(వైదిక – శ్రమణ ఆచార్యుల సందేశం)
సుమారు పాతికేళ్ళ క్రితం 1999లో బుద్దుడు మొట్టమొదటి ప్రసంగం చేసిన సారనాథ్ లోని మహాబోధి సొసైటీలో కంచి కామకోటి పీఠం జగద్గురుశంకరాచార్య జయేంద్ర సరస్వతి, విపస్సనాచార్య సత్యనారాయణ్ గోయంకాజీ కలిసి ఉమ్మడిగా విడుదల చేసిన విలువైన ప్రకటన ఇది!
అప్పటి విపస్సనా పత్రిక డిసెంబర్ సంచికలో ప్రచురించబడిన ఈ మానవతావాద సందేశాన్ని 2015 లో ఎనిమిదేళ్ళ క్రితం ఇండాలజీ (చరిత్ర అధ్యయనం)కి చెందిన విశిష్టమైన విషయంగా గుర్తించి, కరపత్రంగా బాపట్ల నుండి టి. రవిచంద్ మిళింద ప్రచురణల ద్వారా పునర్ముద్రించడం జరిగింది.
వైదిక – శ్రమణ సాంప్రదాయాలకి సంబంధించిన అన్ని స్రవంతుల మధ్యా అభిప్రాయ భేదాలు బలహీనపడి, ఆత్మీయమయిన మానవీయ సౌహార్దిక స్నేహ సంబంధాలు పెంపొందాలనీ, నిర్ద్వందంగా ఆకాంక్షించిన ఆ సంవాద సారం మతోన్మాదం పేట్రేగుతున్న ఈ కాలానికి చాలా అవసరమనేదే నా అభిప్రాయం.
తప్పొప్పుల గతాన్ని వైష మ్యాల్తో తిరగతోడి మనుషుల వివేచనను మసకబార్చే విద్వేషం కంటే కూడా, ఏ మతాన్ని అవలంబించేవారైనా అంతిమంగా మానవతావాదాన్నే మార్గంగా నిర్దేశించు కోవడానికి నిర్ణయించుకున్నట్లైతే ఆ మేరకు సమాజంలో భిన్నమైన దృక్పథాల పట్ల సహృద్భావన నెలకొంటుంది.
ప్రస్తుతానికి ఈ దేశానికి కావాల్సింది అదే. వ్యవస్థకి పునాదులైన వ్యక్తుల ఆలోచనల్ని గుప్పెడు మంది ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసుకున్న విశ్వాసమనే ఒక వైఖరి కట్టడి చేస్తోంది. ఈ క్రమంలో మనిషిని ముందు పెట్టి మతాన్ని వెనక్కి నెట్టడమే జరగాల్సిన పని. అందుకిలాంటి మెట్లెన్నో కావాలి.
Also read: ఒకానొక ప్రస్థానం గురించిన ప్రస్తావన
నిజానికి, ఆధిపత్యంతో కూడిన వైదిక బ్రాహ్మణ క్రతువుల్ని ధిక్కరిస్తూ, వ్యతిరేకంగా నిలచిన శ్రమణ సాంప్రదాయిక సంస్కృతిని గురించిన అధ్యయనం మనకి జరగలేదు. మతాల్ని ద్వితీయం చేసి మనిషికి ప్రాధాన్యత ఇచ్చిన శ్రమణులు ప్రపంచచరిత్రలోనే మొట్టమొదటి మానవతావాదులు!
అయినా మనం ఎరిగున్న కాలంలో అసలు ఈ మాత్రం ముందుకొచ్చి వారివారి వాదనల్లో భిన్నత్వాన్ని గూర్చి ఒక అర్ధవంతమైన, సంవేదనాత్మక చర్చకు సిద్దపడటం, అలా జరిగిన చర్చ సారాన్ని పత్రిక ద్వారా ప్రజలకి అందించడం ఆమేరకు ఆహ్వానించదగిన అంశాలే.
Also read: కొన్ని తరాలు – కొన్ని స్వరాలు
భారతీయ తాత్విక చింతనలోని భిన్నత్వంతో కూడిన చింతనాత్మక ధోరణిని పెంపొందించే దిశగా సాగే సకల సంవేదనలు, సంవాదాలు, సంఘర్షణల సారం ఏదీకూడా ప్రత్యామ్నాయ చరిత్ర అధ్యయనం, అన్వేషణకి విసర్జితం కాదని పేర్కొంటూ ఆ కరపత్రం చిత్రాలతో ఎన్నాళ్ళుగానో అనుకంటున్న ఈ చిన్న రైటప్!
(ఈ కరపత్రం తెలుగు చేద్దామని అనుకున్నా కానీ ఇంత అమూల్యమైన విషయంలోని సారం సులభమైన ఆంగ్లంలో అర్థమయ్యేలా ఉండగా ప్రతీదాన్ని తర్జుమా చేసి తీరాలనే ఆబ సరైనది అనిపించలేదు. ఇది ఒక్క మతాలకి చెందిందని నేననుకోవడం లేదు. భిన్న రాజకీయ,సామాజిక సిద్ధాంతాల విషయంలోనూ వర్తిస్తుంది.)
Also read: గదర్ పార్టీ వీరుడు దర్శి చెంచయ్య, పిరికితనం ఆయన రక్తంలోనే లేదు!
– గౌరవ్