నువ్వో మతంలో పుట్టావు. నేనో మతంలో పుట్టాను.
నీకో దేవుడున్నాడని నీకు మీవాళ్ళు చెప్పారు
నాకో దేవుడున్నాడని నాకు నావాళ్ళు చెప్పారు
నీకు నువ్వు పుట్టిన ఊరు, దేశం ఉన్నాయి
నాకూ నేను పుట్టిన ఊరు, దేశం ఉన్నాయి
నీకు నీ భాషాసంస్కృతులున్నాయి. నాకూ నా భాషాసంస్కృతులున్నాయి
కాని, మతాలతోను, దేశాలతోను, భాషలతోను
కులాలతోను, గోత్రాలతోను, జాతులతోను, జాతీయతలతోను
సంబంధం లేనిది, ప్రపంచ పౌరులందరికీ కవాల్సింది
ఒకటుంది – అదే మానవత్వం!
దానికి మళ్ళీవెన్నుపూసలా ఇప్పటిదాకా నిలబడింది,
ఇకముందుకూడా నిలబడుతూ ఉండేది – ఇంకా ఒకటుంది
అదే సైన్స్ – ప్రపంచ పౌరులందరి ఉమ్మడి ఆస్థి!
అది ఒక దేశానిదో, ఒక మతానిదో, ఒక జాతిదో కాదు
ప్రాంతీయ దురభిమానాలకు, భాషావిద్వేషాలకు అతీతమైంది
ధనిక – పేద భేదాలు, అగ్ర-నిమ్న తేడాలు లేనిది
ప్రపంచ పౌరుల సమష్టి కృషికి దక్కిన, దక్కుతున్నఫలితం – సైన్స్!
సమాజంలో నిమ్నోన్నతాలు తొలగించి,
ఒక సమతుల్యం సాధించడానికి ఉపయోగించాల్సిన
శస్త్రం – అదే శాస్త్రం : విజ్ఞానశాస్త్రం!
ఎవరెన్ని వాదనలు చేసినా అంతిమంగా ఒకటి మాత్రమే నిజం
సైన్స్ – ఆధుని మానవుడి జ్ఞాన నేత్రం!!
మారుతున్న జీవనశైలికి దర్పణం
స్వశక్తిలోంచి వెల్లివిరుస్తున్న మానవత్వపు విజయం –
ఏ వైజ్ఞానికుడు, ఏ సాంకేతిక నిపుణుడు ఏయే ఆవిష్కరణలు చేసినా అవి సర్వ ప్రపంచ మానవాళికోసం చేస్తున్నాడు. కేవలం తనకోసమో,తన వారికోసమో లేక తన దేశంకోసం మాత్రమో కాదు. అంటే ఆ ఆలోచనలోనే మానవసేవ ఉంది. మానవత్వం ఉంది. మానవతా దృక్పథానికి సైన్స్ ఎప్పుడూ వెన్నెముకగా నిలబడుతూ వస్తోంది. సైన్స్ అవసరం లేని మానవత్వం, మానవత్వం అవసరం లేని సైన్స్ ఊహించలేం. అయితే సైన్స్ ఆవిష్కరణలను మనిషి కుటిలబుద్ధి వినాశనానికి వాడుకున్న ఉదంతాలు లేకపోలేదు. మళ్ళీ అది, వేరే విధంగా చర్చించాల్సిన విషయం. అయితే సమాజాన్ని గతితప్పించడం, నాశనం చేయడం సైన్స్ ఎప్పుడూ తన ధ్యేయం చేసుకోలేదు. నిర్మాణం మీద, పునర్నిర్మాణం మీదే సైన్స్ ఎప్పుడూ దృష్టి పెడుతూ వస్తోంది.
Also read: జీవ-జీవన రహస్యాలు
హ్యూమనిజం అంటే ఏమిటి?
కొందరు పెద్దలు మానవత్వం, మానవతావాదం గురించి విరివిగా మాట్లాడుతుంటారు. కాని, దానికి విరుద్ధమైన పనులు చేస్తుంటారు. దీనివల్ల అమాయకులైన సామాన్యులు అయోమయంలో పడుతుంటారు. అందుకే మానవత్వమంటే ఏమిటో – అది ఎలా వాడుకలోకి వచ్చిందో టూకీగా తెలుసుకుందాం. దీన్నే ఇంగ్లీషులో ‘హ్యూమనిజం’ అంటున్నాం. ఇంగిత జ్ఞానంతో మొదలై, నైతిక విలువలతో కూడిన ఒక తాత్త్విక చింతన మానవత్వం! దానికి కొంత విచక్షణ, విశ్లేషణాజ్ఞానం తొడయితే అదే హేతువాదమవుతుంది. అది పూర్తిగా ప్రజాస్వామ్యపు పునాదుల మీద నిలబడి, మానవ జాతిలో సమానత్వంకోసం సంఘర్షిస్తుంది. అన్ని దశల్లో అన్ని వేళలా మానవాభ్యదయాన్ని కాంక్షించేదే మానవతావాదం. ఫ్రెడ్రిక్ ఇమ్మాన్యుల్ నైథమ్మర్ (FRIEDRICH NIETHAMMER) తొలిసారి 1808లో ఈ ‘హ్యూమనిజం’- అనే పదాన్ని రూపొందించాడు. నిజానికి ఇది లాటిన్ భాషలోని హ్యూమనిటస్ (HUMANITAS) అనే పదంలోంచి తీసుకున్నది. ఇలాంటి పదాలు ఇంగ్లీషులో ఇజంతో (ISM)ముగుస్తాయి గనక, దీనికి ఇజం కలిసి ‘హ్యూమనిజం’ అయింది. దీనిలోంచే ‘హ్యుమానిటీ’ అనే పదం వచ్చింది. బవేరియన్ ఎడ్యుకేషనల్ కమిషనర్ అయిన ప్రెడ్రిచ్ నైథమ్మర్ తన అధికారాల్ని ఉపయోగించి జర్మన్ సెకండరీ స్కూళ్ళలో ‘హుమనిటస్’ను ఒక పాఠ్యాంశంగా చేర్చి, బోధించే ఏర్పాటు చేశాడు. ఆ విధంగా 1936లో ‘హ్యూమనిజం’ అనే పదం ఇంగ్లీషు భాషలో చేర్చబడింది. 1765లోనే ఒక పేరు తెలియని రచయిత ‘మానవాళిని ప్రేమిద్దాం!’ అని రాశాడని ఆ తరువాత పరిశోధనల్లో బయటపడింది. ఏది ఏమైనా, ప్రెంచి విప్లవానికి ముందు వెనకలుగా వెలువడ్డ చరిత్ర, తాత్త్విక చింతన, సామాజిక, రాజకీయ, సాహిత్య గ్రంథాలు మానవాళిని కేంద్రకంగా చేసుకుని వెలువడ్డాయి.
Also read: మనిషికీ, సత్యానికీ ఉన్న బంధమే సైన్సు: గ్రాంసి
దయాగుణం, సేవాగుణంతో పాటు విద్వత్తు
ఆలుస్ జిల్లియస్ (AULUS GELLIUS) క్రీ.శ. 125-180 నాటి భాషాశాస్త్రజ్ఞుడు హ్యూమానిటస్ కు దాదాపు సరిసమానమైన పదం గ్రీకులో ఫిలాంత్రఫీ (PHILONTHROPY)అవుతుంది గనక, దాని లక్షణాలు కూడా కలిపి ఆ రెండింటి అర్థాల్ని స్వీకరించాలన్నాడు. లోకోపకారిగా తన తోటివారిపై దయాగుణం ఉండడం, అవసరమైనప్పుడు వారికి తగిన రీతిలో సేవచేయడం లాంటి వన్నీ సమాజానికి అలవాటు చేయాలన్నాడు. ఈ ఆలోచనను, ఈ పదాల్ని వాటికున్న అర్థాల్ని, వాటి చుట్టూ అల్లుకున్న విస్తృత అర్థాల్ని రోమన్ తత్త్వవేత్త, కవి సిసిరో (106-43 బీసీఇ) జనంలో ప్రచారం చేశాడు. దయాగుణం, సేవాభావమే కాదు, తగిన విద్వత్తు కూడా ఉంటేనే అతణ్ణి ‘హ్యూమనిటస్’గా గుర్తించాలన్నాడు సిసిరో – ఆ విధంగా చాలా శతాబ్దాలు మతవిశ్వాసాలతోపాటు ‘మానవత్వం’ చెలామణి అయ్యింది. క్రమక్రమంగా 18, 19 శతాబ్దాలకాలంలో మానవ అవసరాల మీద శ్రద్ధ పెట్టడం, పనికిరాని విశ్వాసాల్ని పక్కకు నెట్టడం, ప్రతిదానికీ కారణాన్ని అన్వేషించడంతో ప్రారంభమై ‘మానవతావాదం’ ఒక ఆలోచనా ధోరణిగా రూపుదిద్దుకోవడం మొదలయ్యింది. ఆ ఆలోచనా ధోరణి అన్ని కళల్లోకి వ్యాపించింది. మానవవాద దృక్పథంలోంచి లలితకళలు, కవిత్వం, విద్య, వైద్యం వంటి రంగాలన్నీ బలపడుతూ వచ్చాయి. ప్రతిచోట, ప్రతిరంగంలో ప్రశ్నకు విలువ పెరుగుతూ వచ్చింది. ఆ ప్రశ్నలకు సమాధానాలు అన్వేషించుకునే క్రమంలో హేతువాదంతో కూడిన మానవతావాదం, శాస్త్రీయ అవగాహన వ్యాప్తి చెందాయి.
Also read: ‘హిందుత్వ’ భావన ఎలా వచ్చింది?
హ్యూమనిస్టు మానిఫెస్టో
తొలిసారిగా 1933లో ‘హ్యూమనిస్ట్ మానిఫెస్టో’ చికాగో విశ్వవిద్యాలయంలో జరిగిన సదస్సులో విడుదల అయ్యింది. ఆ మానిఫెస్టో ప్రధానంగా కారణం, నైతికత, సామాజిక-ఆర్థిక న్యాయం, సమన్వయం అనే సూత్రాల మీద ఆదారపడింది. వీటన్నిటితో పాటు మరొక విషయం ప్రత్యేకంగా చర్చించబడింది. అదేమిటంటే, ఆధారం లేని విశ్వాసాలు, మూఢనమ్మకాలు పక్కకు నెట్టి, వైజ్ఞానిక అవగాహనను పెంపొందించాలని, దానిపై ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉందని కూడా మానిఫెస్టోలో రాశారు. మనవతావాదం గురించి అవగాహన పెరుగున్న దశలో అక్స్ ఫర్డ్ ఇంగ్లీషు నిఘంటువు ఒక వ్యతిరేకమైన అర్థాన్ని ప్రచురించింది. దాన్ని రూపొందించిన బృందంలో ఒక ఇంగ్లీషువాడు, హ్యూమనిస్ట్ లంటే చులకన భావం గలవాడు ఆ అర్థాలు రాశాడు. ‘‘దైవభావనను ధిక్కరించేవారు,’’ ‘‘ఉట్టి మానవతావాదులు,’’ ‘‘అరాచకవాదులు,’’ ఆస్థులను దోపిడీ చేయువారు’’- అని రాశాడు. బహుశా అతను విశాలమైన భావజాలంతో ప్రగతిశీల ధోరణితో ఆలోచించలేనివాడై ఉంటాడు. అందువల్ల అతను తన అక్కసును అలా వెళ్ళగక్కుకున్నాడు. అది మాత్రమే కాదు, అలాంటి మరికొన్ని సంఘటనలు జరుగుతూ రావడం వల్ల సహజంగా మతతత్వవాదులకు వెయ్యేనుగుల బలం చేకూరింది. అదే సమాజంలో వేళ్ళూనుకుని పోయింది. తరతరాలుగా ప్రపంచ వ్యాప్తంగా దైవభావన బలం పుంజుకుంది. దాని పర్యవసానంగానే మతాన్ని, దైవాన్ని ప్రశ్నించినవారు దుర్మార్గులు, పాపాత్ములు, చెడ్డవారు అనే ముద్ర వేయడబుతూ వచ్చారు. అందుకే చూడండి…పరిస్థితి ఈ నాటికీ పూర్తిగా మారలేదు. మతవిశ్వాసాలలో పడి కొట్టుకుపోయేవారిని మామూలు మనుషులుగా పరిగణిస్తున్నాం. స్వేచ్ఛాలోచనతో హేతుబద్ధంగా మాట్లాడేవాళ్ళను పిచ్చివాళ్ళ కింద జమ కుడుతున్నాం. అయితే అడ్డుకునేవారూ, విషయం వివరించేవారూ ప్రతి తరంలో ఎవరూ ఉండడం లేదని కాదు. ఉంటున్నారు. కాని ఏ కొద్దిమందో ఉంటున్నారు.
Also read: చరిత్ర అంటే కొందరికి ఎందుకు భయం?
విశాల హృదయంతో ఆలోచించలేనివారిని దైవభావనలో పడి కొట్టుకుపోతున్నవారిని, ఈ దేవుడు కాదు- ఆ దేవుడని, ఈ మతం కాదు, ఆ మతమని కొట్టుకు చ్చేవారిని- సమాజంలో అకడక్కడ అప్పుడప్పుడు కొందరు మహానుభావులు హెచ్చరిస్తూనే వచ్చారు. వాస్తవంలోంచి ఆలోచించండని, కారణాన్ని వెతకండని బోధిస్తూనే వచ్చారు. అలాంటివారిలో ఎర్నెస్ట్ రెనన్ (ERNEST RENAN) పేరు తప్పక చెప్పుకోవాలి. ‘జ్ఞానం యొక్క భవిత : 1848 నాటి ఆలోచనలు’- అనే గ్రంథంలో ఆయన ఇలా రాశాడు: ‘‘భవిష్యత్తులో మతమేదైనా ఉంటే, అది మా‘నవ’వాదమే అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. శాఖోపశాఖలుగా ఉన్న ఈ విశ్వాసాలన్నీ ఒక్క తాటిపైకొచ్చి, నైతిక విలువలతో కూడిన ‘మా‘నవ’వాదం’గా రూపుదిద్దుకుంటుంది – తప్పదు!’’
Also read: సైన్స్ ఫిక్షన్ మాంత్రికుడు – అసిమోవ్
ఈ ప్రపంచం ఇలా ఎందుకుంది?
మరి ఇంతమంది ఇన్ని చెపుతున్నా ‘ఈ ప్రపంచం ఇలా ఎందుకుంది?’ అన్న ప్రశ్నకు కొంచెం ఇంగిత జ్ఞానం ఉపయోగిస్తే సమాధానం దొరుకుతుంది. మనుషుల ప్రేమించడానికి, ప్రేమించబడటానికి పుడుతున్నారు. వస్తువులు (ఆస్థి) ఉపయోగించుకోవడానికి ఉత్పత్తి అవుతున్నాయి. కాని, ఇప్పుడు జరుగుతున్న విచిత్రం గమనించండి. మనుషుల్ని ఉపయోగించుకుంటున్నాం. వస్తువుల్ని (ఆస్థిని) ప్రేమిస్తున్నాం. ఇలా అసహజంగా ప్రవర్తిస్తున్నందువల్లే లోకం రీతి మారింది. మానవ ప్రవృత్తి ఎంత విచిత్రమైందంటే…వాడు స్వర్గంలోని ఉద్యానవనాల్ని కలగంటాడు. తన ఇంటి కిటికీ బయట పూసిన రోజా పువ్వును చూసి ఆనందించలేడు. స్వర్గంలో ఉన్నారనుకునే రంభ, ఊర్వశి, తిలోత్తమల కోసం అర్రులు చాస్తాడు. చుట్టూ ఉన్న అందమైన మనుషుల్ని చూసి సంతోషించలేడు. కనపడని దేవుడి గొప్ప మనసు గూర్చి నోరు నొప్పి పెట్టేట్లు పొగడుతుంటాడు. తనకు సహాయపడ్డ పక్కవాడి గొప్పమనసు పట్ల కృతజ్ఞతాబావం ప్రకటించడలేడు. అందువల్ల ఇప్పుడు బుద్ధీ,జ్ఞానం ఉన్న ప్రతివాడ తక్షణం తనేం చేయాలో తనేనిర్ణయించుకోవాలి.
దుర్మార్గాల్ని ఆపే శక్తి సంప్రదాయాలకు లేదు-
వైజ్ఞానిక అవగాహన పెరిగితేనే మానవత్వం వికసిస్తుంది!
Also read: మానవత్వాన్ని మంటగలుపుతున్న పుతిన్
(రచయిత కేంద్ర సాహిత్య అకాడెమీ విజేత, జీవశాస్త్రవేత్త)