ఆనందాల జల్లుల్లో స్వేచ్ఛావిహారం చేయాలనుకుని అనుకున్నవన్నీ ఈ చిన్న జీవితంలో అందుకోవాలని ఆరాటపడుతూ, పార్టీలూ సంఘాలు, ప్రజా సమూహాలూ, నలుగురిలో మెప్పుకోసం ఆర్భాటాలూ చేసే వారిని బహిర్ముఖులు అంటారు. ఇంగ్లీషులో వీళ్లను Extraverts గా పరిగణిస్తారు! ఇక మౌనంగా తన పని తాను చేసుకుపోతు, పుస్తకాలు, ఫోన్లు, సమాజంతో అంటి ముట్టనట్టు, అవసరం మేరకే మాట్లాడుతూ ప్రజా జీవనానికి దూరంగా ఉంటూ అన్ని గమనించే వారిని అంతర్ముఖులు అంటారు ఇంగ్లీషులో వీళ్ళను Introverts గా పరిగణిస్తారు!
వీరిద్దరి మధ్య ఎల్లప్పుడూ ఘర్షణ ధోరణి ఉంటుంది. సంసారాల్లో ఇది ఎక్కువగా కనబడుతుంది. తన కూతురును పెద్ద డ్యాన్సర్ గా చూడాలని తాను అందుకోలేని శిఖరాలను తన కూతురు అందుకోవాలని పెద్ద వేదికలో తన కూతురు ప్రతిభను మెచ్చి స్టేజి మీదకు తల్లి దండ్రులుగా తమను పిలిచి సత్కరించాలని తల్లి కి బలమైన కోరిక ఉంటుంది. తండ్రికి దానికీ విరుద్దంగా తన కూతురును ఐఏఎస్ చదివించి బ్యూరోక్రాట్ గా నో లేదా డాక్టర్ గానో చూడాలని ఉంటుంది.
కూతురి భవిష్యత్తు విషయంలో భార్యాభర్తల మధ్య విభేదాలు పొడచూపుతాయి. ఆయన బెల్లం కొట్టిన రాయిలా ఉలుకూ పలుకూ లేకుండా పెళ్ళాన్ని సాధిస్తాడు. ఈమె తన పంతమే నెగ్గాలని పట్టు పడుతుంది. మధ్యలో కొంత ఘర్షణ ధోరణి విడిచి ఇద్దరు కూర్చుని జరగబోయే పరిణామాలు అవమానాలు, ప్రశంసలు బేరీజు వేసుకుంటే కొంతలో కొంత ఇద్దరికి ఆమోద యోగ్యమైన పరిష్కారం దొరుకుతుంది. కానీ చాలా కుటుంభాల్లో అంతర్ముఖం- బహిర్ముఖం రైలు పట్టాలు మాదిరిగా సమాంతర పట్టాలపై రైలు అనే సంసార ప్రయాణం కోనసాగుతుంది కానీ హృదయాలు, భావాలు కలవడం లేదు. ఇది ఇద్దరి మానసిక దౌర్భాగ్యం. సిగ్గు కారణంగా సమూహంలో కలవడం లేదని అంతర్ముఖాన్ని తప్పుగా చూడటం మనుషుల సాదారణ లోపం. అంతర్ముఖం అనేది ఒక ప్రాధాన్యత, అయితే ఆతనికి / అమెకు సిగ్గు అనేది బాధ నుండి పుడుతుంది. అంతర్ముఖులు సామాజిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలనుకుంటారు. ఏకాంతాన్ని ఇష్టపడతారు. వాళ్ళు సమాజానికి భయపడుతూ ఉంటారని భావించడం తప్పు.
ఆధునిక పాశ్చాత్య సంస్కృతి అంతర్ముఖ వ్యక్తుల సామర్థ్యాలను తప్పుగా అంచనా వేస్తున్నారని, వారి ప్రతిభ, శక్తి, ఆనందాన్ని వృథా చేయటానికి దారితీస్తుందని సైకాలజిస్టులు వాదిస్తున్నారు. సమాజం అంతర్ముఖులకు వ్యతిరేకంగా ఎలా పక్షపాతంగా ఉందో, వారితో స్నేహశీలమైన భావన తో ఉంటే వాళ్ళు జనజీవన స్రవంతిలో మిళితం అవుతారు. వాళ్ళు సమాజంలో సంతోషంగా ఉండే అవకాశం ఉంటుంది. చిన్ననాటి నుండే వారి తల్లిదండ్రులు వారికి బోధించడంలో విఫలం అవుతున్నారు. మూడీ ఫెలో గా ముద్ర వేయడం వల్ల అంతర్ముఖులు నిరాశ నిస్పృహలతో కొట్టు మిట్టాడుతున్నారు. దీనికి విరుద్ధంగా, అంతర్ముఖం అనేది రెండవ తరగతి లక్షణం కాదని, అంతర్ముఖులు కూడా బహిర్ముఖులు గా సమాజాన్ని సుసంపన్నం చేస్తారని కూడా సైకాలజీ అవపొసనం పట్టిన వారి భావన. బహిర్ముఖం, అంతర్ముఖం లక్షణాలను చూద్దాం!
వ్యక్తిత్వ సిద్ధాంతాలలో ఈ రెండు భిన్న కోణాలు ఉంటాయి. ఎక్స్‌ట్రావర్ట్స్ (బహిర్ముఖులు) తరచుగా తమ అభిప్రాయాలు వెల్లడిస్తారు. మాటలు చేతల ద్వారా వాళ్ళ భావ వ్యక్తీకరణ ఉంటుంది. వారిలోని భావాలు టాకటివ్, ఎనర్జిటిక్ బిహేవియర్‌లో వ్యక్తమవుతాయి. ఇక అంతర్ముఖులు మితభాషులుగా, ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. ప్రవర్తన పరస్పర విరుద్ధంగా (కాంట్రడిక్టరీగా) ఉంటుంది. ఆలోచన విధానంలో సత్వర పనులు జరగాలనీ, అవమానాలు,అలజడులు జీవితంలో ఒక భాగమని బహిర్ముఖులు భావిస్తుంటారు…ఉరుకుల పరుగుల జీవితం లో అందే ప్రతిఫలం చూడాలని లేదా పేరు ప్రఖ్యాతులు గడించాలని తాపత్రయం వారికి ఉంటుంది. ఇక అంతర్ముఖులు ఏది చేస్తే ఏమి అవమానాలకు గురవుతామో మాట పడకుండా పనులు చక్కదిద్దేందుకు ప్రయత్నం చేస్తుంటారు… అవమానాలు కోరి తెచ్చుకోరు..ప్రతిదీ భిన్న కోణంలో ఆలోచిస్తారు! సమాజంలో వెనుకబడి పోతున్నామనే బాధ వారికి ఉండదు. జరిగేదేదో జరుగుతుంది అనే నిర్లిప్త భావన వారిలో ఉంటుంది. సమాజంలో ఈ రెండు కోణాల వల్ల మంచి ఎంతగా జరుగుతుందో చెడు కూడా అంతే జరుగుతుంది.