కప్పు ఖాళీగా ఉంటేనే మీరందులో కాఫీ, టీ, పళ్ళరసం వగైరా ఏదైనా పోసుకోవచ్చు. ముందే నీళ్ళతో నిండి ఉన్న కప్పులో మీరేమీ పోయలేరు. పోయాలనుకుంటే ముందు ఆ కప్పును ఖాళీ చెయ్యాలి. మనిషి మెదడు కూడా అలాంటిదే. పసితనంలో ఎవరి మెదడైనా ఖాళీ కప్పులాంటిదే. అందులో ఏ మత విశ్వాసాలూ ఉండవు. తాతయ్యలు, నానమ్మలు, తల్లిదండ్రులు, చుట్టుపక్కలవారు మెల్లమెల్లగా ఆ పసివాడికి దైవభావనని పరిచయం చేస్తారు. సంప్రదాయాలు, సంస్కృతి పేర తాతలు వారసత్వంగా నేర్చుకున్న వందల యేళ్ళనాటి విషయాలు, ఈ కాలపు ఈ పసివాడికి నూరిపోస్తారు. అంటే ఏమిటీ? కొంచెం కొంచెం వాడి మెదడుకప్పు నింపేస్తున్నారన్నమాట! ఆ రకంగా యుక్తవయసు వచ్చేసరికి వాడికో దేవుడు, వాడికో మతం, వాడికో సంప్రదాయం ఏర్పడి, వాడో చట్రంలో బిగుసుకుని ఉండిపోతున్నాడు. తన చుట్టూ ఉన్న సమాజం గూర్చి, తన దేశం గూర్చి, ప్రపంచం గూర్చి, విశ్వవిజ్ఞానం గూర్చి ఏమీ తెలుసుకోవడం లేదా? అంటే, భేషుగ్గా తెలుసుకుంటున్నాడు. కానీ, వాటిని తన మెదడులో, మనసులో బలంగా నిలుపుకోలేకపోతున్నాడు. కారణం వాడి మెదడు కప్పులో ఖాళీ లేకపోవడమే! కప్పు ఖాళీగా ఉంటేనే ఇతరులకు పయోగపడేది. ఇతరులకు ఉపయోగపడదామన్న తపన ఉంటేనే మీ కప్పు ఖాళీ చేసుకుని మీరు సిద్ధంగా ఉంటారు. మానవ హృదయంతో, మానవత్వం గురించి ఆలోచిస్తూ, మనిషి మనిషికోసం బతికినప్పుడే అతను మానవుడవుతాడు.
Also read: ఫేక్ వర్సెస్ రియల్
తమలొ గడ్డకట్టుకొని ఉన్న దైవభావనకి బయటి ప్రపంచం లోని భౌతిక ప్రపంచానికి- విశ్వవిజ్ఞానానికీ మధ్య జనం మెదళ్ళలో హోరాహోరీగా యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఎటూ తేల్చుకోలేనివారు అయోమయంలో పడి కొట్టుకుంటూ ఉంటారు. కొందరు మాత్రం నిర్మొహమాటంగా తమ ‘మెదడు కప్పు’ ఖాళీ చేసుకుంటారు. అందులో తమ దృక్ఫథాలకు అనుగుణంగా, తాము కావాలనుకున్న వైజ్ఞానిక స్పృహను నింపుకుని ఆత్మస్థైర్యంతో ముందుకు పోగలుగుతుంటారు. భయస్థులు, చంచల మనస్కులు, కళ్ళముందున్న వాస్తవాన్ని చూడలేని గుడ్డివాళ్ళు మాత్రం దేవుడిలో లీనమయ్యే ఆత్మల గురించి, పరలోకాల గురించి, పునర్జన్మల గురించి భడపడుతూ బతుకీడుస్తుంటారు. నమ్మకాలు, దేవుళ్ళు, సంస్కృతి, సంప్రదాయాలు, అంధవిశ్వాసాలతో ఉన్న ఏ మనసైనా అయోమయంతో బరువెక్కిపోతుంది. అది వారి తాతల మనసుకు నకలు కాపీ (ట్రూకాపీ). ఒరిజినల్ కాదు. ఎవరి మనసైనా ఒరిజనల్ కాపీలా ఉండాలంటే దానికి వివేకం, వివేచన అవసరమౌతాయి. హేతుబద్ధంగా పరిశీలించుకోవడం, నిజాల నిగ్గు తేల్చుకోవడం అవసరమౌతుంది. అప్పుడే ఆ మనసులో సృజనాత్మకత, నవ్యత వంటివి ప్రవేశించగలుగుతాయి. వాటితో ఆ మనసున్న వ్యక్తికి అప్రయత్నంగానే ప్రత్యేక వ్యక్తిత్వం రూపొందుతుంది – ‘‘మనిషి తనను తాను మనిషిగా భావించుకున్నప్పుడు, ఎదుటివారిని మనుషులుగా గుర్తించినపుడు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆనందం లభిస్తుంది. మొత్తానికి మొత్తంగా భద్రతాభావం ఇనుమడిస్తుంది’’ అని అంటారు తత్త్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి.
Also read: దేశాన్ని సానిటైజ్ చేద్దాం!
అలాగే మరొక విషయం కూడా ఆలోచించాలి. మనం ఎవరి ఇంటికైనా వెళ్ళాలనుకుంటే, వారి ఇంటి గేటు తెరచి ఉంటేనే వెళ్లగలం. గేటుకు తాళం వేసి ఉంటే మనం వెళ్ళలేం. ఈ ప్రపంచంలో చాలామంది తమతమ ఇళ్ళకు ఏదో ఒక మతానికి సంబంధించిన పెద్ద తాళం కప్ప బిగించుకుని ఉంటున్నారు. అంటే తమ మెదడుకు మతం అనే తాళం వేసుకుంటున్నారు. ఇక ఇతరులు రావడానికి వీలేదీ? వచ్చేవారు ఇతర మతాలవారు కావొచ్చు. ఇతర ఆలోచనా ధోరణి గలవారు కావొచ్చు. ఇతర కులాలవారు, ఇతర వర్గాలవారూ ఎవరైనా కావొచ్చు. మీకు మీరు ఒకదానికి ‘ఫిక్స్’ అయి ఉన్నప్పుడు వేరే వాటిని ఎలా ఆహ్వానించగలరు? విశాల హృదయం గురించి, విశ్వమానవుడి గురించి, విశ్వవిజ్ఞానం గురించి మీరెలా తెలుసుకోగలరు? ముందు మీరు మీ గేట్లు తెరచి ఉంచాలి. అంటే మీ మనసు-మెదడూ తెరచి ఉంచాలి. మనసు, మెదడు వేరువేరు కావు. రెండు ఒకటే! అందులోని చెత్తనంతా బయటికి పంపిస్తే గానీ, మీ మనసులోకొత్తగాలి వీచదు. కొత్త వెలుతురు సోకదు.
Also read: మాల్గుడి సృష్టికర్త ఆర్. కె. నారాయణ్
ఇంటితో పోల్చి చూస్తే తలుపులు చిన్నవి. తలుపులతో పోల్చి చూస్తే వాటికి వేసే తాళం చిన్నది. ఇక తాళం చెవి అన్నింటికన్నా చిన్నది. కానీ అంత చిన్నదయినా,అది మొత్తం ఇంటినే తెరవగలదు కదా? మతమౌఢ్యమే మీ ఇల్లనుకుని, సంస్కృతనే తలుపులు బిడాయించుకుని, దానికో సంప్రదాయపు తాళం వేసుకుని లోపల కూర్చుంటే ఏమవుతుందీ? బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా పోతుంది. మీలో మీరే కుంచించుకు పోతారు. దీనికి పరిష్కారముంది. సైన్సు మీ తాళాన్ని తెరిచే తాళం చెవి కాగలదు. సైన్సు తాళం చెవితో మీ సంప్రదయాపు తాళాన్ని ఒక్కసారి తెరవండి. సంస్కృతి పేరుతో బిగుసుకున్న తలుపులు బార్లా తెరుచుకుంటాయి. మతమౌఢ్యపు మీ ఇల్లు తెరుచుకుని, అందులో కాస్త గాలీ, వెలుతురూ ఆడతాయి. ప్రపంచజ్ఞానం అందుబాటులోకి వస్తుంది. అప్పుడు మీరూ మనుషుల్లో కలుస్తారు. ఆలోచన చిన్నదైతే మాత్రం ఏమిటీ? అది పెద్దపెద్ద సమస్యల్ని పరిష్కరించేది కావొచ్చకదా!
Also read: శాస్త్రవేత్తల్లో మతవిశ్వాసాలు
ఒకడు బైక్ మీద అడవిలోకి చాలా దూరం వెళ్ళాడనుకుందాం. అతనికి రెండు దారులు కనబడ్డాయి. ఒక దారికి ‘దేవుడున్నాడు’ అనే బోర్డు కనబడింది. మరోదానికి ‘దేవుడు లేడు’ అనే బోర్డు ఉంది. ఎవరూ లేని చోటికి ఒంటరిగా వెళ్ళడం దేనికీ అనే భయంతో – ఈ దారిలో ఎవరో ఒకరు ఉన్నారు కదా-’ అనే భరోసాతో ఒకరి తర్వాత ఒకరు చాలామంది ‘దేవుడున్నాడు’ అనే దారిలో వెళుతున్నారు. కొద్దమందిమాత్రం ‘ఇంతదాకా ఒంటరిగా ధైర్యంగా వచ్చాను కదా ఇంకా ముందు ఎవరూ లేకపోతేనేం?’ అనే ఆత్మవిశ్వాసంతో ‘దేవుడులేడు’ అనే దారిలో వెళుతున్నారు. అసలు విషయమేమంటే ఏ దారిలో వెళ్ళినా ఒకటే. కొంతదూరం వెళ్ళాక రెండు దారులూ కలిసేవే. ‘దేవుడున్నాడు-లేడు’ అని చెప్పే ఆ సైన్ బోర్డులు మనషుల్ని విడగొట్టడానికి తప్పితే కలపడానికి కాదు. మత విశ్వాసాలు, లక్షల సంఖ్యలో దేవుళ్ళు పనికొచ్చేది ఎందుకంటే, మనుషుల్ని నిర్దాక్షిణ్యంగా విడగొట్టడానికి మాత్రమే! నిజం ఎప్పుడూ ఒకటే ఉంటుంది. వాస్తవం ఒకటే ఉంటుంది. ఊహలు, భ్రమలు, ఎన్నయినా, ఎన్నిరకాలుగానైనా ఉండొచ్చు. అందుకే కదా దేవుళ్ళు ఇన్నిరకాలుగా ఉన్నారు.
Also read: మా‘నవ’వాదానికి వెన్నెముక – సైన్స్
మహామానవతావాది, జాతీయ విప్లవకారుడు, తత్త్వవేత్త, రాజకీయ సిద్ధాంతకర్త అయిన యం.ఎన్. రాయ్ (మానబేంద్రనాథ్ రాయ్) ‘‘పిల్లి ఆత్మకథ’’లో రాసుకున్న విషయం అర్థం చేసుకుని, అందులోని అంతరార్థాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంది-‘‘ప్రతి మతమూ ప్రజలను మరింత అజ్ఞానానికి గురి చేసే సాధనంగా ఉండిపోయింది. ప్రజలు ఉన్నత వర్గాల పరిపాలనకు లొంగిపోవాలి. ప్రభువుల్ని గుడ్డిగా నోరుమూసుకుని అనుసరించాలి. సిరిసంపదల హెచ్చుతగ్గులను దైవ నిర్ణయాలుగా భావించాలి. వారు పూర్వజన్మలో చేసిన పాప పరిహారంగా ఈ జీవితాన్ని దుర్భరంగా గడపాలి. మూఢవిశ్వాసాలతో, జ్ఞానశూన్యులుగా , భావస్వేచ్ఛ ఎరక్కుండా బతకాలి…మతమే ప్రజల్ని ఇలాంటి దుస్థితికి తెచ్చింది.’’
నీకున్న దానితో నువ్వు గొప్పవాడికి కావు. ఇతరులకు నువ్విచ్చేదానితో అవుతావు. నీ మెదడు కప్పు ఖాళీగా ఉంటేనే కదా, దానితో నువ్వు ఎవరికైనా ఏమైనా ఇవ్వగలవు. విశాల హృదయంతో, తెరచిన మనసుతో ఉన్నప్పుడే సమ్యక్ దృష్టితో పరిశీలించగలవు. అప్పుడే హాయిగా, ‘స్వేచ్ఛాలోచన’ నీలొ ఊపిరి పీల్చుకుంటుంది!
Also read: జీవ-జీవన రహస్యాలు
గేదెను గుంజకు కట్టేసినట్టు, నీ మనసును, బుద్ధిని గుంజలాంటి ఒక మతానికి కట్టేసుకున్నావనుకో. ఇక అంతే – నీ మనసు ఆ గుంజ చుట్టే తిరుగుతూ ఉంటుంది. అక్కడక్కడే ఆ పరిధిలో గింజుకోవాల్సిందే. అరవాల్సిందే. ఒకసారి గేదెను గుంజనుండి విప్పి చూడండి. అది స్వేచ్ఛగా ఊరి బయటికి, పొలాల్లోకి, అడవుల్లోకి పరిగెత్తుతుంది. చెప్పొచ్చేదేమంటే మనిషి గేదె కాదు. మనిషి మనిషే. మనిషి గేదెను కట్టేస్తున్నాడు. సరే. మరి మనిషి? తనను తానే ఎందుకు కట్టేసుకుంటున్నాడూ? మనిషి గేదెలాగా బతకకూడదు. మనిషిలాగా బతకాలి. స్వంత ఆలోచనలతో, స్వంత నిర్ణయాలతో, సంయమనంతో, విచక్షనతో ఎదగాలి!
Also read: మనిషికీ, సత్యానికీ ఉన్న బంధమే సైన్సు: గ్రాంసి
మనిషి మెదడును నియంత్రించే మతమౌడ్యం, చాదస్తాలు, సంప్రదాయాల బంధనాల్లోంచి మనిషి స్వేచ్ఛగా బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఇది ఎవరికి వారు..అందరూ సీరియస్ గా ఆలోచించుకోవాల్సిన విషయం! మూఢవిశ్వాసాల నుండి, మతపరమైన నమ్మకాల నుండి స్వేచ్ఛపొందినపుడే మానవ జీవితంలో ఒక కొత్తదనం ప్రారంభమౌతుంది. ప్రతిక్షణాన్ని, ప్రతికదలికని, ప్రతి సందర్భాన్నీ, ప్రతి సంఘటననీ గతితార్కికంగా విశ్లేషించుకుంటూ ఉన్నప్పుడే, కార్యకారణ సంబంధాల్ని అర్థం చేసుకుంటున్నప్పుడే మనిషిలో ఆత్మవిశ్వాసం బలపడుతుంది. ప్రపంచంలోని ఏదో ఒక మతాన్ని అంగీకరించి, ఏదో ఓ దేవుణ్ణి ఆరాధిస్తూ, పరలోక సౌఖ్యాలకోసం అంగలారుస్తున్నంతకాలం మనిషి కృంగికృషించి కుళ్ళిపోతూనే ఉంటాడు. వాడికి ఆత్మవిశ్వాసం పెరగదు. నాణ్యమైన విత్తనాలు నాటితేనే నాణ్యమైన మొక్కలు మొలుస్తాయి. నాణ్యమైన పంట పండుతుంది. ఏదో ఓ మతానికి సంబంధించిన పిచ్చి గింజలు చల్లితే మొక్కలూ పంటా ఆ విధంగానే ఉంటాయి మరి! ఇక్కడొక విషయం ఆలోచించాల్సి ఉంది – అన్ని మతాలు శాంతి ప్రబోధిస్తూ శాంతి స్థాపనకే పని చేస్తుంటే మరి వేలవేల యేళ్ళుగా ప్రపంచంలో శాంతి ఎందుకు స్థాపించబడలేదూ? అంటే మతాలన్నీ విఫలమైనట్టే కదా?
Also read: ‘హిందుత్వ’ భావన ఎలా వచ్చింది?
మనిషి మానవశక్తి గుర్తించి, శ్లాఘించి, కీర్తించగలిగినపుడు అతను ఇక ఏ శక్తి గురించి ఆలోచించనక్కరలేదు. జవాబులు బలంగా ఉన్నప్పుడు ప్రశ్నలు తోకముడుస్తాయి. వాస్తవాలు దృఢమవుతున్న కొద్దీ భ్రమలు, ఊహలు, కల్పనలు, పరలోకాలు పలాయనం చిత్తగిస్తాయి. మనిషిలోని మంచితనమనేది మతంతోనూ, స్థాయితోనూ, జాతితోనూ, రంగుతోనూ, లింగభేదంతోనూ లేదా రాజకీయపరమైన, సాంస్కృతికపరమైన దృక్ఫథాలతోనూ ముడిపడిలేదు. కేవలం ఎదుటివారితో అతను ఎట్లా వ్యవహరిస్తున్నాడన్నదానిమీదే అతని మంచితనం గుర్తింపులోకి వస్తుంది. అలాగా, మనిషిలోని చెడుతనం ఎలా ఉంటుంది? మూర్ఖుడంటే ఎవరూ? అనేది ఆలోచిస్తే దానికి సమాధానం ఇలా ఉంటుంది – ‘‘అతను నిజం తెలుసుకుంటాడు. నిజాన్ని చూస్తాడు కూడా! అయినా అబద్దాల్ని నమ్ముతుంటాడు.’’- అందువల్ల ఎవరికివారు తమను తాము బేరీజు వేసుకుంటూ ఉండాలి!
Also read: చరిత్ర అంటే కొందరికి ఎందుకు భయం?
(రచయిత కేంద్రసాహిత్య అకాడెమీ విజేత, జీవశాస్త్రవేత్త)