ఎవడు బతికాడు మూడు యాభైలు? అని ఉత్తరాంధ్రలో సామెత ఉంది. భవిష్యత్తులో ఆ సామెతను మార్చాల్సి వస్తుంది. శతమానం భవతి.. మనం తరచుగా వినే ఆశీర్వాద పూర్వక వాక్యం,అంటే వందేళ్లు బతకమని ఆ దీవెనకు అర్ధం. అది కూడా కాలగర్భంలో కలిసేట్టు ఉంది. నిజం! ఎందుకంటే మనిషి జీవించే కాలం గణనీయంగా పెరగనుంది. 150 ఏళ్ళు హాయిగా బతకవచ్చునని తాజా అధ్యయనాలు, పరిశోధనలు చెబుతున్నాయి. ఆశ్చర్యానికి గురిచేస్తున్నాఅది ఆచరణ సాధ్యమేనని భావికాలమే చెప్పనుంది.
Also read: రామప్ప ఆలయానికి విశ్వవిఖ్యాతి
ఇతిహాసయుగాలలో భారీకాయాలు
మన రామాయణ, మహాభారత ఇతిహాసాలను గమనిస్తే మనిషి ఆయుఃప్రమాణం, శరీర పరిమాణం ఇప్పటి కంటే ఎన్నోరెట్లు ఎక్కువగా ఉండేవి. మహాభారత కథ సుమారు ఐదువేల సంవత్సరాల క్రితం నాటిదని చెబుతున్నారు. కురుక్షేత్ర యుద్ధం జరిగినప్పుడు పాండవులు, కౌరవుల వయస్సులు సుమారు 70 పైనే అని అంటారు. యుద్ధంలో గెలిచిన తర్వాత ధర్మరాజు రమారమి మూడు దశాబ్దాల పైగా పరిపాలన చేసినట్లు తెలుస్తోంది. ఆ కాలం నాటి వ్యక్తుల ఆయుప్రమాణం వందేళ్లకు పైనే ఉంటుందని పెద్దలు చేసే వ్యాఖ్య. భారతం జరిగిన కథగానే ఎందరో అంగీకరించారు. ఆ చారిత్రక ఆనవాళ్లు ఎన్నో సాక్షీభూతంగా మన ఎదుట ఉన్నాయని పురాతత్వశాస్త్రవేత్తలు నిరూపిస్తూ వివరిస్తున్నారు. యుగధర్మం ప్రకారం క్రమేపీ వాతావరణం, జీవనశైలిలో వచ్చే మార్పుల వల్ల ఆయుఃప్రమాణం తగ్గుతూ వచ్చింది.1875లో మనిషి సగటు జీవితకాలం 43ఏళ్ళని నివేదికలు చెబుతున్నాయి. అది మళ్ళీ పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం, 2020 లెక్కల ప్రకారం ప్రపంచంలో మనిషి సగటు జీవనకాలం 72.63 సంవత్సరాలు. అందివచ్చిన ఆధునిక వైద్య సదుపాయాలు, పెరుగుతున్న ఆరోగ్య స్పృహ మనిషి జీవించే కాలాన్ని పెంచుతూ వచ్చాయి. ఇందులో దేశాల మధ్య, జాతుల మధ్య ఎన్నో వ్యత్యాసాలు ఉన్నాయి. కొన్ని దేశాల్లో 80 ఏళ్ళు ఉంది. ఎక్కువ దేశాల్లో 70-80 కనిపిస్తోంది. కొన్ని దేశాల్లో 50 కూడా ఉంది. భారతీయుల తాజా ఆయుఃప్రమాణం 68-70 మధ్య సాగుతోంది. మహిళలు -70.7, పురుషులు -68.2 ఏళ్ళుగా నివేదికలు చెబుతున్నాయి.
Also read: కవికోకిల జాషువా
ప్రపంచ సగటుకంటే మనం తక్కువే
ప్రపంచ సగటు కంటే మనం కొంచెం తక్కువగా ఉన్నాం. చైనా – 77, అమెరికా – 78, పాకిస్తాన్ – 67,బంగ్లాదేశ్ -72,శ్రీలంక -77, నేపాల్ -71.17 గా తెలుస్తున్నాయి. అమెరికా, చైనా వంటి అగ్రదేశాలు,మన సరిహద్దు దేశాలైన బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్ తో పోల్చుకుంటే మనం వెనుకబడే ఉన్నాం. పాకిస్తాన్ కంటే కాస్త మెరుగ్గా ఉన్నాం. తాజాగా జరిపిన అధ్యయనాల్లో వేసుకున్న ప్రశ్నల ప్రకారం,140 నుంచి 150 ఏళ్ళ వరకూ జీవించ వచ్చని పేర్కొంటున్నారు. 19వ శతాబ్దం నాటి ‘ గోంపెట్జ్ ఈక్వేషన్’ ఆధారంగా లెక్కలు వేస్తున్నారు. కంప్యూటర్ మోడల్ సహాయంతో వేసిన లెక్కలు కూడా 150 ఏళ్ళు చూపిస్తున్నాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. వయసు పెరిగే క్రమంలో, ఒక్కొక్క అవయవం పనిచేయడం మానేస్తున్నప్పుడు శరీరం సమస్థితిని (హోమియో స్టాసిస్ ) కోల్పోతుంది. ఈ స్థితిని స్థిరంగా ఉంచుకొని, వ్యాధుల నుంచి కోలుకునే సామర్ధ్యాన్ని తగ్గకుండా చూసుకుంటే, తప్పకుండా మనిషి 150 ఏళ్ళు జీవించే అవకాశముందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ పరిశోధనలో భాగంగా 70 వేల మంది రక్త నమూనాలను సేకరించారు. మంచి జన్యువులు (జీన్స్), మంచి ఆహార వ్యాయామ నియమాలు, మంచి వైద్య చికిత్స, ఔషధాలు మనిషి ఆయుష్షును పెంచడంలో కీలకమైన మూడు ముఖ్య అంశాలుగా శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. బ్రిటన్ విశ్వవిద్యాలయం ఆయుఃప్రమాణ అంశంపై విరివిగా పరిశోధనలు చేస్తోంది. ఎన్నో ఏళ్ళుగా అనేక విశ్వవిద్యాలయాలు మనిషి జననమరణాలపై విశేషంగా అధ్యయనాలు చేస్తున్నాయి. 100 ఏళ్లకు పైగా జీవించి వున్నవారు మనదేశంలోనూ ఎందరో ఉన్నారు. కోవిడ్ ప్రభావం వల్ల ఆయుఃప్రమాణం కొంచెం తగ్గినా,మళ్ళీ ప్రగతి వైపు సాగవచ్చుననే విశ్వాసంలో శాస్త్రవేత్తలు ఉన్నారు. భావి తరాలు శతాధిక జీవన ప్రమాణంతో విలసిల్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనుషుల చేతుల్లోనే ఉంది.
Also read: కరోనాను మించిన ప్రమాదం పెగాసస్