(వ్యసన వ్యతిరేక ప్రచార సమితి ప్రచురణ)
“ఎప్పుడైనా, ఎవరైనా మద్యనిషేధం గురించిన చర్చ ప్రారంభించగానే దాన్ని వ్యతిరేకిస్తూ వాదనలు చేస్తున్నది ప్రభుత్వాలో, వ్యాపారస్తు లో కాదు. కొంతమంది సోకాల్డ్ బుద్ధిజీవులే. ఈ పరిస్థితి మారాలి. ‘మా ఆరోగ్యాలను పాడు చేసుకుంటాం, మా డబ్బులతో మేం తాగుతాం. అది మా హక్కు’ అనేవాళ్ళ కోణం నుంచి కాకుండా, సమాజంలో అట్టడుగున ఉన్న పేదలు, బలహీన వర్గాలు, శ్రమజీవుల శ్రమ జీవుల కుటుంబాల భవిష్యత్తు నుంచి ఈ చర్చ ఎక్కువ జరగాలి…”
– కన్నెగంటి రవి
రైతు స్వరాజ్య వేదిక, హైద్రాబాద్
“తాగుడు తప్పు కాకపోవచ్చు కానీ తాగడమే జీవితం కాదు కదా. ఆనందం అంటే మందు తాగడమే అన్నంత కన్పిస్తుంది కొన్ని సినిమాల్లో…తెలంగాణ నేటివిటీతో వచ్చే సినిమాల్లో ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ తాగడం, సందర్భం లేకుండా మందులో మునిగి పోవడం చూస్తుంటే, ఈ సినిమావాళ్ళు ‘తెలంగాణ అంటే తాగుడు’ అని పరిచయం చేస్తున్నారా ? అనిపిస్తోంది…’’
– అన్నవరం దేవేందర్
జర్నలిస్టు, కరీంనగర్
“పౌరుల బలహీనతలను లాభసాటి ఆదాయ వనరు లుగా చూసే ప్రభుత్వాలు ఇకనైనా కళ్ళుతెరిచి ఆర్ధికత కంటే ఆరోగ్యం ప్రధానమని గుర్తించాలి. బడుగు, బలహీన వర్గాల జీవితాల్లో చిచ్చు పెట్టే మద్యాన్ని సమూలంగా నిర్మూలన చేయకుండా ఎన్ని సంక్షేమ పథకాలు పెట్టినా వృధా అనే నిజాన్ని పాలకులు గ్రహించాలి…”
– దాడి గంగాధరరావు
మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ, ఏలూరు
“భారతదేశ సార్వభౌమా ధికారం ఒక్కరోజు నాకు సంక్రమిస్తే సంపూర్ణ మద్య నిషేధం అములుచేస్తానన్నారు గాంధీజి. అలాగే, ఈ వ్యాపారం పై ఆధారపడిన వారికి ఎటు వంటి నష్ట పరిహారం కూడా చెల్లించాల్సిన అవసరం లేదని జాతిపిత మహాత్మా గాంధీ అభిప్రాయం వెలువరించారు.”
– సర్వోదయ సుబ్బారావు,
ప్రముఖ గాంధేయవాది, నాగర్ కర్నూల్
“పోర్న్ చిత్రాలు చూసేవారు క్రమంగా తమ వారికి దూర మవుతూ ఒంటరిత నానికి అలవాటు పడతారు. ఎక్కువ సమయం పోర్న్ చూడటానికే వెచ్చిస్తారు. జీవిత భాగస్వామిపై అభిమానం, ఆప్యాయతకి బదులుగా అనుమానం పెంచుకుంటారు. పదేపదే గొడవలు గాయపరిచే సంఘటనలు జరిగే అవకాశాలు ఎక్కువ. దీనిని మాన్పించకపోతే మరింత క్రూరంగా, జుగుప్సా కరంగా, నిర్ఘాంతపోయేంత అమానవీయంగా మారుతూ ఎందుకూ కొరగాకుండా పోతారు..”
– డా. బి. కేశవులు
తెలంగాణ మేధావుల సంఘం, హైదరాబాద్
“వ్యసనం కేవలం మత్తు మందులకు మాత్రమే పరిమితమై ఉండదు. దేన్నీ లెక్క చేయకుండా, తనకి ఆనందాన్ని ఇచ్చే పనిని చేస్తూ పోయే ధోరణి వ్యసనమే అవుతుంది…డ్రగ్స్ వాడకుండానే ప్రవర్తనాపరమైన వ్యసనాలు కొన్ని ఉంటాయ్. నెగెటివ్ సెన్స్ లో చెప్పే సెక్స్ ఎడిక్ట్, వర్క్ ఎడిక్ట్ లే కాకుండా మనిషిని నిష్క్రియాపరం గానూ, విధ్వంసకరంగా, శక్తి రహితంగా చేసేవి ఏవైనా వ్యసనాలే…” – రమా సుందరి,
మాతృక పత్రిక, ఒంగోలు
“మానవశరీరాన్ని, అవయవాల్ని ఏ రూపంలో వర్తకం చేసినా అది నేరమే. శరీరాన్ని అంగట్లో సరుకుగా, వ్యాపార వస్తువుగా ప్రదర్శించడానికీ, బానిసల్ని విక్రయించే సంతల్లో బానిస వ్యాపారులు బానిసల నగ్న అవయవాల్ని కర్రలతో పొడిచి నాణ్యత చూపడానికి తేడా ఏముంది? స్త్రీల గర్భాశయం అద్దెకు ఇవ్వడం ఒక ఉపాధి ఎందుకు కారాదో, అందుకే స్త్రీపురుషుల లైంగిక చర్య బూతు చిత్రాల వృత్తి కారాదు. కిడ్నీలు, కాలేయాలు అమ్ముకోవడం ఒక వృత్తిగా ఎందుకు కుదరదో, పూర్తి గోప్యత అవసరమైన వ్యక్తిగత చర్య అయిన సంగమం బహిరంగ ఉపాధిగా అందుకే కుదరదు. ఇది మానవ మనుగడకు, నాగరికతకూ, సంస్కారానికి ఒక కీలక అంశం…”
– దేవి
సాంస్కృతిక కార్యకర్త, హైద్రాబాద్
మానవాళి పై వ్యసనాల ప్రభా వాల్ని విశ్లేషిస్తూ ఒక్కదరికి చేర్చిన ఏడు వ్యాసాల సంకలనం ‘మనుషులు -వ్యసనాలు’ అనే ఈ పుస్తకం. అప్పటి కప్పుడు అనుకుని ఏరిన పాతకొత్త వ్యాసాల్నిలా కూర్చ డం జరిగింది. తొందరలో దొర్లిన అచ్చు తప్పులకూ, వాక్య సమన్వయ లోపాలకూ పూర్తి బాధ్యత మాదే. విలువల తో కూడిన నైతిక జీవన విధానం చులకనగా చూడబడే వ్యవస్థలో, ఏదో రూపేణా మత్తులో జోగడం నవీన మానవుడి లక్షణంగా చెలామణీ చేయడం జరుగుతోంది. అందుకే మద్యం తదితర మత్తు పదార్థాల పై పోరాటం మానవోద్య మంలో ప్రధాన భాగం. ఆసక్తి ఉన్నవారికి సాఫ్ట్ కాపీ పంపుతున్నాను. విమర్శలకు ఆహ్వానం !
– గౌరవ్