సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణకి తిరుమలలో, హైదరాబాద్ లో ప్రముఖులు బ్రహ్మరథం పట్టారు. ఆయన నిటారుగా, ఎత్తుగా, హుందాగా నడుచుకుంటూ సతీసమేతంగా శంషాబాద్ విమానాశ్రయంలో శుక్రవారంనాడు విమానం దిగి బయటకు వచ్చినప్పుడు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కొహ్లీ, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు, పార్లమెంటు సభ్యుడు కె.కేశవరావు తదితరులు స్వాగతం చెప్పారు. విమానాశ్రయం నుంచి నేరుగా రాజభవన్ చేరుకున్నారు. అక్కడే మూడు రోజులపాటు బస చేస్తారు.
అంతకు ముందు తిరుమలలో ప్రధాన న్యాయమూర్తి దంపతులు శ్రీవెంకటేశ్వరస్వామి దర్శనం చేసుకున్నారు. వారికి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తీర్థప్రసాదాలు అందించారు. ఈవో జవహర్ రెడ్డి, డాలర్ శేషాద్రి, ఇతర ప్రముఖులు జస్టిస్ రమణకూ, ఆయన సతీమణికి స్వాగతం, వీడ్కోలు పలికారు.
శంషాబాద్ విమానాశ్రయం నుంచి రాజభవన్ చేరుకున్న ప్రధాన న్యాయమూర్తి దంపతులకు గవర్నర్ తమిళసై, ఆమె భర్త సౌందర్ రాజన్, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి హిమా కోహ్లీ, ధర్మాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఘనస్వాగతం చెప్పారు. విమానాశ్రయం నుంచి రాజ్ భవన్ వరకూ గోడలమీదా, పిల్లర్లమీదా, హోర్డింగ్ ల మీదా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పోస్టర్లను అతికించి హడావుడి చేశారు.
జస్టిస్ రమణకు హైదరాబాద్ కొత్తకాదు. ఆయన ఇక్కడే చాలా దశాబ్దాలు నివసించారు. అనేక హోదాలలో పని చేశారు. అనేక విడతల దిల్లీ నుంచి తిరుమల వెళ్ళి దైవదర్శనం చేసుకొని హైదరాబాద్ కి వచ్చారు. ఇప్పుడు అత్యున్నత న్యాయస్థానంలో అత్యున్నత పదవి స్వీకరించిన తర్వాత తొలిసారిగా హైదరాబాద్ సందర్శించారు. కనుకనే ఇంత హడావుడి. చాలామంది జస్టిస్ రమణను కలుసుకొని శుభాకాంక్షలు చెప్పడానికి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు.
కొన్ని సత్యాలు, మరికొన్ని అర్ధసత్యాలు
కొన్ని వాస్తవాలు ప్రచారంలోకి రావు. ప్రచారంలోకి వచ్చినవన్నీ వాస్తవాలు కావు. కొన్ని పాక్షికంగా నిజం. మరికొన్ని పూర్తిగా నిజం. ఇంకాకొన్నిపూర్తిగా అబద్ధం. జస్టిస్ రమణ కానీ అంతకు ముందు జస్టిస్ చలమేశ్వర్ కానీ పైకి రావడానికి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు కారణమని అందరూ అనుకుంటారు. అది పాక్షికమైన నిజం మాత్రమే. సంపూర్ణమైన సత్యం ఏమంటే వారిరువురికీ పూర్వపు కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి పి.సి. రావుగారి ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి. పీసీ రావుగారికీ, జస్టిస్ వెంకటాచలయ్యగారికీ సన్నిహిత సంబంధాలు ఉండేవి. వారిద్దరూ ఒక గదిలో ఉండేవారు. జస్టిస్ వెంకటాచలయ్య ఆశీస్సులు కూడా జస్టిస్ రమణకూ, జస్టిస్ చలమేశ్వర్ కూ ఉన్నాయి. ఇద్దరూ కష్టపడి పైకి వచ్చినవారే. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కొన్ని గంటలు ఆలస్యంగా చేరడం వల్ల జస్టిస్ చలమేశ్వర్ సీనియారిటీ కోల్పోయారు. అందువల్ల ప్రధాన న్యాయమూర్తి కాలేకపోయారు. అటువంటి సమస్యలు ఏమీ లేకుండా కనీసం రెండేళ్ళ పాటు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగే అవకాశం, అదృష్టం జస్టిస్ రమణకు దక్కింది. జస్టిస్ కోకా సుబ్బారావు తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవిని అలంకరించిన తెలుగు వ్యక్తి జస్టిస్ రమణ కావడం విశేషం. అందుకే హైదరాబాద్ లోనూ, తిరుపతిలోనూ ఘనస్వాగత సత్కారాలు లభించాయి.
కృష్ణకాంత్ కథ
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా పని చేసిన కృష్ణకాంత్ ఉపరాష్ట్రపతి కావడానికి చంద్రబాబునాయుడు కారకుడు అన్నది కూడా పాక్షికసత్యమే. ఐకె గుజ్రాల్ కు కృష్ణకాంత్ బాగా సన్నిహితుడు. ఇద్దరూ కత్రీ సామాజికవర్గానికి చెందినవారు. గుజ్రాల్ ప్రధాని కావడంలో చంద్రబాబునాయుడు పాత్ర ఉన్నదనేది సంపూర్ణసత్యం. ఆ విధంగా గుజ్రాల్, చంద్రబాబునాయుడుల ఆశీస్సులో కృష్ణకాంత్ ఉపరాష్ట్రపతి అయినారు. రాష్ట్రపతి కావాలన్న ఆకాంక్ష నెరవేరకుండానే కన్నుమూశారు.
మరో పాక్షిక సత్యం ఏమంటే ఇటీవల ఈ లోకం విడిచిపోయిన మహానుభావుడు ఎస్ వి ప్రసాద్ అనే ఐఏఎస్ అధికారి అబ్దుల్ కలాం రాష్ట్రపతి కావడానికి కారకుడంటూ కొంతమంది రాశారు. కలాం రాష్ట్రపతి అయితే బాగుంటుందని ప్రసాద్ గారు చంద్రబాబునాయుడుతో అని ఉంటారు. చంద్రబాబునాయుడు కూడా దిల్లీలో కృష్ణకాంత్, కలాంలలో ఎవరికి వీలైతే వారికి ఉన్నత పదవి ఇప్పించడంకోసం ప్రయత్నించి ఉంటారు. కలాంకు కలసి వచ్చిన అంశం ఏమంటే సమాజ్ వాదీ పార్టీ నాయకుడు ములాయంసింగ్ యాదవ్ రక్షణమంత్రిగా పని చేసినప్పుడు కలాంను దగ్గరగా చూశారు. ఆయన మేధోసంపత్తి, నిరాడంబర జీవితం, కలుపుగోలుతనం ములాయంకు నచ్చాయి. ఆయన ఆశీస్సులు కూడా కలాంకు ఉన్నాయని అంటారు. అదే విధంగా దేవెగౌడ ప్రధాని కావడానికి కూడా నేషనల్ ఫ్రంట్ కన్వీనర్ గా చంద్రబాబునాయుడు చక్రం తప్పారంటారు. నిజమే. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగానే ఉండాలని కోరుకున్నారు. అవి ఎన్ టీఆర్ దివంగతులైన తర్వాత రోజులు. అప్పుడప్పుడే ముఖ్యమంత్రి స్థానంలో చంద్రబాబునాయుడు కుదురుకుంటున్నారు. అప్పుడు ఆ స్థానం ఖాళీ చేసి, అందులో ఎవరినైనా కూర్చోబెట్టి, ఎప్పుడు ఊడుతుందో తెలియని ప్రధాని పదవి కోసం అర్రులు చాచడం అవివేకమని వివేకవంతమైన నిర్ణయానికి చంద్రబాబునాయడు వచ్చారు. లేకపోతే దేవెగౌడ్ స్థానంలోనో, గుజ్రాల్ స్థానంలో ప్రధాన మంత్రిగా చంద్రబాబునాయుడు కూర్చుంటానంటే నేషనల్ ఫ్రంట్ భాగస్వామ్య పక్షాలు పెద్దగా అభ్యంతరం చెప్పేవి కావు. కానీ దేవెగౌడ ప్రధానమంత్రి కావడానికి అసలుసిసలైన దోహదకారి ఎవరైనా ఉంటే ఆయన పేరు పీవీ నరసింహారావు. 1996 ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత, అటల్ బిహారీ వాజపేయి 13 రోజులు ప్రధానిగా ఉండి దిగిపోయిన తర్వాత, నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వానికి నాయకత్వం ఎవరు వహించాలనీ, ఎవరు ప్రధానిగా ఉంటే కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వవచ్చుననీ చర్చ వచ్చినప్పుడు తోటి దక్షిణాది నాయకుడు దేవెగౌడ అభ్యర్థిత్వాన్ని పీవీ సమర్థించారనే సంపూర్ణసత్యానికి రావలసినంత ప్రచారం రాలేదు. అవి పీవీకి మంచికి పోతే చెడు ఎదురయిన పాడు రోజులు. ఈ సత్యం దేవగౌడకు తెలుసు. అందుకే ఆయన పీవీ పట్ల వినియవిధేయతలు ప్రదర్శించేవారు.
-కేరా