కుల్బుర్గి, దబోల్కర్, నస్రీన్, పన్సారే
క్రీస్తుశకం 1550 ప్రాంతంలో ఏండ్రియస్ వేసాలియస్ అర్ధరాత్రి దాటిన తర్వాత స్మశానాలకు వెళ్ళి శవాల్ని కోసేవాడు. పుర్రెల్ని పరిశీలిస్తుండేవాడు. అతను తాంత్రికుడో, మంత్రికుడో కాదు. నాటి ప్రముఖ వైద్యశాస్త్రవేత్త! శవాన్నైనా సరే కోయడానికి ఆ రోజుల్లో న్యాయశాస్త్రం ఒప్పుకునేది కాదు. మంతం అంతకన్నా ఒప్పుకునేది కాదు. తప్పని సరైన పరిస్థితుల్లో ప్రపంచానికి కొత్త విశేషాలు అందించడానికి చట్టాన్ని, సమాజపు కట్టుబాట్లను పట్టించుకోకుండా ఆత్మవిశ్వాసంతో, గుండెధైర్యంతో మానవ శరీర నిర్మాణం అధ్యయనం చేశాడు వేసాలియస్! ఫలితంగానే ఈ రోజు కోట్ల మంది శస్త్రచికిత్సతో ఆరోగ్యాన్ని పొందుతున్నారు. జీవిత కాలాన్ని పొడిగించుకుంటున్నారు. మంత్రగాడేమోనని భయపడిన జనం…ఆయన ప్రాణరక్షకుడని తర్వాత తెలుసుకున్నారు. ఇదీ అంతే! సమాజంలో ఎక్కువమంది విశ్వాసాలకు వ్యతిరేకంగా మాట్లాడినవారంతా మూర్ఖులు, పాపులు, దుష్టులు ఏమాత్రం కాదు. ప్రగతి పథాన వెళ్ళదలచుకున్నవారు ఎదుటివారి వాదనలోని నిజమెంత అని అర్థం చేసుకునే ప్రయత్న చెయ్యాలి. అందుకే ఈ ‘హగ్ ఎన్ ఎథీస్ట్ డే’ జరుపుకోవాలి. మనవతావాదాన్ని బతికించుకోవాలి!!
Also read: యోగాను సైన్సు ఎందుకు అంగీకరించదు?
‘‘ఎవరు వినయవిధేయతలు కలవారూ? ఈ విశాల విశ్వాన్ని తెరిచిన మెదడుతో అర్థం చేసుకుంటూ, అది నేర్పుతున్న విషయాల్ని నేర్చుకుంటున్న శాస్త్రజ్ఞులా? లేక మొదడ్లు యూసుకుని మానవజాతిని, వారి పురోగతిని పరిగణనలోకి తీసుకోకుండా, తమ పూర్వీకులు ఎవరో రాసిన పుస్తకాల్లోని విషయాల్ని తమకు అనువైన అర్థతాత్పర్యాలతో వల్లించేవారా?’’ అని ప్రశ్నించాడు ప్రముఖ వైజ్ఞానిక రచయిత కార్ల్ సాగన్.
Also read: కవి, వెండితెర కవిగా మారితే – బుద్ధదేవ్ దాస్ గుప్తా
నాస్తికవాదం, నిరీశ్వరవాదం వంటివి ఏవీ భారతదేశంలో అధికారికంగా గుర్తించబడలేదు. అయితే, మన రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛ ప్రకారం ఎవరైనా ఏ మత విశ్వాసాలతోనైనా ఉండొచ్చు. ఏ మతవిశ్వాసాలు లేకుండా కూడా ఉండొచ్చు. ఎవరి మీద ఏ బలవంతం ఉండకూడదు. పెండ్లిళ్ళకు గానీ, సంప్రదాయ సిద్ధమైన కార్యకాలపాలకు గానీ, కఠినమైన నిబంధన లేవీ లేవు. ఎవరెవరి మతవిశ్వాసాలను బట్టి వారు ఊహించుకోవచ్చు. నిర్వహించుకోని వారిపై చట్టం ఏ చర్య తీసుకోదు. విశ్వాసం ఉంచడం ఎంత సబబో, విశ్వాసం లేకపోవడం అంతే సబబు. అది ప్రాథమిక హక్కు. దాన్ని ఎవరూ కాదనలేరు. విశ్వాసాలు ఉండాల్సిన పరిమితులతో ఉంటే, ఇతరులకు అభ్యంరాలు ఉండవు. అది మౌఢ్యం కిందికి మారకూడదు. అలాగే నిరీశ్వరవాదులకు తమ వాదన వినిపించే హక్కు తప్పకుండా ఉంటుంది. దేవుడు లేడన్నవాదన వినిపించినంత మాత్రాన వారిని పాపులుగా, నీచులుగా ముద్రవేయకూడదు. ప్రజాస్వామ్యబద్ధంగా వారి వాదనను ఆహ్వానించినప్పుడే మానవీయ విలువలు పరిరక్షింపబడతాయి. దేవుడు లేడన్న వాదన విని భరించలేని భక్తజనశిఖామనులు మనుషులెట్లా అవుతారో ఆలోచించుకోవాలి. తమది విశాలదృక్పథమా, సంకుచితత్వమానన్నది వారికి వారే విశ్లేషించుకోవాలి!
Also read: ముందుమాటలు… ముందుచూపు పెంచాలి!
29 అక్టోబర్ 2013న బొంబాయి హైకోర్టు ఒక నాస్తికుడి పక్షాన తీర్పిచ్చింది. నాసిక్ లో సంజయ్ సాల్వే అనే ఉద్యోగి సావిత్రీబాయి ఫూలే సెకండరీ స్కూల్ లో 1996 నుండి పనిచేస్తున్నాడు. 2007లో ప్రార్థన సమయంలో అతను చేతులు జోడించి నిలబడలేదని అతనికి ప్రమోషన్-పేరివిజన్ ఇవ్వకూడదని మానేజిమెంట్ వాదించింది. రాజ్యాంగంలోని సెక్షన్ 28(ఎ) ప్రకారం ప్రభుత్వ పాఠశాలలో కానీ, ప్రభుత్వ నిధులతో నడుస్తున్న పాఠశాలలో గానీ జరిగే మతపరమైన కార్యక్రమాలలో భాగస్వాములు కావడం ‘తప్పనిసరి’ కాదు- అందువల్ల, సంజయ్ సాల్వేకి రావాల్సిన జీతభత్యాల పెంపును ఆపడం వీలుకాదని హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. 23 సెప్టెబర్ 2014న అదే బొంబాయి హైకోర్టు మరో తీర్పిచ్చింది. అందులో ప్రభుత్వం ఏ వ్యక్తినైనా ఒక మతం స్వీకరించమని బలవంతం చేయకూడదు. ఎలాంటి ఒత్తిడికి గురిచేయకూడదు, ఒప్పించగూడదు-అని! ‘‘మతం లేదు’’ No religion – అనే దాన్ని కూడా ఒక మతంగా భావించవద్దని నొక్కి చెప్పింది. దేవతా విగ్రహాలు పాలు తాగడం బూటకమని నిరూపించినందుకు నరేంద్ర నాయక్ అనే వ్యక్తి శారీరక దాడులకు గురయ్యాడు. తలకు బలమైన గాయాలయ్యాయి, అతి కష్టం మీద బతికి బయటపడ్డాడు. అతని స్కూటర్ను రెండు సార్లు ధ్వంసం చేశారు. ఇలాంటి మూడనమ్మకాల నిర్మూలనకు కృషి చేస్తూ మేఘరాజ్ మిట్టల్ కూడా దాడులకు గురయ్యాడు. అతని ఇంటిపై దాడులు జరిగినప్పుడు పోలీసులు రక్షించాల్సివచ్చింది.
Also read: మానవ సంబంధాల్ని బలపరుస్తున్న టెక్నాలజీ
15 మార్చి 2007న అప్పుడు భారత్ లో నివసిస్తున్న బంగ్లా రచయిత్రి తస్లిమా నస్రీన్ తలపై ఏడు లక్షల ఫత్వా ప్రకటించారు తఖీర్ రజాఖాన్, హసన్ రజాఖాన్ లు. ఆమె తన రచనల్లో మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యాలు చేశారని అభియోగం! ‘‘ఒక స్త్రీని చంపుతామన్న దోషులకు ఈ దేశంలో శిక్షలే ఉండవా?’’ అని తస్లిమా ప్రకటిస్తే…తమను ‘దోషులనడం’ పవిత్ర ముస్లింల భావోద్వేగాల్ని దెబ్బతీయడం అని రజాఖాన్ లు బదులు చెప్పారు. 2 జులై 2011న వల్లికున్నులో కేరళ యుక్తివాది సంఘం కార్యదర్శి యు. కలనాథన్ ఇంటిపై దాడి జరిగింది. కారణం టెలివిజన్ చానెల్ చర్చలో ఆయన ‘‘పద్మనాభస్వామి నిధుల్ని ప్రజోపయోగ కార్యక్రమాలకు ఖర్చు పెట్టాల’’ని సూచించినందుకు! మూడనమ్మకాలకు వ్యతిరేకంగా జీవితం ధారపోసినందుకు ఫలితంగా 20 ఆగస్టు 2013న ప్రముఖ హేతువాది నరేంద్ర దబోల్కర్ మార్నింగ్ వాక్ లో ఉండగా కాల్చి చంపిన సంఘటన అందరికీ తెలిసిందే! సీ.పీ.ఐ నేత గోవింద్ పన్సారే భార్యతో కలిసి మార్నింగ్ వాక్ చేస్తుండగా సంప్రదాయ మతోన్మాదులు కాల్చి చంపడం కూడా తెల్సిందే. మాజీ వైస్ చాన్సలర్ యం.యం. కల్బుర్గి ఇంటికి వెళ్ళి, పాత విద్యార్థులమని పరిచయం చేసుకొని కాల్చి చంపిన విషయమూ తెల్సిందే. భగవద్గీతలోని లోపాల్ని ఎత్తిచూపినందుకు కె.యస్. భగవాన్ ను చంపుతామని బెదిరించిన విషయం కూడా మీడియా ప్రముఖంగానే వెలుగులోకి తెచ్చింది. ఆలోచించాల్సిన విషయమేమంటే హత్యలతో ఎవరైనా ఆలోచనాధోరణికి అడ్డుకట్టవేయగలరా? అని! ఇంగిత జ్ఞానాన్ని ఉపయోగించడం, విషయాల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం కావాలి. సమాజంలో సహనం పాలు పెరగాలి. ఎదుటివారి ఆలోచనను గౌరవించడం నేర్చుకోవాలి. దైవభావనను ప్రపంచమంతా శతాబ్దాలుగా నెత్తినపెట్టుకొని మోసింది. ఇంకా మోస్తూనే ఉంది. ఇక ఇప్పుడు సమయం వచ్చింది. వైజ్ఞానిక, మానవతావాద, ప్రజాస్వామ్యంలోకి అడుగుపెట్టాల్సిన సమయం రానేవచ్చింది. ‘హగ్ ఎన్ ఏథీస్ట్ డే’ లాంటివి జరుపుకుంటూ,జీవితంలో కొత్త నిర్వచనాలకు చోటుందని చెప్పుకోవాల్సి ఉంది. దేవుడు, భక్తి, సంప్రదాయం పేరుతో జరుగుతున్న అరాచకాలు, అమానవీయ దృశ్యాలు చూస్తున్నాం కాబట్టి, వాటికిక ముగింపు పలికి-జాలి, దయ, కారుణ్యం, నైతిక విలువల పరిరక్షణకు పాటుపడదాం! అందుకు పనికిరాని ‘మతం’ అనే పాత అజ్ఞానాన్ని పరిత్యజించి, ‘మానవత్వ’’మనే కొత్త, శాస్త్ర, సాంకేతిక విజ్ఞానంతొ ముందుకు పోదాం!!
Also read: ‘‘భరతమాత ముద్దుబిడ్డ నెహ్రూ:’’ అటల్ బిహారీ వాజపేయి
(HUG AN ATHEIST DAY-ప్రతిసంవత్సరం జూన్ మొదటి శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు)