కోల్ కతా: ‘ఒక్క కాటుతో చంపేసే కోడెనాగును నేను’ అని సినిమా డైలాగ్ చెప్పుకునే ప్రఖ్యాత నటుడూ, తృణమూల్ కాంగ్రెస్ మాజీ రాజ్యసభ సభ్యుడూ మిథున్ చక్రవర్తి మార్చి 7న కోల్ కతా లోని బ్రిగేడ్ మైదానంలో ప్రధాని ప్రసంగానికి ముందు బీజేపీలో చేరిపోయారు. టీఎంసీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరించడాన్ని తప్పుడు నిర్ణయంగా అభివర్ణిస్తూ ప్రజలకు సేవ చేసేందుకే బీజేపీ లో చేరానని చెప్పుకొచ్చారు.
బెంగాల్ తనయుడు
‘ఇక్కడ కొడితే శ్మశానంలోకి వెళ్ళి పడతావు అనేది నా పాత డైలాగ్. దాన్ని మార్చి కొత్త డైలాగ్ తయారు చేసుకున్నాను. ‘నేను భారతీయ నాగుబాముని. ఒక్క కాటుతో చంపేస్తా.’ అన్నది కొత్త ప్రచారంలో పెట్టదలచిన డైలాగ్’ అని మిథున్ చక్రవర్తి అన్నారు. బీజేపీ పశ్చిమబెంగాల్ శాఖ అద్యక్షుడు దిలీప్ ఘోష్ పార్టీ పతాకాన్ని మిథున్ చక్రవర్తి చేతికి అందించి ఆయనను సభికులకు పరిచయం చేశారు. ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతూ మిథున్ చక్రవర్తిని ‘బంగ్లార్ చేలే’ (బెంగాల్ తనయుడు) అంటూ సంబోధించారు. బంగ్లా నిజేర్ మేయే కే చై (బెంగాల్ తన కూతురినే కోరుకుంటుంది) అనే త్రిణమూల్ కాంగ్రెస్ నినాదానికి ప్రతిగా ప్రధాని బంగ్లార్ చేలేను ప్రయోగించారు. త్రిణమూల్ నినాదం ముఖ్యమంత్రి మమతా బెనర్జీని బెంగాల్ పుత్రికగా అభివర్ణిస్తుంది. ఈ నినాదాన్ని పూర్వపక్షం చేసేందుకు బీజేపీ ఒక బెంగాలీ ప్రముఖుడి కోసం చూస్తున్నది.
Also Read : మిథున్ చక్రవర్తి జనాకర్షణ బీజేపీకి లాభిస్తుందా?
రాజకీయాలలో ఆసక్తి లేదన్న గంగూలీ
ప్రఖ్యాత క్రికెటర్ సౌరవ్ గంగూలీని పార్టీలో చేర్చుకొని మమతాకి పోటీగా నిలబెడతారంటూ ఊహాగానాలు వినిపించాయి. రాజకీయాలలో చేరే ఉద్దేశం తనకు లేదని గంగూలీ తన సన్నిహితులతో చెప్పడంతో బీజేపీ అతడిని దువ్వే ప్రయత్నాన్ని విరమించుకున్నది. బెంగాలీ సినిమాలో శిఖర సమానుడైన ప్రొసేన్ జిత్ చటర్జీని చేర్చుకోవాలని బీజేపీ తలబోసింది. జనవరి 23న నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా విక్టోరియా మెమోరియల్ లో ప్రధాని పాల్గొన్న సమావేశానికి చటర్జీ హాజరైనారు. చటర్జీ సైతం తనకు రాజకీయాల పట్ల ఆసక్తి లేదని చెప్పారు. ఇది ఇలా ఉండగా, మిథున్ చక్రవర్తి ఫిబ్రవరిలో ముంబయ్ లోని తన నివాసంలో ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్ ను ఉదయం అల్పాహారానికి ఆహ్వానించారు. అప్పటి నుంచి ఆయన బీజేపీలో చేరతారనే వదంతి వ్యాపించింది.
అందాల నటుడు అందరివాడు
బెంగాలీ అందాల నటుడు మిథున్ చక్రవర్తి అందరివాడుగా పేరు తెచ్చుకున్నారు. సీపీఎంకు చెందిన సుభాష్ చక్రవర్తికి మిథున్ సన్నిహితంగా ఉండేవారు. వామపక్షాల ప్రభావం తగ్గుతున్న సమయంలో త్రిణమూల్ కాంగ్రెస్ లో చేరారు. ఆ పార్టీ 2014లో ఆయనను రాజ్యసభకు పంపించింది. రెండేళ్ళ తర్వాత శారదా పోంజీ కుంభకోణంలో తన పేరు బయటికి రాగానే ఆనారోగ్య కారణం చూపించి ఎగువ సభ నుంచి రాజీనామా చేశారు.
మృణాల్ సేన్ దర్శకత్వం వహించిన ‘మృగయా’లో ఆదివాసీ విలుకాడుగా వేషం వేయడంతో నటుడిగా పేరుప్రఖ్యాతులు పొందిన మిథున్ చక్రవర్తి ఆ చిత్రంలో ఉత్తమనటుడుగా జాతీయ స్థాయి పురస్కారం అందుకున్నారు. మార్చి 12 నుంచి బీజేపీ తరఫున మిథున్ ప్రచారం చేస్తారని పార్టీ వర్గాలు ప్రకటించాయి.
Also Read : నందిగ్రామ్ నుంచి మమత పోటీ
సినిమా దిగ్గజాలు బీజేపీలోకి
లోగడ కంటే అధికంగా బెంగాల్ చలనచిత్ర పరిశ్రమ నుంచి హేమాహేమీలను పార్టీలో చేర్చుకోవడానికి బీజేపీ విశేషించి ప్రయత్నించింది. రుద్రనీల్ ఘోష్, యాష్ దాస్ గుప్త, హిరణ్ చటర్జీ, పాయెల్ శంకర్, శ్రవంతి చటర్జీ వంటి ఘనాపాఠీలను పార్టీలో చేర్చుకున్నది. టీవీ నటీనటులను కూడా పార్టీలోకి ఆహ్వానించారు. 2019 పార్లమెంటు ఎన్నికలలో బంగ్లాదేశ్ కు చెందిన ఫిర్దోసీ బీజేపీ తరఫున ప్రచారం చేశారు. బీజేపీ బహిరంగసభలలో, ఎన్నికల సభలలో మిథున్ చక్రవర్తి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారనడంలో సందేహం లేదు. యాక్షన్ చిత్రాలలో, కుటుంబ కథా చిత్రాలలో విరివిగా నటించిన మిథున్ దేశవ్యాప్తంగా బాలీవుడ్ నటుడిగానే కాకుండా సోవియెట్ యూనియన్ వంటి విదేశాలలో సైతం పేరు తెచ్చుకున్నారు.
నందిగ్రామ్ లో మిథున్ ప్రచారం?
ప్రస్తుతం మమతా బెనర్జీకి ప్రత్యర్థి, మొన్నటి వరకూ సహచరుడు అయిన సువేందు అధికారికి మిథున్ చక్రవర్తి సన్నిహిత మిత్రుడు. 2014 లోక్ సభ ఎన్నికలలో అధికారికి మిథున్ ప్రచారం చేశారు. ఇప్పుడు అదే అధికారి ముఖ్యమంత్రి మమతా బెనర్జీపైన నందిగ్రామ్ లో తపబడుతున్నారు. మిథున్ చక్రవర్తి ప్రచారం చేస్తే మంచి మెజారిటీతో గెలుపొందాలని సువేందు అధికారి ఆకాంక్ష.
Also Read : పశ్చిమ బెంగాల్ లో బీజేపీ, తృణమూల్ అమీతుమీ