Friday, December 27, 2024

అఫ్ఘానిస్తాన్ లో సోవియెట్లను ఓడించేందుకు ముజాహిదీన్ ని తయారు చేశాం: జనరల్ ముషారఫ్

కిరాయి సైనికులు (మెర్సెనరీలు) అల్ ఖాయిదాగా మారారు?

26 ఏళ్ళ పాటు యుద్ధవాతావరణాన్ని పాకిస్తాన్ భరించింది

అఫ్ఘానిస్తాన్ లో సోవియెట్ యూనియన్ పైనా, కమ్యూనిజంపైనా జిహాద్ (మతయుద్ధం) ఎట్లా జరిగిందో పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు జనరల్ ముషారఫ్ వివరిస్తున్న పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రధానిగా నవాజ్ షరీఫ్ ఉండగానే కార్గిల్ యుద్ధం ప్రారంభించిన దుడుకుపిండం ముషారఫ్. ఆ తర్వాత నవాజ్ షరీఫ్ ను తోసిరాజని అధికారం హస్తగతం చేసుకున్నాడు. భారత్ తో యుద్ధం చేశాడు, దౌత్యం చేశాడు. 1943లో బ్రిటిష్ ఇండియాలో దిల్లీలో పుట్టిన పర్వేజ్ ముషారఫ్ కరాచీలో పెరిగాడు. సైన్యంలో చేరాడు. అధికారంలోకి వచ్చాడు. షరీఫ్ హయాంలోనే ప్రత్యర్థి బేనజీర్ భుట్టో హత్య జరిగింది. పదవీ చ్యుతుడైన తర్వాత లండన్ లో నివసించాడు. ఆల్ పాకిస్తాన్ ముస్లింలీగ్ ను 2010లో నెలకొల్పాడు. ఎన్నికలలో పాల్గొనడానికి పాకిస్తాన్ వెళ్ళాడు. ఎన్నికలలో పోటీ చేసే అర్హత లేదని కోర్టు నిర్ణయించింది. తిరిగి లండన్ వెళ్ళిపోయాడు. రెండేళ్ళ కిందట ముషారఫ్ కు పాకిస్తాన్ ప్రత్యేక న్యాయస్థానం మరణశిక్ష విధించింది. దానిపైన అప్పీలు చేసుకున్నారు. ఆయన దేశంలో లేకుండా అప్పీలుపై విచారణ జరపడం సహజ న్యాయ సూత్రానికి విరుద్ధమని కోర్టు ప్రకటించింది.  తర్వాత దుబాయ్ లో స్థిరపడ్డారు.  లండన్ లో రికార్డు చేసిన సంభాషణలో అఫ్ఘానిస్తాన్ లో సోవియెట్ యూనియన్ ని ఎట్లా ఓడించిందీ వీడియోలో వివరించారు.

‘‘సోవియెట్ యూనియన్ 1979లో అఫ్ఘానిస్తాన్ ని ఆక్రమించుకున్న తర్వాత దానిని ప్రతిఘటించడానికి ఒక కూటమి ఏర్పడింది. పాశ్చాత్యదేశాలూ, అమెరికా, పాకిస్తాన్ లు సోవియెట్ వ్యతిరేక కూటమిలో చేరాయి. కమ్యూనిజాన్ని ప్రతిఘటించే పోరాటాన్ని ప్రధానంగా నాలుగు రకాలవారు కొనసాగించారు. మేమంతా కలిసి అఫ్ఘానిస్తాన్ లో మతయుద్ధం చేశాం. ప్రధానంగా అఫ్ఘానిస్తాన్ ప్రజలు.  వీరు మొదటి తరహా. రెండో తరహా వారు ప్రపంచం మొత్తం నుంచి, ముఖ్యంగా ఇస్లామిక దేశాల నుంచి వచ్చి చేరిన ముజాహిదీన్. 20 నుంచి 30 వేల మంది ముజాహిదీన్ ను అఫ్ఘానిస్తాన్ లోకి తీసుకువచ్చాం. ఒసామాబిన్ లాదెన్ కూడా అప్పుడే వచ్చాడు. మూడో తరహావారు మా మదరసాలలో (ఇస్లామిక్ పాఠశాలలు) శిక్షణ ఇచ్చి, ఆయుధాలు ఇచ్చి అఫ్ఘానిస్తాన్ కు పంపిన తాలిబ్ లు (విద్యార్థులు). నాలుగో కేటగరీవారు మెర్సనరీస్. కిరాయి సైనికులు. నేను స్పెషల్ కేటగరీ గ్రూప్ లో పని చేశాను కనుక నాకు తెలుసు.

‘‘ఈ పోరాటం పదేళ్ళు కొనసాగింది. దీని ప్రభావం పాకిస్తాన్ పైన ఎట్లా  ఉన్నదో చూడండి. పదేళ్ళ తర్వాత సోవియెన్ యూనియన్ ఓడిపోయింది. అందరూ పాకిస్తాన్ ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారు. అఫ్ఘానిస్తాన్ లో వార్ లార్డ్స్ పన్నెండు, పదిహేను మంది ఉన్నారు. వారు ఒకరి ముఠాను ఒకరు చంపుకోవడం సాగించారు. అఫ్ఘానిస్తాన్ ను వారు నాశనం చేస్తున్నారు. నలభై లక్షల మంది కాందిశీకులు పాకిస్తాన్ కు వచ్చారు. మేము శిక్షణ ఇచ్చి, ఆయుధాలు ఇచ్చి పోరాటం చేయించిన 20 వేల మంది ముజాహిదీన్ ఎక్కడికి పోతారు. ఇక్కడే ఉన్నారు. వారు పాకిస్తాన్ లో సుఖంగా ఉన్నారు. స్వదేశమైన అఫ్ఘానిస్తాన్ లో హింసాకాండ జరగుతున్నది. అనిశ్చిత పరిస్థితులు ఉన్నాయి. అందుకని పాకిస్తాన్ నగరాలలో, పట్టణాలలో తిరగడం ప్రారంభించారు. అఫ్ఘానిస్తాన్ లో పోరాటం చేసిన మెర్సినరీలు అల్ ఖాయిదాగా రూపాంతరం చెందారు. 2000లకు మందు మీరు అల్ ఖాయిదా గురించి విన్నారా? లేదు.  ముజాహిదీన్ లో కొందరు అల్ ఖాయిదాగా మారారు (వారికి ఒసామా బిన్ లాదెన్ నాయకత్వం వహించారు). 1989 తర్వాత సోవియెట్ యూనియన్ పతనమై మధ్య ఆసియా రిపబ్లిక్ స్వాతంత్ర్యం ప్రకటించుకున్నాయి. ఉజ్బెకిస్తాన్ లో తిరుగుబాటు ప్రారంభమైంది. చెచెన్యా ప్రజలకు స్వాతంత్ర్యం కావాలని అనుకున్నారు. వారు కూడా పాకిస్తాన్ కు వచ్చారు. ఈ భారం అంతా, ఈ గందరగోళమంతా 2001 దాకా పాకిస్తాన్ భరించవలసి వచ్చింది. అంతలో సెప్టెంబర్ తొమ్మిది ఘటన జరిగింది. అమెరికా, నాటో సేనలు అఫ్ఘానిస్తాన్ ని ఆక్రమించుకున్నాయి. 2005 వరకూ ఆ అనిశ్చితి కొనసాగింది. అంటే 26 సంవత్సరాల యుద్ధ ప్రభావాన్నీ, అనిశ్చితినీ, గందరగోళాన్నీ పాకిస్తాన్ ఎదుర్కోవలసి వచ్చింది. తూర్పు భాగంలో, పశ్చిమ భాగంలో మిలిటెంట్లు పోరాడటం, తుపాకులు పేలుతూ ఉండటం మేము మధ్యలో ఉండటం జరిగింది. ఈ వాస్తవాన్ని ప్రపంచం అర్థం చేసుకోవాలి,’’ అని చెబుతుంటే ముషారఫ్ భార్య, మరో యువతి, ఇంకో పురుషుడు వింటూ, ఊ కొడుతూ ఉన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles