- విజయుడి వైఫల్యాలను ఎట్లా చూడాలి?
- తప్పుకోమనడం భావ్యమా? తానే నిర్ణయించుకోవడం నయమా?
భారత దేశంలో జన్మించిన అద్భుతమైక క్రికెట్ వీరులలో మేటి అయిన విరాట్ కొహ్లీ పని అయిపోయిందా? మొన్నటి మొనగాడు కపిల్ దేవ్, తదితరులు అంటున్నట్టు విరాట్ విరామం తీసుకోవలసిందేనా? కెప్టెన్ రోహిత్ శర్మ ఆశిస్తున్నట్టు విరాట్ త్వరలోనే విజృంభిస్తాడా? మళ్ళీ ఫామ్ లోకి వచ్చి శతకాలు కొడతాడా? 2019 నుంచి శతకం కాదు కదా మంచి స్కోరు కూడా చేయలేకపోయినా కొహ్లీ తన విశ్వరూపం ప్రదర్శిస్తాడా? కొహ్లీని కొట్టిపారవేయడం తొందరపాటు అవుతుందా? గొప్ప బ్యాటర్లకు అప్పుడప్పుడు ఇటువంటి విఫల సందర్భాలు ఎదురుకావడం మామూలేనా? కొహ్లీ నుంచి నిరవధికంగా అద్భుతాలు ఆశించి అతగాడిని అపార్థం చేసుకొని హైరానా పెడుతున్నామా? సచిన్ టెండూల్కర్ తన క్రీడా ప్రస్థానం ముగింపు దశకు చేరుకున్నప్పుడు ఇదే మాదిరిగా పేలవంగా ఆడి విమర్శలు ఎదుర్కొన్నాడు. కొహ్లీ సంగతి కూడా అంతేనా? కొహ్లీకి ఇంకా ముప్పయ్ మూడేళ్ళు దాటలేదు. సచిన్ నలభయ్యో పడి దగ్గర పడిన తర్వాత బ్యాట్ తో సమస్యలు ఎదుర్కొన్నాడు. కొహ్లీ పునరుత్థానం జరుగుతుందా? ఇదీ దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులలో జరుగుతున్న చర్చ. వారిని వేధిస్తున్న సమస్య.
సచిన్ టెండూల్కర్ కి కూడా నూరో శతకం చేయడానికి చాలా కాలం పట్టింది. తొంభై తొమ్మిదో శతకం దగ్గరే చాలా కాలం ఆగిపోయాడు. దేశం యావత్తూ అతడి వందో శకతం కోసం ఓపికగా నెలల తరబడి ఎదురు చూసింది. చివరికి బంగ్లాదేశ్ పర్యటనలో వంద పరుగులు చేసి ఆ ముచ్చట తీర్చాడు. ఆ మ్యాచ్ లో ఇండియా ఓడిపోయింది. అది వేరే విషయం. సహజంగా మనం వ్యక్తిగత ప్రతిభకు అధిక ప్రాధాన్యం ఇస్తాం. భారత్ ఓడిపోయినా సరే టెండూల్కర్ గెలిచినందుకు సంతోషించాం.
ప్రతి క్రీడాకారుడి జీవితంలో జరిగినట్టే కొహ్లీ ఆటలో కూడా అవరోధం ఏర్పడింది. అంతమాత్రాన అతడి తలదీసి మొలవేయాలనడం సమంజసం కాదు. ఒక భారీ స్కోరు, బహుశా మనం అందరం ఎదురు చూస్తున్న 71వ అంతర్జాతీయ శతకాన్ని బాదేస్తే కొహ్లీ గురించి కొన్నాళ్ళపాటు నిర్దయగా మాట్లాడుకోవడం ఉండదు. మనకు మానసిక సంతృప్తి కలుగుతుంది. కొహ్లీ మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడనే ఎరుకే మనకు ఆత్మానందం కలగజేస్తుంది.
కొహ్లీ బ్యాటింగ్ లో సమస్యలు ఎదుర్కోవడం ఇదే ప్రథమం కాదు. 2014లో ఇంగ్లండ్ పర్యటనలోనూ ఇదే పరిస్థితి. మొత్తం పది ఇన్నింగ్స్ ఆడితే అత్యధిక స్కోరు 39 పరుగులే. ఫర్వాలేదు కుదురుగా బ్యాటింగ్ చేస్తున్నాడని అనుకుంటున్న క్షణాలలో అవుటైపోయేవాడు. అప్పుడు శిక్షకుడు యాండర్సన్ కొహ్లీ సమస్యను తెలుసుకొని పరిష్కారమార్గాలు సూచించి తిరిగి బాటలో పెట్టాడు. ఇప్పుడు మాజీ కెప్టెన్, ఒకప్పటి అగ్రశ్రేణి క్రీడాకారుడు సునీల్ గావస్కర్ తనకు ఇరవై నిమిషాల సమయం కనుక కొహ్లీ కేటాయిస్తే సమస్య పరిష్కరిస్తానని అంటున్నాడు. కొహ్లీకి ఈ సలహా పాటించడానికి అభ్యంతరం ఉండకూడదు. గావస్కర్ సీనియర్ క్రికెటర్ మాత్రమే కాకుండా క్రీజ్ లో ఒక వెలుగు వెలిగిన అరుదైన బ్యాటర్. అగ్రగణ్యుడైన బ్యాటర్.
ఆరేళ్ళ కిందటి ఇంగ్లాండ్ పర్యటనలో కంటే ఈ సారి కొహ్లీ బ్యాటింగ్ మరింత అధ్వానంగా ఉంది. అప్పుడు అంతులేని ఆత్మవిశ్వాసంతో ఆడేవాడు. ఈ సారి ఆత్మవిశ్వాసం సన్నగిల్లినట్టు కనిపిస్తోంది. ఇప్పటి వరకూ సాధించిన విజయాలతోనైనా చరిత్రలో కొహ్లీ నిలిచిపోతాడు. భారత దేశంలో అత్యంత జయప్రదమైన కెప్టెన్ గా కొహ్లీ రికార్డు ఘనమైనది. ముగ్గురు మేటి భారత బ్యాట్స్ మన్ లలో ఒకడుగా చరిత్రలో స్థానం ఇప్పటికే సంపాదించుకున్నాడు. తక్కిన ఇద్దరూ గావస్కర్, టెండూల్కర్. వారిద్దరూ ముంబయ్ పుత్రులు కాగా కొహ్లీ దిల్లీ కుమారుడు. కడచిన రెండున్నరేళ్ళుగా కొహ్లీ సెంచరీ సాధించలేకపోయాడు. అంతకు ముందు 70 అంతర్జాతీయ శతకాలు కొట్టాడు. శతకం చేయలేకపోయినప్పటికీ రెండున్నరేళ్ళలో ఆడిన 79 ఇన్నింగ్స్ లో 2500 పరుగులు చేసి సగటున 35.5 పరుగులు రికార్డు చేశాడు. ఇది వెస్టిండీస్ పోటుగాడు క్రిస్ గైల్ సగటు కంటే కాస్త తక్కువ, శ్రీలంక హీరో సనత్ జయశూర్య సగటు కంటే ఎక్కువ.
కొహ్లీ ఇంతవరకూ 463 అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడాడు. ఈ ఘనత సాధించిన ఆటగాళ్ళు అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో మరి 15 మంది మాత్రమే ఉన్నారు. వారిలో ఎవ్వరూ సగటున 50 పరుగులకు మించి చేయలేదు. కొహ్లీ సగటు 53 పరుగులు. గతం ఘనంగా ఉన్న కొహ్లీ వర్తమానంలో చిక్కులు ఎదుర్కొంటున్నప్పటికీ త్వరలోనే కోలుకుంటాడనీ, అతడు వదిలివేయడానికి వీలులేని అత్యంత విలువైన ఆటగాడనీ క్రికెట్ యాజమాన్యంలో ప్రధాన పాత్రధారులైన ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రావిడ్ అచంచలమైన విశ్వాసం. అదే కొహ్లీకి శ్రీరామరక్ష.
కొహ్లీ సాంకేతికపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నాడా? మానసిక సమస్యలు ఏమైనా అతడిని బాధిస్తున్నాయా? అలసి పోయాడా? ఆత్మవిశ్వాసం సన్నగిల్లిందా? కంటి చూపు మందగించిందా? తక్కువ కాలంలో ఎక్కువ క్రికెట్ ఆడిన కారణంగా విసుగుదల పుట్టిందా? ఇటువంటి ప్రశ్నలు కొహ్లీ అభిమానుల్ని వేధిస్తున్నాయి. అలసి పోయినట్టు కనిపించడు. బుమ్రా బౌలింగ్ చేసి ఇంగ్లండ్ బ్యాటర్ ని అవుట్ చేసినప్పుడు కొహ్లీ గ్రౌండ్ లో భంగ్రా నృత్యం చేశాడు. బంతిని వదిలిపెట్టకుండా పరుగులు తీస్తున్నాడు. ఉత్సాహంగా కనిపిస్తున్నాడు. అందరితో కలుపుగోలుగా ఉంటూ, సరదాగా మాట్లాడుతున్నాడు. ఏకాగ్రతకు భంగం కలగనీయడు. శారీక స్వస్థతపైన దృష్టి పెడతాడు. ఎటువంటి మ్యాచ్ అయినా పూర్తి శ్రద్ధతో ఆడతాడు. టెండూల్కర్ లాగానే కొహ్లీ కూడా క్రమశిక్షణ కలిగిన క్రీడాకారుడు. కనుక పైన అనుకున్న సమస్యలు ఏవీ అతడి దరి చేరలేదనే అనుకోవచ్చు. సాంకేతికపరమైన ఇబ్బందులు కూడా తాత్కాలికమైనవే అనుకోవాలి. భార్య అనుష్క శర్మ సహకారంతో త్వరగానే తిరిగి విజృంభిస్తాడని ఆశించాలి.
ఐదు రోజుల క్రికెట్ మ్యాచ్ లూ, 50 ఓవర్ల ఒన్ డే మ్యాచ్ లూ, టీ 20లూ ఆడుతూ సంవత్సరం పొడవునా నిర్విరామంగా క్షేత్రం లో ఉండటం వల్ల కూడా ఇటువంటి పరుగుల కరువు పరిస్థితి దాపురించిందా? కొహ్లీ కంటే రెండేళ్ళు చిన్నవాడైన ఇంగ్లీషు బ్యాటర్ బెన్ స్టోక్స్ మొన్న దక్షిణాఫ్రికాతో మ్యాచ్ ఆడిన తర్వాత అంతర్జాతీయ క్రికెట్ నుంచి విరమించుకున్నాడు. మూడు ఫార్మట్లకూ న్యాయం చేయలేనని అన్నాడు. బెన్ స్టోక్స్ కూడా చాలా మంచి బ్యాటర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఒక స్టోక్స్, ఒక కొహ్లీ, ఒక టెండూల్కర్ – ఇటువంటి మేటి క్రీడాకారులు ఎల్లవేళలా బాగానే ఆఢాలనీ, ఎవ్వరికీ తీసిపోకుండా ఉండాలని అభిమానులు ఆశిస్తారు. అంతేకాదు. ఈ క్రీడాకారులు కూడా తాము అత్యన్నతమైన ప్రదర్శన ప్రతిసారీ చేయవలసిందేనని పట్టుదలగా ఉంటారు. ఇటువంటి మేటి ఆటగాళ్ళకు గతంలో సాధించిన ఘనవిజయాలే తలపైన బరువై కూర్చుంటాయి. తన పని అయిపోయిందా లేక ఇంకా కొన్నేళ్లు రాణించగలడా అనేది కొహ్లీకి వదలివేస్తే మంచిది. అతడికి అన్నీ తెలుసు. అతడు అజేయుడు. చరిత్ర సృష్టించినవాడు. అతడు చూరు పట్టుకొని వేళ్ళాడే రకం కాదు. ఒకరితో చెప్పించుకునే బండ మనస్తత్వం ఉన్నవాడు కాదు. మూడు ఫార్మాట్లలో జట్టు నాయకత్వాన్ని ఎంత ఉదాత్తంగా వదులుకున్నదీ ఇటీవలే గమనించాం. అతని మానాన అతడిని వదిలేస్తే మళ్ళీ విజృంభించడమో, స్టోక్స్ మాదిరి సెలవు తీసుకోవడమో అతడే నిర్ణయించుకుంటాడు. అందుకే అతడి మానాల అతడిని వదిలేద్దాం.