హైదరాబాద్ నగరంలో నాగరాజు అనే దళిత యువకుడిని అతడి భార్య ఆశ్రీన్ సుల్తానా సోదరులు నట్టనడి రోడ్డులో హత్య చేయడంపైన తెలంగాణ పౌరహక్కుల ప్రజాసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయవింధ్యాల, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇక్బాల్ ఖాన్ విడుదల చేసిన ప్రకటన పూర్తిపాఠం:
వివాహం విషయంలో ఎలాంటి ఆచార విధులు, వ్యవహారాలు ఉండాలి అనేదానిపై …. దాదాపుగా అన్ని మతాలలో స్త్రీల వివాహాన్ని ఒక సంస్కారంగా నిర్ణయించాయి. ముసల్మాన్ లలో వివాహం అనేది ఒక ఒడంబడిక.
ఈ సమాజంపైన ఉమ్మేయాలని ఉంది: ఆస్రీన్ సుల్తానా
ఆస్రీన్ సుల్తాన .. ఈ సమాజం మీద ఉమ్మేయాలని ఉంది అన్నది. ఆవేశంతో మాట్లాడింది, మాట్లాడుతుంది అని కొందరు మీడియా ప్రతినిధులు, కొందరు సామాజిక కార్యకర్తలు ‘జస్టిఫికేషన్’ చేసేపనిలో ఉన్నారు. వాస్తవానికి, సచ్చీ బాత్ కి “జస్టిఫికేషన్” అవసరం లేదు.
ఇది మతోన్మాద హత్య కాదు, కులోన్మాద హత్య కాదు, ఇందులో జెండర్ దాగి ఉంది. తనకు ఇష్టమైన వ్యక్తితో జీవితం పంచుకోకూడదా? నాగరాజు హత్యతో బయటపడిన ‘ఇస్లాం లో కుల వ్యవస్థ /వివక్ష, ఈ సంఘటనను సాకుగా చూపి దళితులకూ ముస్లింలకూ మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టాలనుకుంటున్నారు కొందరు పెద్దమనుషులు… మతం, పితృస్వామ్య భావజాలం కలగలిసి ఉండటం ప్రధాన సమస్య . మిర్యాలగూడ ప్రణయ్ అయినా, మంథని మధుకర్ అయినా, నాగరాజు అయినా హిందూ మతానికి చెందిన తల్లిదండ్రులు, ముస్లిం మతానికి చెందిన తల్లి దండ్రులు వారి మతాల కతీతంగా ఒకేలాగా ప్రవర్తించారు. మతాంతర పెళ్లిళ్లు చేసుకున్నవారు దళితులవడం వల్లనే ఆలా జరిగింది అనుకుంటే, అమీర్ పేటలో కొబ్బరికాయల కత్తితో నరికి చంపబడిన ఘటన , భువనగిరి లో చంపబడిన కానిస్టేబుల్ దళితేతరులు. చంపిన కులాలూ బీ సీ లు…. ఇలాంటి పస లేని మాటలు, ప్రకటనలతో ఒకవైపు సోషల్ మీడియా, మరొక వైపు సాధారణ మీడియాలు హోరెత్తుతున్నాయి.
సోషల్ మీడియాలో మరో వార్త .. అమృత ప్రణయ్‌కి సపోర్ట్ గా యుద్ధం చేశారు. ఇప్పుడు నాగరాజు కనపడలేదు మీ కంటికి.. ముస్లిం అయితే ప్రశ్నించరట.. భయమా … కళ్ళు తెరవండి ఇకనైనా.. అంటూ … ప్రణయ్ ఒక దళిత్ క్రిస్టియన్. ఇది ఏ మీడియా రాయదు. జరిగిన పెళ్లి క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం. ఉద్యమం వెనకాల మొత్తం క్రిస్టియన్ సంస్థలు. కానీ జరిగిన ఉద్యమం .. అగ్రకుల ఉన్మాద -దుర్మార్గ దాష్టిక వ్యతిరేక ఉద్యమంగా వచ్చింది. ఇది ఒక విధంగా ఉద్యమకారులకు “అధ్యయన కేసు” అయ్యివుండాలి. గతంలో ఈదన్న హత్య పోలీస్ హత్య అని ఉద్యమకారులు ఉద్యమం చేస్తే .. పోలీసులు కాదు అని తెలిసిన తరువాత .. పోలీసులు చేపిచ్చారు అని సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ విషయం ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు, అయితే ఉద్యమకారులు ఎప్పటికప్పుడు నవీకరణ / అప్ డేట్ కావాలి. ఇదే ప్రజలు దగ్గెర కావటానికి మంచి సాధనం
ప్రణయ్ హత్యలో ఇగో సమస్య
ప్రణయ్ హత్యలో ‘పరువు’ కన్నా ఈగో సమస్యఉంది. ప్రణయ్ పరిస్థితులు, నేపథ్యం వేరు. ఇక్కడ ఒకటి ప్రస్తావిస్తాను. ప్రభుత్వపథకాలకు “కులం” కార్డును వాడుకోవటం, జీవనశైలిలో కొంచెం మతమార్పిడి అలవాట్లు, మరికొంచెం “గతం కులపు ఆచారాల” అలవాట్లు. రెంటినిఎలా ‘సింక్’ చేయవచ్చు. మీరేచెప్పండి. ప్రభుత్వాలకు కావలసింది ఈనడవడికనే. ప్రజలలో ఎవరికివారు పోట్లాడుకుంటూ ఉంటే ..ముందు మీరు తేల్చుకోనిరమ్మని చెపుతారు. ఇప్పుడు జరుగుతున్న డ్రామా ఇదే. ఇక్కడమరోవిషయాన్నిప్రస్తావిస్తాను ..మాల మాదిగ ఇద్దరూ దళితులే మరి “కంచాన్ని – మంచాన్ని'” ఎందుకుపంచుకోలేరు. ఇక్కడకుల -ఉపకులసమస్యనా? మతంసమస్యనా? సామాజిక పరిస్థితులు సమస్యనా? భారత రాజ్యాంగం సరిగ్గా అమలు చేయటంలో ఉన్న లోపమా? వీటి గురించి కూడా కొంచెం ఆలోచించుకోవాలి. మనం బ్రతుకుతున్న సమాజం ఎవరికి వారుగా గీతలుగీసుకొని బ్రతుకుతున్నసమాజం. భారత దేశ సమాజానికి ఒక దిశ లేదు – నిర్దేశం లేదు. ఎవ్వరి ఆచారాల ప్రకారం వారు బ్రతుకేయటం ఒక్కటే ఇక్కడ ఉన్నది. ఉమ్మడి జీవన విధానం ఎక్కడుంది? భారత దేశంలో 4000 + తెగలు (including all religions, castes, sub -castes, races etc) ఉన్నాయి, 6000+ భాషా -యాసలున్నాయి. వీటిని లింకప్ చేసి పెడుతున్న విషయం “ఆచారాలు – సంప్రదాయాలు” . వీటిని పాటించేవారు మహిళలే, వీరికి కాపలా కాసే వారు ఒకప్పుడు కాపలాదారులు (ఇందులో ఎక్కువగా మగవాళ్ళు ఉంటారు మరియు తక్కువలో కొందరు ఆడవాళ్లు ఉంటారు) ఉండేవారు. ఇప్పుడు పురుషులే. దానికి పేరు పితృస్వామ్య భావజాలురు, మతోన్మాదులు, కులోన్మాదులు, ఉన్మాదులు, దుర్మార్గులు, రేపిస్టులు ఉంటున్నారు. ఎప్పటికప్పుడు కొత్త శంకంలోకి పాత నీరును నింపి బిరడా బిగించి పెట్టటం చేస్తున్నారు. దీన్నిపగులగొట్టాలి? ఎలా …
మతంపైన దాడిగా చూడాలా?
నాగరాజు హత్యా ఒక మతంపైన దాడిగా చూడాలనా? ఒక కులంపైన జరిగిన దాడిగాచూడాలనా? బీదరికంపై జరిగిన దాడిగా చూడాలనా ? లేక పరువు హత్యగా చూడాలనా? భారత రాజ్యాంగంపై జరిగిన దాడిగా చూడాలనా? మతంపైజరిగినదాడిగాచూస్తే ..నాగరాజు హిందూ దళిత్, అస్రీన్ ముస్లీమ్ మహిళ . ఇద్దరూ ఇష్టపడ్డారు, హిందూ మతం వద్దు, ఇస్లాం మతం వద్దూ అనుకున్నారు. ఆర్యసమాజ్ కి వెళ్లి పెళ్లి చేసుకున్నారు. రెండు మతాలలోని ఏమతం ప్రకారం వీరిద్దరూ పెళ్లి చేసుకోలేదు. ఈదేశానికి చెందిన ఇద్దరు పౌరులు ఆడ – మగ ఆర్యసమాజ్ లో పెళ్లి చేసుకున్నారు. ఇదిభారతదేశ ప్రత్యేక వివాహ చట్టం ప్రకారం జరిగింది. ఇందులో ఏమతం యొక్క ఆచార వ్యవహారాలు జోక్యం చేసుకోలేదు. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యవంతులు, వయోజనులైన ఇద్దరు వ్యక్తులు శారీరకంగా-మానసికంగా కలిసి జీవించేటందుకు, సమాజంలో ఒక గౌరవప్రదమైన జీవితంకు భద్రతకోసం “పెళ్లి” చేసుకున్నారు. దీనికి చట్ట ప్రకారంగా భారత రాజ్యాంగం కలిపించిన ప్రత్యేక వివాహ చట్టంప్రకారం వీరి జీవితాలకు భద్రత కలిపించును. ఇందులో మతంకు వ్యతిరేకంగా, మతంను కించపరుస్తూ, మతాలకు వ్యతిరేకంగా వీరిద్దరూ కలిసి చేసిన ఉన్మాదపు పని ఎక్కడుంది. మతం యొక్క పరువు తీసిన అంశం ఎక్కడుంది? ఇద్దరూ ఇద్దరి మతాలను వద్దనుకున్నారు. ఆర్యసమాజాన్నిఆశ్రయించారు. పెళ్లిచేసుకున్నారు. రాజ్యాంగబద్ధంగా కలిసి జీవిస్తున్నారు. మతాలకు భద్రత కలిపిస్తుందే భారత రాజ్యాంగం. భద్రత కలిపిస్తున్న రాజ్యాంగం యొక్క ఆశయంలో బ్రతికి జీవించాలని ఆశపడ్డారు. ఇది మతం మీద దాడికాదు, రాజ్యాంగంపై దాడినే.
ఇతర హత్యల మాటేమిటి?
కులం పైన జరిగిన దాడిగా చూస్తే కులం ఈహత్యలోకి లాగితే … కొబ్బరి కాయల కత్తితో నరికి చంపబడిన ఘటన, భువనగిరిలో చంపబడిన కానిస్టేబుళ్ళు దళితేతరులు, వారిని చంపిన కులాల వారు బీ.సీలు. అనేరకమైన అసందర్భమైన లాజిక్ చెప్పిన మాటలతో మొత్తం వ్యవస్థనే పక్కదారి పట్టించిన వారు అవుతారు. మీవాళ్లు హత్యకు గురైతే ఒకన్యాయం .. మావాళ్ళు హత్యకు గురైతే ఒక న్యాయం అని ఇక్కడ ప్రశ్న కాదు ..మనుషులను విధ్వంసం చేస్తున్న కట్టుబాట్లను ధిక్కరించేవారిని చంపటం మేం సహించం అనే ‘‘స్వరం’’ కావాలి. ఈ స్వరాలనే అస్రీన్ అడిగింది. ఈ సమాజంపై ఉమ్మివేయాలని ఉంది అంటే ఏదో ఆవేశంలో అన్నది అని పక్కన పెట్టే విషయం కానే కాదు. నేరం జరుగుతూ ఉంటే చూస్తూ ఆపకుండా ప్రేక్షక పాత్ర వహించటం కూడా నేరం కిందకే వస్తుంది. నాగరాజు- అస్రీన్ లు మతంవద్దు ,కులం వద్దు అనుకొనే ఆర్యసమాజాన్ని ఆశ్రయించి పెళ్లి చేసుకున్నారు. కుల ఆచారాల ప్రకారం – మతం ఆచారాల ప్రకారం వారిద్దరూ పెళ్లి (ళ్లు) చేసుకోలేదు. హుందాకరమైన జీవితాన్ని కొనసాగించేటందుకు మాత్రమే రాజ్యాంగం కలిపించిన ప్రత్యేక వివాహాల చట్టం ప్రకారం వారు పెళ్లి చేసుకున్నారు. ఇక్కడ కులంపై కులాలపై దాడి జరగ లేదు.
బీదరికంపై జరిగిన దాడిగా చూడాలా?
సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా వెనుకబడిన కుటుంబంగా నాగరాజు కుటుంబాన్ని ఒక వేళ పరిశీలనలోకి తీసుకుంటే… సమాజంలో బాగా పలుకుబడి ఉండి ఉంటే ఇలాంటి మతాంతర వివాహాలకు గట్టి భద్రత ఉండవచ్చా?! ఉండవచ్చనేకొన్ని, కొందరి సంఘటనలు చూపిస్తున్నాయి. సినిమా రంగంలో, పెద్ద రాజకీయ నాయకుల కుటుంబాలలో, పెద్ద వ్యాపారరంగాలలో ఇలాంటి వివాహాలు జరిగాయి, జరుగుతున్నాయి. వీరి వివాహాలు ఆ ఇద్దరి వ్యక్తుల మత ఆచారాల ప్రకారం, వారికీ బుద్ధి పుట్టిన విధముగా జరిపించుకుంటున్నారు. వీరికి మతం – కులం, ఆచారవ్యవహారాలు, కట్టుబాట్లు అడ్డు తెలపటం లేదు. వీరి వివాహాలను మాధ్యమాలు కూడా బహుళ అందముగా ప్రచారం చేస్తాయి. మాధ్యమాల ద్వారా చూసే ప్రేక్షకులు చాలా సంతోషాన్ని పంచుకుంటారు. ఆ సంతోషాలలో నాగరాజులాంటి కుటుంబాలు, అస్రీన్ లాంటి కుటుంబాలు ఉంటాయి. వారికీ లేని మతం – కులం పట్టింపులు, వారి వివాహాలను చూసి ఆనందించే ఈ కుటుంబాలు, వారి వరకు వచ్చేసరికి ఎందుకు ఎక్కువ పట్టింపులు కలిగి వుంటారు. ఆర్థికపరమైన అభద్రతాభావనానా? సామాజికపరమైన కట్టుబాట్లను వీరే ఎక్కువగా “రక్షించుకుంటూ”వుండటమా? రాజకీయంగా ఎలాంటి సపోర్ట్ ఆ కుటుంబాలకు లేకపోవటమా?
ఆర్యసమాజాన్ని ఆశ్రయించి వివాహం
నాగరాజు- అస్రీన్ లు ఇవి ఏవి అవసరంలేదు అని, వద్దు అనుకొనేగా ఆర్యసమాజాన్ని ఆశ్రయించింది. వారి యొక్క నియమ – నిబంధనలను అనుసరించే రాజ్యాంగం కలిపించిన ప్రత్యేక వివాహాల చట్టం ప్రకారం పెళ్లి జరిపించుకున్నారు. రాజ్యాంగాన్ని గౌరవించని వాళ్ళే ఇలాంటి హత్యలు చేస్తున్నారని భావించాలా?లేకరాజ్యాంగం గురించి వారికితెలియదు, ఒక్కమతం – కులం తప్ప అని భావించాలా? లేకపోతే రాజ్యాంగం కన్నా మా కులం – మతం మాత్రమే గొప్పదని భావిస్తున్నారు అని అర్ధం చేసుకోవాలా? మతం – కులం కలిసి బీదరికాన్ని శాసిస్తున్నాయి అనాలా? మరి రాజ్యాంగం పీఠికలో మతం – కులం – బీదరికాన్ని నిర్మూలించి “భారత దేశంను సార్వభౌమ్య సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాముగ నెలకొలుపుటకు.. అంగీకరించి, శాసనము చేసి మాకుమేము ఇచ్చుకున్న / సమర్పించుకున్నవారమైతిమి” అని రాసుకున్నది. మరి దీన్ని ఏ విధంగా అర్ధంచేసుకోవాలి? ఇలాంటి హత్యలు భారత రాజ్యాంగంపై దాడిగా ఎందుకు పరిగణించ కూడదు?
పరువు హత్యగా చూడాలా?
పరువు అంటే ఏంటో తెలుస్తే పరువు హత్యనా ?కాదా? అని నిర్ధారణకు రావచ్చు. హానర్కిల్లింగ్ / పరువుహత్య? భారతదేశం యొక్క పరువునా? రాష్ట్రాల యొక్క పరువునా? రాజ్యాంగం యొక్క పరువునా? ఒక అందమైన సాయంత్రం వేళ “this is honour killing” అని జాతీయ నాయకులు విడుదల చేసిన పత్రికా ప్రకటన జాతీయ పత్రికలలో వచ్చిన వార్త. అప్పటి నుండి పరువుహత్య(ల) కు ఈ సమాజంలో దక్కిన స్థానం. ఒక మనిషిని బహిరంగంగా, అందరూ చూస్తుండగా చంపటం “పరువు “హత్య ఎలా అవుతుంది?
సొంత కులం, సొంత మతం కాని వారిని పెళ్లి చేసుకోవటంతో కుటుంబ పరువు, ప్రతిష్ట, పేరుకు భంగం కలిగింది అని భావించిన ఆయా కుటుంబ సభ్యులు, వారి వ్యతిరేక కుటుంబ సభ్యులను / వ్యక్తులను (భార్య / భర్త ) చంపటం .. పరువుహత్య. చాలా స్పష్టంగా ఉన్నది. ఎవరు, ఎవరి కుటుంబం యొక్క పరువుప్రతిష్ట పేరుకు సమాజంలో భంగం కలుగును. ఎందుకు కలుగును.సమాజంలో ప్రతీ ఒక్కరికీ, ప్రతీ కుటుంబానికి పరువు – ప్రతిష్ట – పేరు ఉండును. పరువు హత్య అంటే గౌరవప్రదమైన జీవితం కొందరే అనుభవిస్తున్నారు, మిగిలిన వారు అనుభవించటం లేదని చెప్పకనే చెపుతుందా? రాజ్యాంగ ఫలాలు అందరికీ సమానంగా అందడం లేదని పరువు హత్యలు వేలెత్తి చూపుతున్నట్లేగా? అస్రీన్అన్నమాట” ఈ సమాజంపైఉమ్మివేయాలనిఉంది” అంటే … సమాజానికే పరువులేదు అని అర్ధంకాదా? భారత రాజ్యాంగాన్ని చెదలకు వేస్తున్నట్లేగా? పరువు హత్య అంటే సమాజం ‘అసహననిర్మాణం’ లోఉందనేగా?
సమాజం ఎలా నిర్మాణం కావాలి?
భారత సమాజం ఎలా నిర్మాణం కావాలి? మతం / మతాల ఆచార వ్యవహారాలతో కూడిన రాజకీయాలతోనా? కులం / కులాల కట్టుబాట్లతో కూడిన రాజకీయాలతోనా? లేక డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ భారతదేశం ఎలా ఉండాలో,ఎలా నిర్మాణం చేయాలో, ఒక సామజిక ఇంజినీర్ గా ఇచ్చిన భారతరాజ్యాంగం ప్రకారంగానా భారత రాజ్యాంగంపై జరిగిన దాడిగా చూడాలా?పరువు హత్యలు అనేవి రోజుకో విధంగా రూపం మార్చుకుంటున్నాయి. ప్రజలు .. మా – మీ, మతాలు – కులాల గొడవలో గ్రూపులుగా విడిపోయి రాళ్లువిసురుకుంటున్నారు. ఎవరి ఆచారాలు వారివి, ఎవరి కట్టుబాట్లు వారివి. ప్రభుత్వ పథకాల సమయంలో, రిజర్వేషన్ల సమయంలో, మరీ ఏదైనా వ్యక్తిగతానికి గాయం అయినప్పుడు మాత్రం “రాజ్యాంగం” కావాలి అనుకుంటున్నారు. ఇలా అయితే ఇలాంటి హత్యలను ఎలా నియంత్రణచేయవచ్చు? ప్రభుత్వాలకు కావలసింది ప్రజలు గ్రూపులు గ్రూపులుగా విడివిడిగా ఉండటం. మొదట్లో ప్రభుత్వాలకు బాగుంటది. వాళ్ళూ ప్రతిపక్షంలోకి వచ్చినప్పుడు జటిలమైన సమస్యను ఎదుర్కోవలసి వస్తుంది.
అంతుబట్టని గందరగోళం సమాజంలో ఉంది
నాగరాజులాంటి హత్యలు పదేపదే జరుగుతున్నాయి అంటే మతం మీదనో – కులం మీదనో, జెండర్ మీదనో దాడిగా భావించలేము. ఇవి అన్నీ రాజ్యాంగంలోనే రాసిఉన్నాయి. ఎలా వీటిని రూపుమాపాలో శాసనాల రూపంలో చెప్పబడ్డాయి. ఒకటీ – రెండూ సంఘటనలు జరిగాయి అంటే “ఇగ్నోరెన్స్”గా కొట్టివేయవచ్చు. ఎప్పటికప్పుడు, ఎటువైపునుండి, ఎక్కడినుండి ఆడవాళ్లను టార్గెట్ చేస్తున్నారో ఒక తెలియని “కన్ఫ్యూజన్” సమాజంలో ఉందో, అది ఆరోగ్యకరమైన విషయం కాదు. రాజ్యాంగంపైననే దాడిగా నిర్ధారణకు రావాలి. రాజ్యాంగంపై దాడి జరుగుతున్నది అంటే ప్రజలు – ప్రభుత్వం క్షేమంగా ఉన్నట్లు కాదు.
కులంపేరుతో, మతంపేరుతో పరువు పేరుతో, అంటరానితనం పేరుతో, దళితుల పేరుతో .. ఏ పేరుతో జరిగినా అది “ఆరోగ్యవంతమైన దేశ సంప్రదాయాలపైన” జరుగుతున్న దాడిగానే చూడాలి. మతం హత్య – కులం హత్య- పరువు హత్య అని క్రియేట్ చేయటం / చేసుకోవటం ద్వారా ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించలేం.
2012 నుండి ఇప్పటి వరకు జరిగిన అన్ని రకాల “పరువుహత్యల” పై పారదర్శకమైన విచారణ కోసం తెలంగాణ ప్రభుత్వం విస్తృత స్థాయి కమిటీ — ప్రభుత్వంలోఉన్నవారితోపాటు,ప్రభుత్వానికి బయట ఉండి పని చేస్తున్న సంస్థల కార్యకర్తలను భాగస్వామ్యం చేస్తే ఒక అర్థవంతమైన నివేదికను బయటికి తేవచ్చు. రాజ్యాంగంపైన కూడా ప్రజలకు అవగాహన కల్పించవచ్చు.
జయవింధ్యాల
ఇక్బాల్ ఖాన్
రాష్ట్రప్రధానకార్యదర్శి ,
రాష్ట్రఉపాధ్యక్షులు
పౌరహక్కులప్రజాసంఘం – తెలంగాణరాష్ట్రం
9440430263 / 9494869731