రామయణమ్ – 163
యుద్ధకాండము ప్రారంభము
అది ఒక అద్భుత దృశ్యము!
అంత చేసిన నీకు ఇంతకన్నా ఏమీ ఇవ్వలేక పోతున్నాను అని రామచంద్రుడు హనుమంతుని తన కౌగిలిలో బంధించెను.
భూలోకములో ఇతరులెవ్వరూ మనస్సుచేత కూడా చేయలేని పని, ఎవరి ఊహలలోకూడా సాధ్యమని తలవని పని అనాయాసముగా పూర్తిచేసుకొని వచ్చినావు.
Also read: సీతమ్మను చూసినట్టు శ్రీరామునికి తెలిపిన హనుమ
ప్రభువు ఒక క్లిష్టమైన పని అప్పచెప్పినప్పుడు ఆ పనిఎడల ఆసక్తిచూపక అశ్రద్ధ చేయువాడు అధముడు, చెప్పిన పని వరకే చేయువాడు మధ్యముడు, ఎంత కష్టమైనా, సంక్లిష్టమైనా! ఇష్టముగా ప్రభుకార్యమును ఆసక్తిగా పూర్తిచేసి అధిక ఫలములను చూపువాడు సర్వశ్రేష్ఠుడు …
హనుమానీవుసర్వశ్రేష్ఠుడవు..
అందుకేనాకుఇష్టుడవయినావు…
Also read: ‘సీతమ్మను చూశాను,’ జాంబవంత, అంగదాదులతో హనుమ
ఇచ్చుటకు నా వద్ద ఏమియూలేదు ఇదిగో ఆలింగనము తప్ప! అని కౌగలించుకొన్న కోసలాధీశుని కౌగిలిలో ఒదిగి పోయాడు మహాకాయుడు ఆంజనేయుడు!
కాసేపటికి ఒకింత ఆలోచించి సుగ్రీవునితో, సీతాన్వేషణము బహుచక్కగా జరిగినది ఇక మిగిలినది ఎట్లు జరుగును?
అగాధమైన జలనిధిని దాటి లంకనెట్లు చేరగలము?
వానరులెట్లు దాటగలరు అని చింతాక్రాంతుడై పలికిన రాముని చూసి …సుగ్రీవుడు ఈ విధముగా మాటలాడెను.
….
మహాయోధుడవే,
జగదేకవీరుడవే
ఓ శ్రీ రామా!
నీవు ఏల చింతించెదవు,
ఎందుకునీకు శోకము!
కృతఘ్నుడు స్నేహమును విడిచినట్లు నీవు శోకమును విడిచిపెట్టుమయ్యా!!!
సీతమ్మ వార్త తెలిసినది!
శత్రువు ఎచట ఉన్నాడో తెలిసినది!
ఇక నీవు వగచుటకు కారణమేదియూ నాకు కనపడుట లేదు.
నీవు బుద్ధిమంతుడవు
శాస్త్రము తెలిసినవాడవు
ఆలోచనా శక్తి కలవాడవు
సామాన్యుడిలాగ ఆలోచించి ఏల దుఃఖించెదవు?
ఉత్సాహములేక శోకముతో వ్యాకులుడై దీనముగా ఉన్న పురుషుని కార్యములన్నీ చెడిపోవును.
Also read: హనుమ పునరాగమనం
సముద్రమెంత పెద్దదయినా కానీ మనచుట్టూ నిలచి యున్న ఈ వానర నాయకులందరూ శూరులూ, ఉత్సాహవంతులు నీకు సంతోషము కలిగించుటకై అగ్నిలో దూకమన్ననూ దూకెదరు!
సముద్రముపై సేతువుకట్టి
లంకను పట్టి
రావణుని కొట్టెదము!
మనము లంకానగర ప్రవేశము చేసి రావణుడు మనకంట పడినాడా!!!
ఆ రోజే వాడి ఆఖరి రోజు!
రాజారామా! మనోవ్యాకులత్వము సకలకార్యములను నశింపచేయునని నీకు తెలియనిదా!
రఘుకులతిలకా నీ సహజ స్థితికి వచ్చి శౌర్యము అవలంబించుము.
కోదండరామా! ధనుస్సు నీ చేతనున్నంత వరకు నీకు ఎదురు నిలువగల సాహసము చేయగలవాడెవ్వడూ ముల్లోకములలో నాకు కనపడలేదయ్యా!
ఇప్పుడు మన తక్షణ కర్తవ్యము సముద్రమును దాటగల ఉపాయమును అన్వేషించుట!
రామచంద్రప్రభూ ఇన్ని చెప్పనేల ? విజయము తధ్యము నీవు విజయలక్ష్మిని సీతాలక్ష్మిని అచిరకాలములోనే చేపట్టగలవు అని సుగ్రీవుడు శ్రీ రామునితో ప్రోత్సాహవచనములు పలికెను.
అప్పుడు రామచంద్రుడు హనుమంతుని చూసి ……
Also read: లంకాదహనం
వూటుకూరు జానకిరామారావు