Thursday, November 21, 2024

రచయితలు ప్రపంచస్థాయి ప్రమాణాలను ఎలా అందుకోగలరు?

విశ్వనాథ, హెమింగ్వే

పోలాప్రగడ సత్యనారాయణమూర్తి మాటలలో….

ఒకసారి ఏదో రేడియో ప్రసంగంకోసం విజయవాడ వచ్చి, విశ్వనాథ వారిని చూసి వెళ్దామని రిక్షాలో వారిఇంటికి వెళ్తుండగా, ఆయన నడిచి వస్తున్నాడు. నేను రిక్షాదిగి నమస్కారం చేశాను. ‘‘ఏమయ్యా? ఇలావస్తున్నావు?’’ అన్నాడు. ‘‘మిమ్మల్ని చూడడానికి  వస్తున్నా’’ అన్నాను. చూశావుగా అన్నాడు. ఆయన మాట అలాగే ఉండేది. ‘‘అంటే వెళ్లిపొమ్మంటారా?’’ అన్నా. ‘‘వెళ్దువుగానిలే,రా!’’ అంటూ భుజంమీద చేయివేసి ఇంటివైపు తిరిగాడు. నాలుగడుగులు వేసినతర్వాత ‘ఈ ఏడాది నోబెల్ బహుమతి ఎవరికి వచ్చింది?’ అని అడిగాడు. ‘‘హెమింగ్వే కి వచ్చింది’’ అన్నాను.

‘‘దేనికి?’’

 ‘ఓల్డ్ మాన్ అండ్ ది సీ’ కి.

 ‘‘చదివావా?’’

‘‘ఎక్కడ చదువుతామండీ? ఆయన అమెరికన్ రచయిత. ఇంకా ఇండియన్ ఎడిషన్ రాలేదు,’’ అన్నాను.

‘‘నువ్వేం ఇంగ్లీషు లెక్చరర్ వయ్యా? ఇలా రా!’’ అని ఇంట్లోకి తీసుకుపోయి, ఆ పుస్తకం చేతిలో పెట్టి “తీసుకొనివెళ్లి చదువు” అన్నాడు. ఆయన తెలుగు లెక్చరరు. ఆయన అమెరికాకు ఉత్తరంవ్రాసి తెప్పించు కున్నాడు. అప్పటికి ఇండియా మొత్తంమీద ఏ ఇంగ్లీషు లెక్చరరూ దానిని ప్రత్యేకంగా తెప్పించుకొని చదివి ఉండడు. అలాంటి ఆయనను ఛాందసుడని మనం ముద్ర వేశాం.

చదువుతానన్నాను. మళ్లీ వచ్చినప్పుడు డిస్కస్ చేయా లన్నాడు. సరే చదివాను. ఇంతక్రితం చెప్పానే, పట్టకం (ప్రిజం)లో ప్రవేశించిన కాంతి విశ్లేషింపబడి ఏడురంగుల్లో వస్తుందని…ఆపద్ధతిలో విశ్లేషించుకొంటూ చదివాను. నాటకీయత, పాత్ర చిత్రణ, శైలి, సంఘటనలు,…ఇవన్నీ దట్టించి వ్రాసుకొన్న నోట్సుతో ఆరునెలల తర్వాత మళ్లీ పనిమీద వచ్చినపుడు ఆయన దగ్గరకు వెళ్ళాను.

‘‘చదివావా?’’

‘‘చదివాను.’’

‘‘ఏమిటికథ?’’

 ఒకముసలివాడు చేపలుపట్టడానికి సముద్రంలోకి వెళ్లివచ్చేవాడు. వాడు తన పదహారో ఏటనుండి అరవయ్యో, డెబ్బయ్యో వచ్చేదాకా- పెద్ద చేపను ఎవరూ చూసిఉండనంత పెద్ద చేపను పట్టుకొస్తానని అంటూ ఉండేవాడు. కథ ఎక్కడ మొదలవు తుందంటే .. ‘‘ఏంవోయ్, అరవై ఏళ్లనుండి అంటున్నావు పెద్ద చేపను పట్తానని, పట్టావా?’’ అని తోటివాళ్లు అడగటంతో.

‘‘పట్తానోయ్,’’ అంటూ సముద్రంలోకి పడవలో వెళ్లిపోయాడు. అతనితోపాటు ఎనిమిదేళ్ల వయస్సున్న అతని మనవడూ ఉన్నాడా పడవలో.

సముద్రంలో పెద్దతుఫాను.. హడావుడి.. అంతా వర్ణించాడు. కథంతా అదే. అక్కడ ఒకచేప తగుల్తుంది. కాని లొంగదు. పగ్గం విసిరి, దానిని బంధించి, ఇటువైపు కొసను నావకు కట్టాడు. వెను తిరిగి ఒడ్డుకు వస్తుంటే, అది వెనుకకు లాగుతూ ఉంటుంది. ఈ చిన్న నావతో ముందుకు రావటం చాలా కష్టంగా ఉంటుంది. ఇంతలో తిమింగలాలు వచ్చి ఆ చేపను కొట్టి ఇంతింత మాంసం లాక్కొని పోతుంటాయి. బాధ భరించలేక చేప ఎగిరెగిరి పడుతుంటుంది. పడవ ఊగిపోతూ ఉంటుంది. తిరగబడబోతుంది…

మొత్తానికి ఒడ్డుదగ్గరకు చేరారు. ముసలివాని ప్రాణాలు కడబట్టిపోతుంటాయి. “ఏరా ముసలోడా, పట్తానన్నావు, పట్టావా?’’ అని అడుగుతారు ఒడ్డునున్న గ్రామస్థులు. ‘‘పట్టాను, ఇదిగో లాగండి’’ అంటూ త్రాడు అందిస్తాడు. దానిని పట్టి లాగగా లాగగా చివరికొక కంకాళం వస్తుంది.

‘‘ఏది? చేపను పట్తానని చెప్పి చివరికొక కంకాళం తెచ్చా వేమిటి?’’ అన్నారు.

‘‘ఏడ్చావ్! మీరెన్నడూ చూడనంత పెద్దచేపను పట్టానా లేదా? అది కంకాళమైతే నేమి?’’ అన్నాడు. అంతటితో కథ అయిపోయింది.

“నోబెల్ ప్రయిజిచ్చారు. ఎందుకిచ్చారు చెప్పు!” అన్నాడాయన. బాగా వ్రాశాడండి. వర్ణనలూ అవీ.. అనబోతుంటే, “వర్ణనలూలేవు, నీ మొహంలేదు. ‘కర్మణ్యే వాధికారస్తే, మా ఫలేషు కదాచన’ అని అర్థం చేసుకో. దానిని మనసులో పెట్టుకొని మళ్లీ చదువు”

‘‘నీకర్మ నీవు చేయి. ఫలితం ఆశించకు అని గీతావాక్యం. గీతకు ప్రాణమది. దానిని అర్థంచేసుకొని ఏడవలేదు మనం వందకోట్ల జనం. ఆ ప్రాణం వాడు అందుకున్నాడు. వాడిభాషలో వ్రాశాడు. అందులోని ప్రాణం వాళ్ల కర్థమైంది. అందుకని నోబెల్ ప్రయి జిచ్చారు. మనమూ వ్రాస్తాం- పెంటకుప్పలగురించి. పెంట కుప్పలను దాటి మనదృష్టి వెళ్లదు. ఎటర్నల్ సబ్జెక్టు (శాశ్వతమైన, సార్వకాలికమైన విషయం) తీసుకుని వ్రాశాడు వాడు.

‘‘మనకు నోబెల్ ప్రయిజు రాదేమని చాలామంది అడుగుతుంటారు. మనబుఱ్ఱ ముందుకు వెళ్లకపోతే ఎందుకు వస్తాయి? మానవ సమాజాన్ని ఛాలెంజ్ చేస్తున్న సమస్య లున్నాయి. అవి ఆంధ్రుడుకాని, ఆఫ్రికన్ గానీ, పదో శతాబ్దంకానీ, ఇరవయ్యో శతాబ్దంకానీ, అవి ఇండియన్ కానీ అమెరికన్ గానీ.. ఎవరైనాకానీ ఎటర్నల్ ప్రాబ్లమ్ తీసుకొని వ్రాయాలి.

‘‘దానినే ఇంతకుముందు Ignoble ని Ennoble చేయటమన్నాను. సమకాలీనాన్ని సార్వకాలీనం చేయటమన్నాను ఆ శక్తి వస్తేనేగాని ఎవరికైనాగాని నోబెల్ ప్రయిజువంటి ప్రపంచ స్థాయి బహుమతులు రావు’’ అన్నారు మాష్టారు.

(9మార్చి 2002నాడు విజయవాడలో ‘సమాలోచన’ నిర్వహించిన “తెలుగుకథా సమాలోచనం”లో శ్రీ ప్రోలాప్రగడ సత్యనారాయణ మూర్తిగారి ప్రసంగం లోని కొంతభాగం)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles