సుశాంత్ సింగ్ మరణం సాకుగా పావులు కదుపుతున్న పాలకపక్షం
కల్లూరి భాస్కరం
మన పురాణాలు కాలాన్ని యుగాలుగా, మన్వంతరాలుగా, కల్పాలుగా విభజించాయని మనకు తెలుసు. తిరిగే చక్రంలోని పైభాగం కిందికి, కింది భాగం పైకి ఎలా వస్తూ ఉంటాయో; అలాగే అవే యుగాలు, అవే మన్వంతరాలు, అవే కల్పాలు మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి. అంటే, మన దగ్గర అన్నీ ఒక రేఖామార్గంలో ఒక దశనుంచి ఇంకో దశకు వెళ్ళడం కాకుండా; ఒక వలయంలోలాగా అవే దశలు మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి. మనదగ్గరే కాకుండా మిగతాచోట్ల కూడా ఇలాగే జరుగుతూ ఉండవచ్చు కానీ, ఇక్కడ మన అనుభవానికి పరిమితమవుదాం.
సుశాంత్ సింగ్ రాజ్ పుట్ అనే ఒక బాలీవుడ్ నటుడి మరణానంతర పరిణామాలనే తీసుకోండి. వాటికి సంబంధించి ముందుగా చెప్పుకోవలసింది, అవి ప్రదర్శిస్తున్న ఒక కొత్త వరవడి. ఎంతో భవిష్యత్తు ఉన్న ఒక యువనటుడి అకాలమరణం ఎంతైనా దురదృష్టకరమే కానీ, అలాంటి ఒక సినీనటుడి మరణం రోజుల తరబడి నేషనల్ న్యూస్ చానెల్స్ లో ప్రైమ్ టైమ్ చర్చా విషయంగా మారడం ఎప్పుడైనా చూశామా? చూసిన గుర్తు రావడం లేదు. అలాంటివే ఆ తర్వాతి పరిణామాలు కూడా. సుశాంత్ బీహార్ కు చెందినవాడు, ముంబైలో ఉంటున్నాడు. అలా ఒక రాష్ట్రానికి చెంది ఇంకో రాష్ట్రంలో ఉంటున్నవారు, స్థిరపడినవారు దేశంలో అసంఖ్యాకంగా ఉంటారు. వాళ్ళలో సామాన్యజనమే కాకుండా సెలెబ్రటీలూ ఉంటారు. వారికి చెందిన అన్ని వ్యవహారాలూ వారున్న రాష్ట్రంతోనే ముడిపడి ఉంటాయి. కానీ సుశాంత్ విషయంలో ఈ సహజన్యాయానికి భిన్నంగా జరిగింది. బీహార్ లో ఉంటున్న అతని తండ్రి సుశాంత్ స్నేహితురాలైన రియా చక్రవర్తి మీద వివిధ ఆరోపణలు చేస్తూ తనున్న చోట పోలీస్ కేసు పెట్టాడు. నమ్మించి మోసం చేయడం, ఆర్థిక నేరాలకు పాల్పడడం వంటి ఆరోపణలు వాటిలో ఉన్నాయి. పోలీస్ యంత్రాంగం ఆ కేసును స్వీకరించింది. ఆపైన రాష్ట్రప్రభుత్వం సుశాంత్ కేసులో సీబీఐ దర్యాప్తును కోరింది. ముంబైలో జరిగిన ఘటనపై దర్యాప్తు చేసే అధికారపరిధి బీహార్ కు లేదని అంటూ ఆ చర్యను రియా చక్రవర్తి సుప్రీంకోర్టులో సవాలు చేసినప్పుడు, బీహార్ ప్రభుత్వం చర్యను ఆమోదిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఒక రాష్ట్రంలో జరిగిన ఏదైనా ఘటనపై సీబీఐ దర్యాప్తు అవసరమనుకుంటే అక్కడి రాష్ట్రప్రభుత్వమే ఆ మేరకు సీబీఐని కోరడం; ఎవరైనా ఆ మేరకు డిమాండ్ చేసినప్పుడు
తను ఆ అవసరం లేదని భావిస్తే తిరస్కరించడం- సాధారణంగా జరుగుతూ ఉంటుంది. కానీ, ఇక్కడ మహారాష్ట్రలో జరిగిన ఒక ఘటనలో బీహార్ ప్రభుత్వం సీబీఐ దర్యాప్తును కోరింది, సీబీఐ అందుకు అంగీకరించింది, సుప్రీంకోర్టు కూడా దానిని సమర్థించింది! ఇలా జరగవచ్చా, జరగకూడదా అనే ప్రశ్నను న్యాయపరంగా, చట్టపరంగా, ఆనవాయితీపరంగా, నైతికతపరంగా…ఇలా వివిధ కోణాలనుంచి చూడవచ్చు. అంతకంటే ముందు, అసలు ఇలా జరగడం ఎప్పుడైనా చూశామా అని ప్రశ్నించుకుంటే, చూసిన గుర్తు రావడం లేదు.
సుశాంత్ కేసులో ‘అపూర్వా’లుగా తోచే మరికొన్ని చూడండి… ఒక నటుడి మరణంపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వంటి కేంద్రసంస్థలు హుటాహుటిన దర్యాప్తునకు దిగిన సందర్భాన్ని ఎప్పుడైనా చూశామా? చూసిన గుర్తు రావడం లేదు. సుశాంత్ మరణాన్ని పురస్కరించుకుని మరో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ రాష్ట్రప్రభుత్వం మీద, ఆ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న శివసేన మీద తీవ్ర ఆరోపణలు చేసింది. ముంబైని పాక్ ఆక్రమిత కాశ్మీర్ తో పోల్చింది. ముంబైని అలా పోల్చడం దారుణమని ఎవరైనా భావిస్తే అది వేరే విషయం. భావప్రకటనాస్వేచ్ఛ కోణంలో అందులో అసహజం ఏమీలేదు. అసహజం ఎక్కడుంది అంటే, కంగనా రనౌత్ కు రక్షణ కల్పించాలని- ఆమె సొంత రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్ కేంద్ర హోమ్ మంత్రిత్వశాఖను కోరడంలోనూ, తక్షణమే ఆ శాఖ ఆమెకు వై-కేటగిరీ రక్షణ కల్పించడంలోనూ ఉంది. ఇలాంటివి ఎప్పుడైనా చూసిన గుర్తూ రావడం లేదు. మొత్తం మీద పూర్తిగా రాష్ట్రాల అధికారపరిధిలోకి వచ్చే ఒక శాంతిభద్రతల అంశంలో బీహార్, హిమాచల్ ప్రదేశ్ అనే మరో రెండు రాష్ట్రాలూ, కేంద్రప్రభుత్వమూ ‘ఇలా’ జోక్యం చేసుకోవడం, దానికి సుప్రీంకోర్టు ఆమోదం లభించడం ఇంతవరకు ఎన్నడూ చూసి ఉండని అసాధారణ ఘటనలనే అనిపిస్తోంది. హత్య, ఆర్థికనేరారోపణలతో మొదలైన సుశాంత్ కేసు చివరికి డ్రగ్స్ కేసుగా మారి, కేవలం కొన్ని రోజుల వ్యవధిలో పలచబడిపోయినట్టు- ఆ కేసును అడ్డుపెట్టుకుని ముంబై పోలీసుల మీద, మహారాష్ట్రప్రభుత్వం మీద దాడి చేస్తూ వచ్చిన న్యూస్ చానెళ్లే పరోక్షంగా అంగీకరించడం ఇంకో విచిత్రం. ఇలాంటిదీ ఎన్నడూ చూసిన గుర్తులేదు.
సుశాంత్ మరణం అనుమానాస్పదం అనిపించినప్పుడు, మహారాష్ట్రప్రభుత్వం సక్రమంగా దర్యాప్తు చేయించలేదని అనుకున్నప్పుడు; ఆ రాష్ట్ర అధికారపరిధిలోకి ఇతర రాష్ట్రాలు కానీ, కేంద్రం కానీ అడుగుపెట్టకుండా సుశాంత్ కు న్యాయం చేసే మార్గమే లేదా? న్యాయశాస్త్రంతో లోతైన పరిచయం లేని సాధారణవ్యక్తులకు కూడా కలిగే సందేహం ఇది. ఉదాహరణకు ఒక పరిష్కారం, ఆ రాష్ట్రహైకోర్టును ఆశ్రయించడం! అందుకు భిన్నంగా మరో రాష్ట్రంలో కేసు దాఖలు చేయడం దానికి అన్నివైపుల నుంచీ ఆమోదం లభించడం ఎలాంటి సంకేతాలను ఇస్తుంది, రేపు ఎలాంటి పరిణామాలకు, సన్నివేశాలకు దారితీయిస్తుందన్నవి ఇక్కడ అనివార్యంగా తలెత్తే ప్రశ్నలు. ఇవాళ సుశాంత్ అయ్యాడు, రేపు ఇంకో రాష్ట్రంలో ఇంకొకరు కావచ్చు, అతను విధిగా సుశాంత్ లా సెలబ్రటి కూడా కానవసరం లేదు. అతడు మరో రాష్ట్రానికి చెందినవాడు అయితే చాలు; ఆ ఘటన చుట్టూ అతని స్వరాష్ట్రంలో విపరీతభావోద్వేగాలను సృష్టించవచ్చు. వాటిని ఎన్నికల్లో వాడుకోనూవచ్చు. ఇలా జరగడం అంటూ మొదలైతే దీనికి అంతనేదే ఉండదు. ఒక రాష్ట్రంలోని శాంతిభద్రతల యంత్రాంగాన్నీ, దాని పనితీరునూ ఇంకో రాష్ట్రం నిరంభ్యంతరంగా సవాలు చేయవచ్చు. దానికి కేంద్రం మద్దతు లభించవచ్చు. న్యాయస్థానం ఆమోదముద్ర లభించవచ్చు. అందుకు అవసరమైన ఆనవాయితీని సుశాంత్ కేసు స్థాపిస్తూనే ఉంది. అప్పుడు శాంతిభద్రతల నిర్వహణపై రాష్ట్రాల అధికారం గల్లంతైపోతుంది. శాంతిభద్రతల యంత్రాంగం నైతిక స్థైర్యం దెబ్బతిని ప్రతి రాష్ట్రంలోనూ అదొక తెల్ల ఏనుగుగా మారుతుంది. రాష్ట్రాల మధ్య యుద్ధవాతావరణం క్రమంగా విషమించి జాతీయసమైక్యతకు విఘాతం కలిగిస్తుంది. ఇప్పటికే సంభవిస్తున్న రకరకాల చీలికలకు, రాష్ట్రాల అంతఃకలహాల రూపంలో కొత్తది జమ అవుతుంది.
రాష్ట్రాలలో భిన్న భిన్న పార్టీలు అధికారంలో ఉండడం ఇప్పుడు కొత్తగా చూస్తున్నదేమీ కాదు. పార్టీలు వేరైనా సరే, వివిధ రాష్ట్రప్రభుత్వాల మధ్య, ముఖ్యమంత్రుల మధ్య పార్టీలకు, రాజకీయాలకు అతీతమైన ఒక ఈక్వేషన్ ఉంటుంది. అది ఒక్కొక్కసారి కేంద్రం వర్సెస్ ఫెడరల్ రూపం తీసుకోవచ్చు. ఫెడరల్ అధికారాల విషయంలోనే కాక, కేంద్రంనుంచి రావలసిన తమకు అందవలసిన పన్నుల వాటాల వంటి ఆదాయాల విషయంలో కూడా ఒక్కొక్కసారి పార్టీలకు అతీతంగా ప్రభుత్వాల స్థాయిలో, లేదా ప్రభుత్వనాయకత్వ స్థాయిలో సంఘటితపోరాటం చేయవలసి రావచ్చు. ఈ మేరకు ప్రభుత్వాలు, ప్రభుత్వనాయకత్వాల మధ్య ఒక సుహృద్భావ సంబంధాన్ని పోషించుకోవలసిన అవసరం ఉంటుంది. సుశాంత్ కేసులో బీహార్, హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాలు జోక్యం చేసుకున్న తీరు శత్రుపూరిత సంబంధాలను సంకేతిస్తోంది తప్ప, సుహృద్భావసంబంధానికి హామీ ఇవ్వడంలేదు. రాష్ట్రాల మధ్య వివాదాలు తలెత్తలేదని కానీ, తలెత్తబోవని కానీ అనడంలేదు. ప్రముఖఉదాహరణ, జలవివాదాలు. అయితే వాటి స్వభావం వేరు. వాటికి సంబంధించి కేంద్రం మధ్యవర్తిత్వం, ట్రైబ్యునళ్ళు, న్యాయస్థానాల జోక్యం వంటి ప్రక్రియలతో కూడిన చరిత్ర చాలా ఉంది. ఒక రాష్ట్రానికి చెందిన శాంతిభద్రతల వ్యవహారంలో ఇంకో రాష్ట్రం జోక్యం చేసుకోవడం అలాంటిది కాదు.
అసలు ఎందుకిలా జరుగుతోందన్న ప్రశ్నలోకి వెడితే, మొన్నటి ఎన్నికల తర్వాత మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని స్థాపించే విషయంలో శివసేన-బీజేపీల మధ్య ఏర్పడిన శత్రుత్వమే, సుశాంత్ మరణాన్ని అడ్డుపెట్టుకుని ఇలాంటి వింత వింత మలుపుల్ని తిరుగుతోందన్న భావన కలిగిస్తోంది. ఆ మలుపులు రానురాను అసహ్యకరంగా మారుతున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి కంగనా రనౌత్ చేసిన ఘాటు విమర్శలు, ముంబైని పాక్ ఆక్రమిత కాశ్మీర్ గా పోల్చడం; ఆమెను ఉద్దేశించి శివసేన నాయకుడు సంజయ్ రౌత్ చేసిన అనుచిత వ్యాఖ్యలు, ముంబైలో అక్రమనిర్మాణాలు ఎన్నో ఉన్నప్పటికీ ఆ ఆరోపణతో కంగనా రనౌత్ కార్యాలయాన్ని కూలగొట్టడం మొదలైనవి దిగ్భ్రాంతికరంగా ఉండడమే కాకుండా, శివసేన-బీజేపీల పోరు ఉచితానుచితాల హద్దులను ఎలా దాటుతోందో కూడా చెబుతున్నాయి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇలాంటివి చేయలేదని కాదు. కానే ఇప్పుడు జరుగుతున్న వాటిలో ఒక తొందరపాటు, పచ్చిదనం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి తప్ప తగిన పరిణతి, చాకచక్యం కనిపించడంలేదు. అలాగని పరిణతి, చాకచక్యం ఉంటే ఏమైనా చేయవచ్చుననడం ఇక్కడ ఉద్దేశం కాదు; రాజకీయపోరాటం చేయవచ్చుకానీ అది హద్దులు దాటుతున్న భావన కలిగించకూడదు. దానివల్ల ఆయా వ్యవస్థలపై నీలినీడలు ప్రసరిస్తున్నాయన్న అభిప్రాయానికి తావు ఇవ్వకూడదు. మొత్తంగా ఈ పరిణామాలను, సన్నివేశాలను చూసినప్పుడు మొదట చెప్పిన చక్రభ్రమణం పొలికే స్ఫురిస్తోంది. పూర్వం దేశమంతా, తమ మధ్య రాజ్యాంగం వంటి ఎలాంటి అతుకూ లేని చిన్న చిన్న రాజ్యాలుగా చీలిపోయి ఉండేది. ఒక రాజ్యం ఇంకో రాజ్యం మీద దండెత్తుతూ ఉండేది. దేశసమైక్యత అనే భావనకే అవకాశం లేని కాలం అది. ఎంతో భావసారూప్యం ఉండి గతంలో రాష్ట్రస్థాయిలోనూ, కేంద్రస్థాయిలోనూ చిరకాలంపాటు పొత్తును పాటిస్తూ వచ్చిన శివసేన-బీజేపీ అనే రెండు పార్టీలు కేవలం అధికారమే పరమావధిగా పరస్పరం ఘర్షణకు దిగడం; ఆ ఘర్షణ సుశాంత్ కేసు; బీహార్, హిమాచల్ ప్రదేశ్ జోక్యం; దానికి కేంద్రం మద్దతు, వాటికి సుప్రీంకోర్టు అంగీకారం వంటి అనేక పరిణామాల మీదుగా ఇన్నిన్ని చిత్రవిచిత్రమైన మలుపులు తిరగడం చూస్తుంటే; ఒకే మత, సంస్కృతీ,సంప్రదాయాలకు చెందిన వెనకటి రాజులు, రాజ్యాలు పరస్పరం కత్తులు దూసుకుంటూ, దేశాన్ని చీలికలు, పీలికలు చేసిన దశ పునరావృత్తమవుతోందా అన్న భావన కలుగుతోంది. ఇంతవరకు ‘సెక్యులర్ వర్సెస్ మతతత్వపక్షా’ల మధ్య కేంద్రీకృతమవుతూ వచ్చిన ఘర్షణ ఇప్పుడు ఒకే మతానికి చెందిన రెండు పక్షాల మధ్య కేంద్రీకృతమవుతున్న పోకడ స్పష్టంగా కనిపిస్తోంది.