తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా పాలంపేట సమీపంలోని రుద్రేశ్వర (ఈశ్వర) దేవాలయమైన రామప్ప దేవాలయాన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్ గా (ప్రపంచ వారసత్వ స్థలం) గుర్తించడం వెనుక కథ ఉంది. విశ్వవ్యాప్తంగా అసాధారణమైన విలువ ఉన్న స్థలాన్నీ, కట్టడాన్నీ , నిర్మాణాన్నీ వారసత్వ స్థలంగా గుర్తిస్తారు. చైనాలొని ఫ్యూజౌ నగరంలో ఆదివారం యునెస్కో ఆధ్వర్యంలో జరిగిన వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ కమిటీ 44వ సమావేశంలో ఏకాభిప్రాయం ప్రాతిపదికగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
రామప్ప దేవాలయంతో పాటు చైనాలోని క్వాంజౌ లోని సాంగ్ యువాన్ చైనాలో ఎంపోరియమ్ ఆఫ్ ద వరల్డ్, ఇరాన్ లోని ట్రాన్స్ ఇరానియన్ రైల్వే, స్పెయిన్ లోని పాసో డెల్ ప్రాడో అండ్ బుయెట్ రిటీరో అనే కళల, సైన్స్ మైదానాన్ని ప్రపంచ హెరిటేజ్ స్థలాలుగా వరల్డ్ హెరిటేజ్ కమిటీ నిర్ణయించింది. మానవాళికి ప్రస్తుతంలోనూ, భవిష్యత్తులోనూ దేశాల సరిహద్దులకు అతీతంగా అత్యంత ప్రాముఖ్యం కలిగి, గొప్ప అనుభూతి కలిగించే స్థలాన్ని ఈ జాబితాలో చేర్చుతారు. సంప్రదాయ మానవ నివాసాల సముదాయమైనా, సంప్రదాయం ఉట్టిపడే నిర్మాణం అయినా ఈ విభాగంలో పరిశీలనకు నోచుకుంటుంది.
రామప్ప గుడిని వరల్డ్ హెరిటేజ్ సంస్థగా గుర్తించినట్టు యునెస్కో ప్రకటించిన వెంటనే ప్రధాని నరేంద్రమోదీ ఒక ట్వీట్ ఇచ్చారు. ‘‘అద్భుతం. అందరికీ హృదయపూర్వక అభినందనలు. ప్రత్యేకంగా తెలంగాణ ప్రజలకు అభినందనలు. సుప్రసిద్ధమైన కాకతీయ వంశం అభివృద్ధి చేసిన అసాధారణమైన నగిషీల పరంపరకు, కళా సృజనకు రామప్ప గుడి అద్దం పడుతుంది. రాజసం ఉట్టిపడే ఈ దేవాలయాన్ని సందర్శించి దాని గొప్పతనాన్ని స్వయంగా ఆశ్వాదించమని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను,’’అని ప్రధాని అన్నారు. తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా ప్రజలకు అభినందనలు తెలియజేశారు.
వరల్డ్ హెరిటేజ్ జాబితాలో ఉండదగినవని భావించే స్థలాల జాబితాను ఆయా దేశాల నుంచి సేకరించాలని హెరిటేజ్ కన్వెన్షన్ నిర్ణయించిన మార్గదర్శక సూత్రాలలో ఉంది. దాని నుంచి యునెస్కో ఒక తాత్కాలిక జాబితాను తయారు చేస్తుంది. దేశాలు తయారు చేసిన డాక్యుమెంటరీలను హెరిటేజ్ కమిటీ చూస్తుంది. దాని తర్వాత హెరిటేజ్ సైట్లను నిర్ణయించడానికి జరిగే సభలో ప్రతిపాదిస్తుంది. మహారాష్ట్రలో మరాఠా సైనిక పాటవ కళాసంపదను గుర్తించాలని కోరుతో 17వ శతాబ్దిలో ఛత్రపతి శివాజీ హయాంకు సంబంధించిన 14 కోటల వివరాలును మే లో మహారాష్ట్ర ప్రభుత్వం యునెస్కోకు సమర్పించింది. ఈ సీరియల్ నామినేషన్ ను ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు యునెస్కోకు మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున పంపించారు. యునెస్కో ఈ నామినేషన్ ను ఆమోదించి తాత్కాలిక జాబితాలో చేర్చింది.
ఆదివారంనాడు జరిగిన సమావేశంలో పాల్గొన్న మొత్తం 21 దేశాలలో 17 దేశాలు రామప్ప దేవాలయాన్ని ప్రపంచ హెరిటేజ్ సంస్థల జాబితాలో చేర్చవలసిందిగా సిఫార్సు చేశాయి. దీంతో కలిపి భారత దేశంలో39 ప్రపంచ హెరిటేజ్ సంస్థలు ఉన్నాయి. వీటిలో 23 సంస్థల పరిరక్షణ బాధ్యతను ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిర్వహిస్తున్నది.
కాకతీయ రాజు గణపతి దేవ సైన్యాధిపతి రాచెర్ల సేనాపతి రుద్రయ్య నేతృత్వంలో రామప్ప దేవాలయ నిర్మాణం జరిగింది. 12 జనవరి 1214నాడు ఈ దేవాలయ నిర్మాణం పూర్తయినట్టు శిలాఫలకం వేశారు. అలావుద్దీన్ ఖిల్జీ సేనాని మాలిక్ కాఫర్ కాకతీయ రాజ్యం పైన దాడి చేశాడు. 1310లో మాలిక కాఫర్ దండయాత్రలో రామప్ప దేవాలయానికి కొంత నష్టం జరిగింది. 16 జూన్ 1819 నాడు పెద్ద భూకంపం సంభవించింది. దండయాత్రనూ, భూకంపాన్నీ తట్టుకొని చారిత్రక కట్టడం నిలిచింది. 15 ఏప్రిల్ 2014 న భారత్ యునెస్కోకు రామప్ప దేవాలయాన్ని నామినేట్ చేసింది. రామప్ప దేవాలయాన్నీ, స్వయంభూ దేవాలయాన్నీ, కాకతీయ కీర్తి తోరణాలనూ, వరంగల్లు కోటనూ, హనుమకొండలోని వేయిస్తంభాల రుద్రేశ్వర ఆలయాన్నిపరిచయం చేస్తూ ఒక డాక్యుమెంటరీని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపితే కేంద్రం యెనెస్కోకు పంపింది. చారిత్రక కట్టడాలు, స్థలాల అంతర్జాతీయ మండలి ప్రతినిధులు 2019లో రామప్ప దేవాలయాన్ని సందర్శించారు. చైనాలోని ఫూజౌలో జరగవలసిన హెరిటేజ్ కమిటీ 43వ సమావేశం కోవిద్ మహమ్మారి కారణంగా వాయిదా పడింది. 25 జులై 2021న యునెస్కో నిర్వహించిన హెరిటేజ్ కమిటీ 44వ సమావేశంలో రామప్ప దేవాలయాన్ని హెరిటేజ్ సైట్ గా గుర్తించాలని నిర్ణయించారు.