Friday, December 27, 2024

విద్యావంతులు సరే, వివేకవంతులు ఎక్కడా?

సమకాలీన సమాజంలో విద్యావంతులకు కొదువలేదు. వివేకవంతులు మాత్రం చాలా అరుదుగా కనిపిస్తున్నారు. తమ పని గడుపుకుని, చల్లాగా జారుకోవడం తప్ప బాధ్యతగా ప్రవర్తించడం, వ్యవహరించడం చాలా కొద్దిమందే చేయగలుగుతున్నారు. వీరి సంఖ్య చాలా చాలా పెరగాలి. చదువుకున్నవారే తమ బుద్ధి ఉపయోగించక అజ్ఞానుల్లా ప్రవర్తిస్తున్నారు. నవ నాగరికంగా బతుకుతూ చాలా అనాగరికంగా ప్రవర్తిస్తున్నారు. ఇటీవల మిర్యాలగూడలో ఒక దళిత యువకుణ్ణి నడిరోడ్డులో చంపేశారు. కారణం అతను అగ్రకులానికి చెందిన అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు. అమ్మాయి తండ్రి, బాబాయి జైలుకు పోవడానికి సిద్ధపడి, అల్లుణ్ని కిరాతకంగా చంపించారు. వారి పరువూ, ప్రతిష్టలు దోషులుగా దేశవ్యాప్తంగా పెరిగాయేమో తెలియదు. గర్భవతి అయిన ఆ అమ్మాయి మాత్రం తన భర్త స్మృతి చిహ్నంగా, ప్రేమకు గుర్తుగా తన కడుపులోని బిడ్డని కని, పెంచి పెద్ద చేస్తానంటుంది. నేరం చేసింది తన తండ్రే అయినా సరే, కఠినంగా శిక్షించాలంటుంది. కులాలు, మతాలు, ప్రాంతాలు వంటి అడ్డగోడల్ని వెతుక్కుంటున్న ఈ మనుషులు   మానవజాతి అంతా ఒక్కటేనని ఎప్పుడు గ్రహిస్తారూ? రాజ్యాంగాన్ని పక్కకు నెట్టేసి మనువాదాన్ని ఎగరేసుకుంటూ తిరిగేవారిని ఏమనాలీ? ఇది విద్యావంతుల సమాజమా? ఇది నాగరికుల సమాజమా? ఇది సంస్కారవంతుల సమాజమా? అందరం మనుషులమేనన్నది గ్రహించలేని మూర్ఖ సమాజమా? తనను ప్రాణప్రదంగా చూసుకునే భర్తను చంపించిన తండ్రిని, అతని కుటుంబ సభ్యుల్ని ఆ అమ్మాయి ఎలా క్షమించగలదూ? అందుకే అడిగేది విద్యావంతులు సరే, వివేకవంతులు ఎక్కడా అని…

Also read: ఆలోచనా విధానం మారితే మనోభావాలు దెబ్బతినవు

విద్యావంతులు వివేకాన్ని ఉపయోగిస్తున్నారా?

విద్యావంతులైన ఈ మనుషులు ఒక్క చోటైనా తమ వివేకాన్నీ, ఇంగిత జ్ఞానాన్నీ ఉపయోగిస్తున్నారేమో చూడండి. అనాలోచితంగా అన్ని రకాల కాలుష్యాలకు కారణభూతులవుతున్నారు. శబ్ద, వాయు, జల కాలుష్యాన్ని పెంచకుండా జీవించలేకపోతున్నారు. మామూలు రోజుల్లో కన్నా, పండగ రోజుల్లో, ప్రత్యేక దినాల్లో కాలుష్యాన్ని కొన్ని వందల రెట్లు పెంచుతున్నారన్నది గ్రహించలేకపోతున్నారు. తన చర్యల్ని తాము సమీక్షించుకోలేకపోతున్నారు. సాయంత్రం కాగానే మజీద్ ల లౌడ్ స్పీకర్లు, నమాజ్ ల ‘అజా’ పిలుపులు. రాత్రి కాగానే దేవుని బిడ్డల ప్రార్థనలు, స్వస్తి కేంద్రాల గోల, శృంగార దేవాలయాల ఆర్తనాదాలు…. ఇక హిందువుల పండగల గురించి చెప్పనవసరమే లేదు. ప్రధాన కాలుష్యకారకాలు ఇవే. దేవీనవరాత్రుల పేర, వినాయక మండపాల పేర, సీతారాముల కళ్యాణం, బతకమ్మ – ఇతర జాతరల పేర – పండుగల పేర శబ్ద, వాయు, జల కాలుష్యాల గురించి అందరికీ తెలిసిందే! నిమజ్జనాల పేర, శోభాయాత్రల పేర పర్యావరణ పరిరక్షణ స్పృహే లేకుండా ప్రవర్తిస్తున్నదెవరూ? నిమజ్జన విగ్రహాలతో చెరువులు,  కుంటలు పూడ్చుకుపోయినా పరవాలేదా? కూడళ్ళలో ఆకులు, కొమ్మలు, ప్లాస్టిక్ దండలు, చెత్త కుప్పలు – టన్నులకొద్దీ పేరుకుపోయినా పరవాలేదా? సంప్రదాయాలు, చాదస్తాలు నిలుపుకోవడమే ముఖ్యమా? విగ్రహాల తయారీలో వాడిన రంగులు, రసాయనాలు నీటిలో కరిగితే ఏమిటీ? ప్లాస్టర్ ఆఫ్ పారిస్, చెక్క ముక్కలు, ఇనుప రేకులు, సీకులు నీటి అడుగున పేరుకుపోతే ఏమిటి? మన దురద, మన పైత్యం తీర్చుకుంటే చాలా? విద్యాతుంతు సరే, వివేకవంతులు ఎక్కడా?

Also read: ఒక అద్భుతం!

హిందువులు ఆదర్శంగా ఉండాలి కదా?

ఈ దేశంలో ఇతర మతస్థులకన్నా హిందువుల జనాభాయే ఎక్కువ. మరి వారు బాధ్యత తీసుకొని, కాలుష్యరహిత సమాజానికి దోహదం చేస్తూ ఇతర మతస్థులకు ఆదర్శప్రాయంగా ఉండాలి కదా? ‘‘నసిగేవారు నసుగుతూనే ఉంటారు. విధ్వంసంలో మన ఆధిక్యత మనం చూపుకుంటూ వెళదాం’’- అని అనుకుంటే ఎలా?  మానవ తప్పిదాలతో ప్రకృతి విలయాలు సంభవించి ఈ భూమి నివాసయోగ్యం కాకుండా పోతూ ఉంది కదా? దసరా, దీపావళి బాంబుల ధాటికి పట్టణాల్లో అపార్టుమెంట్లు దద్దరిల్లిపోతూ ఉన్నాయి. భూమి, నీరు, గాలి వాతావరణమంతా కాలుష్యమయమై పోతూ ఉందనీ  – అధికారంలో ఉన్న ప్రభుత్వానికి చెపుదామనుకుంటే – లాభం ఏముందీ? పరిపాలకులే హోమాల్లో నెయ్యీ-నూనె దండిగా గుమ్మరిస్తూ, యాగాలు చేస్తూ ఉన్నారాయ్యే – ఇక సామాన్యుడి గోడు పట్టించుకునే వాడెవడూ? ఉత్సవాల పేర, సంప్రదాయం పేర, సంస్కృతి పేర అందరం అన్నీ భరించాల్సి వస్తోంది. జరుపుకోకూడదని కాదు. నియంత్రణ ఉండాలని అంటున్నాం అంతే – ఏ విశ్వాసాలైనా వ్యక్తిగత స్థాయిలో వారివారి కుటుంబ స్థాయిలో ఉంచుకుంటే పరవాలేదు. వాటిని వికృతంగా సామాజిక కార్యకలాపాలుగా మార్చి ఇతరులకు అసౌకర్యం కలిగించడం ఏం వివేకం? ఆధునిక మానవుడి జీవితాన్ని ప్రమాదంలోకి నెట్టేసే ధోరణుల గూర్చి విజ్ఞతగలవారైనా ఆలోచించాలి కదా? పర్యావరణం ఎంత భయంకరంగా తయారువుతూ ఉందో కనీసం అర్థం చేసుకునే పనే లేదా? నియంత్రించగలిగే అధికారం ఉన్నవారు నియంత్రించరు. ప్రత్యామ్నాయ మార్గాలు చూపరు. నిపుణుల్ని సంప్రతించరు. హేతుబద్దతలేని నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలకు పనికిరాని విషయాల్లో స్వేచ్ఛ నిస్తుంటారు. ఎందుకంటే వారు ఆ మూఢస్వేచ్ఛలో కొట్టుకు చావాలన్నది వారి ఆలోచన! రాజ్యం మూఢనమ్మకాల్ని ఎందుకు పెంచి పోషిస్తుందీ? అని ప్రశ్నించుకుంటే ఒకే ఒక్క సమాధానం వస్తుంది – జనం మూఢనమ్మకాల్లో ఉంటేనే కదా వారు రాజ్యాలేలడం సులభమౌతుంది?

Also read: చారిత్రాత్మక అవార్డు వాపసీకి అయిదేళ్ళు!

అధికారం సుస్థిరంగా ఉండాలంటే మూఢనమ్మకాలు పెరగాలి

‘‘రాజు తన అధికారం సుస్థిరంగా ఉండాలంటే ప్రజల్లో మూఢనమ్మకాల్ని పెంచాలి’’- ఇది కౌటిల్యుడి సూక్తి!

మన కేంద్ర ప్రభుత్వమే కాదు, రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా సైన్సుకు వ్యతిరేకమైన ఎన్నో అంశాల్ని ప్రచారం చేస్తున్నాయి. అందులో పుష్కర స్నానాలు ఒకటి. కృష్ణా, గోదావరి పుష్కరాల కోసం రెండు ప్రభుత్వాలు వందల కోట్లు ఖర్చు చేశాయి. అలాగే పుష్కర స్నానాలకు తరలి రమ్మని పిలుపునిచ్చాయి. చివరికి బస్ టిక్కెట్ పై కడా ‘‘పుష్కరస్నానం – మహాపుణ్యప్రదం-సర్వపాపహరం’ అని ముద్రించారు. ‘‘జన్మ ప్రభుతి యత్ పాపం, స్త్రీయావా పురుషేణవా పుష్కరే స్నాన మాత్రస్య, సర్వమేవప్రణస్వతి’’ అని పురాణాలు చెబుతున్నాయని ప్రచారం చేశారు. ఆ మంత్రాన్ని చదివి నదిలో మునిగితే సర్వపాపాలు పోతాయని పురాణ పండితులు చెపుతారు. కోట్ల మంది పుష్కర స్నానాలు చేసి పాపాలు పోగొట్టుకుంటే – మరి ఆ పాపాలు పోయిన వారందరూ పుణ్యమూర్తులేకదా? మరివారి సామాజిక, ఆర్థిక స్థాయి ఒకటై పోవాలి కదా? మళ్ళీ వారిని మునుపటి లాగా అగ్రకులంవారిగా,నిమ్నకులంవారిగా మాత్రమే గుర్తిస్తున్నారెందుకూ? ఇక పాపం పోయిందనడానికి రుజువేదీ? రుజువుల్లేని అంశాల్ని రాజ్యాంగబద్ధంగా నడుచుకోవలసిన ప్రభుత్వాలు ప్రచారం చేయడం దేనికీ? విద్యావంతులు తమ వివేకాన్ని ఉపయోగించి ఆలోచించాల్సిన అంశమేదీ లేదా? గుంపులు గుంపులుగా వెళ్ళి మురికి నీటిలో మునగడమేనా? వారు మునగడం అలా ఉండనిస్తే – వారిని ప్రభుత్వాలే నిండా ముంచుతున్నాయన్నది గ్రహించుకోలేకపోతున్నారు. అసలు పాపపుణ్యాల కారణంగానే అగ్ర, నిమ్న కులాల్లో పుడతారనేదానికి రుజువేదీ? అగ్ర వర్ణాలవారు రాసుకున్న మనువాదం ప్రామాణికమైతే మరిక మానవీయ విలువలకు అర్థమేదీ? అవసరమైనప్పుడు మాత్రం రాజ్యాంగం శరణువేడుతారా? అప్పుడు మాత్రం న్యాయం-చట్టం ఉండాలంటారా?

Also read: ఇన్సాన్ కి ఔలాద్ హై ఇన్సాన్ బనేగా!

ఇప్పుడు జరుగుతున్నదీ అదే

‘‘ప్రజలు ఎప్పుడైనా అభివృద్ధి గురించి అడిగితే వాళ్ళ మతాల మధ్య చిచ్చుపెట్టండి’’- అని అన్నాడు నెపోలియన్.

గతంలోనే కాదు, ప్రస్తత ఆధునిక యుగంలోనూ జరుగుతున్నది అదే. మతాల మధ్య చిచ్చు పెట్టి పబ్బం గడుపుకుంటున్నది రాజకీయాలేనన్నది బహిరంగ రహస్యం. అందువల్ల సామాన్య జనం మత విశ్వాసాలు వదిలేస్తే ఉత్తమం. ‘‘మనమంతా మనుషులం, మనుషుల్లాగా వ్యవహరిద్దాం’’- అని అనుకోవడం గొప్పగా ఉంటుంది. లేదూ- వదలలేని స్థితిలో ఉన్నవారు వాటిని తమతమ వ్యక్తిగత స్థాయికి పరిమితం చేసుకుంటే మంచిది. వాటి ప్రభావం సమాజంపై పడకుండా జాగ్రత్త పడడం చాలా అవసరం. ఎందుకంటే అప్పుడే రాజకీయం గానీ, రాజ్యం గానీ జనాన్ని విడదీయలేదు.  ప్రజాసమస్యల్ని అర్థం చేసుకుని పరిష్కరించే చిత్తశుద్ధి లేనివారు ఎప్పుడైనా ప్రజల్లో అయోమయాన్ని సృష్టిస్తారు. ఎటూ తేల్చుకోలేని సందిగర్థంలోకి తోసేస్తారు. అలాంటి అవకాశాన్ని పాలించేవాడికి ప్రజలు ఇవ్వకపోతే బావుటుంది కదా?  ఇంతెందుకూ? చిన్న ఉదాహరణ చెప్పుకుందాం! ఏదో ఒక విషయం మీద ఉద్యమం సాగుతోందని అనుకోండి. ప్రభుత్వం ఏం చేస్తుంది? టియర్ గ్యాస్ వదులుతుంది. లాఠీ చార్జి చేస్తుంది. లేదా రబ్బరు బుల్లోట్లు వదులుతుంది. లేదంటే ఫైరింగ్ చేయిస్తుంది. అంటే ఏమిటీ? భయభ్రాంతుల్ని చేసి, జనాన్ని అయోయమంలో పడేసి, తాత్కాలికంగా సమస్యను అక్కడే వదిలేసి చెల్లాచెదరయ్యేలా చూస్తుంది. సరిగ్గా ఇదే ఫార్ములా – టెక్నిక్ లు వేరవుతే అవుతాయి. పైనతాము సురక్షితంగా ఉన్నామా లేదా అన్నదే వారికి కావాలి. ఆ క్రమంలో తప్పుడు వార్తలు, పుకార్లు ప్రచారం చేయడం, వీడియోలు పంపడం చేస్తుంటారు. జనం అమానవీయ కుట్రల్ని తిప్పికొట్టాలి. విలువల ప్రతిష్టాపన నిరంతరం చేసుకుంటూ ఉండాలి. ఇటీవల కొత్తగా తెలిసిన విషయం ఒకటుంది. కొంతమంది ప్రజాప్రతినిధులు తమ దగ్గర పీఆర్వోలు, సోషల్ మీడియా కోఆర్డినేటర్ల ఉద్యోగాలకు తక్కువ కులం అభ్యర్థుల్ని వద్దంటున్నారు. మరి ఇదేం రకమైన పురోగమనం? కులగజ్జి అంటువ్యాధిలా వ్యాపిస్తుంటే  నివారణ చర్యలేవీ? ఇంకా గొప్పలెందుకూ?

Also read: శాస్త్రీయ అవగాహన పెంచిన కొడవటిగంటి వ్యాసాలు

నానాటికి సంక్లిష్టమై పోతున్న సమాజ స్థితిగతుల్ని ప్రజాసైన్సు ఉద్యమ కార్యకర్తలు బాగా అవగతం చేసుకుంటూ ఉండాలి. గోతిలో పడ్డవాణ్ణి పైన ఉన్నవాడు పైకి లాగినట్లు, మూఢనమ్మకాల్లో కూరుకుపోయిన వాళ్ళను ఆత్మస్థైర్యంతో, అంకిత భావంతో నిలబడ్డ వాళ్ళు పైకి లాగాలి. ఒకరు మరొకరికి అనే పద్ధతి ద్వారా, కరపత్రాల ద్వారా, పుస్తకాల ద్వారా, ఉపన్యాసాల ద్వారా, ఇతర ప్రద్శనల ద్వారా నిరంతరం కృషి చేస్తూనే ఉండాలి. వైజ్ఞానికి ధోరణిని, ఆ ఆలోచనా విధానాన్ని ముందు బాలబాలికలకు నేర్పించాలి. అప్పుడే నవ యుగానికి, నవశకానికి అంకురార్పణ జరుగుతుంది. ఇప్పుడు చదువురాని అమాయకుడికి చదువు చెప్పడం సులభం. కాని చదువుకున్న మూర్ఖుడి – మూర్ఖత్వాన్ని బద్దలు కొట్టడం కష్టం!

Also read: బహుజన చక్రవర్తి అశోకుడు ఎందుకు ‘గ్రేట్’?

Dr. Devaraju Maharaju
Dr. Devaraju Maharaju
సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles