Tuesday, January 21, 2025

టర్కీలో బౌద్ధం ఎందుకుందీ, ఎలా ఉంది?

బాల్కన్, అనటోలియన్ టర్కీ జాతి ప్రజల మూలాలు ఆసియాలో ఉన్నాయి. ఇది చాలామందికి తెలిసిన విషయమే. వీరు సుమారు రెండు వేల ఏళ్ళపాటు ఇక్కడ పరిపాలించారు. ఇక్కడి సాంస్కృతిక జీవనంలో భాగమైపోయారు. ఆ తర్వాత ఎప్పుడో టర్కీ, యూరోప్ లకు చేరుకున్నారు. ప్రస్తుత మంగోలియాలోని ఉత్తర, పశ్చిమ  ప్రాంతాలు టర్కీ ప్రజలకు గొప్ప స్థావరాలు. బుర్ఖానిజం-గురించి తెలుసుకున్నవారికి, టర్కీ భాషలో బుర్ఖాన్ అంటే బుద్ధుడి పేరని తెలిసే ఉంటుంది. కొన్ని నాగరికతలు ఇలా తూర్పు నుండి పశ్చిమానికి వెళ్ళాయి. చైనా, ఇండియా, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, గ్రీక్, రోమన్, ఈజిప్ట్ సంస్కృతుల మేళవిపుంగా టర్కీ ప్రజల జీవన విధానం రూపుదిద్దుకుంది. ఇందులో భాగంగా జుడాయిజం, క్రిస్టియానిటీ, ఇస్లాం-మాత్రమే కాక హిందూయిజం, బుద్ధిజం, టావోయిజం, మనిచిజం మొదలైన వాటితో పరిచయమైంది. కొన్ని మతాలు, కొన్ని జీవన విధానాలు వారి మీద కొంచెం ఎక్కువగానే ప్రభావం చూపాయి. టర్కీ ప్రజల్లో కొన్ని జాతులు, గ్రూపులు తూర్పు నుండి వచ్చిన బౌద్ధంతో చైతన్యవంతమయ్యాయి.

Also read: డిగ్రీలు లేని ప్రిన్సిపాలూ, మరో పరిశోధకుడు

ఒక రకంగా టర్కీ ప్రజలు హుణుల కాలంలో బౌద్ధం గురించి తొలిసారి తెలుసుకున్నారు. సాధారణ శకం ఐదవ శతాబ్దం నుండి టర్కీ జాతులెన్నో బౌద్ధాన్ని స్వీకరించడం, ఆ జీవన సూత్రాల్ని పాటించడం చేస్తూ వచ్చాయి. టి’ ఓపా/టాబ్గచ్ రాజ్య కాలంలో అది విస్తృతంగా కొనసాగింది. ఈ రోజు టర్కీ భాష మాట్లాడేవారిలో కేవలం ముస్లింలే లేరు. షుఐషు-చారిత్రక ఆధారలను బట్టి తెలిసేదేమంటే , ఆరవ శతాబ్దంలో టర్కీ మొదటి చక్రవర్తి (542-581 సీఈ) టుర్క్ ముకన్ కగెన, తర్వాత అతని సోదరుడు ట-ఓపా/టాస్పర్ కగెన్ లు బౌద్ధాన్ని స్వంతం చేసుకున్నారు. ఒక బౌద్ధారామాన్ని కూడా నిర్మించారు. ఉత్తర చైనాకు తమ ప్రతినిధిని (దూతను) పంపి తమకు బౌద్ధప్రమాణాలు/సూత్రాలు (CANON) వగైరా పంపించవల్సిందిగా అర్థించారు. బౌద్ధ సన్యాసి హువై-లిన్, టాస్పర్ కగన్ కు కొంత సమాచారం అందించాడు. కొన్ని సూత్రాలు, నియమాలు, విధానాలు బోధించాడు (నైపాన్, హుఆ-యెన్, చింగ్-మిన్, షై-టంగ్…ఇవి వారి భాషాపదాలు గనక మనకు కొత్తగా ఉంటాయి). బౌద్ధంలోని కొన్ని ముఖ్యమైన అంశాలు బోధించి, ఇంకా లోతుగా తెలుసుకోవాల్సిన అవసరాన్ని వారికి అర్థం చేయించాడు.

ఉత్తర చి  పరిపాలకుడు (535-577 సీఈ) బౌద్ధం పట్ల కగన్ చూపుతున్న ఉత్సుకతను గమనించి తను కూడా స్ఫూర్తి పొందాడు. నిర్వాణ సూత్రాల్ని టర్కీ భాషలోకి అనువదించమని లి-షై-చింగ్ అనే బౌద్ధ భిక్కును కోరాడు. కారణం ఏమంటే – అతను కగన్ తో టర్కీ భాష ధారాళంగా మాట్లాడేవాడు. అందువల్ల, బౌద్ధానికి సంబంధించిన విషయాలు తనకు కూడా సులభంగా అర్థం చేయించగలడన్న నమ్మకం కుదిరి – లి-షై-చింగ్ భిక్కుతో అనువాదాలు చేయించాడు. ఆ టర్కీ పాలకుల కాలంలోనే మహాయాన బౌద్ధం విస్తృతంగా వ్యాపించింది. ఇటు ఇండియా నుండి, అటు చైనా నుండి తీసుకున్న గ్రంథాల అనువాదాలు – జర్మీన, కొరియా, జపాన్, అమెరికాలలోని అనేక గ్రంథాలయాలకు ఆ పుస్తకాలు చేరాయి – తొలిదశలో టర్కీ ప్రజల్లో బుద్ధిజం పట్ల విశ్వాసం నామ మాత్రంగానే ఉండేది. రెండో టర్కీ పాలకుడు (582-744 సీఈ) రాజ్యానికి వచ్చే సరికి అక్కడ బౌద్ధుల సంఖ్య మరింత తగ్గింది. బౌద్ధాన్నిపునరుద్ధరిద్దామన్న సంకల్పంతో రాజు బిల్గే కగన్ ఒక బౌద్ధాలయ నిర్మాణానికి సిద్ధపడ్డాడు. కానీ, ఆయన సలహాదారులు తీవ్రంగా వ్యతిరేకించారు. కారణమేమంటే, బౌద్ధం చెప్పే శాంతి మార్గం వల్ల సైనికులు నీరసపడిపోతారని, వారిలో మానసిక పరివర్తన కలిగి యుద్ధం పట్ల విముఖత చూపుతారని – వీరోచితంగా పోరాడవల్సిన సైనికులకు దయ, కరుణ, జాలి గురించి బోధించడం ఏం బాగుటుదనీ – బౌద్ధాలయ నిర్మాణంతో వాతావరణంలో మార్పు  వస్తుందనీ చెప్పి-ఒప్పించారు. ఆలయ నిర్మాణ ప్రయత్నం మాన్పించారు –

కొంత కాలానికి టర్కీ పాలకుల పాలన ముగిసింది. ఉయగుర్స్ ఆక్రమించుకుని 9 నుంచి 14వ శతాబ్దం (సీఈ) దాకా పరిపాలించారు. తర్వాత కాలంలో టర్కీ ప్రజల్లో – ఇస్లాం బలం పుంజుకుంది. అది బౌద్ధంపై ప్రభావం చూపి, దాన్ని దాదాపు క్షీణింపజేసింది. అయితే, ఒకప్పుడు బౌద్ధాన్ని ఆచరించిన జాతులు, సమూహాలు వారసత్వంగా ఆ విధానాన్ని ఇంకా అక్కడ కొనసాగిస్తున్నాయి. రష్యాలోని తువన్ టర్క్ ప్రజలు, చైనాలోని  ఉయగుర్స్ లాంటివారు ఇప్పటికీ చౌద్ధులే! ఒట్టమాన్ ల కాలం దాకా, అంటే 19 వ శతాబ్దం దాకా, ప్రపంచంలోని మత చరిత్రల్లో భాగంగా – బౌద్ధం కూడా అక్కడక్కడ కొంత చర్చించబడుతూ ఉండేది. కాని కొద్దిమంది ఒట్టమాన్ మేధావులకు బౌద్ధ నైతిక విధానం బాగా నచ్చింది. ముఖ్యంగా సెమిసెట్టిన్ సమి అనే రచయిత 1878లో ఇసటిర్ (ESATIR) అనే తన గ్రంథంలో భారత దేశంలోని మతాల గూర్చి రాస్తూ బుద్ధుడి గూర్చి, బౌద్ధం గూర్చి విపులంగా చర్చించాడు. ఆ తర్వాత 1910లో అహమెట్ మిథట్ ఎఫిండి అనే అతను తర్హీ-ఐ-ఇడైన్ (THE HISTORY OF RELIGIONS) మతాల చరిత్ర నమోదు చేస్తూ చివరి అధ్యాయంలో మొత్తం బౌద్ధం గురించి రాశాడు. ముఖ్యంగా ఇందులో బౌద్ధంలోని నైతికత గురించి దృష్టి సారించాడు. ఇది మరి కొందరికి మార్గదర్శకమైంది. మరికొంతమంది పరిశోధక రచయితలు బౌద్ధం గూర్చి తమ విశ్లేషణలను గ్రంథస్థం చేస్తూ అక్కడి ప్రజలు ప్రభావితమైన అంశాల గూర్చి వివరించారు. వీరిలో ముఖ్యంగా చెప్పుకోవల్సినవారు మహ్మద్ ఇసద్ సైడి సెహరీ (1914) యం.సిమ్ సిద్దిన్ గునాల్టే (1922)లు. అహమెట్ మిధట్ ఇఫెండి అనే పరిశోధకుడి గురించి మరొక ముఖ్యమైన విషయం చెప్పుకోవాలి. ఈయన 1890లోనే నేరుగా బౌద్ధం మీద ఒక పపుస్తకం ప్రచురించారు.  దాని పేరు ‘‘పారిస్ లో ముప్పయ్ వేల బౌద్ధులు (30,000 BUDDHISTS IN PARIS).’’

Also read: వేద గణితం అబద్ధం: సున్నాను కనుగొంది బౌద్ధులే!

ఇవే కాక, ఒట్టమాన్ కాలపు ‘సిబిలుర్రిసడ్’ అనే జర్నల్ లో బుద్ధుడి గురించి, బౌద్ధం గురించి ప్రత్యేకమైన వ్యాసాలు చాలా విపులంగా ప్రచురించబడేవి. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ఒట్టమాన్ పాలకుల పాలన అంతమై, టర్కిష్ రిపబ్లిక్ ఏర్పడినప్పుడు నూతన దేశ నిర్మాణంలో భాగంగా అనేక మార్పులు జరుగుతూ వచ్చాయి. పరిశోధకులు, మేధావులు ప్రపంచ చరిత్రను నూతన దృక్కోణంలో పరిశీలించసాగారు. అవసరమైన వాటిని పునరుద్ధరించుకోవాలన్న స్పృహ  పెరిగింది. అపుడే ఆలోచనాపరులుందరి దృష్టీ బౌద్ధం మీద పడింది. ఒకక రకంగా చెప్పుకోవాలంటే టర్కీ – రిపబ్లిక్ అయిన తర్వాతే బౌద్ధంపై పరిశోధనలు విస్తృతమయ్యాయి. చారిత్రక సత్యాలు వెలికి తీయడం అధికమయ్యింది.

ముస్తఫా కెమల్ అటా టుర్క్ – ఒక దర్శానికుడు. విస్తృతంగా అధ్యయనం చేసిన మేధావి. టర్కీ రిపబ్లిక్ అయిన పదిహేను సంవత్సరాలలో భాష, సాహిత్యం, చరిత్ర, మతం వంటి ఎన్నో విభాగాలు ఏర్పాటు చేశాడు. అంకార యూనివర్శిటీలోని భాష, చరిత్ర, భూగోళ శాస్త్ర విభాగం ఆయన రూపకల్పన చేసిందే!1936లో అది ప్రారంభమైనప్పుడు అందులో మొదటగా ఇండాలజీ విభాగం ప్రారంభమైంది. అందులో ఎన్నో కోర్సులతో పాటు బౌద్ధంపై కూడా ఒక కోర్సును చేర్చారు. వాల్టర్ రూబెన్ అనే ఒక జర్మన్ ప్రొఫెసర్ దానికి తొలి డైరెక్టర్ గా ఉండేవాడు. గోక్ టుర్క్, ఉయ్ ఘర్ కాలాల పరిస్థితుల గూర్చి ప్రత్యేక శ్రద్ధపెట్టి పరిశోధనలు చేస్తే టర్కీ చరిత్ర కొంతవరకు సమగ్రమవుతుందనీ, దానివల్ల ఆ కాలాలలోని భాష, మతాల గురించి క్షుణ్ణంగా తెలుస్తుందని ముస్తఫా కెమల్ అటా టుర్క్ భావించాడు. అదే విధంగా ఆ కాలపు బౌద్ధ గ్రంథాల్ని, ఆధారాల్నీ పరిశీలించడం కూడా అవసరమని భావించాడు. ఈ అటా టుర్క్ కు బౌద్ధం మీద ప్రత్యేక శ్రద్ధా, ఆసక్తీ ఉన్నాయని తెలుస్తూ ఉంది. అందుకు ఆధారమేమంటే ఆయన ఇజ్ మీర్ ఫెయిర్ 1934 గురించి ఇస్మెట్ ఇనోను – కు ఒక టెలిగ్రాం పంపుతూ చివరలో ‘నమో ఇస్మెట్’- అని రాశాడు. నమో అంటే గౌరవంతో నమస్కరిస్తున్నాను అని అర్థం. ఇది బౌద్ధానికి సంబంధించిన పదం. టర్కీ భాషాపదం కాదు. అలాగే, టర్కీ భాషలో ఇస్మెట్ అంటే – స్వచ్ఛమైన  – నిజాయితీ గల – అని అర్థం.

Also read: జీవిత సమస్యల్లోంచి బయట పడడం ఎలా?

ఇక హిల్మి ఒమర్ బుద్ధ(1894-1952) అనే పరిశోధకుడి గురించి చెప్పుకోవాలి. టర్కీ రిపబ్లిక్ అయిన తర్వాత వెలుగులోకి వచ్చిన పరిశోధకుల్లో ఈయన అగ్రగణ్యుడు. ఒక రకంగా టర్కీలోని మత విశ్వాసాల మీద పరిశోధన చేసిన తొలి చరిత్రకారుడు కూడా ఈయనే – ఆయన తన పేరులో బుద్ధ అని చేర్చుకోవడం గమనించాల్సిన విషయం. శాక్యగణానికి చెందిన బుద్ధుడి పూర్వీకుల మూలాలు బహుశా టర్కీలోనే ఉన్నాయేమోనని ఆయన అనుమానం కూడా వ్యక్తం చేశాడు. ఎన్నో ఏళ్ళ పరిశోధన తర్వాత, మతాల చరిత్ర – పేరుతో హిల్మి ఒమర్ బుద్ధ 1935లో ఒక ఉద్గ్రంథం ప్రకటించాడు. ఆయన తన గ్రంథంలో ఇంకా భారత దేశంలోని ఇతర మతాల గూర్చి కూడా రాశాడు. టిబెట్ లోని లామాయిజం గురించి, చైనాలోని టావోయిజం, కన్ ఫ్యూసియనిజం గురించి, చైనీయ బుద్ధిజం, జపనీయ బుద్ధిజంల గురించి కూడా వివరిస్తూ తన గ్రంథ రచన సాగించాడు. అసఫ్ హలెట్ సెలిబి అనే గ్రంథ రచయిత 1946లో ‘‘పాలి గ్రంథాల ఆధారంగా గౌతమ బుద్ధ’’- అనే ఒక గ్రంథాన్ని ప్రచురించాడు. ప్రొ.  కొర్హన్ కయ, ప్రొ. ఎల్సిన్ కయలి (ఆసియా పసిఫిక్ రీసెర్చ్ సెంటర్ వైస్ డైరెక్టర్) ప్రొ. డెర్యాకాన్ వంటివారు బుద్ధిజం మీద వరివిగా పరిశోధనలు చేస్తూ యువ పరిశోధకులకు మార్గదర్శకులవుతున్నారు. తెలుగులో నేను రాస్తున్న ఈ విషయాలు కూడా టర్కీ: అంకారా యూనివర్సిటి చెందిన ఏసియా పసిఫిక్ సెంకటర్ కు డైరెక్టర్ అయిన ప్రొ. ఎ. మెర్తాన్ డ్యూండర్ ప్రకటించిన పరిశోధనా పత్రంలోనివి-

మొత్తానికి మొత్తంగా అక్కడి APRC – ఆసియా దేశాల్లోని బుద్ధ చరిత్ర – సంస్కృతులపై దృష్టిపెట్టి పని చేస్తోంది. టర్కీ జీవనంపై సాగుతున్న అధ్యయనాలలో భారత, చైనా, జపాన్ బౌద్ధుల ప్రభావం ఎంతగా ఉందో కూడా పరిశీలిస్తున్నారు. గత కాలపు బౌద్ధపత్రాలు, గ్రంథాలు, శాసనాల ఆధారంగా వచ్చిన అనువాదాలు పరిశీలిస్తున్నారు. ప్రొ. సిమా బయట్కు ఒజోండర్, ఫ్రొ. మెహమిట్ ఓల్మేజ్ లు ఈ విషయాలమీద కృషి చేస్తున్నారు. పలు విశ్వవిద్యాలయాల మధ్య అవగాహనా సదస్సులు పెరుగుతున్నాయి. అవి కలిసి కట్టుగా పరిశోధనలు ఉధృతం చేయాలని కూడా నిర్ణయించుకున్నాయి. చివరగా అర్థం చేసుకోవాల్సింది ఏమంటే – టర్కీలో క్రమంగా బౌద్ధంపై, బౌద్ధ సంస్కృతిపై, బౌద్ధనైతిక జీవనంపై అభిరుచి పెరుగుతూ ఉంది!

Also read: ఇంగితం లేని పండిత ప్రకాండులు

(రచయిత కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు విజేత, విశ్రాంత బయాలజీ ఫ్రొఫెసర్, మెల్బోర్న్ నుంచి)  

Dr. Devaraju Maharaju
Dr. Devaraju Maharaju
సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles