అఫ్ఘానిస్తాన్ లో తాలిబాన్ రాజ్యం నెలకొన్న నేపథ్యంలో భారత్ ఏమి చేయాలి? భారత విదేశాంగ విధానంలో రావలసిన మార్పులు ఏమిటి? భారత్ కు ప్రయోజనకరమైన మార్గం ఏమిటి? ప్రస్తుతం భారత్ పరిస్థితి ఏమిటి? అంతర్గత వ్యవహారాలకూ, విదేశీ వ్యవహారాలకూ ఎంతో కొంత సంబంధం ఉంటుంది. కేంద్రంలో నరేంద్రమోదీ అనుసరిస్తున్న విధానాలకూ, భారత్ విదేశాంగ విధానానికీ మధ్య విడదీయలేని బంధం ఉంటుంది.
Also read: తాలిబాన్ పై గెరిల్లాపోరాటానికి రంగం సిద్ధం చేస్తున్న అఫ్ఘాన్ మాజీ ఉపాధ్యక్షుడు
జయశంకర్, దోవల్ నిర్వాకం
ప్రస్తుతం భారత విదేశాంగ విధానాన్ని విదేశాంగమంత్రి జయశంకర్, భద్రతావ్యవహారాల సలహాదారు అనిల్ కుమార్ దోవల్ లు నిర్దేశిస్తున్నారు. ప్రధానమంత్రికి విదేశీ వ్యవహారాలపైన ఎంత అవగాహన ఉన్నదో తెలియదు. గత ఏడేళ్ళ నరేంద్రమోదీ పాలనలో విదేశీ వ్యవహారాలు దెబ్బతిన్నాయి. మోదీ పాలనలో భారత దేశం అంతర్జాతీయ ప్రతిష్ఠ పెరిగిందనీ, దేశం పట్ల గౌరవ భావం పెరిగిందనీ ప్రచారం చేసుకోవడానికి బాగానే ఉంటుంది కానీ వాస్తవంగా జరిగింది ప్రచారానికి పూర్తి భిన్నం. మన ఇరుగుపొరుగు దేశాలన్నీ చైనా చెప్పుచేతలలో ఉన్నాయి. మన దేశవాసులే వెళ్ళి స్థిరపడిన శ్రీలంక, హిందూమతానికి చెందినవారే నివసిస్తున్న నేపాల్, మన సహకారంతో పురుడుపోసుకున్న బంగ్లాదేశ్ ఇప్పుడు చైనాను సన్నిహితంగా ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే చైనా, భారత్ లో ఒక దేశాన్ని మిత్రదేశంగా ఎంచుకోమని అడిగితే ఈ దేశాలన్నీ చైనాను ఎంచుకుంటాయనడంలో సందేహం అణుమాత్రం అక్కరలేదు. పాకిస్తాన్ తో సమస్యలు జటిలమైనాయే కానీ తగ్గలేదు. చైనాతో సంఘర్షణవాతావరణం నెలకొన్నది. రష్యా క్రమంగా చైనా పంచన చేరింది. ఇందిరాగాంధీ హయాంలో సోవియెట్ యూనియన్ తో ఇరవై సంవత్సరాల స్నేహ ఒడంబడికను కుదుర్చుకున్న ఇండియా ఇప్పుడు రష్యాను మిత్రదేశంగా పిలుచుకునే పరిస్థితి లేదు. సప్త సముద్రాల ఆవల ఉన్న అమెరికాతో, చాలా దూరంగా ఉన్న ఆస్ట్రేలియాతో, సైనికంగా, ఆర్థికంగా పెద్దగా సాయపడలేని స్థితిలో ఉన్న జపాన్ తో సన్నిహిత సంబంధాలు పెట్టుకున్నాం. క్వాడ్ కూటమిలో చేరాం. దక్షిణచైనా సముద్ర ప్రాంతానికి మన యుద్ధనౌకను పంపించాం. ఈ కూటమిని నమ్ముకొని ఇరుగుపొరుగు దేశాలతో శత్రుత్వం పెంచుకుంటున్నాం. ఈ కూటమికి నాయకత్వ స్థానం అమెరికాది. అమెరికాను ఎంతవరకూ నమ్మవచ్చు? కష్టసమయాలలో అమెరికా ఆదుకుంటుందా?
Also read: క్లిష్టపరిస్థితులలో కాబూల్ నుంచి భారతీయులను ఎట్లా రక్షించారు? ఎవరు కాపాడారు?
ఇందిరాగాంధీ ఏమన్నారు?
అమెరికాకైనా, మరే దేశానికైనా స్వప్రయోజనాలు ముఖ్యం. ఒక సారి ఇందిరాగాంధీని ఒక విదేశీ విలేఖరి ‘మీరే సోవియెట్ యూనియన్ కు అనుకూలమా? అమెరికాకు అనుకూలమా?’ అని ప్రశ్నించాడు. ఇందిరాగాంధీ వెంటనే ‘ఇండియాకు అనుకూలం’ అనే సమాధానం ఇచ్చారు. అదే సరైన వైఖరి. అమెరికా ప్రపంచ పోలీసు పాత్రను విరమించుకోవలసిన సమయం ఆసన్నమైంది. అఫ్ఘానిస్తాన్ నుంచి నిష్క్రమించిన తీరు చాలా అంశాలను స్పష్టం చేస్తున్నది. గత రెండు దశాబ్దాలుగా అమెరికా అఫ్ఘానిస్తాన్ లో ఒక ట్రిలియన్ డాటర్లు ఖర్చు చేసింది. అఫ్ఘానిస్తాన్ రక్షణ కోసం నాలుగువేల మంది సైనికులను కోల్పోయింది. అయినా అఫ్ఘానిస్తాన్ ప్రజల హృదయాలను గెలవలేకపోయింది. ఎందుకని? అసలు అమెరికా అఫ్ఘానిస్తాన్ ను ఆక్రమించుకున్న పద్దతినే అఫ్ఘాన్ ప్రజలు అంగీకరించలేదు. పాకిస్తాన్ లో తలదాచుకున్న ఒసామా బిన్ లాదెన్ ను సంహరించిన తర్వాత అమెరికాకు అఫ్ఘానిస్తాన్ నుంచి ఎంత త్వరగా వెళ్ళిపోతే అంత బాగనే అభిప్రాయం బలపడింది. అందుకనే ప్రెసిడెంట్ ట్రంప్ హయాంలో అఫ్ఘానిస్తాన్ ప్రభుత్వం ప్రమేయం లేకుండానే నేరుగా పాకిస్తాన్ సహకారంతో తాలిబాన్ తో చర్చ ప్రారంభించింది. అమెరికా ప్రోత్సాహంతో అఫ్ఘానిస్తాన్ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న అష్రాఫ్ ఘనీకి తెలియకుండా అమెరికా అధికారులు తాలిబాన్ తో వ్యవహారం చేయడం అమిత్ర చర్య కాదా? వియత్నాం యుద్ధాన్ని విరమించి అమెరికా సైగాన్ ను వీడి వచ్చినప్పుడు అక్కడ కమ్యూనిస్టు పార్టీ బలమైన స్థితిలో ఉంది. వియత్నాంను ఏకం చేసి సమర్థంగా పరిపాలించి ఆర్థికంగా విజయాలు సాధిస్తున్నది. అటువంటి పరిస్థితి అఫ్ఘానిస్తాన్ లో లేదు. సైగాన్ నుంచి నిష్క్రమించినప్పటి కంటే అవమానకరమైన పరిస్థితిలో అమెరికా కాబూల్ నుంచి బయటపడింది. నిష్క్రమణ తేదీలను మార్చడానికి అమెరికా అధ్యక్షుడు బైడెన్ సిద్ధంగా లేరు. పైగా అమెరికా సేనలను ఉపసంహరించుకోవడం సరైన చర్యేననీ, అఫ్ఘాన్ సైన్యం పోరాడలేదనీ, తమకున్న పోరాట పటిమను ప్రదర్శించకుండానే లొంగిపోయారనీ, తప్పు తమది కాదనీ బైడెన్ మంగళవారంనాడు జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో సమర్థించుకున్నారు. 1990లలో రష్యా కాబూల్ నుంచి ఉపసంహరించుకున్నప్పటి కంటే అన్యాయంగా, అసమర్థంగా, గందరగోళంగా అమెరికా ఉపసంహరించుకున్నది. తాలిబాన్ కాబూల్ చేరుకోవడానికి కొన్ని వారాలు పడుతుందని అమెరికా గూఢచర్య సంస్థలూ, బ్రిటిష్ ఇంటెలిజెన్స్ సంస్థలూ, భారత వేగులూ నిర్థారించడంలో ఎక్కడో ఏదో పెద్ద లోపం జరిగింది. అఫ్ఘాన్ ప్రజల అంతరంగాన్నితెలుసుకోవడంలో అందరూ విఫలమైనారు.
Also read: తాలిబన్లు కాదు, తాలిబాన్!
మొన్నటి వరకూ అమెరికా ఆక్రమణలోనే అఫ్ఘానిస్తాన్
అఫ్ఘానిస్తాన్ ను ఆక్రమించిన దేశంగానే అమెరికా మిగిలిపోయింది. అమెరికా సేనలు ఉన్నంతవరకూ అమెరికాను అభిమానిస్తున్నట్టే అఫ్ఘాన్ ప్రజలు కనిపించారు. కానీ వాస్తవంగా అమెరికా అయినా, రష్యా అయినా, బ్రిటన్ అయినా తమ భూభాగం ఆక్రమించి, అక్కడ తిష్ఠవేసి, తమను పరిపాలిస్తామంటే అఫ్ఘాన్ లు అంగీకరించరు. వారికి ఆత్మగౌరవం ఎక్కువ. పేదరికం ఉండవచ్చు. అనేక సమస్యలు సతమతం చేస్తూ ఉండవచ్చు. కానీ విదేశీ జోక్యాన్నిమాత్రం వారు అంగీకరించరు. వారి నైజం తెలియకుండా అమెరికా ఇరవై ఏళ్ళు అక్కడ కాలయాపన చేసింది. నిధులు ఖర్చు చేసింది. ఎంత చేసినా అమెరికన్ల కంటే తాలిబాన్ నే అఫ్ఘాన్ లు ఆమోదిస్తారని ఇటీవలి పరిణామాలు చాటి చెబుతున్నాయి. అందుకే అఫ్ఘానిస్తాన్ ను పదిహేను రోజులలోనే తాలిబాన్ గెలుచుకోగలిగారు. అమెరికా శిక్షణ ఇచ్చి ఆయుధాలు సమకూర్చిన అఫ్ఘాన్ సైన్యం కూడా తాలిబాన్ లో కలిసిపోయింది కానీ తాలిబాన్ తో తలబడి అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధపడలేదు. అఫ్ఘాన్ ప్రజల మనస్తత్వాన్ని సవ్యంగా అర్థం చేసుకోవడంలో అన్ని దేశాలూ విఫలమైనాయని చెప్పుకోవాలి.
Also read: అఫ్ఘాన్ అధ్యక్షుడు అష్రాఫ్ కజికిస్తాన్ కు పరార్
తాలిబాన్, అమెరికా మధ్య చర్చల సారాంశం ఏమిటి? తాలిబాన్ దేనికి అంగీకరించింది? అమెరికా విధించిన షరతులు ఏమిటి? అసలు కథ ఏమిటి?
(రేపటి వ్యాసంలో తెలుసుకుందాం)
Good