కనుగుడ్డు
భూగోళమంత ముఖ్యమైంది.
అది దృష్టి
ఇది అనంత సృష్టి.
కన్ను తెరిస్తే అది దృశ్యం
మూసుకుంటే ఒక స్వప్నం.
అక్షరాల మైదానాల్లో
తిరిగి తిరిగి అలిసి పోయి నట్టున్నాయి.
లీలగా మసక
గాలికి లేచిన ఇసక.
కండ్లు
దేహానికి కిటికీలు
నాలుకను మించిన
బహు భాషా వేదికలు.
ఇంత జలం
ఎక్కడి నుంచి ఊరుతున్నట్టు!
బాష్పాలు
భావుక పుష్పాలు.
సైజులో చిన్న గాజు ముక్కలే
కాని విశాల ప్రపంచాలను
అలా అలా ఇముడ్చుకుంటాయి.
హిమాలయాలను
జేబులో వేసుకొని తెచ్చాను
అది వీటి చలవే.
ఇవాళ కొంత
దిగులు గానే వుంది.
వెల్తురులో చీకటి రంగు కలుస్తున్నట్టు.
సూర్య ప్రకాశం విలువ
క్రమంగా అనుభవానికొస్తున్నట్టు.
అయ్యో!
ఇవాళటితో
మాయపొర తొలిగి పోతుంది కాబోలు!
ఇక నుంచైనా
కనుపాపలను
చంటి పాపల్లా కాపాడు కోవాలి.
Also read: అతీత
Also read: లత జ్ఞాపకాలు
Also read: రాచకొండ
Also read: పురుషులందు…
Also read: పునర్ఘోష