భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సమావేశం దిల్లీలో మూడు రోజుల కిందట ముగిసింది. ఇతర విషయాలతో పాటు అయిదు అసెంబ్లీలకు జరగబోతున్న ఎన్నికలలో అనుసరించవలసిన రణనీతి (యుద్ధవ్యూహం) గురించి కూడా చర్చించినట్టు వార్తాపత్రికలు తెలియజేశాయి. అటువంటి కీలకమైన అంశాలను అధిక సంఖ్యాకులు ఉండే సమావేశాలలో చర్చించరనే విషయం మనందరికీ తెలుసు. తన పార్టీ అజెండా, ఉపన్యాసాల గురించి పార్టీ ప్రతినిధి చెప్పిన అంశాలను పట్టి చూస్తే దిల్లీ సభ అంత ముఖ్యమైనది కాదు. సభలో చేసిన ప్రసంగాలూ, ఇటీవల విదేశీ పర్యటన గురించి పార్టీ అధినేత, ప్రధాని చెప్పిన అంశాలూ, ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత ఆయన చేసిన పనుల కారణంగా దిల్లీ సభ ప్రాముఖ్యం సంతరించుకున్నది. అధికారపార్టీ మదిలో, ఆ పార్టీ ప్రతీక అయిన ప్రధాని మనస్సులో ఏమున్నదో తెలుసుకోవడానికి ఈ మూడు రకాల కార్యక్రమాల నుంచి వెలువడిన సంకేతాలు ముఖ్యం. త్వరలో ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రాలలో రంగం ఎట్లా ఉన్నదో అర్థం చేసుకోవడానికి ఈ సంకేతాలను విశ్లేషించే ప్రయత్నం ఇక్కడ చేస్తాను.
ఈ ఎన్నికలు బీజేపీకి ప్రధానం
అయిదు రాష్ట్రాలలో వచ్చే ఏడాది ప్రారంభంలో, నిజానికి మరి కొన్ని వారాలలో, జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి, ప్రధానికీ చాలా ముఖ్యమైనవి. అయిదు రాష్ట్రాలకు గానూ నాలుగు రాష్ట్రాలలో ప్రస్తుతానికి బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయి. వీటిలో రెండు రాష్ట్రాలు – ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ – పోయిన ఎన్నికలలో బీజేపీకి అనుకూలంగా చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చాయి. కాంగ్రెస్ హస్తంలో పంజాబ్ ఉన్నది. గోవా, మణిపూర్ లలో అధికారపార్టీగా బీజేపీ అడ్డదారిలో అవతరించింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్ ఫలితాలు 2024లో జరగబోయే లోక్ సభ ఎన్నికలలో బీజేపీ భవితవ్యాన్ని ప్రభావితం చేస్తాయి. మూడింటిలో కూడా ఉత్తరప్రదేశ్ వజ్రం వంటిది. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో మోదీ గెలుపొందడానికి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో యోగి ఆదిత్యనాథ్ గెలవడం అత్యంత కీలకమంటూ దేశీయాంగమంత్రి, బీజేపీ ఎన్నికల చాణక్యుడు అమిత్ షా ఒకటికి పది సార్లు అన్నారు. యూపీ, ఉత్తరాఖండ్, పంజాబ్ లలో కలిపి 98 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. గోవాలో, మణిపూర్ లో విజయం సంకేత ప్రాయమే కానీ 2024 ఎన్నికల పరిణామాలపైన ప్రభావం వేసేది కాదు. ఆ రెండు రాష్ట్రాలలో తలా రెండు లోక్ సభ స్థానాలు ఉన్నాయి. అంతే.
పంజాబ్ గురించి నేను క్లుప్తంగా చెబుతాను. తర్వాత ఉత్తరాఖండ్ చూద్దాం. చివరిగా ఉత్తరప్రదేశ్ లో పరిస్థితిని గమనిద్దాం. ఈ కార్యక్రమంలో గోవా, మణిపూర్ గురించి మాట్లాడను.
పంజాబ్ లో సంక్లిష్ట పరిస్థితి
శిరోమణి అకాలీదళ్, బీజేపీకి ఉండిన దీర్ఘకాలిక అనుబంధం మూడు కొత్త వ్యవసాయచట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న రైతు నిరసనోద్యమం కారణంగా తెగిపోయింది. అకాలీదళ్ కీ, బీజేపీకీ ఎన్నికల అవగాహన 1967లో బీజేపీ పూర్వావతారమైన భారతీయ జనసంఘ్ రోజుల్లోనే కుదిరింది. చాలా అంశాలపైన విభేదాలు ఉన్నప్పటికీ ఒకరి ఆసరా లేకుండా మరొకరు అధికారంలోకి రాజాలమనే స్పృహ, వాస్తవిక పరిస్థితి రెండు పార్టీల మధ్య ఎన్నికల అవగాహనను అయిదు దశాబ్దాలపాటు అభేద్యంగా కొనసాగించింది. ఈ కూటమిలో ఎప్పుడూ అకాలీలే సీనియర్ భాగస్వాములు. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు రెండు పార్టీలూ విడిపోవడానికి కారణమైన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగారైతులు చేస్తున్న ఆందోళన అసెంబ్లీ ఎన్నికలకంటే ముందు పరిష్కారమయ్యే అవకాశాలు లేవు. 2024 ఎన్నికల సమయానికి కూడా రైతుల నిరసనోద్యమం ఒక పరిష్కారానికి నోచుకోకపోవచ్చు. ఈ కారణంగానే మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత కెప్టెన్ అమరీందర్ సింగ్ తో బీజేపీ పొత్తు కూడా సాధ్యం కాకపోవచ్చు. కాకపోతే, కెప్టెన్, బీజేపీల మధ్య అవగాహన ఉభయతారకంగా ఉంటుంది. బీజేపీతో వ్యవహారం చేయడంలో అకాలీదళ్ కూ, కెప్టెన అమరీందర్ సింగ్ కూ ఇబ్బందులు ఉండటం మూలంగా పంజాబ్ లో ఎన్నికల పరిస్థితి జటిలంగా తయారైంది. మహా అయితే హిందూ ఓట్ల సంఘటితం కారణంగా బీజేపీ కొన్ని సీట్లు సాధించవచ్చు. ఆ దిశగా దాని ప్రయత్నాలు ఎప్పటికీ సాగుతూనే ఉంటాయి.
ఉత్తరాఖండ్ లో సందిగ్థం
ఉత్తరాఖండ్ లో బీజేపీ కొద్దిగా సందిగ్థంలో పడింది. నాటి ముఖ్యమంత్రిని అసెంబ్లీకి గెలిపించుకోలేకపోయిన కారణంగా అతడు రాజీనామా చేయవలసి వచ్చింది. కాంగ్రెస్ నుంచి పెద్ద సవాలు ఏమీ లేదు కానీ అంతర్గత సమస్యలూ, పదవిలో ఉన్నవారిపట్ల సహజంగా ఉండే వ్యతిరేకభావం, తదితర అంశాలను అధిగమించి అధికారం నిలబెట్టుకునేందుకు పార్టీ నాయకత్వం కృషి చేస్తోంది. మాతృరాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లోని రాజకీయ గాలుల ప్రభావం ఈ చిన్న రాష్ట్రంపైన విధిగా ఉంటుంది. ఇటీవల ప్రధాని కేదార్ నాథ్ ను సందర్శించడం, కొన్ని అభివృద్ధి ప్రాజెక్టులతో పాటు మత-సాంస్కృతిక ప్రాధాన్యం కలిగిన కొన్ని ప్రాజెక్టులను ప్రారంభించడం వంటి సానుకూలమైన అంశాలపైన ఉత్తరాఖండ్ లో బీజేపీ ఆధారపడినట్టు కనిపిస్తోంది. అయితే, ప్రధాని సందర్శన ప్రభావం ఉత్తరాఖండ్ పై కంటే ఉత్తరప్రదేశ్ పైనే ఎక్కువ ఉండే అవకాశం ఉంది. పొరుగున ఉన్న పెద్ద రాష్ట్రమైన యూపీలో ఉన్నంతగా ఈ కొండల, గుట్టల రాష్ట్రంలో మతపరమైన చీలక లేదు.
యోగిపైన మోదీ, షాల ప్రశంసల వర్షం
బీజేపీ జాతీక కార్యవర్గ సమావేశంలో యూపీ ముఖ్యమంత్రికి ప్రత్యేక మర్యాద, మన్నన ఇచ్చినట్టు కనిపించింది. ఈ సమావేశానికి భౌతికంగా హాజరైన ముఖ్యమంత్రి ఆయన ఒక్కరే. రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టే అవకాశం యోగికి ఇవ్వడం ద్వారా ఆయన ప్రాధాన్యం ఇనుమడింపజేసినట్టు అయింది. ప్రధాని, కేంద్ర హోం మంత్రి ఇటీవల ఉత్తరప్రదేశ్ సందర్శించిన ప్రతిసారీ ముఖ్యమంత్రిని ఆకాశానికెత్తుతున్నారు, ఆయన పాలన పట్ల ఆమోదం ప్రకటిస్తున్నారు. ఏ యోగీ ప్రభుత్వం సవ్యంగా లేదనే అభిప్రాయంతోనే రాజకీయంగా పార్టీ బలహీనంగా ఉన్నదని భావిస్తున్నారో అదే వ్యక్తిపైన ప్రధాని ప్రశంసల వర్షం కురిపించడం పరిశీలకులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఉదాహరణకు టీకాలు వేయించే పనిలో, కోవిద్ విస్తరణను నిలుపుదల చేయడంలో, శాంతి-భద్రతల నిర్వహణలో యోగీ ప్రభుత్వ వైఫల్యాలు పార్టీని బలహీనపరిచాయనే అభిప్రాయం పార్టీ నాయకత్వంలో ఉండేది. ఈ రంగాలలో యోగీ ప్రభుత్వం పనితీరుపైన బీజేపీ నాయకత్వం ఆధారపడిలేదని స్పష్టంగానే తెలుస్తోంది. రైతులు ఉద్యమాన్ని కొనసాగించడం, లఖింపూర్ ఖేరీలో ప్రదర్శన చేస్తున్న రైతులపై నుంచి కారు పోనిచ్చి చేసిన హత్యలలో కేంద్రమంత్రి కుమారుడి హస్తం ఉన్నదనే విమర్శలు వెల్లువెత్తడం, గంగానదిలో శవాలు తేలిరావడం, చైనా దురాక్రమణ, ఇంధనం ధరల హెచ్చింపు, పెద్దనోట్ల రద్దు ప్రహసనం, గ్రామీణప్రాంతాలలో ఆర్థిక సంక్షోభం, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, ముస్లింలూ, ఓబీసీ ఓటర్లలో కొంతమంది పార్టీకి దూరం కావడం వంటి పలు అంశాలు పార్టీ విజయావకాశాలను తీవ్రంగా దెబ్బతీసే అవకాశం ఉన్నదనే వాస్తవం నాయకత్వానికి తెలియకపోలేదు. కాంగ్రెస్, ప్రియాంకాగాంధీ క్షేత్రంలో తరచుగా కనిపించడం, కూటమి నిర్మాణంలో సమాజ్ వాదీ పార్టీ విజయం సాధించడం వంటి అంశాలను తేలికగా కొట్టిపారేస్తున్నట్టు బయటికి కనిపిస్తున్నప్పటికీ వాటిని అంత తేలికగా తీసుకోజాలమని పార్టీ నాయకత్వానికి తెలుసు. ప్రతిపక్షాలు సమైక్యంగా ఒక వేదికపైన నిలిచి అధికారపార్టీపైన సమష్టి పోరాటం చేసే అవకాశాలు బహుతక్కువగా కనిపించడం ఒక్కటే బీజేపీకి సానుకూలాంశం. ఇదివరకు ప్రస్తావించిన అంశాల కారణంగా వీస్తున్న ఎదురుగాలిని తట్టుకొని నిలబడటానికి బీజేపీ వెనుక హిందువులను సంఘటితం చేయడం మెరుగైన, మరింత ఆధారపడదగిన ప్రత్యామ్నాయం. పంజాబ్ లో అకాలీలకు గల యంత్రాంగం లేకపోవడం వల్ల ప్రత్యామ్నాయ మార్గంగా హిందువుల సంఘటితంకోసం బీజేపీ చాలా తీవ్రంగా కృషి చేస్తోంది.
పొంచి ఉన్న ప్రమాదాలు
కానీ బీజేపీకి రిస్కులు (పొంచి వున్న ప్రమాదాలు) చాలానే ఉన్నాయి. అసాధారణంగా పరిపాలిస్తున్నట్టు యోగీ ప్రభుత్వానికి ప్రధాని, హోంమంత్రి ఇస్తున్న యోగ్యతాపత్రాలు ఈ సవాలు ముందు నిలువజాలవు. యూపీలో మైనారిటీల జనాభా పెరుగుతోందంటూ యోగీ యాగీ చేయడం, రేషన్ మాయం కావడంపై ‘అబ్బాజాన్’ వ్యాఖ్య చేయడం, కైరానాలో తాలిబాన్ మనస్తత్వం అంటూ వ్యాఖ్యానించడం, అయోధ్యలో రామాలయ నిర్మాణం కాలాన్ని కేంద్ర ప్రభుత్వం ఎన్నికలలో కలసి వచ్చేట్టు నిర్ణయించడం, ఇటీవల ప్రధాని కేదార్ నాథ్ ను సందర్శించడం, అదే సందర్భంలో దేశమంతటా ప్రార్థనా స్థలాలలో అట్టహాసంగా బోలెడంత హడావుడి చేయడం వంటి పనులన్నీ హిందూ భావజాలాన్ని ప్రోత్సహించడానికీ, హిందూ సమాజంలో మత, సాంస్కృతిక అభిమానాన్ని, గర్వాన్ని పునరుద్ధరించడానికీ బీజేపీ కంకణం కట్టుకున్నదనే సందేశాన్ని ప్రజలకు పంపించడానికి ఉద్దేశించినవే. అవన్నీ కేవలం ఉత్తరాఖండ్ ఓటర్లను సుముఖులను చేసుకోవడానికి మాత్రమే ఉద్దేశించినవి కావు. అది పంజాబ్ లో ఉన్న హిందువులకూ వర్తిస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ లోని హిందువులకు ఉద్దేశించినవి. రోమ్ లో జి-20 సమావేశంలో, పర్యావరణ శిఖరాగ్ర చర్చ సందర్భంలో, గ్లాస్గోలో కాప్26 సమావేశంలో ప్రపంచ నాయకులను ప్రధాని పదేపదే ఆలింగనం చేసుకోవడం వెనుక ఆంతర్యం ఏమిటి? ప్రధాని నాయకత్వంలో అంతర్జాతీయ వేదికపైన ఇతర అగ్రదేశాల సరసన సమానహోదాలో, సమఉజ్జీగా భారత్ కూర్చోగలుగుతున్నదనీ, భారతీయ నాయకుడు ప్రపంచ దేశాల నాయకులతో సమానఫక్కీలో వ్యవహరిస్తున్నారనే సందేశం ఓటర్లకు పంపడం. హుందాగా వ్యవహరించాలని కోరుకునేవారికి అది ఎబ్బెట్టుగా కనిపించవచ్చు. కానీ ఓటర్లలో తనను ఇష్టపడేవారినీ, తనకు అవసరమైన ఓటర్లనూ ఈ పద్దతి బాగా ఆకట్టుకుంటుందని ప్రధాని భావిస్తున్నారని అనుకోవాలి.
ఇటీవల ముగిసిన ఉపఎన్నికల ఫలితాలు బీజేపీ నాయకత్వాన్ని అస్థిరపరచినట్టు కనిపిస్తున్నాయి. పెట్రోలు, డీజిల్ పైన ఎక్సైజ్ డ్యూటీని తగ్గించడం ఇందుకు స్పష్టమైన నిదర్శనం. ఇంధన ధరల నియంత్రణలో తనకు ఎటువంటి పాత్రా లేదని ఉపఎన్నికల ఫలితాలు వచ్చే వరకూ కేంద్ర ప్రభుత్వం పదేపదే చెబుతూ వచ్చింది. ఫలితాలు వెల్లడైన వెంటనే ధరలు తగ్గించింది.
రెండు రకాల వాదాలు
యూపీ బీజేపీ ఎన్నికల ప్రచారంలో రెండు రకాల వ్యక్తీకరణలు కనిపిస్తున్నాయి. ఒకటి ఆధునికాంతర చారిత్రక పునర్నిర్మాణవాదం (మెటా నేరేటివ్). రెండోది దానికి అనుగుణ్యమైన ఉపవాదం. హిందూత్వ రాజకీయ ప్రాజెక్టు కొనసాగడం 2024లో బీజేపీ విజయంపైనే ఆధారపడి ఉంటుంది. సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ గెలుపొందాలంటే ఇప్పుడు యూపీలో ఆ పార్టీ విజయం సాధించడం అత్యవసరం. కేంద్ర హోంమంత్రి ప్రకటనలలో, వ్యాఖ్యాలలో ఈ దృష్టికోణం దాపరికం లేకుండా బాహాటంగా కనిపిస్తున్నది. కేదార్ నాథ్ నుంచి ప్రధాని ఇచ్చిన సందేశం మరింత ఎగువ స్థాయికి చెందినది. కేదార్ నాథ్ నుంచి వెలువడిన దృశ్యాలు చాలా ప్రబలమైనవి. ప్రధాని నుదుటిపైన దట్టంగా పూసుకున్న గంధం కొట్టవచ్చినట్టు కనిపించింది. భారీ ఆదిశంకరుడి విగ్రహం ముందు ప్రార్థిస్తున్న భంగిమలో కళ్ళు మూసుకొని ప్రధాని కూర్చున్న దృశ్యం దేశం అంతటా ప్రసారమైంది. కేదార్ నాథ్ లో ఆయన ఉపన్యాసం నిండా హిందూ పునరుద్ధరణ సందేశం దండిగా ఉంది. ప్రధాని ఏమన్నారంటే:
‘‘సాంస్కృతిక వారసత్వ కేంద్రాలకూ, మతవిశ్వాసాలకూ సంబంధించిన స్థలాలను ప్రజలు ఇప్పుడు సముచితమైన రీతిలో సగర్వంగా, సగౌరవంగా చూస్తున్నారు.’’
శతాబ్దాల తర్వాత అయోధ్యకు వెలుగు మళ్ళీ ఇప్పుడు వచ్చింది. రాముడికి సంబంధించిన అన్ని కేంద్రాలను మతపరమైన పర్యాటక వలయంగా అభివృద్ధి చేయాలన్నది తన ఆకాంక్ష అని కూడా ప్రకటించారు. ఈ ప్రకటనలూ, వ్యాఖ్యాలూ హిందూ హృదయ్ సమ్రాట్ గా తనకున్న ఖ్యాతిని (ఇమేజ్ ని) మరింత పెంచుతాయి. దీనికి నౌషేరాలో జవాన్లతో కలిసి దీపావళి పండుగ జరుపుకోవడాన్ని జోడిస్తే హిందూ ఓటర్ల హృదయాలపై ఇది ఎంతటి ప్రభావం వేస్తుందో అర్థం అవుతుంది. ఇంధన ధరల పెరుగుదల, నిరుద్యోగం, కోవిద్ వ్యవహారంలో జరిగిన అస్తవ్యస్తం, శాంతి-భధ్రతలు, రైతులు నిరసనోద్యమం వగైరా దైనందిన సమస్యలను పూర్వపక్షం చేయడానికి వేసిన బ్రహ్మాండమైన ఎత్తుగడ ఇది. శషబిషలకు అతీతంగా, పటుత్వంగా వ్యవహరించే యోగి రాష్ట్రంలో హిందూత్వ అజెండాను సమర్థంగా, పిసరంతైనా రాజీపడకుండా అమలు చేస్తారన్న నమ్మకం కలిగించడానికి ఉద్దేశించింది ఉపవాదం. విధాన సభ ఎన్నికలలో బీజేపీ తరఫున ముస్లింలకు ఒక్క టిక్కెట్టు కూడా ఇవ్వకపోవడం ఈ దిశలో మొదటి అడుగు.
ఆధిక్యభావజాలాన్ని(మెజారిటేరియన్ అజెండా) అనుసరించడం పట్ల రెండు దశాబ్దాల కిందట కూడా బీజేపీ నాయకులలో అపరాథభావన కనిపించేది. ఏదో సంకోచిస్తున్నట్టు కనిపించేవారు. తమకు రహస్య అజెండా అంటూ ఏమీ లేదని ఉన్నత నాయకత్వ స్థానాలలో ఉన్నవారు పదేపదే స్పష్టం చేసే ప్రయత్నం చేసేవారు. తన కార్యక్రమం గురించి ఇప్పుడు బీజేపీకి ఆత్మవిశ్వాసం కొండంత పెరిగింది. ఇప్పుడు ఏ మాత్రం అపరాధ భావన కానీ సంకోచం కానీ లేకుండా హిందూత్వ వాదాన్ని ఒంటినిండా పులుముకొని దర్జాగా కవాతు చేయగలదు. యూపీలోనూ, దేశవ్యాప్తంగానూ ఉన్న పరిస్థితి ఏమంటే హిందూ వ్యతిరేకి అనే ముద్ర వేయించుకోకుండా ఏ పార్టీ కూడా ప్రధాని, బీజేపీ అనుసరిస్తున్న హిందూత్వ విధానాలను విమర్శించలేదు. రాజకీయ పార్టీలు మాత్రమే ఎందుకు? వ్యాపార సంస్థలు సైతం లొంగిపోతున్నాయి. హిందూ వ్యతిరేకి అనే ముద్ర పడుతుందన్న భయంతో ప్రటనలను (అడ్వర్టయిజ్ మెంట్స్) కూడా వాపసు తీసుకుంటున్నారు. చిన్నాచితకా గ్రూపుల (ఫ్రింజ్ గ్రూప్స్) నుంచి వచ్చే బెదిరింపులు కావవి. బీజేపీకి చెందిన ఎన్నికైన ప్రజాప్రతినిధులు తర్జని చూపిస్తూ చేస్తున్న హెచ్చరికలు. హిందూత్వ అంటే హిందూ మత విశ్వాసం, సనాతన ధర్మం అని మన జనాభాలో అత్యధికులను బీజేపీ నాయకులూ, దాని భావజాల పరివారం జయప్రదంగా నమ్మించగలిగారు. హిందూత్వ ప్రాజెక్టును జయప్రదం చేయడానికి అత్యున్నతమైన అద్వైతి ఆదిశంకరుడినే సాధనంగా ఉపయోగిస్తున్నారు.
ఈ క్షణం ముందు పీటీలో బీజేపీ
ప్రస్తుతం నడుస్తున్నఆటలో ఆర్థిక, పరిపాలనా పరమైన ఇబ్బందులను హిందూ అస్థిత్వం, ధార్మికదర్పం సహాయంతో అధిగమించాలని బీజేపీ ప్రయత్నిస్తున్నది. పరుగుపందెంలో ఈ క్షణం బీజేపీ ముందున్నది. భారత్ అనే ఉదారవాద భావనకూ, బహుళత్వానికీ, సహనానికీ ఏర్పడిన ముప్పు గురించీ, పరిపాలన, ఆర్థికపరమైన సమస్యల గురించీ, ప్రజల కష్టాల గురించీ ప్రముఖంగా మాట్లాడుతూ ప్రజలను ఈ అంశాలపైన ప్రభావితం చేయడం ప్రతిపక్షం ముందున్న సవాలు. మోదీ-షా ఆధ్వర్యంలో జగన్నాథరథంలాగా తయారైన బీజేపీని సమర్థంగా ఎదుర్కొనే విధంగా ప్రతిపక్షాలు ఐక్యత సాధించి సమైక్యంగా పోరాడటం కూడా అంతే ముఖ్యం. ఇది (ప్రతిపక్ష ఐక్యత) జరిగే అవకాశాలు ఈ రోజు చాలా స్వల్పంగా కనిపిస్తున్నాయి. అన్నీ సమానంగా ఉంటే వచ్చే కొన్ని మాసాలలో యూపీలో జరిగే పోటీ ఫలితం భవిష్యత్తుకు పునాది అవుతుంది. ఒక సమాజంగా, రాజకీయ వ్యవస్థగా ఇండియా ఏ విధంగా ఉండబోతోందో ఈ ఎన్నికల ఫలితం నిర్ణయిస్తుంది.
(MwM Episode 37 – మిడ్ వీక్ మేటర్స్ – 37వ ఎపిసోడ్ కి స్వేచ్ఛానువాదం)