ఇల్లు కూడా మనిషి లాంటిదే
దానికీ బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం ఉంటాయి
ఇంటి నిండా పిల్లలు కేరింతలు కొడుతున్నప్పుడు
అరవై యేళ్ళనాటి ఇల్లయినా సరే అది తన
వయసును మరిచి నవనవలాడుతూ కనిపిస్తుంది
బోసి నవ్వులు చిందిస్తూ, గజ్జెల గలగలలు వినిపిస్తుంది
ఆ ఇంట్లో యువతీయువకుల సరసాలు సాగితే
ఇంటి పెరట్లో మల్లెలు గుబాళిస్తాయి
ఆ ఇంటి చెక్కిళ్ళ మీద గులాబీలు పూస్తాయి
ఆ ఇంటి చుట్టూ దీపాలు వెలిగించుకుని, యవ్వనంతో వెలిగిపోతూ
అర్ధరాత్రి దాటినా ఆ ఇల్లు నిద్ర పోదు-
బారెడు పొద్దెక్కినా నిద్ర లేవదు-
ఇంట్లో ఉండేవాళ్ళకు వయస్సు మళ్ళితే
అది కొత్తగా కట్టిన ఇల్లయినా సరే
కీళ్ళనొప్పులు, కాళ్ళ నొప్పులు, గుండెజబ్బులతో బాధపడుతుంది!
దగ్గుల్లో మూలుగుల్లో మునిగిపోయి
ఒక్కోసారి అది, నిశ్శబ్ద గంభీరంగా ఉండిపోతుంది.
అనుబంధాలు చచ్చిన ఇంట్లో ఆనందాలెట్లా ఉంటాయి?
అనురాగాలు లేనిచోట జీవనరాగాలెట్లా ఉంటాయి?
నిస్సహాయత గూడుకట్టుకుని,
ఆ ఇంటి ముందు నిశ్వబ్దంగా వేలాడుతూ ఉంటుంది.
చీకటితో పోట్లాడే సత్తువ లేని ఓ గుడ్డి దీపం
వారి గాజుకళ్ళలాగా ఆ ఇంటిముందు
ఏదో ఆశతో దీనంగా మినుకుమంటూ ఉంటుంది.
పెందరాళే పడుకుని ఎటూ తోచక ఆ ఇల్లు
వేకువజామునే లేచి కూచుంటుంది.
ఒంటరితనంలో కొట్టుమిట్టాడుతూ
ఒ మాటకోసం, ఓ నవ్వు కోసం అంగలారుస్తూ ఉంటుంది!!
మరి మనుషులెవరూ లేనప్పుడు
ఆ శూన్య గృహం మాత్రం ఏం చేస్తుంది?
అది ఊపిరి పీల్చేదెట్లా? అలికిడే లేనప్పుడు
దాని గుండె కొట్టుకునేదెట్లా?
దాని నాడి నీరసించి, నీరసించి ఆగిపోతుంది కదా?
ఎముకలు వంగిపోయినట్టు దూలాలు, మొగురాలు కృంగిపోతాయి కదా?
పైకప్పు వంగిపోయి వృద్ధాప్యంలో వంగిపోయిన
వెన్నుపూసను తలపిస్తుంది కదా?
ఆ ఇల్లు ఎంతకాలమని తనని తాను
కర్రపోటుతో నిలబెట్టుకుంటుంది?
దాని కండరాల గోడలు శుష్కించి, సడలిపోయి
చర్మం ముడతలు పడ్డట్టు పెచ్చులు ఊడిపోయి
ముఖ ద్వారపు నోరు వంకరపోయి
కిటికీల కళ్ళు బూజుల ఊసులతో మూసుకుపోయి
తెరుచుకోలేక అదొక శిధిల దేహమైపోదూ?
అంతమౌతున్న శకాన్ని ఒక జీవన సారాన్ని
కరిగిపోతున్న ఒకప్పటి కేంద్రబిందువును గుర్తు చేయదూ?
దాని ఆరోగ్యం బాగుపడాలంటే
దాని ఆత్మలో మళ్ళీ వెలుగులు నిండాలి!
ఎవరైనా వెళ్ళి నివసించాలి…ఓ చిన్న దీపంతో ధైర్యం వెలిగించాలి
ఆ వెలుగుతో అది తనను తాను చక్కబరుచుకుంటుంది
ఎప్పటికప్పుడు పునరుద్ధరణ జరగకపోతే
దేహమైనా, గృహమైనా, దేశమైనా జరిగేది ఒక్కటే-
నీ దేహాన్ని పునరుద్ధరించుకుంటే
నీ గృహాన్ని పునరుద్ధరించుకున్నట్టే-
నీ గృహాన్ని పునరుద్ధరించుకుంటే
నీ దేశాన్ని పునరుద్ధరించుకున్నట్టే-
దేహం, గృహం, దేశం అన్నీ మనం నివసించే ఇళ్ళేకదా?
రండి! మనం మన ఇంటిని బతికించుకుందాం.
(కవి కేంద్ర సాహిత్య అకాడెమీ విజేత, జీవశాస్త్రజ్ఞుడు)