తెనాలి సాహితీసంస్థ ‘ప్రజ్వలిత’ గౌరవాధ్యక్షుడు, సాహిత్యలోకానికి ఆప్తుడు నాగళ్ళ దుర్గాప్రసాద్ బుధవారం రాత్రి కన్నుమూశారు. ఆయన స్వగ్రామమైన అనంతవరంలో గురువారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో అంత్యక్రియలు జరిగాయి. తెనాలిలో సాహిత్య కార్యక్రమాలకు రెండు దశాబ్దాలుగా నాయకత్వం వహించి, రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన కవులనూ, రచయితలనూ, రంగస్థల కళాకారులనూ తెనాలికి ఆహ్వానించి, వారి చేత పద్యపఠనం చేయించీ, సాహిత్య పరిణామాలపై ఉపన్యాసాలు చేయించి, నాటకాలు వేయించీ సన్మానించిన దుర్గాప్రసాద్ సాహిత్యరంగంలో అందరికీ ఆత్మీయుడు. తెలుగువారి సంస్కృతిక వారసత్వాన్ని యువజనులకు అందించడమే పరమావిధిగా సాహిత్యరంగంలో విశేష కృషి చేసిన వ్యక్తి.
దుర్గాప్రసాద్ మూత్రపిండం వ్యాధితో బాధపడుతూ కోవిద్ సోకిన కారణంగా మరణించారు. భార్య రాజేశ్వరి మూత్రపిండం దానం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. కరోనా మహమ్మారి నుంచి వైద్యులు కాపాడలేకపోయారు. కుమార్తె కావ్య, కుమారుడు జయరాం తల్లిదండ్రుల దగ్గరే ఉన్నారు. తాను స్వయంగా అనారోగ్యంతో బాధపడుతూ కోవిద్ బారిన పడిన ఒక జంటకు వైద్య సహాయం అందించి రక్షించే ప్రయత్నంలో తాను కరోనాకు రక్కసికి చిక్కి ప్రాణాలను పోగొట్టుకున్న పరోపకారి దుర్గా ప్రసాద్. 56 సంవత్సరాల దుర్గాప్రసాద్ తెనాలికి సిసలైన సాహిత్య ప్రతినిధి. తెనాలిలో రంగస్థల కళాకారులకోసం తన కుటుంబ సభ్యుల కష్టార్జితాన్ని ఖర్చు చేసి విశాలమైన రెండంతస్తుల భవనం నిర్మించి ఇచ్చిన వదాన్యుడు. దుర్గాప్రసాద్ లేని తెనాలి వెలతెలపోతోంది. అందరితో కలుపుగోలుగా వ్యవహరించే ఒక కార్యదక్షుడి మరణం తెనాలి పట్టణంలో ఎవరూ పూడ్చలేని లోటును మిగుల్చుతుంది.