నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టిన రైతుల్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి చర్చలకు ఆహ్వానించారు. రాత్రి 7 గంటలకు రైతు సంఘాల నేతలతో అమిత్ షా భేటీ కానున్నారు. భారత్ బంద్ కొనసాగుతున్న నేపథ్యంలో అమిత్ షా చర్చలకు ఆహ్వానించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 13 రోజులుగా రైతులు చేస్తున్న ఆందోళనకు దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు ఏకతాటిపైకొచ్చాయి. తమ విభేదాలను మరిచి అన్నదాతకు అండగా నిలిచాయి. రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉన్న కొత్త చట్టాలను రద్దు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.
Also Read:ఆ చట్టాలు పైకి లాభసాటిగానే కనిపిస్తాయి
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు తలపెట్టిన దేశవ్యాప్త బంద్ ప్రశాంతంగా ముగిసింది. ఇటీవల ప్రభుత్వానికి, రైతు సంఘాల నేతలకు మధ్య జరిగిన ఐదో విడత చర్చల్లో ప్రతిష్టంభన నెలకొనడంతో రైతు సంఘాలు దేశ వ్యాప్త బంద్ కు పిలుపునిచ్చాయి. బంద్ కు ప్రతిపక్ష పార్టీలు ట్రేడ్ యూనియన్లతో పాటు పలు ఉద్యోగసంఘాలు రైతులకు బాసటగా నిలిచాయి. సామాన్యులు ఇబ్బందులు పడకుండా నాలుగు గంటలపాటు మాత్రమే బంద్ పాటించాయి. బంద్ కు మద్దతుగా రహదారులపై రైతులు బైఠాయించి తమ నిరసన తెలిపారు. ధర్నాలు, రాస్తారోకోలతో తమ నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం కొత్త వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని నినాదాలు చేశారు. బంద్ నేపథ్యంలో పలు రాష్ట్రాలలో జనజీవనం నిలిచిపోయింది. రైతుల ఆందోళనకు మద్దతుగా సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే ఒక రోజు నిరాహారదీక్షకు దిగారు
Also Read:రైతు వ్యతిరేక బిల్లే కాదు, ప్రజా వ్యతిరేక బిల్లు అని ఎందుకు అనకూడదు?