సరిగ్గా యాభై సంవత్సరాల కిందట జరిగిన ఘటనలను తలచుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది.
1969 నాటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి, 1972-73 నాటి ‘జై ఆంధ్ర’ ఉద్యమానికి మధ్య (తెలంగాణ ప్రజా సమితి వ్యూహం ఫలితంగా) ఏర్పడిన రాజకీయ సంధి కాలం అది.
పి.వి. నరసింహారావు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. కొత్త శాసన సభ తొలి సమావేశం 1972 మార్చి 21 న జరిగింది..
ఆంధ్రప్రదేశ్ విడిపోకూడదని పట్టుబట్టిన నాటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ నిర్దేశించిన విధానానికి అనుగుణంగా తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధికి 15 ఏళ్ళ ప్రణాలికను గవర్నర్ ఖందూభాయ్ దేశాయ్ కొత్త శాసనసభ సహా ఉభయ చట్ట సభలను ఉద్దేశించి చేసిన తన ప్రసంగంలో ప్రకటించారు.
సభ ఘనంగా హర్షధ్వానాలు చేసింది.
అది నిక్కచ్చిగా అమలు జరిగి ఉంటే …?
కాని, 40 రోజుల తరువాత – భూసంస్కరణల బిల్లుకి ముందస్తు చర్యగా – భూముల క్రయ విక్రయాలపై ఆంక్షలు విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన అర్ధరాత్రి ఆర్డినెన్స్ చరిత్ర గతిని మలుపు తిప్పేసింది!!!