Thursday, November 7, 2024

చారిత్రాత్మక పోరాటాల అవలోకనం

**     లేడీ డాక్టర్స్      **

(పుస్తక పరిచయం)

“చదవకుండా వంటపనిలో పడి చదువుని నిర్లక్ష్యం చేసినందుకు 13 ఏళ్ళ భార్యను చితకబాదే భర్తా, ఆడపిల్లకు చదువు నేర్పిస్తే లేచిపోతుందని నమ్మే కన్నతండ్రీ, డాక్టరుని అస్పృశ్యురాలిగా భావించి పనిమనిషి పక్కన కూర్చోబెట్టి భోజనం పెట్టిన రోగి బంధువులు, కాలేజీ చదువులో ప్రథమస్థానం పొందినాసరే ఆడపిల్లకు బంగారు పతకం ఇస్తే ఆమెను హతమారుస్తామనే మగపిల్లలు, ఇల్లు చక్కబెట్టు కోకుండా వైద్యవృత్తి చేపట్టినందుకు పతితగా ముద్రవేసిన పత్రికాధిపతులూ, బరి తెగించిన ఆడది అనే జాతీయవాదులూ, పదేళ్ళు కూడా నిండని భార్య ముందు పరాయి స్త్రీ తో కామక్రీడలు జరిపే కామపిశాచ భర్తలూ ఇందులో మనకు కనిపిస్తారు.” (పేజి – 6)

Also read: కులనిర్మూలన – తులనాత్మక పరిశీలన

2021 లో ఇంగ్లీష్ లో వచ్చిన కవితారావు గారి లేడీ డాక్టర్స్ పుస్తకానికి తెలుగులో వచ్చిన పరిచయానికి ముందుమాటలోనివి పై మాటలు. డా. పి. ఎస్. ప్రకాశరావు తెలుగులో పరిచయం చేసిన ఈ పుస్తకాన్ని డా. చెలికాని రామారావు మెమోరియల్ కమిటీ, రామచం ద్రాపురం, వారు చక్కగా ప్రచురించారు. అంతేకాదు, తెలుగువారికి అమూల్యమైన కానుకగా అందించడం ద్వారా తెలుగులో లేడీ డాక్టర్స్ గురించిన మొదటి పరిచయ గ్రంథంగా ఇదో చరిత్ర అని చెప్పవచ్చు. స్త్రీల పట్ల అన్ని రంగాలలో అమలవుతున్న వివక్ష తాలూకా స్పృహని గుర్తించడానికి ఇదో సందర్భం !

ఎంత సంకుచితంగా ఉండగలరో!

ప్రపంచంలోని పేరెన్నికగన్న విశ్వవిద్యా లయాలు మొదలుకొని పేద్ద జాతీయ నాయకులుగా పేరొందిన పురుషుల వరకూ స్త్రీల విద్య, హక్కుల దగ్గరకి వచ్చేసరికి ఎంత సంకుచితంగా ఉండగలరో కళ్ళకు కట్టినట్లు చూపించే ప్రయత్నం ఈ పుస్తకం చేసింది. దశాబ్దాల క్రితం మూఢనమ్మకాలు, మత చాందసత్వం, కుల వివక్షత, పురుషాధిక్యత రాజ్యమేలుతున్న కాలంలో ఇందులోని మహిళలు చేసిన పోరాటాలు, నిజంగా అవి నూతన సమాజం కోసం వేసిన బలమైన చైతన్యవంతమైన ముందడుగులు. మానవ చరిత్రనీ, ముఖ్యంగా భారతీయ జ్ఞాన పునర్వికాశ ఉద్యమంలోనూ, వైజ్ఞానిక వికాసోద్యమంలోనూ స్త్రీల అస్తిత్వాన్ని లోతుగా పాదుకొల్పిన సంఘర్షణ వెలుగులు!

Also read: మరిచిపోలేని మహా స్పందన: మహాపండిత్ రాహుల్జీ సమాలోచన

“పందుల్ని పెంచితే మాంసం వస్తుంది. కుక్కల్ని పెంచితే ఇంటికి కాపలా కాస్తాయి. పిల్లుల్ని పెంచితే ఎలుకల్ని పడతాయి. స్త్రీల వల్ల ఒరిగేదేముంది” వంటి చైనా సామెతలు ప్రపంచంలోని స్త్రీల పరిస్థితుల్ని చెప్పకనే చెబుతాయనే పరిచయ కర్త (పేజి నెం – 10).

ఉత్తమ పరిశోధన

పురాణాల నుండి ఆధునిక భారతదేశ చరిత్ర వరకూ స్త్రీల పై జరిగిన అవమానాల్నీ, అఘాయిత్యాల్నీ ఓపికగా పరిశీలించి రాసుకున్న ఫుట్ నోట్సూ, మహిళా సంఘాలు ప్రచురించిన కరపత్రాల నుండి కందుకూరి, గురజాడ, మహీధర,  బిపిన్ చంద్ర, బండారు అచ్చమాంబ, రాహుల్జీ వంటి మహామహుల ఆధార గ్రంథాల జాబితా చూస్తే అవడానికి ఇదో పరిచయం కావచ్చును కాని పరిచయకర్త ఈ పుస్తకాన్ని గురించి చేసిన లోతైన కృషి ఉత్తమ పరిశోధనకి ఏ మాత్రం తగ్గేది కాదనే విషయాన్ని తెలుపుతుంది !

అవడానికి ఇది లేడీ డాక్టర్స్ కథైనా నిజానికి వైజ్ఞానికోద్యమానికి దేశంలో బాటలు వేసిన మహిళల వ్యధ. అందుకు అడుగడుగునా వారు ఎదుర్కొన్న అంతులేని అవరోధాల బెడద కూడా మనకి కనిపిస్తుంది. విదేశీయానం చేయడం నుండి విశ్వవిద్యాలయాల్లో స్థానం కోసం ఈ స్త్రీలు చేసిన పోరాటం దాకా, వైద్య చికిత్సాలయాల స్థాపన గురించి ఎదుర్కొన్న సమస్యల నుంచీ దేవదాసీ వ్యవస్థను రూపు మాపడం కోసం పరోక్షంగా కారణమైన ఉద్యమం వరకూ ఎన్నో రకాలుగా ఈ దేశపు మహిళలు చేసిన సంఘర్షణ ఈనాటి తరాలకొక కనువిప్పు కావాలి. “స్త్రీలకు చదువెందుకు? చదువుకుని ఊళ్ళేలాలా, ఉద్యోగాలు చేయాలా ? అంది పురుష ప్రపంచం. కానీ ఈ మహిళలు ఊళ్ళేం ఖర్మ శాసనసభకు వెళ్ళి రాష్ట్రాన్నే ఏలారు. ఉన్నతమైన ఉద్యోగాలూ చేసారు.” (పేజి – 113)అన్న పరిచయకర్త మాటలు అక్షర సత్యాలని పుస్తకం పూర్తి కాగానే అనిపించక మానదు!

Also read: కట్టిన దుస్తులు పసుపు ! పట్టిన జెండా ఎరుపు !! రాహుల్ సాంకృత్యాయన్ !!!

సులభమైన భాషలో అనువాదం

ముఖ్యంగా, పుస్తకం మొత్తంలో ఎక్కడా ఒక్కటంటే ఒక్క సంక్లిష్ట వాక్యం కూడా లేకుండా చాలా తక్కువ అచ్చు తప్పులతో వీలైనంత సున్నితంగా సాగిపోయే సులభమైన భాషలో తెలుగు చేసిన పరిచయకర్త కి ప్రత్యేక అభినందనలు. పోతే నా దృష్టికి వచ్చిన ఒకట్రెండు అంశాల్ని తడిమి ఆపుతాను. మొదటిది అనేక అంశాల్ని ప్రస్తావించిన ‘ప్రవేశిక’

 చివరాఖరికి మహాత్మా జోతిరావు ఫూలే మహిళలకి నిర్వహించిన పరీక్షా విధానం చూడడానికని వచ్చిన మూడువేల మంది సందర్శకుల సంగతి కూడా ప్రస్తావించింది కానీ దేశంలో స్త్రీల విద్యకి మార్గాన్ని సుగమం చేసిన సావిత్రి బాయి ఫూలే, ఫాతిమా షేక్ లని ప్రస్తావించకపోవడం పొరపాటనేది (పేజి నెం 14) నా అభిప్రాయం. ఇక రెండోది తొలితరం లేడీ డాక్టర్లని కూడా సంక్షిప్తంగా పరిచయం చేసి మూల గ్రంథంలో ఉన్నటువంటి దేశంలోనే మొట్టమొదటి లేడీ సర్జన్ అయిన మేరీ లూకోస్ ను తెలుగు పుస్తకం నుండి మినహాయించడం సరికాదు సరికదా అందుకు వివరణ ఇస్తూ ముందుమాటలో చెప్పిన “ఆరవ డాక్టరైన మేరీ లూకోస్ తండ్రి వైద్యుడు కావడం వల్ల మొదటి ఐదుగురు మహిళా వైద్యులకూ ఎదురైన కుల, మత, సంఘ కట్టుబాట్లు వివక్షలూ స్వదేశంలో ఆమెకు ఎదురవలేదు. అందుకే ఆమె చరిత్రను ఈ పరిచయంలో మినహాయించడం జరిగింది.” అనే వాక్యాలు లింగ వివక్ష దగ్గరకి వచ్చేట ప్పటికి ఎంత మాత్రమూ సమంజసం కాబోవనే నా అభిప్రాయం!

Also read: దరిశి చెంచయ్య , నేనూ నా దేశం!

‘కాపీలెఫ్ట్’ విధానం

ఆంగ్లం లోనే మొట్టమొదటి ప్రయత్నం అయిన ఈ పుస్తకం అన్ని భారతీయ భాషలలో రావాల్సిన అవసరం ఉంది. తెలుగులో ఈ ప్రయత్నం చేసిన ప్రచురణ కర్తలకూ, పరిచయ కర్తకూ మరోసారి అభినందనలు. జ్ఞానం సమిష్టి తత్వానికి ప్రతీకనే విషయాన్ని అంగీకరిస్తున్న ప్రపంచవ్యాప్త ఉద్యమకారులు, ప్రజాతంత్ర వాదులూ Creative Commons అనే ఒక భాగస్వామ్య విధానంలో భాగంగా పుస్తకాల పై పెట్టుబడిదారీ కాపీరైట్ పద్ధతులకి భిన్నంగా ‘కాపీలెఫ్ట్’ విధానాన్ని అవలంబించడం ఒక ఆరోగ్యకరమైన సాంప్రదాయం. తెలుగులో నా ప్రచురణలు అన్నీ దాదాపు ఆ కోవకి చెందినవే.

ఏ లాభాపేక్షా లేకుండా  చేస్తున్న ఈ ప్రయ త్నాలకి కాపీరైట్ హక్కులు తెలిసీ పెట్టినవి కావు. కాబట్టి భవిష్యత్తు ప్రయత్నాలలో ఈ విషయం దృష్టిలో పెట్టుకుంటారని ఆశిస్తూ, ఈ పుస్తకం విద్యార్థులు, యువతలోకి విస్తృతంగా వెళ్ళాలని కోరుకుంటూ, ఆసక్తిపరులకు సాఫ్ట్ కాపీ పంపుతున్నాను, తప్పక చదవగలరు. సెలవు.

Also read: తెలుగు సాహిత్యంలో సాంకృత్యాయన్!

గౌరవ్

Gourav
Gourav
గౌరవ్, సామాజిక కార్యకర్త, రామచంద్రాపురం, డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles