వోలేటి దివాకర్
ఒక చరిత్రకారుడి నడక ఆగిపోయింది. గోదావరి తీరంలో చారిత్రక, పురావస్తు అంశాలపై సాధికారిక అవగాహన కలిగిన యాతగిరి శ్రీరామ నరసింహరావు రాజమహేద్రవరంలోని తాను స్థాపించిన ఎ.కె.సి.కళాశాల ప్రాంగణంలోనే కన్నుమూశారు. ఆయన వయసు 86 సంవత్సరాలు. ఆయన గత కొద్ది రోజులుగా వృద్దాప్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయన ఎకైక కుమారుడు సత్యాధీశ్ 1985లో మృతి చెందగా ఆయన ఆయన భార్య పద్మావతి 2012లో మృతి చెందారు. ఇద్దరు కుమార్తెలు కాగా వారిలో ఒకరు మృతి చెందారు.
బహుముఖ సేవలు
పెద్దాపురంలో1936 అక్టోబర్ 18న జన్మించిన నరసింహరావు విద్యాభ్యాసమంతా రాజమహేద్రవరంలో జరిగింది. రాజమండ్రిలోనే డిగ్రీ చదివి, ఇక్కడ రామదాసు సహకార శిక్షణ సంస్థలో ఆచార్యులుగా పనిచేశారు. స్వాతంత్ర పోరాటాన్ని స్వయంగా చూసిన ఆయన దేశభక్తి ప్రబోధితమైన ఎన్నో కార్యక్రమాలను అనుసరించారు. ఆ ప్రేరణతో సామాజిక సేవా కార్యక్రమాలకు స్వచ్చందంగా చేతులు కలిపారు. 1953లో గోదావరి వరదల సమయంలో బాధితులకు విలువైన సేవలు అందించారు. 1955-61 మధ్య కాలంలో జవహర్ లాల్ నెహ్రూ స్థాపించిన భారత్ సేవక్ సమాజ్ కు రాజమండ్రి పట్టణ కన్వీనర్ గా పనిచేశారు. ఆ కార్యక్రమాల నుంచి స్ఫూర్తి పొందిన నరసింహరావు 1962లో ఆంధ్ర కేసరి
యువజన సమితిని స్థాపించి, యువతరాన్ని సామాజిక సేవలకు పురికొల్పారు. ఇదే క్రమంలో సమితి ఆధారంగా 1972లో ఆంధ్ర కేసరి సెంటినరీ జూనియర్ కళాశాలను, ఆ తర్వాత డిగ్రీ కళాశాలను స్థాపించారు. ఈ కళాశాలల ద్వారా తక్కువ ఫీజుతో పేదలకు ఉన్నత విద్యను చేరువ చేశారు. గౌతమి ప్రాంతీయ గ్రంథాలయం, రాళ్ళబండి మ్యూజియం, దామెర్ల ఆర్ట్ గ్యాలరీ వంటి సంస్థలు తెలుగు విశ్వవిద్యాలయంలో విలీనం కాకుండా తన వంతు ఉద్యమాన్ని నడిపించి పురావస్తు కళల పరిరక్షణకు కృషి చేశారు. రాజమహేద్రవరంలో ఫ్రీడమ్ పార్కు పేరిట మహిళా స్వాతంత్ర్య సమరయోధుల విగ్రహాలు ఏర్పాటుకు కృషి చేశారు. నవయుగ వైతాళికులు కందుకూరి వీరేశలింగం స్థాపించిన టౌన్ హాలు అభివృద్ధికి కృషి చేశారు. అభిలేఖ కేంద్రం రాజమహేద్రవరం నుంచి తరలి పోకుండా అడ్డుకున్నారు. ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయ సాధన ఉద్యమంలో ఆయన చురుకైన పాత్ర పోషించారు.
పీవీకి సన్నిహితుడు
వై ఎస్ శతాబ్దాల చరిత్ర కలిగిన రాజమండ్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి వంశపారంపర్య ధర్మకర్త గా, అర్చకునిగా పనిచేశారు. దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తో వై ఎస్ కు సన్నిహిత సంబంధాలు ఉండేవి. పివి ఏ కె సీ కళాశాల ను కూడా సందర్శించారు. ఆంధ్ర కేసరి డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఉంచిన నరసింహరావు పార్థివ దేహానికి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, పలువురు ప్రముఖులు శ్రద్ధాంజలి ఘటించారు.