కాబూల్ నుంచి వాణిజ్య విమానయానాలు ప్రారంభమైన వెంటనే అఫ్ఘానిస్తాన్ లో మిగిలిపోయిన హిందువులనూ, సిక్కులనూ స్వదేశానికి తీసుకురావడానికి ప్రాధాన్యం ఇస్తామని భారత ప్రభుత్వం ప్రకటించింది. అఫ్ఘానిస్తాన్ ను వదిలి ఇండియాకు రాదలచుకున్నవారికి రవాణా సదుపాయం కల్పిస్తామని భారత ప్రభుత్వం చెప్పింది. ‘‘భారత పౌరుల, భారత ప్రయోజనాల పరిరక్షణకోసం భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని భారత విదేశాంగ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ చెప్పారు.
కాబూల్ లో రోజురోజుకూ దిగజారుతున్న శాంతిభద్రత పరిస్థితిని ప్రస్తావించి, అఫ్ఘానిస్తాన్ లో హిందువుల, సిక్కుల ప్రతినిధులతో సంపర్కంలో ఉన్నామనీ, అఫ్ఘానిస్తాన్ వదిలి ఇండియాకు రాదలచుకున్నవారిని ఇండియాకి రవాణా చేస్తామనీ అన్నారు.
ప్రస్తుతానికి కాబూల్ విమానాశ్రయం నుంచి కమర్షియల్ విమానాల రాకపోకలను నిలిపివేశారు. ‘‘ఈ కారణంగా భారతీయులను ఇండియాకు తీసుకొని వచ్చే ప్రయత్నాలకు అంతరాయం కలిగింది. కమర్షియల్ ఫ్లయిట్స్ మొదలు కాగానే భారతీయుల రవాణాను ప్రారంభిస్తాం’’ అని బాగ్చీ అన్నారు. కాబూల్ విమానాశ్రయంలో గందరగోళ దృశ్యాల మధ్య విమానాశ్రయాన్ని మూసివేశారు. ఒక్కసారే చాలామంది విమానాశ్రయంలోకి చొచ్చుకు రావడంతో వారిని నియంత్రించడానికి అమెరికా సైనికులు గాలిలో కాల్పులు జరిపారు. అంతుబట్టని కారణాల వల్ల అయిదుగురు మృతి చెందారు. ఆ తర్వాత విమానాశ్రయాన్ని భద్రతాదళాలకు అప్పగించారు.
అమెరికా, నాటో సైనికుల ఉపసంహరణ జరిగిన తర్వాత భారతీయులనూ, ఇండియాకు రావాలని కోరుకున్న అఫ్ఘానిస్తాన్ పౌరులనూ ఇండియాకు చేరవేసే కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం ప్రారంభించింది. ఇండియాకు తిరిగి రావలనుకుంటున్న భారతదేశ పౌరులు ఇంకా కొందరు అఫ్ఘానిస్తాన్ లో మిగిలిపోయారనీ, వారితో సంపర్కంలో ఉన్నామనీ బాగ్చీ చెప్పారు. భారత రాయబార కార్యాలయ సిబ్బంది, వారి భద్రతకోసం అక్కడ ఉన్న భారత సైనికులు కలిపి మొత్తం రెండు వందలమంది దాకా ఉంటారని అంచనా. వారికోసం కాబూల్ విమానాశ్రయంలో ఒక విమానం సిద్ధంగా ఉంది. వారిని రాయబార కార్యాలయం నుంచి విమానాశ్రయానికి చేర్చడమే సమస్యగా మారింది. పరిస్థితులు అదుపులోనికి వచ్చిన తర్వాత వారిని ఇండియాకు తీసుకొని వచ్చే ప్రయత్నం జరుగుతుంది.