‘‘మెజారిటీవాదంలో తప్పేముంది?’’ అంటూ ప్రధాని అడిగినట్టు కనిపిస్తున్నది. ‘‘జిస్కీ జితినీ సంఖ్యా భారీ, ఉత్నీ ఉస్కీ హిస్సేదారీ’’ అనే కాన్సీరాం నినాదాన్ని ఉటంకిస్తూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యను వక్రీకరిస్తూ ప్రధాని మెజారిటీ హిందువులు కాంగ్రెస్ పైన తిరగబడతారని వ్యాఖ్యానించారు.
వక్రీకరణ, వాదన పక్కన పెడితే, ప్రతిసవాలు కింద పాతిపెట్టకుండా సమాధానం చెప్పుకోవలసిన ప్రశ్న ఇది. కులజనగణనకు ‘ఇండియా’ కూటమి మద్దతు ఇవ్వడానికీ, హిందూ ఆధిక్యవాదాన్ని బీజేపీ వినిపించడాన్ని వ్యతిరేకించడానికీ సంబంధించిన ప్రధానమైన రాజకీయ వివాదంలో కీలకమైన అంశం ఇది. ఈ ప్రశ్నను జాగ్రత్తగా పరిశీలించాలి. సూటిగా సమాధానం చెప్పుకోవాలి.
Also read: బీహార్ కులజనగణన బృహత్తరమైన ముందడుగు
రెండు సమానమైన వాదనలు ఇక్కడ ఉన్నాయి. మొదటిది రెండు రకాల ఐడెంటిటీ (గుర్తింపు) రాజకీయం. ఒకదానికి కులం ప్రాతిపదిక, మరోదానికి మతం ప్రాతిపదిక.
కనుక ఒక రకం ఐడెంటీటీ రాజకీయం రెండో రకం ఐడెంటిటీ రాజకీయం కంటే ఎందుకు మెరుగైనది? మతతత్వాన్ని మనం వ్యతిరేకిస్తే కులతత్వాన్ని మాత్రం ఎట్లా సమర్థిస్తాం? రెండోది రెండు రకాల మెజారిటీ సిద్ధాంతాల మధ్య పోటీ. ఒకటి బహుజనులు (ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు కలిసి) సంఖ్యాపరంగా అత్యధికులు ఉన్నారనే వాదన. రెండోది హిందువులు మెజారిటీ కదా అనే వాదన. హిందూ మెజారిటీవాదం ప్రజాస్వామ్యానికి ముప్పు అయితే బహుజన మెజారిటీవాదం సైతం ఆమోదయోగ్యమైన ఆహారం ఎట్లా అవుతుంది?
మెజారిటీ రాజకీయానికి సంబంధించిన మొదటి ప్రశ్న చాలాకాలంగా ఉదారవాదులనూ, ప్రగతివాదులనూ వేదనకు గురి చేసింది. సమస్యలనూ, ప్రయోజనాలనూ ప్రస్తావించి ప్రజలను సమీకరించడంలో తప్పులేదు. కానీ తమ ప్రమేయం లేకుండా ఎక్కడ పుట్టారనే విషయం ప్రతిపదికగా జనాలను గుర్తించడం ప్రమాదకరం. అది ప్రాచీన పోకడలను ఆహ్వానించడం అవుతుంది. అవి అహేతుకం అవడం అనివార్యం. ఒక సారి ఈ భూతం సీసాలోనుంచి బయటకి వెడితే దాన్ని తిరిగి సీసాలో బంధించడం అసాధ్యం. ఇది చదివితే మండల్ రాజకీయం మందిర్ రాజకీయమంత చెడ్డది. ఒక వాదనను సమర్థించడం, రెండో వాదనను వ్యతిరేకించడం రాజకీయ అవకాశవాదం అంటూ వారి వాదన సాగుతుంది.
Also read: మహిళా రిజర్వేషన్లు మాటవరుసకేనా? పదిహేనేళ్ళ వరకూ అమలులోకి రావా?
ఈ వాదనతో సమస్య ఏమంటే ఐడెంటిటీ రాజకీయం అంటే ఏదో ఒక రకమైన అపభ్రంశ రాజకీయం కాదు. ఇప్పుడున్న గుర్తింపులను ఉపయోగించడం లేదా కొత్త గుర్తింపులను అమలులోకి తేవడమే రాజకీయ పిండితార్థం. కులాలనూ, మతాలనూ, జాతులనూ ఉపయోగించి ప్రజలను సమీకరించడానికి మాత్రమే ఇది వర్తించదు. మహిళలనూ, ప్రాంతాలనూ, జాతులనూ ప్రాతిపదికగా చూపించి జనాలను సమీకరించడానికి కూడా అది వర్తిస్తుంది. గుర్తింపులు చెప్పకుండా ఒక సమూహంతో కలిసిపోయే విధంగా ప్రజలను ప్రభావితం చేయడం. ఇందులో సరిహద్దును గీయడం, అతిక్రమించడం జరుగుతుంది. దళితులనో, హిందువులనో సమీకరించడం కూడా రైతులనో, విద్యార్థులనో సమీకరించడం వంటిదే.
కనుక సమస్య వాస్తవానికి ఐడెంటిటీ (గుర్తింపు) రాజకీయాలది కాదు. కానీ ఏ తరహా సమీకరణ ఎందుకోసం జరుగుతోందన్నది ప్రధానం. సరిహద్దు గీతలు గీసి, ఆ గీతలను పెద్దగా చేసి, వాటిని కాపాడటానికి విద్వేషానికి పాల్బడి హింసకూ, విచ్ఛిత్తికీ దారితీసే రాజకీయం గురించి మనం జాగ్రత్తగా ఉండాలి. ఇతర ఏ గుర్తింపు రాజకీయం కన్నా భారత దేశంలో మతంపేరుతో సాగుతున్న గుర్తింపు రాజకీయం చాలా ప్రమాదకరమైనది. బాగా ముదిరిన మత సమాజంలో వివిధ మతస్థుల మధ్య విభజన రేఖలు చాలా స్పష్టంగా, అనుల్లంఘనీయంగా ఉంటాయి.
మతపరమైన హింసకి ఉన్న చరిత్రను చూస్తే, దేశ విభజన సమయంలో జరిగిన మతకలహాలనూ, అనంతరం దేశంలో అనేక చోట్ల జరిగిన మతకలహాలనూ గమనిస్తే మతం ప్రాతిపదికగా ఎటువంటి సమీకరణ జరిగినా అది ప్రమాదకరమైనది, హింసాత్మకమైనది అవుతుంది. హిందూ మతానికి చెందినవారిని (అలాగే ముస్లింలనూ, సిక్కులనూ, ఇతర మతస్థులనూ) సమీకరించడానికి విద్వేషాన్ని సాధనంగా వినియోగించడం కద్దు. ఈ కారణాల వల్ల ప్రజాస్వామ్యం కులాన్ని వ్యవస్థీకృతం చేయగలిగింది. మత విభేదాలను లొంగదీసుకోవడంలో ప్రజాస్వామ్య వ్యవస్థ విఫలం చెందింది. దీని వల్ల మతపరమైన రాజకీయం ఈ రోజున జాతీయ సమైక్యతకు అత్యంత ప్రమాదకరమైన అంశం.
Also read: మతలబు 2019 ఎన్నికలలో ఖాయంగా జరిగింది, దాస్ పత్రం మాత్రం చేపను పట్టుకుంటుందని అనుకోవడం లేదు
అదే సమయంలో కులం ప్రాతిపదికన జనసమీకరణ రాజకీయానికి ఇది ఒక హెచ్చరికగా పని చేస్తుంది. కొన్ని బహుజన కులాల నాయకులు ఇతర రకాల వివక్షలను గుర్తించడానికి నిరాకరిస్తున్నారు. ఎస్సీ, ఓబీసీలలోని అంతరాలనూ, లింగ వివక్షనూ, వర్గ విభేదాలనూ పట్టించుకోవడానికి నిరాకరిస్తున్నారు. తమ కులంవారినే గుర్తించడం, ఇతర కులాలను గుర్తించకపోవడం, వారిని పరాయివారిగా పరిగణించడం, ఫలానా కులాలపట్ల ద్వేషం పెంచుకోవడం వంటి ప్రమాదకరమైన ధోరణుల నుంచి కూడా జాగ్రత్తగా ఉండాలి. బ్రాహ్మణిజాన్ని విమర్శించేవారు బ్రాహ్మణులపైన దాడికి దిగుతారు. దేశంలోని కొన్ని ప్రాంతాలలో, బీహార్ లోని కొన్ని జిల్లాలలో కులసంఘర్షణలు జరుగుతాయి. అటువంటి ప్రాంతాలలో కులంపేరుతో జనసమీకరణ చాలా ప్రమాదరకరం.
మెజారిటేరియనిజం (సంఖ్యాధిక్యవాదం) విషయానికి వస్తే మెజారిటీ పాలనకూ, మెజారిటీ హింసకు (టిరనీ) మధ్య వ్యత్యాసాన్నిగమనించాలి. రాజకీయ మెజారిటీ పాలనను ఆధునిక ప్రజాస్వామ్య రాజకీయాలు ఆమోదిస్తున్నాయి. కానీ దీనితో పాటు కొన్ని షరతులు ఉంటాయి. మొదటి షరతు ఏమంటే అది రాజకీయ మెజారిటీ పాలన అంటే పుట్టుకతో నిర్ణయించే మెజారిటీ సామాజికవర్గం కాదు. రాజకీయ మెజారిటీలో భాగం కాకుండా ఎవరినీ శాశ్వతంగా బహిష్కరించరాదు. కుల రాజకీయాల వల్ల అనేక కలుపుగోళ్ళూ, సమీకరణాలు సంభవిస్తాయి(బహుజన లేదా అహిందర్ లేదా ఏజెజీఏఆర్ లేదా దళిత్-బ్రాహ్మిణ్-ముస్లిం సంకీర్ణం వగైరా) రాజకీయ మెజారిటీ సృష్టించేందుకు. మతపరమైన సమీకరణ, ముఖ్యంగా హిందూ-ముస్లిం విభజన వల్ల అటువంటి అవకాశాలను వదలదు. శాశ్వత పరాయీకరణ జరుగుతుంది.
రెండో షరతు ఏమంటే ప్రజాస్వామ్యంలో మెజారిటీ పాలన అంటే నిరంకుశపాలన కాదు. కొన్ని సరిహద్దులనూ, పరిమితులనూ అది గౌరవించాలి. మైనారిటీలకు కొన్నిప్రాథమిక హక్కులనూ, కొన్ని హామీలనూ విధిగా అమలు పరచాలి. లేకపోతే, మెజారిటీ పాలనను మైనారిటీలు ఆమోదించకపోవచ్చు. అందుకే ఇతర దేశాల రాజ్యాంగాలవలె మన రాజ్యాంగం కూడా మతపరమైన మైనారిటీలకూ, భాషాపరమైన మైనారిటీలకూ, కులపరమైన మైనారిటీలకూ కొన్ని అనుల్లంఘనీయమైన హక్కులను ప్రసాదించింది. హిందూ మెజారిటేరియన్ (ఆధిక్యవాదం)తో వచ్చిన పేచీ ఏమంటే అది మతపరమైన మైనారిటీల హక్కులను కాలరాస్తుంది. మతపరమైన స్వేచ్ఛ, చట్టంముందు అందరూ సమానమనే విలువ, సమానమైన పౌరసత్వం అందరికీ ఉండాలి. లేకపోతే అది మెజారిటీ తీవ్రవాదం అవుతుంది. కులప్రాతిపదికన రాజకీయాలు మరీ అధ్వాన్న స్థితిలో కూడా అటువంటి ప్రమాదాన్ని కల్పించవు.
Also read: మణిపూర్ సంక్షోభాన్ని హిందూత్వ-క్రైస్తవ ఘర్షణగా చూడొద్దు, అది దేశీప్రాచ్యదృష్టి అవుతుంది
చివరి షరతు ఏమంటే మెజారిటీ అన్నీ తానే అయినట్టు వ్యవహరించరాదు. ప్రాథమికంగా సమానావకాశాలు అనే సూత్రాన్ని అతిక్రమించరాదు. తమ జనాభాకు తగినంతగా అధికారంలో తమకు వాటా ఉండాలంటోన్న బహుజన రాజకీయం ఒక బండ సూత్రం. అయినప్పటికీ అది ప్రజాస్వామ్య ప్రాథమిక సిద్ధాంతాన్ని అతిక్రమించదు. యోగి ఆదిత్యనాథ్ (యూపీ ముఖ్యమంత్రి) 80:20 అని మాట్లాడటంలో అర్థం రాష్ట్ర వనరులలో 80శాతం జనాభాలో 80 శాతం ఉన్న హిందువులకు రావాలని కాదు. మిగతా ఇరవై శాతానికి ఏమీ ఇచ్చేది లేదని.
ఇవీ హిందువుల, బహుజనుల మెజారిటీవాదనలలోని వ్యత్యాసాలు. భాష ఒకటే అయినా ఈ రెండు వర్గాలు రెండు సందర్భాలలో నుంచి వస్తాయి. బహుజనులకు జనాభాలో వారి వాటాకు తగినట్టు అధికారంలోనూ, వనరులలోనూ, అవకాశాలలోనూ వాటా లేదని, అందుకని బహుజనులను సమీకరించి వారిని ఒక మెజారిటీగా చూపించి వారికి రావలసిన వాటా ఇప్పించాలన్నది బహుజన రాజకీయానికి మూలం. అది దృక్పథం కానీ అభిప్రాయం కానీ అంచనా కానీ కాదు. పచ్చినిజం. మన జనాభాలో 70 నుంచి 75 శాతం వరకూ ఎస్సీ,ఎస్టీ, ఓబీసీలు ఉంటారు. కానీ వారు సగం వాటా కలిగి ఉన్న రంగం – రాజకీయాలు, పరిపాలనావ్యవస్థ, వ్యాపారం- ఒక్కటి కూడా లేదు. హిందూ అగ్రవర్ణాలు పదవులలో 50 నుంచి 80 శాతం వరకూ ఆక్రమించారు. జనాభాలో వారి వాటా ఇరవైశాతం కంటే తక్కువే. బహుజనులు అన్నీ తమ అధీనంలోనే ఉండాలని కోరుకోరు. అదే కనక జరిగితే వారు మెజారిటేరియన్ వాదానికి దిగినట్టు అవుతుంది. ఈ సమయంలో వారు అవకాశాలు లేని, వనరులలో సరైన వాటా లేని మెజారిటీగా ఉన్నారు. వారు తమకు ఎంత రావాలో అంతే అడుగుతున్నారు కానీ ఎక్కువ కాదు.
హిందువులు ఏ రంగంలోనైనా తమ ప్రాతినిథ్యం తక్కువని (80శాతం కంటే తక్కువని) చెప్పలేరు. దక్షిణాఫ్రికాలో నల్లవారు మెజారిటీగా తమ వాటా అడుగుతున్నారంటే తమ హక్కును అడుగుతున్నారు కానీ మెజారిటీవాదనలో భాగంగా కాదు. మెజారిటీవాదన ప్రజాస్వామ్యానికి బద్ధశత్రువు. బలహీనవర్గాల, తక్కువ ప్రాతినిథ్యం కలిగిన మెజారిటీ ప్రజలు తమకు రావలసిన న్యాయమైన హక్కును అడగడాన్ని తప్పుపట్టడం అసమంజసమైన వాదనకు దిగడమే. శక్తిమంతమైన మెజారిటీకి ఉన్న అధికారంలో బలహీనవర్గాలైన బహుజనులకు తగిన వాటా ఇవ్వాలని కోరడం న్యాయసమ్మతం. ధర్మసమ్మతం.
Also read: స్వామి వివేకానంద సంఘపరివార్ హితైషి కాదు, ఆయనను కాజేయడానికి పరివార్ కు ఉదారవాదులు తోడ్పడ్డారు