- 400 మీటర్ల ప్రపంచ జూనియర్ విజేత హిమ
- 18 రోజుల వ్యవధిలో 5 స్వర్ణాల విజేత హిమ దాస్
అసోంలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన రన్నర్ హిమ దాస్ ను ప్రభుత్వం డీఎస్పీ ఉద్యోగం ఇచ్చి అండగా నిలిచింది. మహిళల ప్రపంచ జూనియర్ 400 మీటర్ల పరుగులో విజేతగా నిలవడం ద్వారా అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకొన్న హిమదాస్ ఆ తర్వాత కేవలం 18 రోజుల వ్యవధిలోనే ఐదు బంగారు పతకాలు సాధించడం ద్వారా అసోం రాష్ట్రానికి మాత్రమే కాదు భారత అథ్లెటిక్స్ కే ఎనలేని గౌరవం సంపాదించి పెట్టింది.
Also Read: అంకిత రైనా సరికొత్త చరిత్ర
తమ రాష్ట్ర్రానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడంతో పాటు యువతలో స్ఫూర్తినింపిన 21 సంవత్సరాల హిమదాస్ కు తమ పోలీసు శాఖలో డీఎస్పీ ఉద్యోగం ఇస్తున్నట్లు అసోం ముఖ్యమంత్రి సర్బానంద సొనోవాల్ అధికారికంగా ప్రకటించారు. తనను డీఎస్పీగా నియమిస్తూ అసోం ప్రభుత్వం ఆదేశాలు జారీచేయడం పట్ల హిమదాస్ సంతోషం వ్యక్తం చేసింది. తమ రాష్ట్ర్ర ముఖ్యమంత్రి, క్రీడామంత్రులకు కృతజ్ఞతలు తెలిపింది. టోక్యో ఒలింపిక్స్ కు అర్హత సాధించడమే లక్ష్యంగా ప్రస్తుతం ఎన్‌ఐఎస్ – పాటియాలాలో హిమదాస్ సాధన చేస్తోంది. 2018లో 400 మీటర్ల పరుగులో ప్రపంచ జూనియర్ చాంపియన్‌గా నిలిచిన హిమ 2018 ఆసియా క్రీడల్లో రెండు స్వర్ణాలు, ఒక రజతం సాధించింది.