నవ్వడం యోగం, నవ్వించడం భోగం, నవ్వకపోవడం రోగం అనే సరికొత్త నిర్వచనాన్ని జనాలకి అందించిన మహా దర్శకుడు జంధ్యాల…. తెలుగు వాకిళ్ళ ముందు హాస్య తోరణాలు కట్టి అందరినీ కడుపుబ్బా నవ్వించిన తెరవెనుక నాయకుడాయన… సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా తనదైన కామెడీమార్క్ ఉండేలా జాగ్రత్త తీసుకున్న హాస్య చక్రవర్తి.
తన చివరి శ్వాస వరకు మరపురాని మధురమైన హాస్యపు చిత్రాలెన్నింటినో తెరకెక్కించి ప్రేక్షకులను నవ్వులలో ముంచెత్తిన ఘనత ఆయనది. జంధ్యాల పూర్తి పేరు జంధ్యాల వీర వెంకట దుర్గా శివ సుబ్రహ్మణ్య శాస్త్రి. 1951 జనవరి 14న పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జన్మించారు. చిన్నప్పటి నుంచి ఆయనకు నాటకాలంటే ఆసక్తి. అలా నాటకాలు రాస్తూనే కళాతపస్వి కె.విశ్వనాథ్ దృష్టిలో పడ్డారు. రచయితగా జంధ్యాల తొలి చిత్రం సిరిసిరి మువ్వ. మొదటి చిత్రంతోనే తనదైన పంచ్ డైలాగులతో, కామెడీ టైమింగుతో పరిశ్రమలో పలువురిని ఆకర్షించారు.
శంకరాభరణం సంభాషణలు అద్భుతం
1979లో కె.విశ్వనాథ్ దర్శకత్వంలో ఏడిద నాగేశ్వరరావు నిర్మించిన శంకరాభరణం చిత్రానికి జంధ్యాల రాసిన సంభాషణలు అద్భుతంగా అమరాయి. మాటల రచయితగా జంధ్యాల విశ్వరూపం ప్రదర్శించిన చిత్రం శంకరాభరణం. మాస్ మసాలా చిత్రాల వెల్లువలో కొట్టుకుపోతున్న తెలుగు సినిమాకు ఈ చిత్రం మేలుకొలుపు పాడింది. ప్రతి తెలుగువాడి గుండెలోతుల్లోకి ఈ చిత్రం వెళ్ళింది. అందుకు జంధ్యాల రాసిన పదునైన మాటలు బాగా సహకరించాయి. సర్వమనోరంజక చిత్రంగా శంకరాభరణం సినిమాకు జాతీయ స్థాయిలో ‘స్వర్ణకమలం’ బహుమతి లభించింది. 1981లో నిర్మాత భీమవరపు బుచ్చిరెడ్డి విశ్వనాథ్ దర్శకత్వంలో నిర్మించిన సప్తపది చిత్రానికి జంధ్యాల పదునైన సంభాషణలు రాశారు. తరవాత రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన వేటగాడు, డ్రైవర్ రాముడు, రౌడీరాముడు-కొంటెకృష్ణుడు, అమరదీపం, భలేకృష్ణుడు, ఆఖరిపోరాటం, జగదేకవీరుడు-అతిలోక సుందరి చిత్రాలకు; విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన శుభోదయం, సీతామాలక్ష్మి, సాగరసంగమం, ఆపద్బాంధవుడు, స్వాతికిరణం చిత్రాలకు; సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన సొమ్మొకడిది-సోకొకడిది, ఆదిత్య369, కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన పసివాడి ప్రాణం, విజేత వంటి విజయవంతమైన చిత్రాలకు జంధ్యాల మాటలు సమకూర్చారు. సినీ రచయితగా 1977-86 మధ్య తొమ్మిది సంవత్సరాల కాలంలో జంధ్యాల అలా క్లాస్ ని మాస్ ని అలరించిన సుమారు రెండు వందల సినిమాలకు పైగా సంభాషణల రచయితగా పనిచేశారు. వాటిలో అధికశాతం చిత్రాలు శతదినోత్సవాలు జరుపుకున్నవే.
ముద్దమందారంతో దర్శకత్వం ఆరంభం
ఇలా ఉండగా, నిర్మాత కానూరి రంజిత్ కుమార్ 1981లో నటనాలయ సంస్థ పేరుతో నిర్మించ తలపెట్టిన ముద్దమందారం సినిమాలో జంధ్యాలకు దర్శకత్వం చేసే అవకాశాన్ని కలిపించారు. ఆ టీనేజి లవ్ స్టోరీకి జంధ్యాల తొలిసారి రచన, దర్శకత్వ బాధ్యలు నిర్వహించారు. రమేష్ నాయుడు సంగీతం అద్భుతంగా అమరిన ఈ చిత్రం 11 సెప్టెంబరున విడుదలై 25 కేంద్రాల్లో విజయవంతంగా ఆడి శతదినోత్సవం చేసుకుంది. అలా తొలి ప్రయత్నంలోనే జంధ్యాల దర్శకునిగా జయకేతనం ఎగురవేశారు. రెండవ ప్రయత్నంగా జంధ్యాల దర్శకత్వం వహించిన చిత్రం 1982లో విడుదలైన మల్లెపందిరి. చల్లా వెంకట్రామయ్య నిర్మించిన ఈ చిత్రంలో విజ్జిబాబుని హీరోగా పరిచయం చేశారు. తూర్పువెళ్ళే రైలు ఫేమ్ జ్యోతి హీరోయిన్ గా నటించగా ‘షేక్ మోజెస్’ గా గాయకుడు బాలు, మరో పాత్రలో గేయ రచయిత వేటూరి అతిథి పాత్రలు పోషించారు.
నరేష్ హీరోగా తొలిచిత్రం
మల్లెపందిరి వచ్చిన నెల రోజుల గ్యాప్ తో విడుదలైన జంధ్యాల చిత్రం నాలుగు స్తంబాలాట సూపర్ హిట్ గా నిలిచింది. నవతా కృష్ణంరాజు నిర్మించిన ఈ చిత్రంలో రెండు జంటలుగా నరేష్-పూర్ణిమ, ప్రదీప్-తులసి నటించారు. నరేష్ కి హీరోగా ఇదే తొలి చిత్రం. ఇందులో వీరభద్రరావు, వేలు చేత “సుత్తి” అనే పదప్రయోగం చేయించి వారిని “సుత్తిజంట”గా పాపులర్ చేసిన ఘనత జంధ్యాలది. సినిమాలో వీరి కామెడీ ట్రాక్ ని రికార్డుగా విడుదల చేశారు. వరసగా మూడు ప్రేమకథా చిత్రాలను విజయవంతం చేసిన జంధ్యాల, నాలుగో ప్రయత్నంలో తన ట్రాక్ మార్చి ‘మతంకన్నా మానవత్వం మిన్న’ అనే సందేశమిచ్చే నెలవంక (1983) చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఈ చిత్రం ద్వారా రాజేష్, కిరణ్ అనే ఇద్దరు నటులను జంధ్యాల వెండితెరకు పరిచయం చేశారు. అయితే ఈ చిత్రం విజయవంతం కాలేదు. రెండుజెళ్ళ సీత (1983) పేరుతో శ్రీభ్రమరాంబికా ఫిలిమ్స్ వారికి జంధ్యాల ఒక చిత్రం చేశారు. ఇందులో నరేష్, ప్రదీప్, రాజేష్, శుభాకర్ ప్రధాన పాత్రలు పోషించారు. సినిమా బాగా ఆడి శతదినోత్సవం జరుపుకుంది. 1983లో జంధ్యాల అక్కినేనితో అమరజీవి అనే ఒకే ఒక చిత్రానికి దర్శకత్వం వహించారు. తరవాత చంద్రమోహన్-రాధిక జంటగా ‘మూడుముళ్ళు’ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈనాడు పత్రికాధినేత రామోజీరావు జంధ్యాల దర్శకత్వంలో శ్రీవారికి ప్రేమలేఖ చిత్రాన్ని నిర్మించారు. వారి సంస్థ వెలువరించే ‘చతుర’లో వచ్చిన పొత్తూరి విజయలక్ష్మి నవల ‘ప్రేమలేఖ’ ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో నరేష్-పూర్ణిమ జంటగా నటించారు. రమేష్ నాయుడు అద్భుత సంగీతం అందించారు. “తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు”, “లిపిలేని కంటిబాస” పాటలు అద్భుతాలే. ఈ చిత్రం ద్వారా విద్యాసాగర్, మెల్కోటే వెండితెరకు పరిచయమయ్యారు. సీరియస్నెస్ లేని ఈ ఫుల్ లెంగ్త్ కామెడీ చిత్రం బ్రహ్మాండంగా ఆడింది. 1984 లో జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ఆనందభైరవి చిత్రాన్ని మరో శంకరాభరణం గా భావించవచ్చు. జంధ్యాలలోని దర్శకత్వ ప్రతిభను ద్విగుణీకృతం చేసిన ఈ చిత్రం అద్భుత విజయాన్ని నమోదు చేసి శతదినోత్సవం జరుపుకుంది. ఇలా రావూగోపాల్రావు, పుత్తడిబొమ్మ, శ్రీవారి శోభనం, మొగుడూ-పెళ్ళాలూ. బామ్మగారి మనవరాలు, రెండురెళ్ళు ఆరు, సీతారామకల్యాణం (1988), చంటబ్బాయ్, తదితర విజయవంతమైన చిత్రాలెన్నింటినో నిర్మించారు.
చంటబ్బాయ్ గా మెగాస్టార్
జంధ్యాల ఒక్కో చిత్రం ఓక్కో హాస్యపు ఆణిముత్యం. మెగాస్టార్ తో సైతం చంటబ్బాయి గా చిత్ర విచిత్ర వేషాలు వేయించిన ఘనపాటి జంధ్యాల. అంతేకాదు, ఎంతో మంది కామెడీ నటీనటులను తెలుగుతెరకు అందించిన ఘనత కూడా ఆయనదే.. ముఖ్యంగా సుత్తి జంటైన వీరభద్రరావు, వేలుని నాలుగు స్తంభాలాట చిత్రంతో వెండితెరకు పరిచయం చేసారు. ఆ తర్వాత ఈ సుత్తిజంట ఎన్నో చిత్రాల్లో తమ కామెడీ టైమింగ్ తో ఓ వెలుగు వెలిగేలా చేసిన ఘనత జంధ్యాలకే దక్కుతుంది. తెలుగు వారందరికీ పరిచయమైన బ్రహ్మానందాన్ని అహనా పెళ్లంట చిత్రంతో స్టార్ కమెడియన్ చేసిన గొప్ప దర్శకుడు జంధ్యాల. తన మార్క్ డైలాగులతో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో ఆయనది అందెవేసిన చేయి. దరిద్ర నారాయణుడికి దిక్కు మాలిన స్వరూపం అని వర్ణించినా…. పాండురంగారావును జేమ్స్ పాండ్ చేసినా…హై హై నాయకాలో బూతు బూతు అని వినీ వినిపించని బూతులు తిట్టించినా…శ్రీవారికి ప్రేమలేఖ చిత్రంలో శ్రీలక్ష్మీతో సినిమా స్టోరీ చెప్పించినా… ‘జయమ్ము నిశ్చయమ్మురా’ బాబూ చిట్టి అని శ్రీ లక్ష్మీతో వెరైటీ డైలాగ్స్ పలికించినా అది ఒక్క జంధ్యాలకే సొంతం.
హాస్యం ఉప్పు వంటిది
“హాస్యం ఉప్పువంటిది. అది ఎక్కువైనా తక్కువైనా ప్రమాదమే. సినిమాకూడా అలాంటిదే. ఆ పదార్ధాన్ని తగుపాళ్ళలో మేళవిస్తే సినిమా విజయవంతమౌతుంది” అని నమ్మిన వ్యక్తి జంధ్యాల. సినిమాలకే కాదు స్నేహానికి కూడా ప్రాణం ఇచ్చే జంధ్యాల 19 జూన్ 2001 సంవత్సరంలో గుండె పోటుతో మరణించారు. అటు కమర్షియల్ చిత్రాలతో పాటు ఇటు కళాత్మకమైన సినిమాలను కూడా తనదైన శైలిలో నిర్మించి కొత్త తరహా ట్రెండును సృష్టించిన జంధ్యాల లేని లోటు ఎప్పటికీ తీర్చలేనిది.. ఆయన తీసిన ప్రతి చిత్రం నేటి యువతరం దర్శకులకు దిశానిర్దేశం అనడంలో ఎంతమాత్రం సందేహం లేదు.
– దాసరి దుర్గా ప్రసాద్
(జూన్ 19న జంధ్యాల వర్ధంతి సందర్భంగా ప్రత్యేకం)