హైకోర్టు ఉత్తర్వులపై ఎన్నికల సంఘం లంచ్ మోషన్ దాఖలు చేయనుంది. ఎలక్షన్ కమిషన్ నిర్ణయాలలో కోర్టులు జోక్యం చేసుకోరాదని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పునఃపరిశీలించాలని ఎన్నికల సంఘం అభిప్రాయపడింది. రివ్యూ పిటిషన్ దాఖలు విచారణకు స్వీకరించాలని ఎలక్షన్ కమిషన్ హైకోర్టును కోరనుంది.
కోర్టు నిర్ణయంపై బండి సంజయ్ హర్షం:
ఓటర్ల విశ్వాసాన్నినిలబెట్టిన హైకోర్టుకు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతున్నానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. నగర ఓటర్లు ఇచ్చిన తీర్పుతో రాష్ట్ర ప్రభుత్వం కొంచమైనా సిగ్గు తెచ్చుకోవాలని అన్నారు. ఎన్నిసార్లు కోర్టు మొట్టికాయలు వేసినా దున్నపోతుమీద వాన పడ్డట్టుగానే పరిస్థితి తయారైందని ఎద్దేవా చేశారు. ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వం కుమ్మక్కై ప్రజాస్వామ్యాన్న అపహాస్యం చేసేందుకు ప్రయత్నించాయని సంజయ్ అన్నారు. ఎన్నికల సంఘం నిర్ణయాన్ని హైకోర్టు అడ్డుకోవడం ద్వారా న్యాయ్యవస్థ పై ప్రజలకున్న నమ్మకాన్ని విశ్వాసాన్ని పెంచిదని అన్నారు.
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన ఎన్నికల సంఘం, ప్రభుత్వం :
కోర్టు తీర్పును గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ సాధించిన నైతిక విజయంగా బండి సంజయ్ అభివర్ణించారు. ఎన్నికల్లో అడ్డదారుల్లో గెలవాలని చూసిన టిఆర్ఎస్ కి కోర్టు నిర్ణయం చెంపపెట్టు అని అన్నారు. కోర్టు నిర్ణయంతో ఎన్నికల సంఘం పరువు పోయిందన్న సంజయ్ ఎలక్షన్ కమిషనర్ వెంటనే రాజీనామా చెయ్యాలి, లేదా ప్రభుత్వమే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా తీర్పును గౌరవించలేని వ్యక్తి ముఖ్యమంత్రిగా కొనసాగే నైతిక అర్హత కేసీఆర్ కు లేదన్నారు. టిఆర్ఎస్ ,ఈసీ ఎంత అనైతికంగా వ్యవహరించారో హైకోర్టు సాక్షిగా బట్టబయలు అయింది.
చివరి గంట పోలింగ్ పై అనుమానాలు:
పోలింగ్ రోజు గంట గంటకూ పోలింగ్ శాతం ప్రకటించిన ఎన్నికల సంఘం సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్య జరిగిన పోలింగ్ శాతాన్ని మాత్రం అర్థరాత్రి వరకు ఎందుకు ప్రకటించలేదని సంజయ్ ప్రశ్నించారు. గంటలో పోలింగ్ శాతం 12% నుండి 18% శాతం ఎలా పెరిగిందో హైకోర్టు విచారణ జరపించాలని అన్నారు. కొన్ని పోలింగ్ కేంద్రాలలో చివరి గంటలో 90% శాతానికి పోలింగ్ పెరిగిందని, ఇందులో ఏదో అవకతవకలు జరిగాయనే ప్రజలు అనుమానిస్తున్నారని అన్నారు. దీనికి కెసిఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పెన్నుతో టిక్కులు పెట్టిన బ్యాలెట్ పేపర్లు లెక్కపెట్టమని అర్థరారత్రి సర్క్యులర్ విడుదల చెయ్యడం చూస్తుంటే కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుందని బండి సంజయ్ విమర్శించారు.