• ప్రకాశం బ్యారేజిపై బైఠాయించిన మహిళా రైతులు
• అడ్డుకున్న పోలీసులు
• సచివాలయంలోకి ప్రవేశించేందుకు మహిళా రైతుల యత్నం
అమరావతి ప్రాంత మహిళా రైతులు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాజధాని కోసం మరో సారి ఆందోళన చేపట్టారు. విజయవాడ దుర్గమ్మను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో అమరావతి ప్రాంత మహిళలు ప్రకాశం బ్యారేజీ పైకి తరలివచ్చారు. బ్యారేజీపై మహిళలు బైఠాయించి నిరసన తెలియజేశారు. అప్రమత్తమైన పోలీసులు వారిని బలవంతంగా వ్యాన్ ఎక్కించి మంగళగిరి, తాడేపల్లి పోలీస్ స్టేషన్ లకు తరలించారు. మహిళల ప్రతిఘటనతో కొద్దిసేపు అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ విషయం తెలిసిన వెంటనే రాజధాని ప్రాంత వాసులు సీడ్ యాక్సిస్ రోడ్డుపైకి వచ్చి సేవ్ అమరావతి అంటూ నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేసి మహిళలను అడ్డుకున్నారు. దీంతో మందడంలో రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
Also Read: విజయవాడ తెలుగు తమ్ముళ్ల మధ్య సమసిన వివాదం
మరోవైపు రాయపూడి నుండి మందడం వస్తున్న రైతులను వెలగపూడి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. రోడ్డుపై బారికేడ్లను ఏర్పాటు చేసి ఆందోళనకారులను నిలువరించే ప్రయత్నం చేశారు. మందడం శివాలయం సెంటర్ వద్ద మహిళలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ధర్నా చేస్తున్న మహిళలకు అల్పాహారం అందిస్తుండగా పోలీసులు అడ్డుకోవడంతో రైతులు పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆందోళన చేస్తున్న రైతులు వెలగపూడి లోని సచివాలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు మహిళా రైతులకు మధ్య జరిగిన తోపులాటలో పలువురు మహిళలు కిందపడ్డారు. ఏడాదికిపైగా నిరసనలు కొనసాగిస్తున్నా ప్రభుత్వం నుండి కనీస స్పందన లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీపై పోలీసులు అదుపులోకి తీసుకున్న మహిళలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన కొనసాగించారు. ఈ పరిణామాలతో రాజధాని ప్రాంత గ్రామాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Also Read: అసత్య ప్రచారానికి అడ్డుకట్ట