ఖమ్మం: ఖమ్మం జిల్లా అడిషనల్ కలెక్టర్ స్నేహలత ప్రభుత్వ ఆస్పత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చారు .శుక్రవారంనాడు పురిటి నొప్పులతో సామాన్య మహిళలాగా ప్రభుత్వం ఆస్పత్రికి వచ్చి టెస్టులు చేయించుకున్నారు . అనంతరం వైద్యులు ఆపరేషన్ చేసి , డెలివరీ చేశారు . సర్కారు దవాఖానాలో డెలివరీ చేయించుకుని , అందరికీ ఆదర్శంగా నిలిచారని నెటిజన్లు ఆమెను ప్రశంసిస్తున్నారు . దీని వల్ల ప్రజలకు ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం పెరుగుతుందని చెబుతున్నారు .
తెలుగు రాష్ట్రాలలో పని చేస్తున్న ఉన్నతాధికారులలో తమ పిల్లల్ని సర్కారు బడికి పిల్లలను పంపేవారూ, సర్కార్ దవాఖానకు స్వయంగా వెళ్ళి ప్రసవించేవారూ, ఇతర వైద్యం చేయించుకునేవారూ ఇదివరకు ఎక్కువగా ఉండేవారు. నల్లగొండ జిల్లా కలెక్టర్ గా లోగడ పని చేసిన ఐఏఎస్ అధికారి ఒకరు తన పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చదివించేవారు.
నిమ్స్ దవాఖానాకు వెళ్ళిన చివరి ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య. ఆయన తర్వాత ముఖ్యమంత్రులైనవారూ, ఆయన కంటే ముందు ముఖ్యమంత్రులైన కొందరూ ప్రభుత్వాసుపత్రులకు వెళ్లేవారు కాదు. ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి వైద్య అవసరాల నిమిత్తం యశోదా ఆస్పత్రి వైద్యులను సంప్రదిస్తారు. కంటి వైద్యం అవసరమైతే దిల్లీలో చేయించుకుంటారు. అందుకే జిల్లా ఉన్నతాధికారి హోదాలో ఉన్న స్నేహలత ప్రభుత్వ ఆసుపత్రిలో పరుడుపోసుకోవడం వార్త అయింది.