ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిలిపివేయాలన్న ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తిని హైకోర్టు తిరస్కరించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల సంఘం నిర్ణయంపై స్టే ఇవ్వలేమని స్పష్టం చేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 14 వ తేదీకి వాయిదా వేసింది.
కరోనా తగ్గుముఖం పట్టడంతో ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ప్రకటన విడుదల చేశారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం కరోనా నియంత్రణలో ప్రభుత్వ యంత్రాంగం నిమగ్నమైందని ఇప్పట్లో ఎన్నికలకు సిద్ధంగా లేమన్న ప్రభుత్వం ఎన్నికలు నిలిపివేయాలని హైకోర్టును అభ్యర్థించింది. ఎన్నికల సంఘం ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకుందని ప్రభుత్వం తరపున పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఇప్పటికే దీనిపై పలుమార్లు విచారణ చేపట్టిన హైకోర్టు ఎన్నికల నిర్వహణపై స్టే విధించలేమని స్పష్టం చేసింది.