Sunday, December 22, 2024

వారసత్వ జబ్బు

సంపద సృష్టిద్దాం – 24

‘గల్లీలో ఎవడైనా క్రికెట్‌ ఆడతాడు. స్టేడియంలో ఆడేవాడే అసలైన క్రికెటర్‌..’ అన్న సినిమా డైలాగ్‌ ప్రభాస్‌ నోటినుంచి విన్నప్పుడు మన శరీరం వైబ్రేట్‌ అయింది కదా!  ఒక వస్తువును గాలిలోకి ఎగరేసినప్పుడు అది తిరిగి కిందకు వస్తుంది. భూమికున్న ఆకర్షణ శక్తివల్ల అలా జరగడం చాలా సహజ పరిణామం. ఈ ప్రకృతి ధర్మాన్ని పిల్లలతో పాటు పెద్దలు కూడా ఎంతో ఇష్టంగా అనుభవించడం మనం నిత్యమూ చూస్తాం. బంతి లేదా ఏదైనా వస్తువు గాలిలోకి ఎగరేసి మళ్లీ చేతులతో కాచ్‌ పట్టుకోవడం ఎవరికి ఇష్టముండదు చెప్పండి! చేతితో విసరటం, తలపైకెత్తి చూడడం, బంతిమీదే దృష్టి నిలిపి సరిగా కిందకి వచ్చినప్పుడు రెండు చేతులతో పట్టుకోవడం అంతా ఒక ఆట. ప్రకృతి సహజమైన భూమ్యాకర్షణ గుణంతో మన ఆట జతకలిసి మనసులో ఆనందం ఉప్పొంగటం మనకు తెలిసిందే.

Also read: సాయం చేద్దాం.. సాయం పొందుదాం..

ఆచితూచి ధనక్రీడ

క్రికెట్‌ మన వీధిలో ఆడామనుకోండి, ఆ బంతి ఎవరింటిలో పడుతుందో, ఎవరి పెరట్లో పడుతుందో, ఎవరి కిటికీ అద్దాన్ని బద్దలుగొడుతుందో అని భయంభయంగా ఆడతాం. అదే మైదానంలో అయితే చెలరేగిపోయి ఆడతాం. డబ్బు కూడా భూమికున్న ఆకర్ణణ శక్తిలాగా చాలా ప్రకృతి సహజమైనదే. డబ్బుతో ఆడే ఆటకూడా ప్రకృతి నియమాలను అనుసరించి మనం ఆడేదే. డబ్బుతో ఆడే ఆటలకుండే నియమ నిబంధనలు రూపొందించుకుంటేనే వాటిని మనం ఆనందించగలం. లేకపోతే ఆందోళన తప్పదు. డబ్బు విషయంలో, ఇతర క్రీడల్లాగే, మీరు చేసే సాధన మీ నేర్పునకు ఎంతో గొప్ప ఫలితాలను అందిస్తుంది. మీరు సంపద సృష్టించడంలో సహకరిస్తుంది. హద్దులు లేని స్థాయికి చేరుస్తుంది. నేర్పు పెరిగిన కొద్దీ కొత్త శిఖరాలు అధిరోహించడం సాధ్యమవుతుంది. ఈ రోజు నుండి మీరు డబ్బుతో ఆడే ఆటను సీరియస్ గా తీసుకుని, దినవారీ డబ్బు వ్యవహారంలో ధనక్రీడలను ఆచితూచి ఆడతారు. మన ఇల్లు, మన కుటుంబం కొన్నిసార్లు మన ఆశయ సాధనకు ప్రతిబంధకాలు అవుతాయి. చాలా జాగ్రత్తగా దీనిని గ్రహించగలగాలి. తల్లిదండ్రుల నుంచి పిల్లలకు కేవలం ఆస్తిపాస్తులు, డబ్బు, సంప్రదాయాలు మాత్రమే వారసత్వంగా అందుకుంటామనుకుంటే అది కేవలం మన భ్రమ మాత్రమే. వీటితో పాటు మన పెద్దల నుంచి ‘డబ్బుతో వ్యవహరించే తీరు’ను కూడా మనం వారసత్వంగా అందుకుంటాం. ఆ తీరులో వారి సహజ లక్షణాలను మనం పుణికిపుచ్చుకుంటాం.

Also read: వైద్యం విఫలమైన వేళ…

తల్లిదండ్రులకు జీవితంలో కలిగిన వ్యక్తిగత అనుభవాలు, వారి తల్లిదండ్రుల నుండి అందివచ్చిన అనుభవాలు, సమాజ పరిస్థితులు కలిసి ఆ కుటుంబం డబ్బుతో వ్యవహరించే గుణగణాలను తీర్చిదిద్దుతాయి. ఇందులో మంచి ఉండవచ్చు, చెడు వుండవచ్చు. దానిని మనం జడ్జ్‌ చేయలేం. అది కేవలం ఒక ఆటిట్యూడ్‌. అయితే ఎక్కడా నిర్దిష్టంగా నిర్దేశించబడని నియమ నిబంధనలు ఆ కుటుంబ వారసత్వంగా కొన్ని డబ్బు విషయంలో మీకు అందించబడతాయి. ఆ లోపభూయిష్ట సూచనలనే తెలియకుండా మీరు అందుకుంటారు. వాటిని తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు పదేపదే వల్లె వేయడం వల్ల.. వాటినే స్వచ్ఛమైన, అనుభవంతో కూడిన సూచనలుగా భావించే స్థితికి చేరతారు. ఉదాహరణకు, ప్రభుత్వ ఉద్యోగి అయిన ఒక (ఎంప్లాయీ క్వాడ్రెంట్‌లో ఉన్న) తండ్రి తన కొడుకుతో చేసే సంభాషణను పరిశీలించండి. కొడుకును కూడా ఏదోవిధంగా ప్రభుత్వోద్యోగం సంపాదించుకోమనే చెపుతాడు. కాని కొడుక్కి సొంతంగా వ్యాపారం చేసి ఓ వెలుగు వెలగాలని కోరిక ఉంటుంది. అది తెల్సిన తండ్రి ‘వ్యాపారంలో ఎన్నో కష్టాలుంటా’యని హెచ్చరిస్తాడు. ‘అదే ప్రభుత్వ ఉద్యోగమైతే భద్రత ఉంటుంది. ఎలాంటి చిక్కులూ ఉండవు. ఆరోగ్య రక్షణ పథకాలు, ఫించను సౌకర్యం వంటి లాభాలు అనేకం అదనంగా లభిస్తాయ’ని వాదిస్తాడు.

Also read: పారిపోవద్దు, ఫైట్‌ చేద్దాం!

అడుగు – నమ్ము – పొందు

అంతేకాదు తమది డబ్బు విలువ బాగా తెలిసిన కుటుంబం అని పునరుద్ఘాటిస్తారు. డబ్బుకు సంబంధించిన రహస్యాలు, విజయం సాధించటం గురించిన అంశాలన్నీ తమకు తరతరాలుగా అందించబడ్డాయని పదేపదే వల్లె వేస్తుంటారు. ‘‘మా వంశంలో గత ఏడు తరాలలో ఎవరూ వ్యాపారాలు చేయలేదు. మా నాన్న, తాత కూడా ప్రభుత్వ ఉద్యోగులే. ఎంతో లాభం లేకుంటే ఇటువంటి బాటను ఎందుకు ఎంచుకుంటారు? కాబట్టి వారి అనుభవాన్ని తోసిపారేయలేమని’ కొడుక్కి సలహా ఇస్తారు. మనలో చాలామందిమి ఆ కొడుకులాంటి వారిమే. మనం కూడా మన ముందుతరం వారు అందించిన జీవితం ఎటువంటిదో, వారు నిర్దేశించిన వృత్తి ఎటువంటిదో దానితోనే బతుకుతున్నాం. ఒక వైద్యుడి కూతురు వైద్యవృత్తిలోకి రావలసిందే. ఒక న్యాయవాది కొడుకు బి.ఎల్‌ చదివి ఆ వృత్తిని కొనసాగించాల్సిందే. ఇదిగో ఇటువంటి ఆలోచనలను మనకు అందించారు. పెద్దలు అందించిన ఆ ఆలోచనలు మనలో బలంగా నాటుకుని పోయాయి అన్నది నేను చెప్పదలచుకున్న విషయం.

Also read: సమస్తమూ అంతశ్చేతనతోనే..

డబ్బుకు సంబంధించిన పెద్దల మాటలే వాస్తవాలని భావించి తు.చ. తప్పకుండా అనుసరిస్తున్నాం. అయితే ఆ అవాస్తవ సూత్రాలను వాస్తవ సూత్రాలుగా పాటిస్తునామనే వాస్తవం తెలుసుకోవడం లేదు. జీవితంలో మనం వరుసగా చేస్తున్న చర్యలలో ఎప్పటికప్పుడు రాజీపడుతూ నెట్టుకొస్తున్నాం. మనసులో పుట్టుకొస్తున్న ఆశలు, ఆకాంక్షలు, అనాదిగా మనమీద రుద్దబడి, ఒక పరిధి దాటి బయటకు వెళ్లడానికి వీలులేకుండా విధించిన ఆంక్షలకు మధ్య రాజీపడుతూ పోతున్నాం. మీ జీవితం ఇంతేనని, ఇంతకు మించి ముందుకు వెళ్లాలని రాసిపెట్టలేదని మీకు చెప్పేవారి సంఖ్య తక్కువేమీ కాదు.

కాబట్టి మీ దగ్గరున్న మీ తల్లిదండ్రుల నుండి అందిన డబ్బుకు సంబంధించిన సూచనల గ్రంథాన్ని అవతల పడేసి దాని స్థానంలో కొత్త పుస్తకంలోని సూచనలను అందుకోండి. అవి మీకు మేలు చేస్తాయి. ఒక్కక్షణం ఆగి నేటివరకు మీరు అనుసరించిన సంప్రదాయ ధనసూత్రాలు, నమ్మకాలను మూలం నుండి ఫలితం వరకు పరిశీలించండి. అవి నిజంగా మీకు మేలు చేశాయా!? హాని చేయాలనే ఉద్దేశం లేకపోయినా జరిగిన హాని ఫలితం మీ జీవితానికి తగులుతుంది. కాబట్టి మీకు చెప్పే విషయాలను వెంటనే నమ్మకండి. వాటిని తరచితరచి పరిశీలించండి. అవసరమైతే వాటిపై, అవి చెప్పిన వారిపై తిరుగుబాటు చేయండి. ఎందుకంటే మీ జీవితం ఆ సూత్రాలతో, ఆ సూచనలతో ముడిపడి ఉంది.

Also read: కాపీక్యాట్‌ మార్కెటింగ్‌ 

దుప్పల రవికుమార్‌

రవికుమార్ దుప్పల
రవికుమార్ దుప్పల
దుప్పల రవికుమార్ సిక్కోలు బుక్ ట్రస్ట్ ప్రధాన సంపాదకులు. ఆంగ్ల అధ్యాపకులు. ఫ్రీలాన్స్ జర్నలిస్ట్. మొబైల్ : 99892 65444

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles