అనంతపురం జిల్లాలో అత్యంత ప్రాచీన గుడులు వున్న హేమావతిని, శిల్పకళా క్షేత్రమైన లేపాక్షి వీరభద్రాలయాన్ని ‘మాన్యుమెంట్ మిత్ర’ పథకంలో చేర్చి అభివృద్ధి చేయాలని ప్రముఖ చారిత్రక పరిశోధకుడు మైనాస్వామి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. హిందూపురం పత్రికా ప్రతినిధులతో ఆదివారం (ఫిబ్రవరి 27) ఆయన మాట్లాడుతూ… మాన్యుమెంట్ మిత్ర పథకం లో ఎంపిక చేసిన పర్యాటక ప్రదేశాలను, యాత్రా స్థలాలను అభివృద్ధి చేయడానికి స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ కంపెనీలు, ధనిక వ్యక్తులు ముందుకు వస్తారని తెలిపారు. దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలను ప్రయివేట్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేయడానికి కేంద్ర పర్యాటక – సాంస్కృతిక శాఖ ‘మాన్యు మెంట్ మిత్ర’ పథకాన్ని ఇటివల ప్రవేశపెట్టింది. హేమావతి-లేపాక్షి ఆలయాలను కేంద్ర ప్రభుత్వ పథకంలో చేర్చితే ఆయా ఆలయాలు జాతీయ స్థాయిలో అభివృద్ధి అవుతాయి. గుడుల కట్టడాలను పటిష్టపరచడం, మౌలక సదుపాయాలు మెరుగుపరచడం, రహదారి – రవాణా సౌకర్యాల అభివృద్ధి, దేవాలయాల గురించి ప్రచారం చేయడం వంటి వాటికి కేంద్ర ప్రభుత్వ పథకం అవకాశం కల్పించింది. వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తారు. పర్యాటక కార్యకలాపాలు జోరుగా సాగుతాయి. దానితో ఆయా ప్రదేశాల్లో ఉపాధి అవకాశాలు, జీవనాధారాలు పెరుగుతాయి.
Also read: బహుభాషా పండితులను ఆదరించిన శ్రీక్రిష్ణదేవరాయలు
ప్రతిరోజూ బస్ నడపాలి
లేపాక్షి నుంచి హేమావతికి ప్రతి రోజు బస్ ను నడపడానికి రాష్ట్ర పర్యాటక శాఖ చర్యలు చేపట్టాలని మైనస్వామి కోరారు. హేమావతి-లేపాక్షి ఆలయాల అభివృద్ధి – సౌకర్యాల కల్పనపై త్వరలో ఒక సదస్సును నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. కాగా చిత్రేశ్వర, సోమేశ్వర, సిద్ధేశ్వర, దొడ్డేశ్వర, మల్లేశ్వర, విరూపాల్లేశ్వర దేవాలయాలు హేమావతిలో వున్నాయి. సిద్ధేశ్వరాలయంలో ముక్కంటిశుడు మానవా కారంలో పూజలందు కొంటున్నాడు. మిగతా గుడులలో స్వామి లింగరూపంలో దర్శనమిస్తున్నాడు. హేమావతి ఆలయాలు అద్భుత శిల్పకళతో అలరారుతున్నాయి. పెద్ద శివలింగాలలో పాటు సూక్ష్మ శిల్పాలను అక్కడ చూడవచ్చు. క్రీ.శ.8,9 శతాబ్దాల్లో హేమావతి గుడులను నోలంబ పల్లవ ప్రభువులు కట్టించారు. హెంజేరు (హేమావతి) రాజధానిగా నోలంబ పల్లవులు క్రీ.శ. 730 నుంచి 1054 వరకు రాజ్య పాలన చేశారు. ప్రతి మంగళ నోలం బాధి రాజు మొదటివాడు. నోలంబపల్లవులు పాలించిన నోలంబవాడా -32,000 రాజ్యానికి సంబంధించిన పలు శిలా శాసనాలు హేమావతి మరియు పరిసర ప్రాంతాల్లో వున్నాయి.హేమావతి ఆలయాల అద్భుత నిర్మాణాలు – శిల్పకళ, నోలంబ పల్లవ ప్రభువుల చరిత్ర పై త్వరలో ఒక పరిశోధనాత్మక పుస్తకాన్ని ప్రచురిస్తానని మైనాస్వామి చెప్పారు.
Also read: బుక్కరాయలనాటి శాసనాలు : ఆ తెలుగు అద్భుతం
రచయిత మొబైల్ : 9502659119