- ఆస్పత్రిలో కింద పడ్డారు, తలకు గాయమైంది
- వెంటనే మెరుగైన చికిత్స అవసరం, బెయిల్ పై విడుదల చేయండి
- ఇంతవరకూ అభియోగాలు మోపలేదు, విచారణ ఆరంభం కాలేదు
వరవరరావును విడుదల చేయాలని ఆయన సతీమణి పెండ్యాల హేమలత గురువారంనాడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన భర్తకు కోవిద్ వచ్చి తగ్గిందనీ, దాని తాలూకు అనారోగ్యం వేధిస్తున్నదనీ, ఆయన నోటి వెంట మాట రావడం లేదనీ, నిలబడలేకపోతున్నారనీ, ఆయనకు మెరుగైన చికిత్స అవసరమనీ, వెంటనే విడుదల చేయాలనీ ఆమె కోరారు. తన భర్త అనారోగ్యానికి మహారాష్ట్ర ప్రభుత్వం, నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు కారణమని ఆమె తన పిటిషన్ లో ఆరోపించారు.
ఎల్గార్ పరిషత్ కేసుతో నిరుడు ఆగస్టులో వరవరరావుని మహారాష్ట్ర పోలీసులు హైదరాబాద్ వచ్చి అరెస్టు చేసి తీసుకొని వెళ్ళారు. 79 సంవత్సరాల వరవరరావుకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి. జైలు జీవితం వల్ల ఆరోగ్యం పూర్తిగా చెడిపోయింది. నరాల సంబంధమైన అనారోగ్యం వచ్చింది. పుణె పట్టణంలోని శనివారవాడలో ఎల్గార్ పరిషత్ సభలో రెచ్చగొట్టే ప్రసంగాలు సాగాయనీ, ఆ తర్వాత రోజున కోరేగాం భీమాలో హింస చోటు చేసుకున్నదనీ, ఈ కేసుతో వరవరరావుకు సంబంధం ఉన్నదనీ పోలీసుల అభియోగం.
వీరిని అన్ లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ యాక్ట్ కింద అరెస్టు చేశారు. ఈ చట్టాలు అత్యంత కఠినమైనవి. విచారణ లేకుండా ఎంతకాలమైనా నిర్బంధంలో ఉంచవచ్చు. ఈ కేసులో ఇంతవరకూ నిందితులపైన విడివిడిగా అభియోగాలు మోపలేదు. విచారణ మొదలు కాలేదు. ఎప్పుడు మొదలవుతుందో తెలియదు. మొదటి చార్జిషీటు మాత్రం పదివేల పేజీలు ఉంది.
వయస్సూ, కోవిద్ సమస్యా కారణంగా రోగిని (వరవరరావుని) జాగ్రత్తగా చూడాలని బాంబే హైకోర్టు ఆగస్టు 17న అన్నది. నానావతి హాస్పిటల్ జూలై 30న విడుదల చేసిన నివేదికలో వరవరరావు ఆరోగ్య పరిస్తితి వివరాలు ఉన్నాయి. కోవిద్ వచ్చి సెయింట్ జార్జి హాస్పిటల్ చేరినప్పుడు ఆయన కిందపడినారనీ, తలకు గాయమైదననీ హేమలత తన పిటిషన్ లో తెలిపారు. వరవరరావు ఆరోగ్య పరిస్థితిపైన ఒక నివేదిక ఇవ్వాలని తలోజా జైలు అధికారులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై స్పందన లేదు.
అక్షరమే వారి నిర్బంధానికి కారణం: శశి థరూర్
వరవరరావు, సుధాభరద్వాజ్, ఆనంద్ టెల్టుంబ్డే వంటి హక్కుల నేతలు వారి వాక్కు కారణంగా డిటెన్షన్ లో ఉన్నారు కానీ వారు ఎవరినో కొట్టినందుకో, లేక తుపాకి చేత పట్టినందుకో కాదని కాంగ్రెస్ కు చెందిన లోక్ సభ సభ్యుడు శశి థరూర్ వ్యాఖ్యానించారు. అక్షరాలూ, ఆలోచనలూ అధికారం, ఆధిపత్యం కంటే అతీతమైనవని అన్నారు.
సింబియాసిస్ అంతర్జాతీయ విశ్వవిద్యాలయం నిర్వహించిన సాహిత్య సంబరంలో తిరువనంతపురం పార్లమెంటు సభ్యుడు మాట్లాడుతూ, ‘నేను స్కూల్లో ఉన్నప్పుడు కత్తి కంటే కలం బలమైనదని నేర్చుకున్నాను. ఈ రోజు నేను మన దేశాన్నీ, రాజకీయాలనూ, ఉపన్యాసాలనూ చూస్తున్నాను, వింటున్నాను. కత్తి కంటే కలం గొప్పదనే నమ్మకం కుదరడం లేదు,’ అని అన్నారు. అధికారం, ఆధిపత్యం అక్షరాన్ని అణచివేస్తున్నాయనీ, ఇది కళ్లక కనిపిస్తున్న వాస్తవమనీ ఆయన అన్నారు. ‘తాము మాట్లాడిన మాటలకు మూల్యం చెల్లిస్తూ చాలా మంది నిర్బంధంలో ఉన్నారు. వరవరరావు, వెర్నాన్ గాన్ స్లేవ్స్, సుధా భరద్వాజ్, ఆనంద్ టెల్టుంబ్డే వంటి వారు ప్రస్తుతం జైళ్ళలో ఉన్నారు. ఎందుకు? వారు ఎవ్వరిపైనా రాళ్ళు రువ్వలేదు. తుపాకీ చేత పట్టుకోలేదు. వారు మాట్లాడిన మాటలే వారిని వెంటాడుతున్నాయి. కత్తికి ఎదురుగా అక్షరం ఎట్లా నిలువగలదు? ’అంటూ శశి థరూర్ ప్రశ్నించారు. వరవరరావు, తదితరులను మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణపైన అరెస్టు చేశారు. 1 జనవరి 2018న కోరెగాం భీమా దగ్గర హింసాకాండలో వారికి సంబంధాలు ఉన్నాయన్నది మరో ఆరోపణ.