(జె సురేందర్ కుమార్, ధర్మపురి)
దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలు ,రాజ్యాంగ ఆదేశిక సూత్రాల మేరకు పరిపాలన కొనసాగించాల్సి ఉంది. అవే సూత్రాల మేరకు ఐదు సంవత్సరాలకు ఓసారి ప్రజాస్వామిక పద్ధతిలో ఎన్నికలు జరగాల్సి ఉంది. జరుగుతూనే ఉన్నాయి.
శాస్త్రీయత లేని విశ్వాసం
గత దశాబ్ద కాలంగా ఆయా రాష్ట్రాల ప్రధాన పట్టణాల్లో కి తుఫాన్ వల్ల భారీ వర్షాల వలన వరదలు సంభవిస్తే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మారుతున్నాయి, లేదా ప్రభుత్వ అధినేతలు మారుతున్నారు. ఈ మార్పులకు సవాలక్ష, అనేక కారణాలు ఉండవచ్చు. వరదల వల్ల ప్రభుత్వాలు మారాయని చెప్పడానికి శాస్త్రీయంగా ,సాంకేతిక ఆధారాలు లేవు, కానీ ప్రకృతి విలయ తాండవం వల్ల కొన్ని రాష్ట్ర ప్రభుత్వ లు తమ పదవీ కాలం ముగిసిన పిదప జరిగిన ఎన్నికల్లో వారు తిరిగి అధికారాన్ని ఆయా పార్టీలు పొందలేకపోతున్నాయి. ఈ అంశాలు కాకతాళీయమే కావచ్చు అయినా చర్చనీయాంశంగా మారింది. వివరాలు పరిశీలిద్దాం.
వైఎస్ దుర్మరణం
ఉమ్మడి రాష్ట్రంలో 2009 సంవత్సరంలో రాష్ట్రంలో తుఫాన్ వల్ల భారీ వర్షాలు, వరదలు వచ్చాయి. రాష్ట్రం అతలాకుతలమైంది. కర్నూలు, నల్లగొండ ,కృష్ణా జిల్లాలలో భారీ నష్టం సంభవించింది. కొన్ని పట్టణాలలో వరద నీరు చేరింది. అప్పటి ప్రభుత్వ అధినేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2009 సెప్టెంబర్ 2న హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఆయన స్థానంలో శ్రీ రోశయ్య గారు, కొంతకాలం పిదప ఉమ్మడి రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రి గా శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి కొనసాగారు.
2015లో తమిళ్ నాడులో భారీ వర్షాలు పడ్డాయి. చెన్నపట్టణం నీటమునిగింది. అపారమైన నష్టం సంభవించింది. జనజీవనం అతలాకుతలమైంది ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న జయలలిత 2016 డిసెంబర్ 5న అనారోగ్యంతో మృతి చెందింది. ఆమె స్థానంలో ముఖ్యమంత్రిగా పళని స్వామి నియమితులయ్యారు.
చంద్రబాబునాయుడిపై వరద ప్రభావం
జూన్ 2 , 2014 సంవత్సరంలో నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కొనసాగుతున్న తరుణంలో 2014 అక్టోబర్ మాసంలో.” హు ద్ హుద్ ” తుఫాన్ వల్ల ఆ రాష్ట్రం అతలాకుతలమైంది. ఆ రాష్ట్రంలో అప్పటి ప్రధాన మెట్రోపాలిటన్ నగరమైన విశాఖపట్టణం లో ఎనలేని ఆస్తి నష్టం సంభవించింది. పట్టణంలో వర్షం, వరద నీరు ప్రవహించాయి. 2019 లో జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు పార్టీ తెలుగుదేశం ఘోరంగా ఓటమి చెందింది. 23 ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీల కే పరిమితమై ఆ పార్టీ అధికారం కోల్పోయింది. వై ఎస్ ఆర్ సి పి పార్టీ అఖండ మెజార్టీతో 151 స్థానాలు గెలుచుకొని. 22 మంది ఎంపీలతో విజయ ఢంకా మోగించి. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి గా పదవీ బాధ్యతలు చేపట్టారు.
ముంబయ్ అధికార పీఠానికి వరద తాకిడి
2012- 13 లో మహారాష్ట్రలో సంభవించిన భారీ వర్షాలు వల్ల ముంబై నగరం వర్షం వరదలతో అతలాకుతలం అయింది. అప్పటి పృథ్వీరాజ్ చవాన్ ప్రభుత్వం కు శరద్ పవార్ నేతృత్వంలోని న్ సి పి పార్టీ మద్దతు ఇచ్చింది. 2014 సెప్టెంబర్ మాసంలో ఎం సి పి పార్టీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడం 2014 సెప్టెంబర్ 25న సీఎం పృథ్వీరాజ్ చవాన్ తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు. 2014 అక్టోబర్ లో జరిగిన ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుని పోగా బిజెపి, శివసేన పార్టీలు అత్యధిక సీట్లు సాధించి మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. ముఖ్యమంత్రిగా ఫడ్నవిస్ ప్రభుత్వం 2019 వరకు కొనసాగింది. 2017 లో ముంబాయి పట్టణం వర్షం వరదలతో తల్లడిల్లిపోగా 2019 ఎన్నికల్లో బిజెపి మహారాష్ట్రలో అధికారం కోల్పోయి శివసేన ఎన్సీపీ ,కాంగ్రెస్ కూటమితో ఉద్దమ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు.
హైదరాబాద్ లో భారీ వర్షాలు
2020 అక్టోబర్, నవంబర్ మాసాలలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం భారీ వర్షాలకు అతలాకుతలం కావడంతోపాటు అనేక కాలనీలలోకి వరద నీరు చేరింది. కొన్ని కాలనీలలోకి పడవల ద్వారా వారం రోజుల పాటు రాకపోకలు కొనసాగించారు. ఇదే తరుణంలో జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో టిఆర్ఎస్ బిజెపి ఎంఐఎం కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు కార్పొరేటర్ల స్థానం ల కోసం పోటీ పడ్డారు. గత 2016 సంవత్సరంలో జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో 99 కార్పొరేటర్ స్థానాలను గెలుచుకున్న టిఆర్ఎస్ పార్టీ 56 స్థానాలకే పరిమితమైంది. ఈ ఎన్నికల్లో టీఆర్ ఎస్ 43 స్థానాలకు కోల్పోయింది. అదే ఎన్నికల్లో కేవలం నాలుగు కార్పొరేటర్ స్థానాలకే పరిమితం అయిన బీజేపీ పార్టీ 48 స్థానాలను కైవసం చేసుకుంది. ఎంఐఎం 44 కాంగ్రెస్ రెండు స్థానాలకే పరిమితం. అయింది. పట్టణంలో వరదలు వచ్చి తగ్గిన పిదప జరిగిన ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ 56 స్థానాలకు పరిమితం కావడం తెలిసింది.
2023 వరకూ వేచి చూడాలా?
ఇది ఇలా ఉండగా రాష్ట్రంలో ఇటీవల కొనసాగుతున్న, వినిపిస్తున్న రాజకీయ వదంతుల నేపథ్యంలో ముఖ్యమంత్రిగా టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కే తారకరామారావు కు ముఖ్యమంత్రిగా గా పట్టాభిషేకం చేయనున్నట్లు కొందరు అధికార పార్టీ నేతలతో పాటు ప్రతిపక్ష రాజకీయ పార్టీల నేతలు లీకులు ఇవ్వడం, బహిరంగంగా వ్యాఖ్యానించడం, ప్రసార మాధ్యమాలలో ఈ అంశం రావడం. టీవీ ఛానల్ లో ఈ అంశంపై చర్చాలు కొనసాగడం మనకు తెలిసిందే. రానున్న రోజుల్లో ప్రభుత్వాలు మారుతాయో? అధినేత మారనున్నారో? ఈ ఆనవాయితీ కొనసాగుతుందా లేక దానికి ముఖ్యమంత్రి, తెరాస అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు బ్రేక్ వేస్తారో.. 2023 అసెంబ్లీ ఎన్నికల వరకూ వేచి చూడాల్సిందే.