* టీ-20 తుది జట్టులో చోటుకు హోరాహోరీ
* 9 స్థానాల కోసం 19 మంది పోటీ
ఇంగ్లండ్ తో అహ్మదాబాద్ వేదికగా జరిగే ఐదుమ్యాచ్ ల టీ-20 సిరీస్ ప్రారంభానికి ముందే విరాట్ కొహ్లీ నాయకత్వంలోని భారత జట్టుకు సరికొత్త తలనొప్పి వచ్చి పడింది. ప్రతిభావంతులైన ఆటగాళ్లందరూ అందుబాటులో ఉండడంతో జట్టులోని ఒక్కో స్థానానికీ తీవ్రపోటీ నెలకొని ఉంది.
ఆరోగ్యవంతమైన పోటీ ఇది
ప్రపంచ మాజీచాంపియన్ భారత టీ-20 తుదిజట్టులో చోటు సంపాదించడం ప్రతిభావంతులైన పలువురు ఆటగాళ్లకు అసలుసిసలు సవాలుగా మారింది. మొత్తం 11 మంది సభ్యుల తుదిజట్టులో కెప్టెన్ విరాట్ కొహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మల స్థానాలు ఖాయం కాగా మిగిలిన తొమ్మిది స్థానాల కోసం రిషభ్ పంత్, నటరాజన్ లతో సహా మొత్తం 19 మంది పోటీపడుతున్నారు. తుదిజట్టులో ఏ ఒక్క ఆటగాడి చోటుకు గ్యారెంటీ లేకపోడంతో ఎక్కడలేని ఉత్కంఠ చోటు చేసుకొని ఉంది. పేస్ బౌలింగ్, స్పిన్ బౌలింగ్, వికెట్ కీపర్, మిడిలార్డర్ , ఆల్ రౌండర్ స్థానాల కోసం తీవ్రపోటీ నెలకొంది.
Also Read : విజయ్ హజారే టోర్నీలో కుర్రోళ్ల జోరు
తలనొప్పిగా మారిన తుదిజట్టు ఎంపిక
చీఫ్ కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ విరాట్ కొహ్లీ, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్,బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ లకు తుదిజట్టు ఎంపిక తలనొప్పిగా మారింది. భారత్ వేదికగా వచ్చే ఏడాది జరిగే టీ-20 ప్రపంచకప్ ను దృష్టిలో ఉంచుకొని ప్రతిభావంతులైన ఆటగాళ్లందరికీ తగిన అవకాశాలు కల్పించాలన్న పట్టుదలతో టీమ్ మేనేజ్ మెంట్ కార్యాచరణ సిద్ధం చేసింది. అహ్మదాబాద్ వేదికగానే ఇంగ్లండ్ తో ఐదుమ్యాచ్ ల టీ-20 సిరీస్ మార్చి 12 నుంచి 20 వరకూ జరుగనుండడంతో తుదిజట్టు కూర్పు కీలకం కానుంది. వికెట్ కీపర్ స్థానం కోసం కెఎల్ రాహుల్, రిషభ్ పంత్ పోటీపడుతున్నారు. వీరికి బ్యాకప్ వికెట్ కీపర్ గా ముంబై ఆటగాడు ఇషాన్ కిషన్ ను అందుబాటులో ఉంచారు.
Also Read : శిక్షకుల్లో మహాశిక్షకుడు రవిశాస్త్రి
శిఖర్ ధావన్ కు కష్టమే
ఓపెనర్ గా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ స్థానం ఖాయం కావడంతో…రెండో ఓపెనర్ స్థానం కోసం వెటరన్ శిఖర్ ధావన్, కెఎల్ రాహుల్ పోటీపడుతున్నారు. ప్రధాన వికెట్ కీపర్ గా రిషభ్ పంత్ ను తీసుకొంటారా? లేక కెఎల్ రాహుల్ కు అవకాశమిస్తారా? అన్నది కూడా సస్పెన్స్ గా మారింది. దేశవాళీ విజయ్ హజారే టోర్నీలో ఢిల్లీ తరపున శిఖర్ ధావన్ 150 పరుగుల స్కోరు సాధించడం ద్వారా తన ఫామ్ ను చాటుకొన్నా తుదిజట్టులో చోటుకు హామీ లేకుండా పోయింది. వన్ డౌన్ స్థానంలో కొహ్లీ బ్యాటింగ్ కు దిగితే…రెండో డౌన్ స్థానం కోసం ముంబై జోడీ శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ ఢీ అంటే ఢీ అంటున్నారు. 5వ నంబర్ స్థానంలో రిషభ్ పంత్, 6వ నంబర్ స్థానంలో హార్ధిక్ పాండ్యా బ్యాటింగ్ కు దిగే అవకాశం ఉంది. మిడిలార్డర్ లో చోటు కోసం రాహుల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ ల నడుమ ముక్కోణపు సమరమే జరుగనుంది.
భువనేశ్వర్ కుమార్ బ్యాక్
గాయంతో గత ఏడాది కాలంగా జట్టుకు దూరమైన సీనియర్ స్వింగ్ బౌలర్ భువనశ్వర్ కుమార్ తిరిగి పూర్తి ఫిట్ నెస్ తో అందుబాటులోకి వచ్చాడు. మరోస్థానం కోసం దీపక్ చహార్, శార్దూల్ ఠాకూర్ తలపడుతుంటే బుమ్రా స్థానాన్ని నటరాజన్ తో భర్తీ చేయాలని టీమ్ మేనేజ్ మెంట్ యోచిస్తోంది. స్పిన్నర్ల స్థానం కోసం యజువేంద్ర చహాల్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ మూడుస్తంభాలాట ఆడనున్నారు. బుమ్రా స్థానం కోసం నటరాజన్ తో నవదీప్ సైనీ అమీతుమీ తేల్చుకోనున్నాడు. సూపర్ హిట్టర్లు ఇశాంత్ కిషన్, రాహుల్ తెవాటియా సైతం తుదిజట్టులో తమ వంతు కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. మహ్మద్ షమీ, రవీంద్ర జడేజా, జస్ ప్రీత్ బుమ్రా లాంటి కీలక ఆటగాళ్లు సైతం అందుబాటులోకి వస్తే..తుదిజట్టు ఎంపిక మరింత తలనొప్పికానుంది. ఏది ఏమైనా మరక మంచిదే అన్నట్లుగా తుది జట్టు ఎంపిక ను ..టీమ్ మేనేజ్ మెంట్ కు మంచి తలనొప్పిగానే చెప్పుకోవాలి మరి.
Also Read : భారత మహిళా క్రికెటర్ ప్రపంచ రికార్డు