- జగన్ చొరవ, నవీన్ స్పందన అభినందనీయం
- చర్చల ద్వారా సమస్యల పరిష్కారం మంచి సంప్రదాయం
- రెండు రాష్ట్రాల మధ్య పరిష్కరించుకోవలసిన సమస్యలు అనేకం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి,ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మధ్య ఒడిశా సచివాలయంలో తాజాగా భేటీ జరిగింది. ఇది శుభ పరిణామం. ఉభయ రాష్ట్రాల మధ్య ఉన్న అపరిష్కృత సమస్యలకు ముగింపు పలికే దిశగా ఇద్దరు ముఖ్యమంత్రులు కలవడం ముదావహం. ఈ దిశగా ముందడుగు వేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అభినందించి తీరాలి. హృదయ పూర్వకంగా స్వాగతం పలికిన ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కు కృతజ్ఞతలు తెల్పాలి. చర్యలను వేగవంతం చేయడానికి ‘జాయింట్ కమిటీ’ ఏర్పాటు దిశగా తొలి సమాగమంలోనే ఉభయలూ నిర్ణయం తీసుకోవడం ముందడుగుగా భావించాలి. ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో ఈ కమిటీ నిర్మాణం కానుంది.
Also read: ఒకే గూటిలోకి (ఇందిరా)గాంధీ పరివార్!
ఇవీ ప్రధాన సమస్యలు
ప్రధానంగా నేరడి బ్యారేజి, జంఝావతి ప్రాజెక్టు, కొఠియా గ్రామాల అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఒడిశా పదే పదే అభ్యంతరాలు లేవనేత్తడం వల్ల దశాబ్దాలుగా అనేక సమస్యలు పరిష్కారానికి నోచుకోవడంలేదు. సరిహద్దుల్లో మాటిమాటికీ వివాదాలు చెలరేగుతున్నాయి, ఘర్షణలు జరుగుతున్నాయి. ఇది ఉభయులకూ మంచిది కాదు, ముఖ్యంగా మనం అనేక విధాలుగా నష్టపోతున్నాం. కొఠియా గ్రామ పంచాయతీలోని 21 గ్రామాల వివాదం తలనొప్పిగా మారింది. తరచూ వార్తల్లోకి ఎక్కుతూ ఉంటుంది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలు ఘర్షణ వాతావరణాన్ని సృష్టించాయి. రెండు ప్రభుత్వాలతో ఈ గ్రామాలు ముడిపడి వున్నాయి. వాటిల్లో ఫట్టుసెనేరి గ్రామం వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. పాలనాపరమైన ఇబ్బందులు, పథకాల అమలులో ఏర్పడుతున్న సంధిగ్ధాలు, పాఠశాలలలో మాధ్యమపరమైన సమస్యలు, రిజర్వేషన్ల అమలులో అడ్డంకులు, ఆధార్ కార్డుల విషయంలోనూ గందరగోళం, రాజకీయపరమైన కక్షలు, ఆధిపత్యపోరు.. ఇలా అనేక సంక్లిష్టమైన అంశాలు ఈ గ్రామాలతో ముడిపడి వున్నాయి. ముఖ్యంగా, 1956లో ఆంధ్రప్రదేశ్ అవతరణ కాలం నుంచి సరిహద్దు వివాదాలు పెరిగిపోయాయి. 1936ప్రాంతంలో జైపూర్ పరిధిలో ఈ ప్రాంతాలు ఉండేవి. సరిహద్దు వివాదాల అంశంలో, సర్వే నిర్వహణ సక్రమంగా జరగకపోవడం గమనార్హం. కొఠియా గ్రామ పంచాయతీ కోరాపుట్ జిల్లా పరిధిలో ఉంది. ఘర్షణలు జరిగినప్పుడల్లా సరిహద్దులను బారికేడ్స్ తో మూసెయ్యడం, ఒడిశా పోలీస్ ను పెద్దఎత్తున తరలించడం అతి సాధారణమై పోయింది. కొఠియా పంచాయతీలోని 21 గ్రామాలలో 16 గ్రామాల ప్రజలు ఆంధ్రప్రదేశ్ లోనే ఉండడానికి తీర్మానాలు చేసినట్లుగా తెలుస్తోంది. చరిత్రను గమనిస్తే, ఒడిశాలోని చాలా ప్రాంతాలు ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ లోనే ఉండేవి. బరంపురంలో ఇప్పటికే తెలుగువారే ఎక్కువమంది ఉన్నారు. ఇటువంటి ఊర్లు ఎన్నో ఉన్నాయి. వీరందరూ తెలుగు భాషా సంస్కృతుల కోసం ఉవ్విళ్లూరి పోతుంటారు. తెలుగు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన రోజు పండుగగా భావిస్తారు. తెలుగు భాషలో చదువుకోడానికి చాలా ఆసక్తి చూపిస్తారు. ఒడిశాలో తెలుగు ప్రజాప్రతినిధులు చాలామంది ఉన్నారు.
Also read: బీజేపీపై కాలుదువ్వుతున్న కేసీఆర్
ఒఢిశా ప్రధాన కార్యదర్శిగా మాచవరం రామకృష్ణయ్య
నెల్లూరు జిల్లా కావలికి చెందిన ఐ ఏ ఎస్ అధికారి ( ఐ ఏ ఎస్ మొదటి బ్యాచ్ ) ఎం (మాచవరం). రామకృష్ణయ్య ఒడిశా చీఫ్ సెక్రటరీగా పనిచేశారు. నాబార్డ్ కు వ్యవస్థాపక చైర్మన్ గా, రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ గా సేవలు అందించారు. ఇటీవల వరకూ ఆయన జీవించే ఉన్నారు. అటువంటివారి సలహాలను గత ప్రభుత్వాలు సద్వినియోగం చేసుకొని ఉండిఉంటే బాగుండేది. ఆ దిశగా ప్రయత్నాలు జరిగినట్లు లేదు. ఇప్పటికీ తెలుగు – ఒడిశా రాష్ట్రాలకు చెందిన అధికారులు ఉభయ రాష్ట్రాల్లో ఉన్నారు. సమస్యల పరిష్కారంలో వారిని వినియోగించుకోవడం కూడా సరియైన చర్యగానే భావించవచ్చు. వంశధారపై నేరడి వద్ద బ్యారేజి నిర్మాణానికి మార్గం సుగమం చేసుకుంటే, రెండు రాష్ట్రాలలోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి పునాదులు వేసినట్లవుతుంది. జంఝావతి రిజర్వాయర్ ముంపు సమస్యకు ముగింపు పలకడం చాలా ముఖ్యం. రబ్బర్ డ్యాం స్థానంలో కాంక్రీట్ డ్యాం నిర్మించడం అత్యంత కీలకం. పోలవరం ప్రాజెక్టు విషయంలో ఒడిశా అభ్యంతరాలకు అడ్డుగోడ వేయాలి. ముంపు గ్రామాల సమస్యపై ఒక అంగీకారానికి రావడమే పరిష్కారం. బహుదానది నీటి విడుదలపై స్పష్టమైన ప్రకటన రావాలి. గంజాయి నియంత్రణ, మావోయిస్ట్ ల అంశం, ఇంధన రంగాన్ని ఉభయ తారకంగా తీర్చిదిద్దుకోవడం మొదలైనవి ఉన్నాయి. ఇరు రాష్ట్రాల ప్రతినిధులు కూర్చొని మాట్లాడుకుంటే సమస్యలన్నీ తీరిపోతాయని సుప్రీంకోర్టు పదే పదే చెప్పింది. రెండు రాష్ట్రాల అధినేతలు ద్వైపాక్షిక చర్చలు జరుపుకోండని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన కూడా సూచించారు. మొత్తంమీద ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలుసుకొని మాట్లాడుకోవడం మంచి సంప్రదాయం. మిగిలిన సరిహద్దు రాష్ట్రాల అధినేతల మధ్య కూడా భేటీ జరగాలి. ఒడిశా విషయంలో వలె ఆ దిశగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి మొదటి అడుగులు వేస్తారని విశ్వసిద్దాం. చర్చల ద్వారా సామరస్య వాతావరణంలో సమస్యలను పరిష్కరించుకోవడం ఉత్తమమైన మార్గం.