ఆలోచిస్తే ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది
ఒక్కొక్క జీవి, ప్రకృతి రచించిన
ఒక్కొక్క కవితా చరణంలాగా ముందుకొస్తుంది.
అందమైన పొందికలో సృష్టి తన సృజనాత్మకతను ప్రదర్శిస్తుంది.
కవిత్వం అర్థం కాని వారికి విశ్వరహస్యాలేం అర్థమవుతాయీ?
జీవ ఆవిర్భావమే ఒక మహాకవిత్వమయినప్పుడు
అది అర్థం కావాలంటే హృదయంలో మేధస్సు ఉండాలి
మేధస్సులో హృదయం ఉండాలి.
ఎడారుల్లో సముద్రాల్నీ, సముద్రాల్లో ఎడారుల్నీ చూడగలగాలి
కూలిపోతున్న చట్లలో మొలకెత్తుతున్న గింజల్ని,
మొలకెత్తుతున్న గింజల్లో విశవ్యాప్తమౌతున్న
జీవ ఆవిర్భావాన్నీ చూడగలగాలి.
పిచ్చివాడా! నువ్వు అర్థం చేసుకుంటే
నిజాన్ని మించిన అందం లేదు-
విజ్ఞానాన్ని మించిన కవిత్వం లేదు-
ప్రతిజీవీ అందమైందే కానీ,
ప్రతిజీవినీ అర్థం చేసుకోగలిగే చేవ – కేవలం మనిషికే ఉంది!
ఇన్ని సూర్యుల మధ్య, ఇన్ని గ్రహాల మధ్య
ఇన్ని వేల కాంతి సంవత్సరాల దూరంలో
ఒక చిన్న భూగ్రహం మీద పుట్టినవాడు – మనిషి
కొలతలు లేని, ఎల్లలు లేని విశ్వాంతరాళాల్లో
పరిభ్రమిస్తున్నవాడు – మనిషి
సత్యమనే అందం కోసం తపించిపోవడమే కాదు,
ప్రాణాన్ని త్యాగం చేయడం కూడా తెలిసినవాడు
అందమైన వాక్యాలతో రాస్తున్నదే కవిత్వం కాదు,
సత్యాన్వేషణలో రాయబడేదంతా ఒక మహాకవిత్వం ఎందుకు కాదూ?
అందమైన భావనకు అక్షర రూపమిచ్చేవాడే కవి అయితే,
అదే అందమైన భావనను ప్రత్యక్షం చేయించేవాడు ఇంకెంత మహాకవి?
కవిత్వానికి ఎల్లలు చెరిపేస్తున్నకవి – వైజ్ఞానికుడు!
ఏ ఆకృతీ లేని చిన్న బండరాయిని తొలిచి రూపం ఇచ్చేవాడే శిల్పి అయితే,
ఆదీ, అంతం లేని విశ్వాంతరాళాన్ని మానవశ్రేయస్సు కోసం
నిరంతరం తొలుస్తున్నవాడు ఇంకా ఎంత పెద్ద శిల్పీ?
నీడలకు భయపడేవాడు, నీడలను ఆరాధించేవాడు మనిషి కాదు
వాడు ఇంకా మనిషిగా ఎదగని తక్కువ స్థాయి జీవి!
మనిషయిన వాడు ఎప్పుడూ మనిషికే జేజేలు పలుకుతాడు
మనిషిని, మనిషి కృషిని అర్థం చేసుకున్నవాడే మహనీయుడవుతాడు!!