- స్వేచ్ఛగా, స్వచ్ఛంగా, క్షేమంగా యాత్ర జరగాలని ఆకాంక్ష
- తాలిబాన్ తరహా ఉగ్రవాదులను పంపేందుకు పాక్ సన్నాహాలు
దాదాపు మూడేళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత ‘అమర్ నాథ్ యాత్ర’ ఈ 30వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. 43 రోజుల పాటు సాగే ఈ యాత్ర రక్షాబంధన్ రోజున,ఆగష్టు 11వ తేదీన ముగియనుంది. హిమాలయ మంచుకొండల్లో ప్రతిఏటా వెలిసే పరమశివుని మంచులింగాన్ని దర్శించుకునేందుకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. భక్తుల యాత్ర సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లతో పాటు కట్టుదిట్టమైన భద్రతను కూడా ఏర్పాటుచేసినట్లు శ్రీ అమర్ నాథ్ దేవాలయ బోర్డు ప్రకటించింది. పరిశుభ్రతపై దృష్టి సారిస్తూ ‘స్వచ్ఛ అమర్ నాథ్ యాత్ర’గా తీర్చిదిద్దాలని ప్రభుత్వ యంత్రాంగం లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. దక్షిణ కశ్మీర్ లోని హిమాలయాల్లో 3880 మీటర్ల ఎత్తైన ప్రదేశంలో ఉన్న అమరనాథుడిని దర్శించుకోడానికి భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడం తరతరాల నుంచి జరుగుతున్న ఆధ్యాత్మిక పర్యాటకమైన ఆనవాయితీ. ఈ ప్రాంతమంతా ఉగ్రవాద ముప్పుతో ఉడికిపోతోంది. స్వచ్ఛయాత్ర ఎట్లా ఉన్నా, స్వేచ్ఛాయాత్ర ముఖ్యం. భక్తులందరూ నిర్భయంగా యాత్రను పూర్తి చేసుకొనే వాతావరణం ఉండాలి. ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా చూడడం అత్యంత ముఖ్యం.
Also read: విశాఖ ఉక్కు ఉసురు తీస్తున్న రాజకీయ పక్షాల దొంగాట
అదను చూసి దెబ్బతీసే ప్రమాదం
అదనుచూసి దెబ్బవేయడానికి ఉగ్రవాదులు పన్నాగాలు పన్నుతూనే వున్నారు. అక్రమ చొరబాట్లు ఇప్పటికే మొదలయ్యాయి. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా పెద్దనష్టం జరిగే ప్రమాదం పొంచివుంది. కోవిడ్ ఇంకా ముగియని వేళ ఇటు పరిశుభ్రత -అటు రక్షణ రెండూ కీలకమైన అంశాలు. అసలే చలిప్రాంతం,దానికి తోడు ఎత్తైన ప్రాంతం కావడంతో ఆరోగ్య సమస్యలు రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. గత రెండు మూడేళ్ళలో అమర్ నాథ్ యాత్ర పూర్తిస్థాయిలో జరుగలేదు. ఆర్టికల్ 370రద్దుతో 2019లో అమర్ నాథ్ యాత్ర మధ్యలోనే రద్దయ్యింది. అనంతరకాలంలో కరోనా విస్తృతి పెరగడంతో ఈ యాత్ర ఆగిపోయింది. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ మొదలైంది. ఈ యాత్ర ప్రారంభమవుతున్న నేపథ్యంలో కశ్మీర్ లో ఉగ్రవాదుల చొరబాటు యత్నాలు కలవరపెడుతున్నాయి. మొన్ననే ఆర్ఎస్ పురా సెక్టార్ దగ్గర అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో పాకిస్థాన్ చొరబాటుదారుడు విఫలయత్నం చేశాడు. బీఎస్ ఎఫ్ అతడిని మట్టుపెట్టింది. తాజాగా దోడా జిల్లాలో ఒక ఉగ్రవాదిని జమ్మూకశ్మీర్ పోలీసులు అదుపులోకి తీసుకొని, అతని దగ్గర వున్న సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కొన్ని రోజుల క్రితం లష్కరే తొయిబా ఉగ్రవాదులు ఈ ప్రాంతంలో హింసను సృష్టించడానికి సిద్ధమయ్యారు. అది కనిపెట్టిన భద్రతాదళాలు వారిని మట్టుబెట్టాయి. యాత్రికులపై దాడి చేయడమే లక్ష్యంగా ఉగ్రమూకలు కదులుతున్నాయి. స్థానికులు కూడా ఎందరో ఉగ్రవాదులుగా మారుతున్నారని కథనాలు వెల్లువెత్తుతున్నాయి.
Also read: సంపన్న దేశాలతో సయోధ్య
మాగ్నటిక్ బాంబుల బెడద
అమర్ నాథ్ యాత్రను రక్తసిక్తం చెయ్యాలనే లక్ష్యంతో మాగ్నెటిక్ బాంబులు, గ్రనేడ్లను ఉగ్రవాదులు సిద్ధం చేసుకుంటున్నారని సమాచారం. మాగ్నెటిక్ బాంబులను తాలిబాన్ మూకలు విరివిగా వాడేవారు. పేలుడు పదార్ధాలకు అయస్కాంతాలు అమర్చి అమెరికా సేనలు, అధికారులను మట్టుపెట్టడంలో వారు సిద్ధహస్తులుగా రుజువు చేసుకున్నారు. కాబూల్ వంటి నగరాల్లో దాడులకు సిద్ధమైనప్పుడు కూడా ఇటువంటి వ్యూహలానే అమలుచేసేవారు. మాగ్నెటిక్ బాంబులను పేల్చడానికి రకరకాల మార్గాలను ఎంచుకునేవారు. పేలుడు పదార్ధాలను చిన్న చిన్న డబ్బాల్లో పెట్టి వాటిని సెల్ ఫోన్లతో అనుసంధానం చేయడంలోనూ తాలిబాన్ మూక బాగా ఆరితేరినవారు. తాలిబాన్ తరహా వ్యూహాలను కశ్మీర్ లో అమలుచేయడానికి పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారని మన ఇంటలిజెన్స్ విభాగం కనిపెట్టింది. కశ్మీర్ లో 2012 ప్రాంతంలోనే ఇటువంటి ప్రయత్నాలు జరిగాయని మన భద్రతాదళాలు గుర్తెరిగాయి. కొన్నాళ్ళ క్రితం పూంచ్ జిల్లాలో కొన్ని మాగ్నెట్ బాంబులను మన భద్రతాదళాలు ఛిద్రం చేశాయి. జమ్మూ కశ్మీర్ ప్రాంతంలో ఉగ్రవాద చర్యలు రావణకాష్టంగా రగులుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో,అమర్ నాథ్ యాత్ర రోజులు వచ్చాయాంటే భయమేస్తోంది. ఏ సమయంలో ఎటువంటి దుర్వార్త వినాల్సి వస్తుందో అనే భయాందోళనలు అందరిలో ఉన్నాయి. ఈ భయాలు తొలగిపోయే రోజు రావాలి.
Also read: మళ్ళీ కలవరం కలిగిస్తున్న కరోనా
ఉగ్రవాదం అంతం కావాలి
పాకిస్థాన్ కు చెందిన ఉగ్రవాదులు ఎన్నో రహస్య సొరంగాలను కూడా నిర్మించారు. కొన్ని వెలుగులోకి వచ్చాయి. బయటపడని సొరంగాలు ఇంకా ఎన్నో ఉంటాయనే అనుమానించవచ్చు. అమర్ నాథ్ హిందువులకు అతిపవిత్రమైన పుణ్యక్షేత్రం. హిమాలయ గుహల్లో ఉండే శివుడు మంచురూపంలో ఉంటాడు. ఈ మంచు శివలింగాన్ని చూడడానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు ఎన్నో వ్యయప్రయాసలతో తండోపతండాలుగా తరలి వస్తుంటారు. ఉగ్రవాదం ప్రబలినప్పటి నుంచీ అమర్ నాథ్ యాత్రకు వెళ్లిన వారెందరో అమరులైన రక్తచరిత్ర మన వెనకాల ఉంది. ఉగ్రవాదాన్ని తుద ముట్టించకపోతే మానవాళికి ప్రాణగండం తప్పదు. ఈ యజ్ఞంలో ప్రపంచ ప్రజాస్వామ్య దేశాలన్నీ కలిసి రావాలి, కదలి సాగాలి. జర్మనీలో జీ -7 శిఖరాగ్ర సదస్సు జరుగుతున్న ఈ వేళల్లో ఉగ్రవాద అంశం ముఖ్య చర్చనీయాంశమవ్వాలి. పరిష్కార మార్గాలను కనిపెట్టాలి. ఉగ్రవాదాన్ని ప్రేరేపించే పాకిస్థాన్ వంటి దేశాలను కట్టడి చేయాలి, సభ్యసమాజాల నుంచి వెలివెయ్యాలి.భారత్ లో చెలరేగుతున్న సరిహద్దు సమస్యలు సమసిపోయే విధంగా సత్వరం ముందుకు సాగాలి.ముఖ్యంగా జమ్మూకశ్మీర్ లో అభివృద్ధి,శాంతి, ప్రజాస్వామ్యం వేళ్లూనుకోవాలి. ఇవి జరగనంతకాలం అమర్ నాథ్ యాత్రల వంటివి భయపెడుతూనే ఉంటాయి.
Also read: ‘మహా’సంక్షోభం