డిసెంబర్ 5… హయగ్రీవాచారి వర్ధంతి
రాజకీయాలలో రాణించడం అంత సులువేమీ కాదు. ప్రజలను నిత్యం అంటిపెట్టుకుని, వారి సమస్యలను పరిష్కరిస్తూ, ప్రజా సేవకు అంకితం అయినా, ప్రజా ప్రతినిధులపై అసంతృప్తి ఉండడం అత్యంత సహజం. అందునా ఒక ప్రజా ప్రతినిధి తాను ప్రాతినిథ్యం వహిస్తున్న సెగ్మెంట్ ను కాకుండా, ఇతర నియోజక వర్గం నుండి గెలుపొందడం చాలా అరుదైన విషయమే. అలా మూడు నియోజక వర్గాల నుండి విజయం సాధించి రాష్ట్ర శాసనసభకు వెళ్ళిన అరుదైన నేతగా గుర్తింపు పొందారు వరంగల్ జిల్లాకు చెందిన హయగ్రీవాచారి. అంతే కాదు. నలుగురు ముఖ్యమంత్రుల వద్ద మంత్రిగా పని చేసిన ఘనతను దక్కించుకున్న గొప్ప ప్రజా ప్రతినిధి ఆయన.
వాస్తవంగా హయగ్రీవాచారి వరంగల్ జిల్లా ధర్మసాగర్ వాసి. ఆయన స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గం జనరల్‌గా ఉన్నప్పుడు అక్కడ ఒకసారి గెలిచారు. అలాగే ధర్మసాగర్ నుండి రెండు సార్లు, హన్మకొండ నుంచి ఒక సారి గెలిచారు. హయగ్రీవాచారి 1916 నవంబర్ 25 న ధర్మసాగర్ గ్రామంలో జన్మించారు. తిరునగరి శ్రీనివాసాచార్యులు అండాళమ్మ ఆయన తల్లిదండ్రులు. మూడవ తరగతి వరకు ధర్మసాగర్ లోని వీధి బడిలో చదివారు. కాంతంరాజు, రావుల నరసింహరెడ్డి వద్ద పెద్ద బాలశిక్ష చదివారు. ఆ తరువాత వారి కుటుంబం హన్మకొండ పట్టణంలో స్థిరపడింది. ఆ రోజుల్లో హైదరాబాద్ సంస్థానంలో ప్రతి జిల్లా కేంద్రంలో ఒక ఉన్నత పాఠశాల ఉండేది. ఉన్నత పాఠశాలల్లో చదివే రోజుల్లోనే హయగ్రీవాచారిపై జాతీయోద్యమ ప్రభావం తీవ్రంగా పడింది. 1932లో నిర్వహించిన కాకతీయ ఉత్సవాలు ఆనాటి యువకులను ఉత్సాహ పరిచాయి. ఎంతో మందిలో ఉత్తేజాన్ని నింపాయి. ఆ ఉత్సవాల నిర్వహణలో పర్సా రంగారావు, ఉదయ రాజుశిషగిరిరావు, ఆవంచ వెంకట్రావు, మాదిరాజు రామకోటేశ్వరరావు, కాళోజీ రామేశ్వరరావులతోపాటు విద్యార్థి సేవాదళ బాధ్యునిగా హయగ్రీవాచారి పని చేశారు. 1935లో హయగ్రీవాచారి మెట్రిక్ పరీక్షలో ఉత్తీర్ణులై ఇంటర్ లో ప్రవేశించారు. హైదరాబాద్ చేరి చదువు మధ్యలోనే ఆపేశారు. ఆ తర్వాత ఆయన పూర్తి జీవితాన్ని ప్రజా సేవకే అంకితం చేశారు. వరంగల్లు అయ్యగారుగా ఆయన సుపరిచితులు. నిజాం వ్యతిరేక పోరాటం లో ప్రముఖ పాత్ర ఆయనది. స్వాతంత్రోద్యమంలో వరంగల్ నుంచి ఎదిగిన తొలితరం కాంగ్రెస్ నాయకుల్లో ఆయనొకరు. రాజకీయ సామాజిక రంగాల్లో ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్లో ఆయన తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న నాయకుడిగా గుర్తింపు పొందారు. నిజాం నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకంగా స్వామి రామానందతీర్థ నాయకత్వంలో పోరాటం సాగించిన కొద్దిమంది నాయకులలో ఆయన ఒకరు. ఆయనే తిరునగరి హయగ్రీవాచారి. హైదరాబాద్ హిందీ ప్రచార సభ అధ్యక్షుడిగా, హిందీ ప్రతిష్టాన్ వ్యవస్థాపకులుగా హిందీ భాషకు ఆయన చేసిన సేవ ఎంతో గొప్పది. వరంగల్ పట్టణంలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించడానికి హయగ్రీవాచారి ఎంతో శ్రమించారు. ఆయన కృషి ఫలితంగానే వరంగల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ వశమైంది. వయోజన ఓటింగ్ పద్ధతపై ఎన్నికైన వరంగల్ పురపాలక సంఘ తొలి అధ్యక్షుడిగా హయగ్రీవాచారి ఎన్నికయ్యారు. స్వాతంత్ర్యానంతరం ఆయన చేపట్టిన తొలిపదవిగా, వరంగల్ పురపాలక సంఘం తొలి అధ్యకుడిగా పని చేశారు.
హయగ్రీవాచారి అవిభాజ్య వరంగల్ జిల్లా నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, నలుగురు సీఎంల మంత్రివర్గంలో సభ్యుడిగా పనిచేశారు. 1972 నుంచి ఆయన మంత్రిగా పనిచేశారు. పీవీ నర్సింహారావు, డాక్టర్ మర్రి చెన్నారెడ్డి, టంగుటూరు అంజయ్య, భవనం వెంకట్రామిరెడ్డి మంత్రి వర్గాలలో ఆయన పనిచేశారు. ఆయన నిర్వహించిన పదవులను సమర్థవంతంగా చేశారనే పేరును సంపాదించు కున్నారు. పంచాయతీరాజ్, సాంకేతిక విద్య మొదలైన శాఖలను ఆయన నిర్వహించిన కాలంలో ఆయా శాఖల ను సమర్థ వంతంగా నిర్వహించారని ఆయన పేరు తెచ్చుకున్నారు.
1962 శాసనసభ ఎన్నికలలో ధర్మసాగర్ నియోజకవర్గం నుండి, 1972 శాసనసభ ఎన్నికలలో స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గం నుండి, 1978 శాసనసభ ఎన్నికలలో హనమకొండ నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికయ్యారు. మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గంలో రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖామంత్రిగా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యుడిగా వ్యవహరించారు. ఆంధ్రప్రదేశ్ స్వాతంత్ర్య సమరయోధుల సంఘానికి అధ్యక్షుడిగా కూడా ఇతడు కొంతకాలం ఉన్నారు.1950-52లో వరంగల్ జిల్లా పారిశ్రామిక సలహా మండలి సభ్యులుగా జిల్లా లో పరిశ్రమల స్థాపనకు కృషి చేశారు.
సహకార ఉద్యమ వ్యాప్తిలోనూ, బలహీన వర్గాల పురోగతిలోనూ అయ్యగారి అసాధారణమైందని చెపుతుంటారు. హయగ్రీవాచారిని “అయ్యగారు” అని ముద్దుగా పిలుచుకునేవారు. ఆయన చేపట్టిన అనేక పదవుల ద్వారా అందివచ్చిన అవకాశాన్ని ఆయన సద్వినియోగం చేసుకున్నారు. వరంగల్ పురపాలక సంఘం ప్రధమ ఛైర్మన్‌గా, మంత్రిగా పనిచేస్తూ విభిన్న వర్గాల అభివృద్ధిని ఆకాంక్షిస్తూ పలు నిర్ణయాలు తీసుకోవడంలో ఆయనను ప్రత్యేక పాత్ర పోషించారని ఆయన అభిమాను కాంగ్రెస్ నాయకులు హయగ్రీవా చారి చేసిన సేవల్ని ఎల్లపుడూ గుర్తుచేసు కుంటారు. వరంగల్ జిల్లాలో వివిధ స్థాయిలో వివిధ అంశాలపై మహాసభలు నిర్వహించడంలో ఆయన పాత్ర కృషి చెప్పుకోదగింది.
వరంగల్ పట్టణానికి పోచంపాడు నీళ్లు తీసుకువచ్చి వరంగల్, హన్మకొండ, కాజీపేట పట్టణాలలో మంచినీటి కొరత తీర్చటంలో హయగ్రీవాచారి ఎంతో కృషి చేశారని ఆయనకు పేరుంది. వరంగల్ జిల్లా బోర్డు వైస్ చైర్మనగా హయగ్రీవాచారి జిల్లా సర్వ తోముఖాభివృద్ధికి ఎంతో కృషి చేశారని గుర్తు చేసుకుంటారు. హయగ్రీవాచారి 1991, డిసెంబర్ 5వ తేదీన పీపుల్స్ వార్ గ్రూపు నక్సలైట్లచే హనుమకొండ లోని స్వంత ఇంటిలో హత మార్చ బడ్డారు.