- సగం గ్లాసు ఖాళీగా ఉన్నట్టుంది పరిస్థితి
- తెలియకుండానే అధ్యక్ష బాటలో నడుస్తున్నామా?
- మంచి గతమున కొంచెమేనోయ్ అనడం సమంజసమా?
- గాంధీ, నెహ్రూలను భ్రష్టుపట్టించడం భావ్యమా?
ఈ సారి రిపబ్లిక్ డే (26 జనవరి 2022)కి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. భారతదేశ భవితవ్యానికి ఇది మలుపు కావచ్చు. గణతంత్ర (రిపబ్లిక్) వ్యవస్థగా కొనసాగుతూ 75 ఏళ్ళ కిందట మన రాజ్యాంగనిర్మాతలు ఆశించిన, ఊహించిన ఫలితాలు సాధిస్తామా? లేదా ఇప్పుడున్న పరిస్థితి గ్లాసు నీటితో సగం నిండి ఉన్నదన్నట్టుగా కనిపిస్తున్నది కనుక సరికొత్త రాజ్యాంగంతో రెండవ గణతంత్ర వ్యవస్థకు దారితీస్తామా? 2022-2024 మధ్య కాలంలో ఈ సందిగ్ధావస్థ మెలికలు, మలుపులు తిరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంతవరకూ మనం 17 సార్వత్రిక ఎన్నికలు జరుపుకున్నాం. ఎన్నికల ఫలితాలకు అనుగుణంగా అధికారం చేతులు మారింది. అధికారంలో ఉన్న పార్టీని ఎనిమిది విడతల తిరస్కరించాం. పది మంది ప్రధానమంత్రులను చూశాం. ఇతర దేశాలతో పోల్చితే ఇదే ఒక అద్భుతం. ఈ కాలంలోనే మనం మతకలహాలతో చింపిన విస్తరిలాగా తయారయ్యే ప్రమాదంలో ఉన్న స్థితి నుంచి, దారిద్ర్యం తాండవిస్తున్న స్థాయి నుంచి, పారిశ్రామికంగా ప్రాథమిక వసతులు కూడా లేకుండా, దేశం అంతా నిరక్షరాస్యత గూడుకట్టుకున్న స్థితి నుంచి బయటపడి ఆధునిక రాజ్యంగా ఎదిగాం. ఈ రోజు పాశ్చాత్య దేశాలలోని పెద్ద, ఉన్నతస్థాయి సంస్థలలో శాస్త్రజ్ఞులుగా, సాఫ్ట్ వేర్ ప్రవీణులుగా, హార్డ్ వేర నేర్పరులుగా, యాజమాన్యాలలో ఉన్నతాధికారులుగా పని చేస్తున్నవారిలో దాదాపు ముప్పయ్ శాతం మంది భారతీయ సంతతివారే. ఆర్థిక రంగంలో కూడా మనం ప్రపంచంలో నాలుగో పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగాం. ఇప్పుడు కొరతలు, లోటు లేని దేశం మనది. మనం జనాభా పెంచుకుంటూనే, చట్టపాలన కొనసాగిస్తూనే, ఎప్పటికప్పుడు లోపాలను సరిదిద్దుకునే (చెక్స్ అండ్ బ్యాలెన్స్) వ్యవస్థను కాపాడుకుంటూనే ఇదంతా సాధించాం.
Also read: ప్రపంచ సంస్థల సూచీలలో ర్యాంక్ లను పట్టించుకోకుండా ఉందామా?
కొత్త తరహా పాలనావ్యవస్థ
ఆరు దశాబ్దాలకు పైగా సాధించిన ప్రగతిని చెరిపివేసే ప్రయత్నం చేస్తూ కొత్త పరిపాలనావ్యవస్థను ప్రతిష్టించే కార్యక్రమం దేశంలో జరుగుతూ ఉంది. మన గణతంత్రానికి గతంలో వేసిన పునాదులనూ, చేసిన నిర్మాణాన్నీ, దాని ప్రయాణ దిశనూ ప్రశ్నిస్తూ గతంలో పూర్వీకులు ఎవ్వరూ లేనట్టూ, భవిష్యత్తులో వారసులు ఎవ్వరూ ఉండబోరన్నట్టూ ప్రస్తుత పాలకులు వ్యవహరిస్తున్నారు. ఈ ధోరణి ఫలితంగా కొన్నేళ్ళుగా భారత గణతంత్రం మలుపులు తిరుగుతోంది. మెలికలు తిరుగుతోంది. విమర్శకుల భయసందేహాలను గుర్తించడానికి నిరాకరించజాలం. భయసందేహాలు ఇవి: మొదటిది, గాంధీ-నెహ్రూ జమానాకు పరువునష్టం కలిగించే విధంగా వారిని బదనాం చేస్తున్నారు. ఈ క్రమంలో ఉదారవాద ప్రజాస్వామ్యానికి బాటలు వేసిన ధీరులు నిన్నటి బడాచోరులుగా చిత్రించబడుతున్నారు. జాతీయవాదులు ప్రాంతీయతత్వంతో ఇరుకు మనసులతో వ్యవహరిస్తున్నట్టు అభివర్ణించబడుతున్నారు. నవభారత నిర్మాతలను కూడా దుర్భాషలాడుతున్నారు. గతంలో వారు నెలకొల్పిన వ్యవస్థలలోని శక్తిని ఉపయోగించుకొని ముందుకు కదలడానికి బదులు వారిని భ్రష్టుపట్టించే ప్రయత్నం చేస్తున్నారు. రెండు, ఇంతకు మునుపు దేశంలో అభివృద్ది అంటూ ఏమీ జరగలేదనీ, మన స్వాతంత్ర్యం కూడా మనం పోరాడి సాధించుకున్నది కాదనీ, బ్రిటిష్ వలసపాలకులు దయదలచి ఇచ్చారనీ చెబుతున్నవారు సైతం దాపురించి స్వాతంత్ర్య సమరాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. మూడు, ప్రభుత్వం అనేది నిరంతరంగా కొనసాగే వ్యవస్థ ఇక ఎంతమాత్రమూ కాదనీ, ప్రభుత్వం అధిక సంఖ్యాకులకే చెందిందనే అభిప్రాయం క్రమంగా బలపడుతోంది. ఇదంతా చూస్తుంటే మనకు అధికారికంగా, లాంఛనప్రాయంగానైనా చెప్పకుండానే దేశం అధ్యక్షత తరహా పాలనవైపు నడుస్తున్నట్టు కనిపిస్తున్నది. ఈ గణతంత్ర దినోత్సవం కొత్త ఆశను రేకెత్తిస్తుందనీ, మన భవితవ్యం పట్ల మరింత భరోసా కలిగిస్తుందనీ ఆశిద్దాం.
Also read: భారత్ అగ్రరాజ్యం కాకుండా నిరోధిస్తున్నఅవరోధం ఏమిటి? రాజకీయాలకు అతీతమైన దృక్పథం లేకపోవడమేనా?
స్వగ్రామంలో 52 ఏళ్ళ తర్వాత గణతంత్ర వేడుకల్లో నేను…
మా గ్రామంలో ఈ సంవత్సరం గణతంత్ర దినోత్సవంలో 52 సంవత్సరాల తర్వాత పాల్గొనబోతున్నాను. ఇతర పండుగల మాదిరిగానే మా తల్లిగారు జనవరి 26, ఆగస్టు పదిహేను వేడుకలను కూడా ఉత్సాహంగా జరుపుతూ ఉండేవారు. పొరుగువారిని ప్రేమించాలనే విలువను ఎప్పటికీ గుర్తుంచుకునే విధంగా ఈ సందర్భాలలో పిల్లలకు నూరిపోసేవారు. అమెరికాలో పీహెచ్ డి చేసి 15 ఆగస్టు 1970నాడు స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలలో పాలుపంచుకోవాలనే ఉత్సాహంతో మా గ్రామానికి తిరిగి వచ్చాను. మానవతావాదంలోని మౌలిక విలువలను చుట్టుపక్కల పిల్లలలో బలంగా నాటడానికి మా అమ్మగారు ప్రయత్నించేవారు. నాకూ, నేనూ అనకుండా మాకూ,మేము అనే విధంగా కలుపుకొనిపోయే మనస్తత్వం పిల్లలలో పెరిగే విధంగా విలువలు పాదుగొల్పేవారు. వేడుక చివరలో అందరికీ కొబ్బరి, బెల్లం పంచేవారు. 75 ఏళ్ళ కిందట మా నాన్నగారి చొరవతో మా గ్రామంలో నిర్మించిన హైస్కూలులో పిల్లలతో, ఉపాధ్యాయులతో ఈ సంవత్సరం గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాను.
Also read: పీకే ఎన్నికల తంత్రమే గెలుపు మంత్రమైతే ప్రజాస్వామ్యం ఏమౌతుంది?
వలసల తీరు మారేనా?
కడచిన దశాబ్దంలో దేశంలో పదికోట్ల మంది భారతీయులు పట్టణాలకూ, నగరాలకూ పల్లెల నుంచి వలస వెళ్ళారు. మా గ్రామం నుంచి కూడా వలస వెళ్ళారు. ఇదంతా స్పష్టంగా రికార్డులలో నమోదై ఉన్న వాస్తవం. ఈ ధోరణి తిరగబడుతుందనీ, వలసల తీరు మారుతుందనీ ఊహించగలమా? కోవిద్ మహమ్మారి కరాళనృత్యం కొనసాగుతున్న నేపథ్యంలో దేశంలోని కొన్ని ప్రాంతాలలో పట్టణాల నుంచి పల్లెలకు తిరిగి వచ్చి స్థిరపడుతున్నట్టు సమాచారం అందింది. పల్లెలకు తిరిగి వచ్చే ధోరణికి తగినట్టు నేను మా గ్రామంలో వందేళ్ళనాటి పాత ఇంటి స్థానంలో కొత్త ఇల్లు కట్టించాను. కొత్త ఇంటిలో బాలలకోసం గ్రంథాలయం ఉంటుంది. అందులో పిల్లలకు ప్రేరణ కలిగించే లబ్ధప్రతిష్టుల (గొప్పవారి) జీవిత చరిత్రలు ఉంటాయి. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం 2003 నుంచి 2012 వరకూ దశాబ్దంపాటు శ్రమించి పూరా (PURA-Providing Urban Amenities to Rural Areas) అనే గ్రామీణ ప్రాంతాలలో పట్టణ వసతులు కల్పించే కార్యక్రమం ద్వారా పట్టణాలకూ, నగరాలకూ పల్లెలనుంచి వలసలు నిరోధించాలనే స్వప్న సాకారానికి విఫలయత్నం చేసిన సంగతి నాకు జ్ఞాపకం వస్తోంది. ఆరవై ఏళ్ళ కంటే పూర్వం ఆ సమయంలో వరిష్ఠ నాయకుడు కాకాని వెంకటరత్నం మొదట జిల్లా బోర్డు అధ్యక్షుడుగా, తర్వాత ఎంఎల్ గా, మంత్రిగా ప్రతిగ్రామంలో పాఠశాల స్థాపించి గ్రామీణ ప్రాంతాలలో సౌకర్యాలు పునరుద్ధరించేందుకు కృషి చేశారు. అవిభక్త ఆంధ్రప్రదేశ్ లోని పల్లెలలో రెండు వేల మంది నాయకులను ఆవిష్కరించిన అసాధారణ నేతగా ఎన్. టి. రామారావు చరిత్రలో నిలిచిపోతారు. సకారాత్మకమైన ఉదాహరణలుగా ప్రగతి సాధించిన చాలా ఆదర్శ గ్రామాలు కనిపిస్తాయి. గ్రామాల పాటవాన్ని టెలికాం విప్లవం మార్చివేసింది. రోడ్లు, రవాణా సదుపాయాలు పెరిగాయి. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చొరవ కూడా ప్రగతికి తోడ్పడింది. బహుముఖీనమైన ఈ అభివృద్ధి కారణంగా కనీసం సంకేతప్రాయంగానైనా పట్టణాల నుంచి గ్రామాలకు వలసలు ప్రారంభం కావాలి. నాకు నడవడిక, విలువలు, సమాజహితం గురించి ఆలోచించడం నేర్పిన మా గ్రామంలోనే ఉండాలని అనుకుంటున్నాను. గత ముప్పయ్ సంవత్సరాలుగా ప్రతి ఏటా మా గ్రామాన్ని ఒక్కసారైనా సందర్శించేవాడిని. వాటిలో ఇరవై సంవత్సరాలు మా వెంట గ్రామీణాభివృద్ధికి దీక్షాబద్ధులై దశాబ్దాలపాటు కృషి చేసిన మా నాన్నగారు ఉండేవారు.
Also read: పౌరుల ప్రభుత్వాధీనత పెరుగుతోంది, పార్లమెంటరీ ప్రజాస్వామ్య స్ఫూర్తి తగ్గుతోంది
నాటి నాయకులు తీరే వేరు
మా గ్రామంలో చాలా ఏళ్ళుగా పది ప్రాథమిక సంస్థలు ఉన్నాయి. ఇదివరకు వికేంద్రీకరణ విధానం అమలు జరిగేది కనుక ఆ సంస్థలు వచ్చాయి. మా గ్రామంలో కనీసం 40 మంది స్వాతంత్ర్య సమరయోధులు ఉండేవారు. ఎక్కువ మంది సమరయోధులు ఉన్నకారణంగా రాజకీయాలు ముమ్మరమై మా గ్రామం నష్టపోలేదు. పైగా లబ్ధిపొందింది. ఆ రోజుల్లో దూరదృష్టి కలిగిన నాయకులు పార్టీ విధేయతలనూ అభివృద్దికి ముడిపెట్టేవారు కాదు. వాటికి అతీతంగా వ్యవహరించేవారు. చర్చలనూ, సమాలోచననూ వారు ప్రోత్సహించేవారు. పార్టీలూ, కులాలూ, సామాజికవర్గాల కారణంగా గ్రామం ప్రయోజనాలు ఎన్నడూ దెబ్బతినలేదు. ఇప్పుడు గ్రామంలో ఉన్న ప్రాథమిక సదుపాలూ, సంస్థలూ, రోడ్లూ, ఇతర సౌకర్యాలూ అన్నీ పాతవే. గణతంత్ర స్ఫూర్తి గ్రామంలో స్పష్టంగా కనిపిస్తుంది. కలసి సమష్టిగా పని చేసే సంస్కృతి పెంపొందింది. అప్పటికీ గ్రామాలు కాలనీలుగా, ఉపగ్రహాలుగా మారలేదు. గ్రామీణ ప్రజలు అన్నిటికీ ప్రభుత్వంపైన ఆధారపడటం ఉండేది కాదు. ప్రజావాణి అప్పటికింకా రాజకీయ వాణిగా దిగజారలేదు. పంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తుపైన జరిగేవికావు. గణతంత్రంలో జరిగిన మొదటి రెండు, మూడు ఎన్నికలలో అధికారంలో కొనసాగడానికి ఎన్నికలలో అక్రమాలు చేయడం అనేది వినబడేది కాదు.
Also read: జనాభా విధానం ఎన్నికల హెచ్చరికా? ఎన్నికల వాగ్దానమా?
దిల్లీలో పల్లెటూరి పిల్లగాడు
మనం సాధించిన ప్రగతి గురించి వస్తునిష్టంగా నా తాజా పుస్తకం ‘రిజువనేటింగ్ ద రిపబ్లిక్’ (గణతంత్రాన్ని పునరుజ్జీవింపజేయడం) లో వివరించాను. ఇది కొనసాగుతున్న కార్యక్రమం అని భావించాలా, సగం ఖాళీగా ఉన్న గ్లాసుగా పరిగణించాలా? ఈ పుస్తకానికి రాసిన ముందు మాటలో కేంద్ర మాజీ మంత్రి సురేష్ ప్రభు ఇలా వ్యాఖ్యానించారు: ‘‘రాజకీయ నాయకులలో కూడా రాజ్యాంగం మౌలిక విలువల గురించి అవగాహన, వాటిపట్ల గౌరవం బొత్తిగా లేదని క్రమంగా బయటపడుతోంది.’’ గణతంత్రం అంటే ఏమిటో, దాని గురించి వివిధ ఆలోచనలు ఏమిటో, దానికి సంబంధించి ప్రజలలో ఉన్న అయోమయం, సందిగ్థావస్థ ఏమిటో ఈ పుస్తకంలో వివరించాను. ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయో గుర్తించడమే కాకుండా పరిణామస్వభావం కలిగిన జోక్యం ఎట్లా చేసుకోవాలో, ప్రభావవంతమైన చొరవలు ఎట్లా తీసుకోవాలో కూడా ఈ పుస్తకం సూచిస్తుంది. ఈ సమస్యలను అర్థం చేసుకొని పరిష్కరించుకోవడానికి వచ్చే రెండేళ్ళలో కనుక నిజాయితీతో ప్రయత్నం జరగకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థ, అభివృద్ధి, పరిపాలన వ్యవస్థ పునాదులు నిలబడజాలవు. గ్రామంలో ఎక్కువ సమయం ఉండబోతున్నాను కనుక కొత్త విషయాలు నేర్చుకుంటాను. దిల్లీ కేంద్రంగా చేసే ఆలోచనలలోని లోపాలను సవరించుకుంటాను. అయితే, ఇన్ని దశాబ్దాలుగా దిల్లీలో ‘పల్లెలూరి పిల్లగాడి’ (విలేజ్ బోయ్ ఇన్ న్యూదిల్లీ) లాగనే ఉన్నాను.
Also read: చర్చ లేకుండా బిల్లుల ఆమోదం: రాజ్యాంగ సూక్ష్మాన్ని గుర్తు చేసిన ప్రధాన న్యాయమూర్తి
(డాక్టర్ ఎన్. భాస్కరరావు ప్రభుత్వ విధానాలను అధ్యయం చేసి విశ్లేషించే మేధావి. డజనుకు పైగా పుస్తకాలు రచించారు.)