Monday, January 27, 2025

ఐఏఎస్ వ్యవస్థ మీద దేశానికి నమ్మకం పోయిందా? ‘అవును’ అంటున్నారు డాక్టర్ దువ్వూరి సుబ్బారావు

ఇటీవలి కాలంలో తరచూ న్యాయ స్థానాలు రాష్ట్ర ప్రభుత్వాల్లో గానీ, కేంద్రంలో గానీ ప్రభుత్వాలను నడిపే ఐఏఎస్ ల జవాబుదారీతనం గురించి ప్రస్తావిస్తున్నాయి. వివిధ అంశాల్లో ఇది ప్రస్ఫుటంగా కనుపిస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఇందుకు మినహాయింపు కాదు.

తాజాగా ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులకు రెండువారాలు జైలు శిక్షను కూడా విధించింది. (ఈ శిక్షను మళ్ళీ సేవా కా

ర్యక్రమంగా మార్చింది.)

ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసుల వ్యవస్థకి చెందిన అధికారులు ఇంత తరచుగా న్యాయస్థానాల ముందు తల ఒంచుకొని నిలబడాల్సిన పరిస్థితి ఇటీవలి దశాబ్దాల కాలంలోనే ఎందుకు జరుగుతోంది?

దీనికి జవాబు డాక్టర్ దువ్వూరి సుబ్బారావు రాసిన వ్యాసంలో లభించవచ్చు.

సుబ్బారావు  సివిల్ సర్వీసు పరీక్షల్లో (1972లో)  దేశంలో కెల్లా అగ్రస్థానంలో ఎంపికైన తొలి తెలుగు వాడు. కళంకంలేని కెరీర్ లో రిజర్వుబ్యాంకు గవర్నర్ స్థాయి వరకూ అవిభక్త ఆంధ్రప్రదేశ్, కేంద్ర ప్రభుత్వాలలో కీలక పోస్టుల్లో పనిచేసిన వ్యక్తి.

రిజర్వు బ్యాంక్ రాతిగోడల వెనకాల పుస్తకం ద్వారా మన జీవితాల మీద రిజర్వు బ్యాంకు విధానాల ప్రభావం గురించి వెలుగులోకి తెచ్చిన రచయిత.

ToI (టైమ్స్ ఆఫ్ ఇండియా)లో రాసిన వ్యాసంలో సుబ్బారావు ఐఏఎస్ ల వ్యవస్థ ఇప్పటి తీరుతెన్నుల గురించి వెలుగులోకి తెచ్చిన విషయాలు ఇప్పటి పరిస్థితులకు అద్దం పడుతున్నాయి.

– వల్లీశ్వర్, 9440446444

—-  —————-  ——————-

ఐఏఎస్ వ్యవస్థ మీద మనదేశానికి నమ్మకం పోయిందా?

Duvvuri Subbarao | Center for the Advanced Study of India (CASI)
డాక్టర్ దువ్వూరి సుబ్బారావు

“లేదు” అని ఎవరన్నా ఎలుగెత్తి చెబుతుంటే వినాలని నా ఆశ. కాని నాకు ఆవేదన కలిగిస్తున్న విషయం ఏమిటంటే – అలా వినే అవకాశం లేదన్న వాస్తవం.

ప్రజల దృష్టిలో ఇవాళ ‘ఐఏఎస్’ అధికారి అంటే దర్జాగా జీవిస్తూ, తన అవసరాలకే ప్రాధాన్యతనిస్తూ, సమాజంలో ఉన్న వాస్తవ పరిస్థితులకు  భిన్నంగా పాలనలో యాంత్రికంగా పనిచేసుకుపోతున్న అధికార గణం. తమ సౌకర్యాలూ, తమ హోదాల కోసం వెంపర్లాడుతూ, ఏది న్యాయమో దానికోసం ఆత్మ విశ్వాసంతో నిలబెట్టగల వెన్నెముక లేని అధికార యంత్రాంగం.

ఈ వ్యవస్థ గతంలో ఇలా లేదు. 1970 దశకంలో ఆరంభంలో నేను ప్రభుత్వ యంత్రాంగంలో భాగంగా అవిభక్త ఆంధ్ర ప్రదేశ్ సర్వీసులోకి అడుగుపెట్టాను. ఆ రోజుల్లో ఏదన్నా కుంభకోణం, అధికార దుర్వినియోగం జరిగిందంటూ అసెంబ్లీలో ప్రతిపక్షంవాళ్ళు విరుచుకు పడితే, వెంటనె ముఖ్యమంత్రి కల్పించుకొని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి చేత  విచారణ జరిపిస్తామని ప్రకటించేవారు. అక్కడితో అప్పటికి ప్రతిపక్షాలవారు శాంతించేవారు. ఇవాళ అలాంటి కుంభకోణం ఏదన్నా శాసనసభను కుదిపేస్తే ముఖ్యమంత్రి లేచి అదే విధంగా ప్రకటన చేస్తే నవ్వులపాలయ్యే పరిస్థితి వచ్చింది.

ఐఏఎస్ వ్యవస్థ ప్రతిష్ట పతనం ఏ తేదీన మొదలయిందో ఖచ్చితంగా చెప్పటం కష్టం.

మన దేశానికి స్వాతంత్ర్యం సాధించుకోగానే, అప్పటివరకూ ఉన్న బ్రిటిష్ ఇండియా కాలంనాటి ఐసిఎస్ (ఇండియన్ సివిల్ సర్వీస్) కి దీటుగా ‘ఐఏఎస్ ‘ వ్యవస్థని మన ప్రభుత్వం ప్రవేశపెట్టింది. పేదరికం, నిరక్షరాస్యతలతో కొట్టుమిట్టాడుతున్న ఈ దేశంలో తొలిసారిగా – ‘ప్రజాస్వామ్యం’ అనే స్వపరిపాలనా వ్యవస్థ వ్రేళ్ళూనుతున్న దశలో, నవ భారత నిర్మాణం అనే బృహత్తర బాధ్యతను తలకెత్తుకునే స్వదేశీ వ్యవస్థగా ‘ఐఏఎస్ ‘ అవతరించింది.

వ్యవసాయాభివృద్ధి, భూసంస్కరణలు, నీటిపారుదల పథకాల నిర్మాణం, పారిశ్రామికాభివృద్ధి, విద్య-వైద్య రంగాల అభివృద్ధి, చట్టాలు సమర్థంగా అమలు జరిగేలా చేయటం ద్వారా సామాజిక న్యాయాన్ని సాధించటం వంటి కార్యక్రమాలలో ఆధారపడదగిన ‘డెలివరీ విభాగం’ గా ఐఏఎస్ యంత్రాంగాన్ని సమాజం చూసింది.

ఇలా నవభారత నిర్మాణాన్ని ఐఏఎస్ లు ముందుండి సాగించారు. శూన్యంలోంచి ఒక శక్తిమంతమైన, అభివృద్ధి  స్ఫూర్తితో  పనిచేసే సువ్యవస్థని నిర్మించారు. సామర్ధ్యం, అంకితభావం, నిజాయితీల విషయంలో వాళ్ళు ఒక మేరు పర్వతంలా ఈ సర్వీసుల ప్రతిష్టని నిలనెట్టారు.

తరువాత దశాబ్దాలలో ఈ ప్రతిష్ట క్రమంగా నీరుకారిపోవటం మొదలైంది.

‘ఐఏఎస్ ‘ మౌలిక ప్రమాణాలు గాడి తప్పాయి. నైపుణ్య రాహిత్యం, ఉదాసీన వైఖరి, అవినీతి ప్రవేశించాయి. ఈ వ్యవస్థకి ఇలాంటి అప్రతిష్ట అంటడానికి కారణం – దారి తప్పిన కొద్దిమంది ఐఏఎస్ అధికారులే. కాని ఆ కొద్దిమంది వ్యవహార సరళి ప్రభావం మాత్రం ‘కొంచెం ‘ కాదన్న వాస్తవం ఆవేదన కలిగిస్తోంది.

రాష్ట్రం కోసం పనిచేసే ఒక ముఖ్యమంత్రి నాతో ఒకసారి ‘ప్రభుత్వ సర్వీసుల్లో ప్రమాణాల’ గురించి మాట్లాడుతూ ఒక విశ్లేషణ చేశారు.”ఐఏఎస్ అధికారుల్లో నాలుగోవంతుమంది  ఉదాసీనంగా, యాంత్రికంగా పని చేసుకుపోతున్నారు. సగం మంది అసమర్థులు లేదా (సమర్ధులైన) అవినీతిపరులు. మా ప్రభుత్వం రచించే అభివృద్ధి ప్రణాళికలు సమర్థంగా అమలు జరగాలంటే, మేం ఆధారపడదగిన ఐఏఎస్ లు ఆ మిగిలిన 25 శాతమే…… ఈ నేపథ్యంలో అభివృద్ధి వేగాన్ని ఎలా పెంచగలం?”

ప్రధానమంత్రి సయితం గత ఏడాది పార్లమెంటులో ఒక సందర్భంలో ఇలాంటి భావాన్నే వ్యక్తం చేశారు. “పాలనా వ్యవస్థలో ‘బాబు సంస్కృతి’ (ఢిల్లీ లాబీల్లో అవినీతిపరులకు పర్యాయపదం) విస్తరించటం దురదృష్టకరం….” అంటూ ఆయన తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.  

ఐఏఎస్ వ్యవస్థలో ఈ రుగ్మత ఏం చెబుతోంది?

దీనికి ఎవరు కారణం అన్న ప్రశ్న ఉదయించగానే, సివిల్ సర్వీసుల కోసం వస్తున్న అభ్యర్ధుల ఎంపికలో ప్రమాణాలు పడిపోయాయనో, ఎంపికయివాళ్ళకి ఇచ్చే శిక్షణా స్థాయి పడిపోయిందనో,  సర్వీసులో చేరేటప్పుడు క్షేత్రస్థాయిలోఇచ్చే  శిక్షణ సరిగ్గా ఉండటం లేదనో, ఎంపికయిన అభ్యర్ధులు నేర్చుకొని సమర్ధులైన  అధికారులుగా ఎదగటానికి తగిన అవకాశం ఉండటం లేదనో, కెరీర్ మేనేజిమెంట్ విషయంలో వాళ్ళల్లో అవగాహనా లోపం కారణమనో … వగయిరా  అంశాలు ప్రస్తావనకొస్తాయి.  నిజమే. ఇవన్నీ కూడా పరిగణనలోకి తీసుకోదగిన అంశాలే.

కాని, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసుల్ని వెంటాడుతున్న రుగ్మతకి అతి పెద్ద కారణం ఇవే అనుకుంటే  పొరబాటు.  ఈ రుగ్మతకి ప్రధాన కారణం – ఐఏఎస్ ల పట్ల ప్రభుత్వాలు పాటించే ‘ప్రోత్సాహకాలు, క్రమశిక్షణా చర్యల ‘ విధానం,

నిజానికి ఇప్పటికీ ఈ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఈ దేశంలో ప్రతిభావంతులైన యువతీ యువకుల్ని విశేషంగా ఆకర్షిస్తూనే ఉంది. ఈ సర్వీసులో చేరితే తాము ఈ సమాజాన్ని చాలా ఉద్ధరించగలమన్న ఆశతో, విశ్వాసంతో యువత వస్తున్నారు. కాని చాలా త్వరగా వాళ్ళు రాజీధోరణి లేదా (నాయకులకు) అతి విధేయతల గాడిలో పడిపోతున్నారు. ఫలితంగా బద్ధకం పెంచుకోవటానికి, గురివింద గింజలా లోపాలు ఎంచటానికి పరిమితమైపోతున్నారు. వీటన్నింటికన్నా అధ్వాన్నమైన పరిస్థితి ఏమిటంటే, సర్వీసులోకి వచ్చిన కొత్తలో ఉన్న ఉత్సాహం, ఊపు మాయమైపోయి, ‘దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుందాం ‘ అనే ధోరణికి అలవాటు పడిపోవటం. తమ విద్యుక్త ధర్మాన్ని తాము సక్రమంగా నిర్వర్తించకుండా మధ్యలో రాజకీయ నాయకులు అడ్డం పడటం వల్లనే తాము సాధించాలనుకున్నది సాధించలేకపోయామని ప్రపంచం నమ్మాలని కొంతమంది సీనియర్లు అనుకుంటుంటారు. మరికొంతమంది చాలా సీనియర్లు తమ ఆత్మ కథల్లో కూడా అలా రాశారు.

“… నేను ఫలానా విధంగా ప్రజలకి ఉపయోగపడేలా ఫలానా పథకాన్ని అమలు చేయాలని చాలా తాపత్రయపడ్డాను. కాని, ఏదీ,  ఈ నాయకులు పడనిస్తేనా?….”

ఐఏఎస్ ల కర్తవ్య నిర్వహణలో రాజకీయ జోక్యాన్ని నేనేదో ఆవగింజలా చూపించాలనుకోవడం లేదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది సాధారణమైన విషయం. తమ మేథ దుర్వినియోగం  కావడానికి, నైతిక ప్రమాణాలు పడిపోవటానికీ రాజకీయ నాయకుల్ని కారకులుగా చూపించటం అవకాశవాదం కాదా?

రాజకీయ నాయకులు ‘క్యారట్లు’ ఎర వేస్తారు. వాటికోసం అధికారులు ఎందుకు ఎగబడాలి? నైతిక స్థైర్యం లేని అధికారులు ఈ క్యారట్ల ప్రలోభాలకు లొంగిపోతుంటే, “మనం మాత్రం ఏం చేస్తాం ?” అనుకుంటూ మిగతావాళ్ళు తమ కెరీర్లు కాపాడుకోవటం కోసమో, రివార్డులకోసమో అదే బాట పడితే ఏ జరుగుతుంది?

నాకు తెలిసిన పచ్చి నిజం ఏమిటంటే – ఐఏఎస్ లు అంతా ఒకే రకమైన నైతిక ప్రమాణాలకు, వృత్తి విలువలకు కట్టుబడి ఒకే త్రాటిపై ఉంటే –  ఎంత కరడుగట్టిన అవినీతిపరులైన రాజకీయ నాయకులుకూడా వాళ్ళని తాకను కూడా తాకలేరు. దురదృష్టవశాత్తు ఇప్పుడు ‘నడుస్తున్న ఐఏఎస్ ల కథ ‘ అలా లేదు.

2020 , 2021 సంవత్సరాల్లో – కోవిద్ 19 నిబంధనలు, ‘లాక్ డౌన్లు’  అమల్లో ఉన్న కాలంలో – లండన్ లోని ప్రభుత్వ ప్రాంగణాల్లో కొన్ని విందు సమావేశాలు జరిగాయని, కొన్నింటిలో ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ కూడా పాల్గొన్నారని ఇటీవల విమర్శలు వెల్లువెత్తాయి. చట్ట నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఈ విందు సమావేశాల వ్యవహారం ‘పార్టీ గేట్ ‘ కుంభకోణంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై  క్యాబినెట్ కార్యదర్శి స్థాయి (సివిల్ సర్వీసులకు చెందిన)  అధికారిణి సుసాన్ గ్రే విచారణ జరిపారు. మన ఢిల్లీ పోలీసు వ్యవస్థ లాంటి లండన్ మెట్రో పోలీస్ కేసు నమోదు చేసి, విచారణ జరిపారు. అయినా ఒక్క బ్రిటిష్ పార్లమెంటు సభ్యుడు గానీ, కనీసం ప్రతిపక్ష సభ్యుడు గానీ ఈ దర్యాప్తు మీద ఒక్క సందేహం కూడా వ్యక్తం చేయలేదు. సివిల్ సర్వీసు అధికారుల పట్ల అక్కడున్న గౌరవం, విశ్వాసం అటువంటివి.

ఇలాంటి సంఘటనే మన దేశంలో జరిగిందనుకుందాం. ఇలాంటి దర్యాప్తు, ఆ దర్యాప్తు పట్ల ఇలాంటి విశ్వాసం ఊహించగలమా?

ఈ సంఘటనని – మన రాజకీయ నాయకుల ప్రతిష్ట దిగజారటం గురించి నేను ప్రస్తావించటం లేదు.  మన అధికార గణాల అప్రతిష్ట ఏ స్థాయిలో ఉందో చెప్పటం కోసమే.

అయితే, మన ప్రభుత్వాల్లో ప్రోత్సాహకాలు, క్రమశిక్షణా చర్యల విధానం ఏ రకంగా ఈ వ్యవస్థని బలహీనపరుస్తున్నట్లు?

ప్రతి అధికారికీ సర్వీసు నిబంధనల ప్రకారమే కాలానుగుణంగా (టైం స్కేల్) ప్రమోషన్లు వస్తూంటే, వాళ్ళ పని తీరులో, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల సాధనలో ‘వత్తిడి’ సమస్య ఉత్పన్నం కాదు. కాని, చురుకైన, సమర్ధులైన, ఉత్సాహవంతులైన అధికారులకు కాలానుగుణంగా రావలసిన ప్రమోషన్లు (ప్రోత్సాహకాలు) వస్తాయన్న నమ్మకం కలిగించకపోవటం వల్ల, అవినీతిపరులు, అసమర్ధులు, సోమరులు అయిన వాళ్ళకి ఉద్వాసన (క్రమశిక్షణా చర్యలు) చెప్పకపోవటం వల్ల –  అధికారుల్లో తమ పరిజ్ఞానాన్ని, సామర్ధ్యాన్ని పెంచుకోవటానికి అవసరమైన ప్రోత్సాహం లభించటం లేదు.

చివరికి ఈ ప్రభుత్వాల్లో పరిస్థితులు ఎలా తయారయ్యాయంటే – మిడిమిడి జ్ఞానం కల వాళ్ళకి, రిస్క్ తీసుకోకుండా పని చేయాలనుకునేవాళ్ళకి ప్రోత్సాహం లభిస్తోంది; సృజనాత్మకంగా ఆలోచించగలిగేవాళ్ళకి, పాలనను మెరుగుపరచాలని తాపత్రయపడే వాళ్ళకి మాత్రం కాదు!  ఫలితంగా, పాలన ఏ స్థాయికి దిగజారిపోతోందంటే – ఇవాళ ఐఏఎస్ లున్న స్థాయికి.

ఐఏఎస్ వ్యవస్థలో ప్రతిభకి పట్టంకట్టే సంస్కరణలు రావాలి. అలాంటి సంస్కరణల్కి మొదట్లో కొంత వ్యతిరేకత వస్తుంది. అయినా అలాంటి సంస్కరణ ఆచరణ సాధ్యం. (ఎలా ఆచరణ  సాధ్యమో మరోసారి చెప్పుకుందాం.)

క్షేత్రస్థాయిలో అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా అద్భుతాలు చేస్తున్న యువ ఐఏఎస్ లు దేశంలో వందల్లో ఉన్నారు. వాళ్ళ భవిష్యత్ (దేశ భవిష్యత్) గురించే నా ఆరాటం. … ఆలోచిస్తుంటే నాకు మనసు వికలమై పోతోంది.

మా తరం సివిల్ సర్వెంట్లు, మా తర్వాత తరాలూ ఇలాంటి దిగజారిన పాలనా పరిస్థితుల్ని మా వారసత్వంగా ఆ యువ ఐఏఎస్ లకు అప్పగిస్తున్నాం. అంటే, ఈ పరిస్థితుల్ని సమస్కరించి, ‘ఐఏఎస్ ‘ వ్యవస్థ ఆత్మగౌరవాన్ని కాపాడే సవాల్ని వాళ్ళకి అప్పగిస్తున్నాం.ఎంత దురదృష్టం! 

“ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసులోకి కేవలం ప్రతిభ ఆధారంగా మాత్రమే అభ్యర్ధుల ఎంపిక జరగటం ఒక్కటే ఈ వ్యవస్థని పట్టి పీడిస్తున్న రుగ్మతలన్నింటికీ సంజీవని ఔషధం వంటిది.

ప్రతిభ అంటే ఏమిటి?జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ టెస్ట్ మ్యాచిల్లోకి అభ్యర్ధుల ఎంపిక విషయంలో ఎలా కేవలం ప్రతిభ, సామర్ధ్యం ఆధారంగా మాత్రమే (వాళ్ళు రిటైర్ అయ్యేదాకా) ఎంపిక జరుగుతూ ఉంటుందో,  అలాగే  ఐఏఎస్ ల ఎంపిక ప్రతి స్థాయిలోనూ జరిగిన రోజున మాత్రమే ఈ వ్యవస్థ ఈ దేశం గర్వించదగిన స్థాయికి ఎదుగుతుంది.”

– డాక్టర్ దువ్వూరి సుబ్బారావు 

Valliswar G
Valliswar G
వల్లీశ్వర్ గారు ఈనాడుగ్రూప్ లో ఈనాడు, న్యూస్ టైమ్ లో చాలాకాలం జర్నలిస్టుగా పని చేశారు. అనంతరం ప్రభుత్వ వ్యవహారాలనిర్వాహకుడుగానూ, ‘ఆంధ్రప్రదేశ్’ ప్రభుత్వ మాసపత్రిక సంపాదకులుగానూ, భారత్ టీవీ సంచాలకుడుగానూ పని చేశారు. బహుగ్రంథ రచయిత. చేవ వున్న అనువాదకుడు. మంచి వక్త.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles