- అమ్రుల్లా సాలే పలాయనం చిత్తగించినట్టు వార్తలు
- తాను తజికిస్తాన్ కు వెళ్ళనట్టు వస్తున్న వార్తలను ఖండించిన అమ్రుల్లా సాలే
పంజ్ షీర్ ను కూడా తాలిబాన్ స్వాధీనం చేసుకున్నారనీ, విజయసూచకంగా కాబూల్ లో గాలిలోకి తాలిబాన్ యోధులు కాల్పులు జరిపారనీ వార్తలు అందుతున్నాయి. మొత్తం అఫ్ఘానిస్తాన్ తమ చేతుల్లోకి వచ్చిందనీ, పంజ్ షీర్ ను కూడా జయించామని తాలిబాన్ వర్గాలు ధృవీకరించాయి.
అయితే తాను పలాయనం చిత్తగించినట్టు వార్తలు వ్యాప్తిలోకి వచ్చాయనీ, తాను ఇప్పటికీ ప్రతిఘటన శక్తులతోనే ఉన్నాననీ అఫ్ఘానిస్తాన్ మాజీ ఉఫాధ్యక్షుడు అమ్రుల్లా సాలే ‘ఇండియా టుడే’కి తెలియజేశారు. తాను పారిపోయానంటూ వస్తున్నవార్తలు నిరాధారమైనవని సాలే కొట్టిపారేశారు. తాను పంజ్ షీర్ లో తన స్థావరంలో తాలిబాన్ ను ప్రతిఘటిస్తున్న కమాండర్లతో, రాజకీయ నాయకులతో కలసి ఉన్నానని అన్నారు.
‘‘నేను దేశం విడిచి వెళ్ళిపోయినట్టు మీడియా రిపోర్టులు కొన్ని చక్కెర్లు కొడుతున్నాయి. అవి పూర్తిగా నిరాధారమైనవి. ఇది నా గొంతుక. నేను పంజ్ షీర్ నుంచి మాట్లాడుతున్నాను. మా కమాండర్లతో, రాజకీయ నాయకులతో ఉన్నాను. ఇది కష్టతరమైన పరిస్థితి అనడంలో సందేహం లేదు. తాలిబాన్, పాకిస్తాన్ వారూ, అల్ ఖాయిదా, ఇతర ఉగ్రవాద ముఠాలూ మాపైన ముప్పేట దాడి చేస్తున్నారు. ఇంతవరకూ భూభాగం కోల్పోలేదు,’’అంటూ స్పష్టంగా చెప్పారు. కడచిన నాలుగైదు రోజులుగా తాలిబాన్ దాడులు కొనసాగిస్తున్నారనీ, కానీ వారికి చెప్పుకోదగిన విజయం ఏదీ లభించలేదనీ, వారికి ప్రాణనష్టం జరిగిందనీ, తమకూ ప్రాణనష్టం జరిగిందనీ చెప్పారు.
తాలిబాన్ ధాటికి తట్టుకోలేక కమాండర్లతో కలిసి సాలే కూడా రెండు విమానాలలో గురువారంనాడు తజికిస్తాన్ కు పలాయనం చిత్తగించినట్టు వార్తలు వచ్చాయి. ‘‘అల్లాహ్ దయవల్ల అఫ్ఘానిస్తాన్ భూభాగమంతా మా అధీనంలోకి వచ్చింది. సమస్య సృష్టించినవారిని ఓడించాం. పంజ్ షీర్ ఇప్పుడు తాలిబాన్ చేతుల్లో ఉంది,’’ అని తాలిబాన్ కమాండర్ ఒకరు ప్రకటించారు. అఫ్ఘాన్ మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సాలే ‘టోలో న్యూస్’ సంస్థతో కూడా మాట్లాడుతూ ఈ వార్తలను ఖండించినట్ట సమాచారం.