భగవాన్
మాకు ప్రేమించే హృదయాన్నిచ్చావు
అయినా కుల, మత, ప్రాంత, భాషా భేదాలతో
తిట్టుకుంటూ చంపుకుంటూ బ్రతుకుతున్నాం.
స్వార్ధంతో పసి మనసుల్లో కూడా
విష బీజాలు నాటి ద్వేషం పూలు పూయిస్తున్నాం
అమాయకులను, పిల్లల్ని, ఆడవాళ్లను కూడా
సమిధలు చేసి విద్వేషం రగిలిస్తున్నాం
దేవుడిని కూడా విభజించేశాం మీ, మా అని.
అన్ని మతాలు మంచిగా ఉండమంటాయి
మంచిని మానవత్వాన్ని పెంచేది మతం
అధికారం కోసం మతాన్ని వాడుకుంటున్నాం
మతం కోసం చంపడానికి కూడా సిద్ధ పడుతున్నాం
ఎంత దిగజారి పోతున్నాం.
చరాచర జగత్తు యావత్తూ గతి శీలం
పరిణామం దాని లక్షణం
మంచి చెడు ఆలోచన చేసే చైతన్యాన్ని పాతరేసి
నా ఆచారమే నాకు ముఖ్యమని
నేను మారను అనేది విజ్ఞత కాదుగా
చరత్ర, జీవ శాస్త్రం స్పష్టం చేశాయి
మార్పును వ్యతిరేకకించినది ఏదీ మిగల్లేదు ప్రపంచంలో
కాలచక్రాన్ని ఆపే పని జరిగేనా!
దేవుడిచ్చిన జీవితం విలువను గ్రహించి
జీవితంలో నైతిక విలువలు పాటిస్తూ
అందరం మంచిగా స్నేహంగా ఉండే విజ్ఞత
మాకందరికి ప్రసాదించు తండ్రీ.