“సింధూ నది” భారతదేశానికి – పాకిస్తాన్ కు చాలా ముఖ్యమైన నది. భారత ఉపఖండంలోనే సుప్రసిద్ధమైంది, మన నాగరికతకు ఆలవాలమైంది. సింధూనది హిమాలయాలలోని టిబెట్ దేశంలో పుట్టి, కశ్మీర్,లడాఖ్ మీదుగా, పాకిస్తాన్ లోని పంజాబ్ రాష్ట్రం గుండా , అనేక ప్రాంతాల్లో ప్రవహించి పాకిస్తాన్ లోని కరాచీకి దగ్గరగా ఉన్న అరేబియా సముద్రంలో కలుస్తుంది. పాకిస్తాన్ కు ఇది అతి పెద్ద నది, ఆ దేశపు జాతీయ నది. సింధూకు సంబంధించిన అనేక ఉపనదులు జమ్ము, కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హరియాణా, రాజస్థాన్ మీదుగా ప్రవహించి, పాకిస్తాన్ లో కలుస్తాయి.
రెండేళ్ళకు ఒకసారి సమీక్షా సమావేశాలు
ఈ నదీ జలాలపై భారత్, పాకిస్తాన్ రెండు దేశాలకూ వాటా వుంది. వీటి పంపకాలు, వివాదాలు, పరిష్కారాలు మొదలైన అంశాలపై రెండు సంవత్సరాలకు ఒకసారి రెండు దేశాల మధ్య సమావేశాలు జరుగుతాయి. అందులో భాగంగా, తాజాగా ఈనెల 24,25 తేదీల నాడు రెండు రోజులపాటు రెండు దేశాల ముఖ్యుల మధ్య సమావేశాలు జరిగాయి. గత సమావేశం 2018లో పాకిస్తాన్ లోని లాహోర్ లో జరిగింది. ఈసారి సమావేశానికి మనం ఆతిధ్యాన్ని ఇచ్చాము. ఢిల్లీ వేదికగా జరిగిన ఈ సమావేశంలో పలు అంశాలు చర్చకు వచ్చాయి. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం గత నెలలో జరిగింది. దీన్ని శుభపరిణామంగా రెండు దేశాలు భావించాయి.దీని తర్వాత, సింధూ జలాలపై తాజాగా సమావేశం జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
Also Read : తెలుగు సినిమా వెలుగు కనుమా..!
370వ అధికరణ రద్దు తర్వాత తొలి సమావేశం
జమ్మూ, కశ్మీర్ లో ఆర్టికల్ 370రద్దు చేసిన తర్వాత, జల ఒప్పందాల అంశంపై రెండు దేశాలు కలవడం ఇదే మొదటిసారి కావడం విశేషం. 2019లో ఎన్నికల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ హరియాణలో పర్యటించిన సందర్భంగా, సింధూ జలాల అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశానికి సంబంధించిన వాటాలో పాకిస్తాన్ ఒక్క చుక్క వాడుకున్నా సహించేది లేదని మన ప్రధాని కరాఖండిగా తేల్చి చెప్పేశారు.మన కోటాకు చెందిన జలాలను కూడా మనం సంపూర్ణంగా వాడుకోవడం లేదని ఆయన గుర్తు చేశారు.హర్యానా, పంజాబ్ ప్రధానంగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రాలు.జిడిపిలో సగానికి పైగా వ్యవసాయానిదే భాగస్వామ్యం. ఇండియా పూర్తిగా తన వాటాను వాడుకుంటే హరియాణ, పంజాబ్ వంటి రాష్ట్రాలు మరింత స్వయం సమృద్ధిని సాధిస్తాయి.
హరియాణ, పంజాబ్ రైతుల డిమాండ్
కానీ, హరియాణ, పంజాబ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న పాకిస్తాన్ రైతులు మన జలాలనే ఎక్కువగా వాడుకుంటున్నారు, దీన్ని ఆపాలనే డిమాండ్ ఆ రెండు రాష్ట్రాల నుంచి ఎప్పటి నుంచో ఉంది. గత ఎన్నికల పర్యటనలో ఈ సమస్య పరిష్కారం దిశగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ హామీ ఇచ్చారు. అది ఇంకా నెరవేరాల్సివుంది.1960లో భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రు, పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ మధ్య సింధూ జలాలకు సంబంధించిన ఒప్పందం కుదిరింది. దీన్ని ” ఇండస్ వాటర్స్ ట్రీటీ” అంటారు. దీనికి ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వం నెరపింది. దీని వల్ల పాకిస్తాన్ ఎంతో లాభపడింది. సింధూ నది, ఉపనదుల నుంచి సమృద్ధిగా నీటివాటాను పొందింది. ఈ జలాలకు సంబంధించి మన వాటా కేవలం 20శాతం మాత్రమే. దాన్ని కూడా సంపూర్ణంగా మనం ఎప్పుడూ వాడుకోలేదు.
Also Read : అగ్రనేతలకు విశాఖ ఉక్కు పట్టదా?
పాకిస్తాన్ కు నష్టం బొత్తిగా లేదు
రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం పాకిస్తాన్ కు ఇసుమంత కూడా నష్టం లేదు. నష్టపోయింది కూడా ఇప్పటి వరకూ లేదు. జమ్ము, కశ్మీర్, లడాఖ్ లో మనం నిర్మిస్తున్న ప్రాజెక్టుల వల్ల నష్టం జరుగుతుందని, నీటి ప్రవాహాలు వస్తాయని రకరకాలుగా పాకిస్తాన్ భయపడుతోంది. తాజాగా జరిగిన సమావేశాల్లోనూ పాకిస్తాన్ అధికారులు మన ప్రాజెక్టుల నిర్మాణంపై అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ అంశంపై మన అధికారులు వాదనలు వినిపించినట్లు తెలుస్తోంది. 1948లో నదీజలాల అంశంపై రెండు దేశాల మధ్య వివాదాలు మొదలయ్యాయి. 1960లో ఒప్పందం కుదిరిన తర్వాత, రెండు దేశాల మధ్య ఈ అంశంలో ఎప్పుడూ పెద్దగా వివాదాలు, అలజడులు జరగలేదు.
సింధూజలాల విషయంలో సయోధ్య
రెండు దేశాల మధ్య జమ్ము,కశ్మీర్ మొదలైన అంశాల్లో ఘర్షణలు, యుద్ధాలు జరిగాయి. కానీ, సింధూ జలాల విషయంలో చర్చల ద్వారా న్యాయ బద్ధంగా, చట్టాల పరిధికి లోబడి వివాదాలను పరిష్కరించుకున్నారు. జలాల పంపిణీ – వివాదాల అంశంలో, “ఇండస్ వాటర్స్ ట్రీటీ” ప్రపంచంలోనే ఎంతో విజయవంతమైన ఒప్పందంగా అభివర్ణించవచ్చు. ప్రకృతిలో, వాతావరణంలో వస్తున్న మార్పుల నేపథ్యంలో సాంకేతిక మైన అంశాలపై కూడా రెండు దేశాలు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. సరిహద్దుల్లో కాల్పుల విరమణపై ఇప్పటికే ఒక ఒప్పందానికి వచ్చాము. సింధూ జలాల అంశంలో పెద్దగా ఇబ్బందులు కూడా ఏమీ లేవు. చైనా ప్రోద్బలంతో పాకిస్తాన్ భయానికి, అనుమానాలకు గురవుతోంది. మన వాటాను మనం సంపూర్ణంగా వాడుకోకపోవడం సరియైన చర్య కాదు. గత కొన్ని రోజుల నుంచి రెండు దేశాల మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొంటోంది. ఈ తరుణంలో, సామరస్య వాతావరణంలో వివాదాలను పరిష్కరించుకోవడం మంచి మలుపు అవుతుంది.రెండు దేశాల మధ్య శాంతి వెల్లి విరియడం ఉభయతారకం.
Also Read : మనిషి మారకపోతే మహమ్మారే