Thursday, November 21, 2024

బండి సంజ‌య్‌కు హ‌రీష్ రావు స‌వాల్‌

  • బీడీ కార్మికులకు కేంద్రం డబ్బు ఇస్తోందనే ప్రచారంలో నిజం ఉంటే రాజీనామా చేస్తా
  • లేకపోతే బండి సంజయ్ ముక్కు నేలకేసి  రాస్తారా: హరీష్
  • యువతపై బీజేపీ దృష్టి
  • చాపకింద నీరులాగా విస్తరిస్తున్నాం: ఉత్తమ్ కుమార్ రెడ్డి

పాలడుగు రాము

దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారంలో ప్రధాన పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. బీజేపీ చేస్తున్న అస‌త్య ప్ర‌చారాల‌పై ఆర్థిక శాఖ మంత్రి హ‌రీష్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అసత్యాలు ప్రచారం చేసి రాజ‌కీయ ల‌బ్ది పొందేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. వృద్ధాప్య‌, బీడీ కార్మికుల పెన్ష‌న్‌తో పాటు కేసీఆర్ కిట్‌పై బీజేపీ నేతల అస‌త్య ప్ర‌చారంపై క‌రీంన‌గ‌ర్ ఎంపీ బండి సంజ‌య్‌కు మంత్రి హ‌రీష్ రావు స‌వాల్ విసిరారు. 

బీడీ కార్మికుల‌కు ఇచ్చే పెన్ష‌న్‌లో కేంద్ర ప్రభుత్వం 1600  ఇస్తున్నద‌ని, రాష్ట్రం కేవ‌లం 400 మాత్రమే ఇస్తున్న‌ట్లు చెబుతున్నారు.  బీడీ కార్మికుల‌కు కేంద్రం 16 పైస‌లు కూడా ఇవ్వ‌డం లేద‌ని హ‌రీష్ రావు స్పష్టం చేశారు. ఎంపీ బండి సంజయ్ చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉంటే  చ‌ర్చ‌కు సిద్ధంగా ఉండాల‌ని హ‌రీష్ రావు స‌వాల్ విసిరారు. దుబ్బాక పాత బ‌స్టాండ్ వ‌ద్ద ప్ర‌జ‌ల మ‌ధ్యే చ‌ర్చ పెడదామ‌న్నారు. ఒక వేళ బీడీ కార్మికుల‌కు కేంద్రం రూ. 1600 పెన్ష‌న్లు ఇస్తున్న‌ట్లు నిరూపిస్తే తాను మంత్రి ప‌ద‌వితో పాటు, సిద్దిపేట ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని హ‌రీష్ రావు స్ప‌ష్టం చేశారు. ఒక వేళ నిరూపించ‌క‌పోతే బండి సంజ‌య్ అదే పాత బ‌స్టాండ్ వ‌ద్ద ముక్కు నేల‌కు రాస్తాడా? అని హ‌రీష్ రావు స‌వాల్ విసిరారు.   పథకాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే.. బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఇక్కడి పథకాలు ఎందుకు అమలు చేయడం లేదని హరీష్ రావు ప్రశ్నించారు.

అబ‌ద్ద‌పు పునాదుల మీద బీజేపీ రాజ‌కీయాలు

అసత్య ప్రచారాలు చేసి ప్రజలను మభ్యపెడితే బీజేపీకి డిపాజిట్లు  గ‌ల్లంతు అవ‌డం త‌ప్ప సాధించేదేమీ ఉండదని  మంత్రి హరీష్ రావు  అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ చేస్తున్న గోబెల్స్ ప్రచారానికి దుబ్బాక ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హరీష్ రావు  ఆశాభావం వ్యక్తం చేశారు.

హుజూర్‌న‌గ‌ర్‌లో చేసిన అసత్య ప్రచారానికి బీజేపీకి నాలుగో స్థానం కట్టబెట్టారని హరీష్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దుబ్బాకలో కూడా అదే పునరావృతమవుతుందని హరీష్ రావు జోస్యం చెప్పారు. తెలంగాణ‌ అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లయితే  కాళేశ్వ‌రం లేదా పాల‌మూరు ఎత్తిపోత‌ల ప‌థ‌కానికి జాతీయ హోదా తెచ్చేందుకు కృషి చేయాలని బీజేపీకి హితవు పలికారు. 

దుబ్బాక ఉప ఎన్నికల్లో నిశ్శబ్ద విప్లవం

దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చాప కింద నీరులా విస్తరిస్తోందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తోందని, టీఆర్‌ఎస్‌ పతనానికి దుబ్బాక నుంచే నాంది పలుకుతామని ఉత్తమ్ అన్నారు.  తెలంగాణ వస్తే తమ బతుకులు బాగు పడుతాయని యువకులు, విద్యార్థులు ఉద్యమంలో పాల్గొని బంగారు భవిష్యత్‌ను పణంగా పెట్టారన్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత కల్వకుంట్ల కుటుంబమే లబ్ధి పొందిందని అన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో మాజీ మంత్రి ముత్యం రెడ్డి చేసిన అభివృద్ధే కన్పిస్తున్నదని, ఆయన కుమారుడు శ్రీనివాస్‌కు పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఉత్తమ్ తెలిపారు.

అక్రమ సంపాదన డబ్బులు ఎన్నికల్లో ఖర్చు చేయడం టీఆర్‌ఎస్‌కు రివాజుగా మారిందన్నారు. గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో కేసీఆర్‌ ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు అమలుకు నోచుకోలేదని ఉత్తమ్ ఆవేదన వ్యక్తం చేశారు. అబద్ధాలకోరు టీఆర్‌ఎస్‌ పార్టీని ఓడించాలనీ, తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌ పార్టీకే పట్టం కట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దుబ్బాక ఫలితాలపై టీఆర్ఎస్ భవితవ్యం ఆధారపడి ఉన్నదని ఉత్తమ్ అన్నారు.

యువతకు గాలం వేస్తున్న ప్రధాన పార్టీలు

దుబ్బాక ఉప ఎన్నికలో యువతను ఆకర్షించేందుకు  అన్ని రాజకీయ పార్టీలు పడే పాట్లు ఇన్నీ అన్నీ కావు.  పార్టీ బలాబలాలు ఎలా ఉన్నా ఎన్నికల్లో సందడి చేయాలంటే యువత పాత్ర కీలకం. వయసు మళ్లిన వారి ఓటింగ్‌ సైలెంట్‌గా జరగుతుందని గమనించిన నాయకులు యువకులకు గాలం వేసే పనిలో బీజీ అయిపోయారు. ఈ నాలుగు రోజులు ప్రచారంలో వీరిని మచ్చిక చేసుకుంటే యువతీయువకుల ఓట్లు కూడా వస్తాయని అంచనా వేస్తున్నారు.

 ప్రధాన రాజకీయ పార్టీలు ఎత్తుకు పై ఎత్తు వేస్తూ యువతను ఆకర్షించడంలో తలమునకలయ్యాయి. ఇందులో భాగంగా ఇటీవల దౌల్తాబాద్‌లో రెండు వేల మంది యువకులను సమీకరించి బైక్‌ర్యాలీ నిర్వహించారు. పార్టీ అనుబంధ  తెలంగాణ విద్యార్థి సంఘం నాయకులను నియోజకవర్గంలో తిప్పి యువతను ఒక్క తాటిపైకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. విద్యార్థి, యువజన సంఘాల సమావేశాలు, సమీక్షలు నిర్వహిస్తూ వారికి కావాల్సిన  ఆటవస్తువులు, కిట్లు, జిమ్ లు ఏర్పాటు చేస్తామని హామీలు ఇస్తున్నారు. మరోవైపు  యువతే ఆధారంగా బీజేపీ ప్రచారంలో దూసుకెళుతోంది. ప్రధానంగా బీజేపీ అనుబంధ ఏబీవీపీ, ఆర్‌ఎస్‌ఎస్, బజరంగదల్, మహిళా మోర్చా లాంటి సంఘాల్లోని యువతను ప్రధాన ప్రచార అస్త్రంగా మార్చుకుంటున్నారు. అటు కాంగ్రెస్ పార్టీ కూడా తామేమీ తక్కువ తినలేదన్నట్లు  పార్టీ కూడా అనుబంధ ఎన్‌ఎస్‌యూఐ, యువజన కాంగ్రెస్‌ క్యాడర్‌ను కలుపుకుని ప్రచారంలో పాల్గొంటున్నారు.  అయితే ఈ ఉప ఎన్నికలో యువత ఓట్లు మాత్రం కీలకం కానున్నట్లు తెలుస్తోంది.  ప్రచారంలో అందరికంటే ముందున్న హరీష్ రావు కారణంగా టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతవైపు ప్రజలు మొగ్గు చూపుతున్నట్టు కనిపిస్తున్నది.

Paladugu Ramu
Paladugu Ramu
సీనియర్ సబ్ ఎడిటర్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles